Low pressure effect
-
అండమాన్‌కు ‘నైరుతి’.. రానున్న మూడ్రోజులూ వానలే
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ముందుగా అంచనా వేసిన విధంగానే నైరుతి రుతుపవనాలు ఆదివారం దక్షిణ అండమాన్ సముద్రంలోకి ప్రవేశించాయి. వాతావరణం అనుకూలంగా ఉండడంతో ఇవి చురుగ్గా కదులుతూ దక్షిణ బంగాళాఖాతం, నికోబార్ దీవులు, మాల్దీవులు, కొమరిన్‌లోని కొన్ని ప్రాంతాల్లోకి విస్తరించాయి. రానున్న రెండ్రోజుల్లో ఇవి మరిన్ని ప్రాంతాలకు విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ వెల్లడించింది. ఇక ఈ రుతు పవనాలు మే 31న కేరళను తాకనున్నట్లు భారత వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. ఇంకా ముందు రావడానికి కూడా అవకాశం ఉంది. ఆ తర్వాత ఏపీలోకి 2–3 తేదీల్లో ప్రవేశిస్తాయి. లా నినా పరిస్థితులు భారత్‌కు అనుకూలంగా ఉండటంతో ఈ ఏడాది సాధారణంగా కంటే ఎక్కువగానే వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నట్లు ఐఎండీ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. బలహీనపడ్డ ద్రోణి.. మూడ్రోజులు వర్షాలు..మరోవైపు.. దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు తెలంగాణ, రాయలసీమల మీదుగా సముద్ర మట్టానికి 3.1 కి.మీల ఎత్తులో ఉన్న ద్రోణి బలహీనపడింది. ప్రస్తుతం రాష్ట్రంపైకి ఆగ్నేయ, నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రానున్న మూడ్రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అలాగే, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతిలలో సోమవారం.. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతిలలో మంగళవారం.. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి, విశాఖపట్నం, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో బుధవారం వర్షాలకు ఆస్కారం ఉందని వివరించింది. అదే సమయంలో ఉరుములు, మెరుపులు, పిడుగులు సంభవిస్తాయని, వీటితో పాటు గంటకు 30–40 కి.మీల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ తెలిపారు.పెదకూరపాడులో 55 మిల్లీమీటర్ల వర్షంఆదివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. పల్నాడు జిల్లా పెదకూరపాడులో 55.5 మిల్లీమీటర్లు, ఎన్టీఆర్ జిల్లా వత్సవాయిలో 40 మిల్లీ మీటర్లు, జగ్గయ్యపేట 39.5, అల్లూరి జిల్లా అడ్డతీగల 38, చింతపల్లి 36, తూర్పుగోదావరి జిల్లా అనపర్తి 35.2, అనకాపల్లి రావికమతం 35.2, అల్లూరి జిల్లా రాజవొమ్మంగి 35, తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు 31.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాదాపు 47 ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిశాయి. తుపానుగా మారనున్న అల్పపీడనం..మరోవైపు.. ఈనెల 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది మరింతగా బలపడి 24 నాటికి వాయుగుండంగా మారనుంది. అనంతరం తుపానుగా బలపడే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. -
బలహీనపడిన అల్పపీడనం.. గట్టి వానలు తగ్గినట్టే!
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, విజయవాడ/సాక్షి, నెట్వర్క్: అల్పపీడనం బలహీనపడటంతో రాష్ట్రంలో వర్షాల తీవ్రత తగ్గుముఖం పట్టింది. శుక్ర, శని, ఆదివారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం గురువారం తెలిపింది. ఉత్తరాంధ్రకు ఆనుకుని దక్షిణ ఒడిశా, దాని పొరుగు ప్రాంతాలపై విస్తరించిన అల్పపీడనం బలహీనపడి దక్షిణ ఒడిశా, దానికి ఆనుకుని ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్‌పై కేంద్రీకృతమైంది. దీని ప్రభావంతో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి. రాషŠట్ర వ్యాప్తంగా శుక్ర, శనివారాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పలు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఆదివారం ఒకటి, రెండు చోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. ప్రాజెక్టుల్లో జలకళ రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. బుధవారంతో పోల్చితే గురువారం పలు జిల్లాల్లో చాలా తక్కువ వర్షపాతం నమోదైంది. సగటు వర్షపాతం 2.24 సెంటీ మీటర్లుగా ఉంది. శ్రీకాకుళం జిల్లాలో 6.02 సెంటీ మీటర్లు, విశాఖపట్నం జిల్లాలో 5.24 సెంటీ మీటర్లు, కృష్ణా జిల్లాలో 4.48 సెంటీ మీటర్లు, నంద్యాల జిల్లాలో 4.43 సెంటీ మీటర్లు, ఎన్టీఆర్ జిల్లాలో 4.19 సెంటీ మీటర్లు చొప్పున అత్యధిక వర్షపాతం కురిసింది. తిరుపతి జిల్లాలో 0.21 సెంటీ మీటర్లు అత్యల్ప వర్షపాతం నమోదైంది. బుధవారం అర్ధరాత్రి వరకూ కురిసిన వర్షాలతో ఉమ్మడి కృష్ణా జిల్లాలో పలు ఏర్లు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోని మెట్ట, ఏజెన్సీ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడటంతో జిల్లాలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మెట్ట, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ప్రాజెక్టులు, చెరువులు వరద నీటితో కళకళలాడుతున్నాయి. ఎర్రకాల్వ, తమ్మిలేరు ప్రాజెక్టుల నీటి మట్టం క్రమేపీ పెరుగుతోంది. ఇరిగేషన్ అధికారులు ఎప్పటి కప్పుడు వరద పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో గురువారం పలుచోట్ల వర్షాలు కురిశాయి. తాజా వర్షాలతో జిల్లాలోని చెరువులు, కుంటలు, వాగులు, వంకలు జలకళను సంతరించుకుంటున్నాయి. విజయవాడ–హైదరాబాద్ హైవేపై ట్రాఫిక్ మళ్లింపు మున్నేరు వాగు ఉద్ధృతి కారణంగా ఎన్టీఆర్ జిల్లా, నందిగామ మండలం, కీసర గ్రామంలో 65వ జాతీయ రహదారిపై నీరు ప్రవహిస్తున్న కారణంగా విజయవాడ–హైదరాబాద్ మార్గంలో వాహనాల రాకపోకలను నిలిపివేసినట్లు జిల్లా పోలీస్ కమిషనర్ టి.కె.రాణా తెలిపారు. విజయవాడలోని పోలీస్ కమిషనరేట్‌లో గురువారం రాత్రి విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే వాహనాలు గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, దాచేపల్లి, మిర్యాలగూడ, నార్కెట్‌పల్లి మీదుగా వెళ్లాలన్నారు. వరద ప్రవాహం తగ్గే వరకు ఈ సూచనలు తప్పకుండా పాటించాలన్నారు. వరద ప్రాంతంలో పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. వరద నీటిలో వాహనాలు నడిపే సాహసం చేయవద్దని హెచ్చరించారు. కాగా, విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం వద్ద గురువారం సాయంత్రం భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో నగర డీసీపీ విశాల్‌గున్నీ, వెస్ట్‌జోన్ ఏసీపీ హనుమంతరావు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలను మైలవరం, తిరువూరు, ఖమ్మం మీదుగా మళ్లించారు. ఇది కూడా చదవండి: వానల ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు.. దారి మళ్లింపు -
Rain Alert : ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, హైదరాబాద్: ఉత్తర బంగాళాఖాతంలో ఈనెల 12న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. తదుపరి 24 గంటల్లో బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు వివరించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు సూచించింది. మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం గురువారం బలహీనపడింది. రానున్న రెండ్రోజులు ఆకాశం మేఘావృతమై ఉంటుందని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ వివరించింది. నైరుతి సీజన్లో రాష్ట్రంలో ఇప్పటివరకు 43.6 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 79.36 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సాధారణ వర్షపాతం కంటే 82 శాతం అధిక వర్షపాతం నమోదైంది. (చదవండి: లక్ష్మీ పంపుహౌస్‌లో బయటపడిన మోటార్లు! 28 రోజుల తర్వాత) -
AP Rain Alert: వాయుగుండంగా బలపడనున్న అల్పపీడనం
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: అల్పపీడనం ప్రభావంతో గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు పడనున్నాయి. మధ్య అండమాన్ సముద్రం, దానికి ఆనుకుని ఉన్న ప్రాంతాల మీదుగా అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం విస్తరించాయి. అల్ప పీడనం పశ్చిమ వాయువ్య దిశలో ప్రయాణించి గురువారం నాటికి వాయుగుండంగా బలపడుతుందని భారత వాతావరణ శాఖ బుధవారం తెలిపింది. చదవండి: రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకుంటే.. నగదు, ‘ప్రశంస’లు తదుపరి 24 గంటల్లో మధ్య బంగాళాఖాతంలో జవాద్ తుపానుగా మారుతుందని, అనంతరం వాయువ్య దిశలో ప్రయాణిస్తూ మరింత బలపడి 4వ తేదీ నాటికి ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరానికి చేరుకుంటుందని వివరించింది. దీనివల్ల ఉత్తర కోస్తాలో గురువారం ఒకట్రెండు చోట్ల తేలికపాటి వర్షం, శుక్రవారం మోస్తరు నుంచి ఉరుములతో కూడిన జల్లులు, పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో రెండు రోజులపాటు ఒకటి రెండుచోట్ల తేలికపాటి జల్లులు పడతాయని తెలిపింది. కాగా, 3, 4 తేదీల్లో తీరం వెంబడి గంటకు 80 నుంచి 90 కి.మీ., గరిష్టంగా 100 కి.మీ. వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, అలలు ఎగసిపడతాయన్నారు. ఈ నెల 5వ తేదీ వరకు మత్స్యకారులెవరూ సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కోతకు సిద్ధంగా ఉన్న పంటను కాపాడుకునేందుకు సురక్షిత ప్రాంతానికి తరలించాలని సూచించారు. -
ఎడతెరిపిలేని వర్షాలతో వణుకు
సాక్షి నెట్వర్క్: బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాతోపాటు చిత్తూరు, వైఎస్సార్ కడప, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఎడతెరిపిలేని వర్షాలతో ప్రజలు వణికిపోతున్నారు. ఆయా జిల్లాల్లోని నదులు, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అక్కడక్కడ రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలకు జిల్లా చిగురుటాకులా వణికిపోతోంది. ఆది, సోమవారాలు వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండడంతో వాగులు, వంకలు, పొంగి ప్రవహించాయి. కైవల్యా, స్వర్ణముఖి నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండడంతో చాలా గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. చెన్నై– కోల్‌కతా ఏషియన్ హైవేపై గూడూరు వద్ద నీరు పొంగి ప్రవహించడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనాలను దారి మళ్లించారు. జిల్లాలో పలు చెరువులకు గండ్లు పడ్డాయి. ఎక్కడా ప్రాణనష్టం లేకుండా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు చర్యలు చేపట్టారు. కండలేరు డ్యామ్ కట్టకు ఎలాంటి ప్రమాదంలేదని అధికారులు తేల్చి చెప్పారు. నెల్లూరు నగరంలోని కస్తూర్బా స్కూల్ ఎదురుగా జీఎన్టీ రోడ్డులో వర్షపు నీరు ముసురుకున్న ‘చిత్తూరు’ ఎడతెరిపిలేని జల్లులతో చిత్తూరు జిల్లా ముసురేసింది. ఆదివారం రాత్రి తూర్పు మండలాల్లో భారీవర్షం కురవగా మిగిలిన మండలాల్లో మోస్తరు వర్షం పడింది. జిల్లా వ్యాప్తంగా 30.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా అత్యధికంగా తొట్టంబేడు మండలంలో 110.6 , బీఎన్ కండ్రిగలో 100.4 మిల్లీ మీటర్ల మేరకు వర్షపాతం నమోదైంది. తూర్పు మండలాల్లో సోమవారం మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురిసింది. వాగులు, వంకలు, నదులు ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. దీంతో అధికారులు కాజ్‌వేలు, చెక్ డ్యామ్‌లకు నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకుంటున్నారు. చెరువుల పరిస్థితిని ఎప్పటికప్పుడు సచివాలయ సిబ్బంది, వలంటీర్లు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే 11 పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేసి 2 వేల మందికి ఆశ్రయం కల్పించారు. 34,682 మందికి నిత్యావసరాలతో పాటు రూ.2 వేల చొప్పున ప్రభుత్వ సాయాన్ని అందించారు. పశువులకు పశుగ్రాసాన్ని తరలించే ప్రక్రియను వేగవంతం చేశారు. తిరుపతిలో ప్రమాదకరంగా ఉన్న ఇళ్లను కూల్చివేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. భూగర్భ జలాలు పూర్తిస్థాయిలో రీచార్జ్ కావడంతో నిండ్ర మండలం కచ్చరవేడు గ్రామంలోని బోరుబావి కేసింగ్ పైపు 32 అడుగుల మేర పైకి వచ్చింది. మదనపల్లె మండలం వేంపల్లి వద్ద కొండమీదతండా చెరువుకు గండిపడింది. దీంతో అధికారులు మరమ్మతు పనులను చేపడుతున్నారు. ‘ప్రకాశం’లో పొంగుతున్న వాగులు ఇక ప్రకాశం జిల్లాలోనూ రెండ్రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వివిధ ప్రాజెక్టులు, రిజర్వాయర్లలోకి వరద నీరు చేరుతోంది. పలుచోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రాళ్లపాడు ప్రాజెక్టుకు వరదనీటి ప్రవాహం చేరుతుండడంతో దిగువనున్న మన్నేరుకు సోమవారం సాయంత్రం నీటిని విడుదల చేశారు. దీంతో మన్నేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. కొమరోలు మండలంలోని పులివాగు, గుడ్లూరు మండలంలోని ఉప్పుటేరు, ఎలికేరులు పొంగిపొర్లుతున్నాయి. దీనితో పలు గ్రామాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వైఎస్సార్ జిల్లాలోనూ.. వైఎస్సార్ జిల్లాలోని కాశినాయన మండలంలో సోమవారం 8.5 సెం.మీ. వర్షపాతం నమోదు కాగా, పోరుమామిళ్లలో 8 సెం.మీ. కురిసింది. బద్వేలు నియోజకవర్గంలోని కలసపాడు, బి.మఠం, బి.కోడూరు, కడప తదితర ప్రాంతాల్లో 5 సెం.మీ. పైగా వర్షపాతం నమోదైంది. పలు ప్రాంతాల్లో పంటలు నీట మునిగాయి. ఉధృతంగా ప్రవహిస్తున్న దిగువ సగిలేరు ప్రాజెక్టు నుంచి దిగువన పెన్నాకు నీటిని విడుదల చేశారు. -
AP Rain Alert: 29వ తేదీ వరకు దక్షిణ కోస్తా, రాయలసీమకు వర్ష సూచన
సాక్షి, అమరావతి/విశాఖపట్నం : కొమరిన్, శ్రీలంక తీర ప్రాంతంపై ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల 29వ తేదీ వరకు ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు.. దక్షిణ అండమాన్ సముద్రంలో సోమవారం ఉదయం అల్పపీడనం ఏర్పడనుంది. ఇది తదుపరి 48 గంటల్లో బలపడి పశ్చిమ వాయువ్య దిశగా తీవ్ర అల్పపీడనంగా ప్రయాణించే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో రాష్ట్రమంతటా ఆది, సోమవారాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే సూచనలున్నాయని తెలిపారు. ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వెల్లడించారు. దీని ప్రభావంతో తీరం వెంబడి 30–40 కిమీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశముంది. మత్స్యకారులెవ్వరూ సోమవారం వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. -
AP Rain Alert Today: అల్పపీడనం ముప్పు తప్పినట్టే..!
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతం దాని పరిసరాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారకుండా అలాగే కొనసాగుతూ తమిళనాడు, శ్రీలంక వైపు ప్రయాణిస్తుండడంతో రాయలసీమకు వర్షాల ముప్పు తప్పినట్లేనని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఇది అల్పపీడనంగా మారుతుందని అంచనా వేసినా.. అలాగే కొనసాగుతోంది. శ్రీలంక, తమిళనాడులోని కడలూరు, చెన్నై తీరం వైపు ఇది కదులుతుండడంతో అక్కడ భారీవర్షాలు కురుస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం లేదు. 26వ తేదీ నుంచి పలుచోట్ల భారీవర్షాలు మాత్రం కురిసే అవకాశం ఉందని, 28, 29 తేదీల్లో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పలుచోట్ల భారీవర్షాలకు అవకాశం ఉందని తెలిపారు. మరోవైపు దక్షిణ అండమాన్ సముద్రంలో 29వ తేదీనాటికి ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. (చదవండి: వైఎస్సార్ మరణంలో బాబు కుట్రపై అనుమానాలు..) -
Rain Alert: ఏపీలో నేడు, రేపు వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తమిళనాడు, శ్రీలంక మధ్య ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కి.మీ. ఎత్తులో కొనసాగుతోంది. అల్పపీడనం ప్రభావంతో తూర్పు గాలులు తక్కువ ఎత్తులో రాష్ట్రం వైపు బలంగా వీస్తున్నాయి. ఈ కారణంగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. (చదవండి: AP: దైన్యాన్ని తరిమి.. ధాన్యం భరోసా) ఆది, సోమవారాల్లో కోస్తా, రాయలసీమల్లో చాలాచోట్ల మోస్తరు వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వెల్లడించారు. నవంబర్ మొదటి వారంలో కోస్తాంధ్ర జిల్లాల్లో ఎక్కువ వర్షాలు కురిసే సూచనలున్నాయని చెబుతున్నారు.(చదవండి: బాబు ఊగిపోతూ.. తమ్ముళ్లు తూగిపోతూ!) రెండో వారంలో అల్ప పీడనం నవంబర్ రెండో వారంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని.. ఇది వాయుగుండంగా మారే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ వైపు వస్తుందా లేక దిశ మార్చుకుంటుందా అనే విషయంలో ఇంకా స్పష్టత లేదంటున్నారు. గడచిన 24 గంటల్లో పెదకాకానిలో 79.75 మి.మీ., శృంగవరపుకోటలో 55.5, అద్దంకిలో 54.25, జీకే వీధిలో 53, అనంతగిరిలో 51, వేమనపురంలో 49, జగ్గయ్యపేటలో 48.25, చింతలపూడిలో 46.5, తాడిమర్రిలో 45.75 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. -
వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వర్షాలు
సాక్షి, అమరావతి: వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్రలో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అమరావతి వాతావారణ కేంద్రం హెచ్చరించింది. రాయలసీమలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని పేర్కొంది. కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయని తెలిపింది. తీరం వెంబడి గంటకు 50-60 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
తెలంగాణ, రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి
సాక్షి, విజయవాడ : రాగల 48 గంటలలో మాల్దీవులు, కోమోరిన్ ప్రాంతం, దక్షిణ బంగాళఖాతంతో పాటి మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని గురువారం వాతావారణ శాఖ వెల్లడించింది. దీంతో దక్షిణ బంగాళాఖాతంలో, అండమాన్ & నికోబార్ దీవులతో పాటు ఆగ్నేయ అరేబియా సముద్రం, దానిని ఆనుకొని ఉన్న తూర్పు మధ్య అరేబియా సముద్ర ప్రాంతాలలో మే 31వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావం వలన సుమారుగా జూన్ 1వ తేదీన కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం కూడా ఉందని తెలిపింది. (ఆ జిల్లాలో పిడుగుపడే అవకాశం) పశ్చిమ మధ్య అరేబియా సముద్రం, దానిని ఆనుకొని ఉన్న నైరుతి అరేబియా సముద్ర ప్రాంతాలలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల పశ్చిమ మధ్య అరేబియా సముద్ర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడినట్లు పేర్కొంది. దీనికి అనుబంధంగా మధ్యస్థ ట్రోపోస్పీయర్ స్థాయిల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో ఇది మరింత బలపడిందని వెల్లడించింది. దీంతో రాగల 48 గంటలలో ఈ అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావారణ శాఖ పేర్కొంది. మరో 72 గంటల్లో ఇది వాయువ్య దిశగా దక్షిణ ఒమన్, తూర్పు ఒమన్ తీరం వైపు ప్రయాణించే అవకాశం ఉందని, విదర్భ నుంచి ఇంటీరియర్ తమిళనాడు వరకు తెలంగాణ, రాయలసీమ మీదుగా 1.5 km ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన: ఉత్తర కోస్తాంధ్ర, యానాం : ఇవాళ, రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో పాటు ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తా ఆంధ్ర : ఈ రోజు ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 41వినుండి 44వి నమోదయ్యే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమ : ఈ రోజు, రేపు ఉరుములు, మెరుపులతో పాటు రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 41° నుండి 44° నమోదయ్యే అవకాశం ఉంది. ఎల్లుండి ఉరుములు, మెరుపులతో పాటు రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. -
ఇక వానలే వానలు!
మూడు రోజుల్లో భారీ వర్షాలు ఇప్పుడే విత్తుకోవద్దు.. దుక్కి సిద్ధం చేసుకోండి.. రైతులకు వ్యవసాయ శాఖ సూచన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోకి రుతు పవనాలు ప్రవేశించనప్పటికీ జోరుగా వానలు కురవనున్నాయి. అల్పపీడనం ప్రభావంతో రాగల మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇక మరో నాలుగు రోజుల్లో రుతు పవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయి. అయితే రుతు పవనాలతో కూడిన వానలు.. అల్ప పీడనం ప్రభావంతో కురుస్తున్న వానలకు తేడాలను రైతులు గుర్తించాలని ప్రభుత్వం సూచించింది. ప్రస్తుతం అల్ప పీడన ప్రభావంతో వానలు కురుస్తున్నందున వాటిని నమ్ముకుని విత్తనాలు విత్తుకోవద్దని గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో రైతులను వ్యవసాయ శాఖ కోరింది. కేవలం దుక్కి సిద్ధం చేసుకోవాలని సూచించింది. అల్పపీడన ప్రభావంతో కురిసే వానలు ఉన్నట్టుండి మాయమవుతాయి. వాటిని నమ్మి విత్తుకుంటే.. మొలకెత్తే అనువైన వాతావరణం లేక రైతులు నష్టపోవాల్సి ఉంటుంది. రుతుపవనాలు తాకిన తర్వాత తేలికపాటి నేలల్లో 50 నుంచి 60 మి.మీ., బరువు నేలల్లో 60 నుంచి 75 మి.మీ. మేర వర్షపాతం నమోదైన అనంతరం విత్తుకునేందుకు అనువైన వాతావరణం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. 15 నుంచి 20 సెం.మీ. మేర నేల తడిస్తేనే వర్షాధార పంటలైన సోయాచిక్కుడు, జొన్న, మొక్కజొన్న, కంది, పెసరతోపాటు పత్తి పంటలకు అనువుగా ఉంటుందని పేర్కొంటున్నారు. ఇక వరిలో సోనా (ఆర్ఎన్ఆర్ 15048) రకం నారు వేసుకునేందుకు జూన్ మాసం అనుకూలంగా ఉండదని, కేవలం జులైలోనే నారు పోసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. గురువారం నిజామాబాద్, హైదరాబాద్, భద్రాచలం తదితర ప్రాంతాల్లో వానలు కురిశాయి. ఏపీలోకి నైరుతి ప్రవేశం సాక్షి, విశాఖపట్నం: నైరుతి రుతుపవనాలు గురువారం ఏపీలోకి ప్రవేశించాయి. బుధవారం కేరళను తాకిన ఈ రుతుపవనాలు 24 గంటల్లోనే ఏపీలోని రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాలను తాకాయి. రానున్న 24 గంటల్లో ఇవి కోస్తాంధ్ర, రాయలసీమల్లోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయి. -
ఒంగోలును ముంచెత్తిన వర్షం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : అల్పపీడనం ప్రభావంతో బుధవారం రాత్రి నుంచి ఆగకుండా కురుస్తున్న వర్షాలకు ఒంగోలు నీటమునిగింది. పల్లపు ప్రాంతాల్లో భారీగా నీరు చేరింది. కొన్ని రోడ్లు జలపాతాలుగా మారాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం కురిసిన వర్షం నీరు సాయంత్రానికి బయటకు వెళ్లిపోవడంతో ఊపిరిపీల్చుకున్న జనం రాత్రి కురిసిన భారీ వర్షానికి కాలనీలు నీటమునిగాయి. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటంతో నీరుపోయే మార్గం లేక రోడ్లపైనే నీరు నిలిచిపోయింది. జిల్లా వ్యాప్తంగా సగటున 34.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, ఒంగోలు నగరంలో 58.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. అత్యధికంగా చీమకుర్తిలో 81.0, సింగరాయకొండ 72.4, వలేటివారిపాలెం 71.0, సంతనూతలపాడు 70.6, గుడ్లూరు 68.0, దొనకొండ 66.4, ఉలవపాడు మండలంలో 63.8 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. ఒంగోలు నగరంలోని భాగ్యనగర్ నాల్గవ లైన్ పూర్తిగా నీట మునిగింది, ఆర్టీవో కార్యాలయానికి వెళ్లే జంక్షన్లో పెద్ద ఎత్తున నీరు నిలిచింది. ప్రభుత్వ బధిరుల ఆశ్రమ పాఠశాల ఆవరణ పూర్తిగా చెరువులా మారింది. ధారవారితోటలో రోడ్డుపై నీరు నిలిచిపోగా, బండ్లమిట్టలోని అంకమ్మదేవాలయం వెనుకవీధిలో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. దీంతో సామాన్లను మంచాలపై సర్దుకున్నారు. ఇంట్లోకి చేరిన మురుగునీటిని బక్కెట్లతో బయటకు తోడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంజయ్య రోడ్డులో కూడా డ్రైనేజీ ఎగదన్నడంతో మురుగునీరు రోడ్డుపై నిలిచిపోయి రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. కేంద్రీయ విద్యాలయం ముందు రోడ్డులో రెండు అడుగుల మేర నీరు నిలిచి వాహనరాకపోకలు స్తంభించిపోయాయి. స్కూల్లోకి కూడా నీరు చేరడంతో సెలవు ప్రకటించారు. కోటవీధి, వేంకటేశ్వరకాలనీ,మండలిపాలెం, వంటకాలనీలలోకి నీరు చేరి తటాకాలుగా మారాయి. కందుకూరు మండలంలోని మాచవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలో రెండు విద్యుత్తు స్తంభాలు పూర్తిగా నేలకొరిగాయి. మర్రిపూడి పడమటి బజారులోని రైతు పూనూరి వెంకటేశ్వరరెడ్డికి చెందిన బ్యారన్ నేల కొరిగింది. ఎడతెరపి లేని వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. తీరప్రాంత గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముసి,పాలేరు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. తూర్పు ప్రకాశంలో ఈ వర్షాలు మేలు చేస్తాయని వరి రైతులు భావిస్తుండగా, పత్తి, పొగాకు, మొక్కజొన్న, వేరుశెనగ రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మార్టూరు మండలంలో ఐదు వేల హెక్టార్లలో పత్తి సాగు చేశారు. ఇప్పుడు పత్తి చేలన్నీ కాయమీద ఉన్నాయి.కాయ దశలో ఉండటంతో ఇప్పుడు ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షం కారణంగా కాయలు కుళ్లిపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. పశ్చిమ ప్రకాశంతోపాటు కనిగిరి, కందుకూరు నియోజకవర్గాల్లో అలసంద (బొబ్బర్లు), మినుము, వరి, పొగాకు, శనగ, కూరగాయల పంటలతో పాటు ఖరీఫ్‌లో సాగు చేపట్టిన కంది, పత్తి పంటలకు ఇటీవల నాటిన పొగాకు పంటలకు ఈ వర్షం జీవం పోసింది. ఇటీవల సాగు చేసిన పొగాకు పంటకు ఉపయోగకరంగా ఉంది. అదే సమయంలో కంది, మిరప పంటలు జీవం పోసుకున్నాయి. గుండ్లకమ్మకు వరదనీరు మూడు గేట్లు ఎత్తివేత మద్దిపాడు: గుండ్లకమ్మ రిజర్వాయర్‌కు పైనుంచి నీరు చేరుతుండడంతో మూడు గేట్లు ఎత్తివేసి ఏడువేల క్యూసెక్కుల నీరు కిందకు వదులుతున్నట్టు ఏఈ కిరణ్ తెలిపారు. చిలకలేరు, దోర్నపు వాగుల ద్వారా ఎక్కువగా నీరు వస్తున్నట్లు ఆయన తెలిపారు. నీటి ఉధృతి పెరిగే అవకాశం ఉందని గుండ్లకమ్మ దిగువ గ్రామాలలో చాటింపు వేయించి అప్రమత్తం చేసినట్టు తెలిపారు.