ఒంగోలును ముంచెత్తిన వర్షం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : అల్పపీడనం ప్రభావంతో బుధవారం రాత్రి నుంచి ఆగకుండా కురుస్తున్న వర్షాలకు ఒంగోలు నీటమునిగింది. పల్లపు ప్రాంతాల్లో భారీగా నీరు చేరింది. కొన్ని రోడ్లు జలపాతాలుగా మారాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం కురిసిన వర్షం నీరు సాయంత్రానికి బయటకు వెళ్లిపోవడంతో ఊపిరిపీల్చుకున్న జనం రాత్రి కురిసిన భారీ వర్షానికి కాలనీలు నీటమునిగాయి.
డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటంతో నీరుపోయే మార్గం లేక రోడ్లపైనే నీరు నిలిచిపోయింది. జిల్లా వ్యాప్తంగా సగటున 34.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, ఒంగోలు నగరంలో 58.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. అత్యధికంగా చీమకుర్తిలో 81.0, సింగరాయకొండ 72.4, వలేటివారిపాలెం 71.0, సంతనూతలపాడు 70.6, గుడ్లూరు 68.0, దొనకొండ 66.4, ఉలవపాడు మండలంలో 63.8 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. ఒంగోలు నగరంలోని భాగ్యనగర్ నాల్గవ లైన్ పూర్తిగా నీట మునిగింది, ఆర్టీవో కార్యాలయానికి వెళ్లే జంక్షన్‌లో పెద్ద ఎత్తున నీరు నిలిచింది.
ప్రభుత్వ బధిరుల ఆశ్రమ పాఠశాల ఆవరణ పూర్తిగా చెరువులా మారింది. ధారవారితోటలో రోడ్డుపై నీరు నిలిచిపోగా, బండ్లమిట్టలోని అంకమ్మదేవాలయం వెనుకవీధిలో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. దీంతో సామాన్లను మంచాలపై సర్దుకున్నారు. ఇంట్లోకి చేరిన మురుగునీటిని బక్కెట్లతో బయటకు తోడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంజయ్య రోడ్డులో కూడా డ్రైనేజీ ఎగదన్నడంతో మురుగునీరు రోడ్డుపై నిలిచిపోయి రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. కేంద్రీయ విద్యాలయం ముందు రోడ్డులో రెండు అడుగుల మేర నీరు నిలిచి వాహనరాకపోకలు స్తంభించిపోయాయి.
స్కూల్‌లోకి కూడా నీరు చేరడంతో సెలవు ప్రకటించారు. కోటవీధి, వేంకటేశ్వరకాలనీ,మండలిపాలెం, వంటకాలనీలలోకి నీరు చేరి తటాకాలుగా మారాయి. కందుకూరు మండలంలోని మాచవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలో రెండు విద్యుత్తు స్తంభాలు పూర్తిగా నేలకొరిగాయి. మర్రిపూడి పడమటి బజారులోని రైతు పూనూరి వెంకటేశ్వరరెడ్డికి చెందిన బ్యారన్ నేల కొరిగింది. ఎడతెరపి లేని వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. తీరప్రాంత గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముసి,పాలేరు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
తూర్పు ప్రకాశంలో ఈ వర్షాలు మేలు చేస్తాయని వరి రైతులు భావిస్తుండగా, పత్తి, పొగాకు, మొక్కజొన్న, వేరుశెనగ రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మార్టూరు మండలంలో ఐదు వేల హెక్టార్లలో పత్తి సాగు చేశారు. ఇప్పుడు పత్తి చేలన్నీ కాయమీద ఉన్నాయి.కాయ దశలో ఉండటంతో ఇప్పుడు ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షం కారణంగా కాయలు కుళ్లిపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.
పశ్చిమ ప్రకాశంతోపాటు కనిగిరి, కందుకూరు నియోజకవర్గాల్లో అలసంద (బొబ్బర్లు), మినుము, వరి, పొగాకు, శనగ, కూరగాయల పంటలతో పాటు ఖరీఫ్‌లో సాగు చేపట్టిన కంది, పత్తి పంటలకు ఇటీవల నాటిన పొగాకు పంటలకు ఈ వర్షం జీవం పోసింది. ఇటీవల సాగు చేసిన పొగాకు పంటకు ఉపయోగకరంగా ఉంది. అదే సమయంలో కంది, మిరప పంటలు జీవం పోసుకున్నాయి.
గుండ్లకమ్మకు వరదనీరు మూడు గేట్లు ఎత్తివేత
మద్దిపాడు: గుండ్లకమ్మ రిజర్వాయర్‌కు పైనుంచి నీరు చేరుతుండడంతో మూడు గేట్లు ఎత్తివేసి ఏడువేల క్యూసెక్కుల నీరు కిందకు వదులుతున్నట్టు ఏఈ కిరణ్ తెలిపారు. చిలకలేరు, దోర్నపు వాగుల ద్వారా ఎక్కువగా నీరు వస్తున్నట్లు ఆయన తెలిపారు. నీటి ఉధృతి పెరిగే అవకాశం ఉందని గుండ్లకమ్మ దిగువ గ్రామాలలో చాటింపు వేయించి అప్రమత్తం చేసినట్టు తెలిపారు.