సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, విజయవాడ/సాక్షి, నెట్‌వర్క్: అల్పపీడనం బలహీనపడటంతో రాష్ట్రంలో వర్షాల తీవ్రత తగ్గుముఖం పట్టింది. శుక్ర, శని, ఆదివారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం గురువారం తెలిపింది. ఉత్తరాంధ్రకు ఆనుకుని దక్షిణ ఒడిశా, దాని పొరుగు ప్రాంతాలపై విస్తరించిన అల్పపీడనం బలహీనపడి దక్షిణ ఒడిశా, దానికి ఆనుకుని ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్‌పై కేంద్రీకృతమైంది.
దీని ప్రభావంతో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి. రాషŠట్ర వ్యాప్తంగా శుక్ర, శనివారాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పలు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఆదివారం ఒకటి, రెండు చోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది.
ప్రాజెక్టుల్లో జలకళ
రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. బుధవారంతో పోల్చితే గురువారం పలు జిల్లాల్లో చాలా తక్కువ వర్షపాతం నమోదైంది. సగటు వర్షపాతం 2.24 సెంటీ మీటర్లుగా ఉంది. శ్రీకాకుళం జిల్లాలో 6.02 సెంటీ మీటర్లు, విశాఖపట్నం జిల్లాలో 5.24 సెంటీ మీటర్లు, కృష్ణా జిల్లాలో 4.48 సెంటీ మీటర్లు, నంద్యాల జిల్లాలో 4.43 సెంటీ మీటర్లు, ఎన్టీఆర్ జిల్లాలో 4.19 సెంటీ మీటర్లు చొప్పున అత్యధిక వర్షపాతం కురిసింది. తిరుపతి జిల్లాలో 0.21 సెంటీ మీటర్లు అత్యల్ప వర్షపాతం నమోదైంది.
బుధవారం అర్ధరాత్రి వరకూ కురిసిన వర్షాలతో ఉమ్మడి కృష్ణా జిల్లాలో పలు ఏర్లు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోని మెట్ట, ఏజెన్సీ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడటంతో జిల్లాలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మెట్ట, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ప్రాజెక్టులు, చెరువులు వరద నీటితో కళకళలాడుతున్నాయి. ఎర్రకాల్వ, తమ్మిలేరు ప్రాజెక్టుల నీటి మట్టం క్రమేపీ పెరుగుతోంది. ఇరిగేషన్ అధికారులు ఎప్పటి కప్పుడు వరద పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో గురువారం పలుచోట్ల వర్షాలు కురిశాయి. తాజా వర్షాలతో జిల్లాలోని చెరువులు, కుంటలు, వాగులు, వంకలు జలకళను సంతరించుకుంటున్నాయి.
విజయవాడ–హైదరాబాద్ హైవేపై ట్రాఫిక్ మళ్లింపు
మున్నేరు వాగు ఉద్ధృతి కారణంగా ఎన్టీఆర్ జిల్లా, నందిగామ మండలం, కీసర గ్రామంలో 65వ జాతీయ రహదారిపై నీరు ప్రవహిస్తున్న కారణంగా విజయవాడ–హైదరాబాద్ మార్గంలో వాహనాల రాకపోకలను నిలిపివేసినట్లు జిల్లా పోలీస్ కమిషనర్ టి.కె.రాణా తెలిపారు. విజయవాడలోని పోలీస్ కమిషనరేట్‌లో గురువారం రాత్రి విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.
విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే వాహనాలు గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, దాచేపల్లి, మిర్యాలగూడ, నార్కెట్‌పల్లి మీదుగా వెళ్లాలన్నారు. వరద ప్రవాహం తగ్గే వరకు ఈ సూచనలు తప్పకుండా పాటించాలన్నారు. వరద ప్రాంతంలో పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. వరద నీటిలో వాహనాలు నడిపే సాహసం చేయవద్దని హెచ్చరించారు. కాగా, విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం వద్ద గురువారం సాయంత్రం భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో నగర డీసీపీ విశాల్‌గున్నీ, వెస్ట్‌జోన్ ఏసీపీ హనుమంతరావు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలను మైలవరం, తిరువూరు, ఖమ్మం మీదుగా మళ్లించారు.
ఇది కూడా చదవండి: వానల ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు.. దారి మళ్లింపు
Comments
Please login to add a commentAdd a comment