సాక్షి, అమరావతి/విశాఖపట్నం: అల్పపీడనం ప్రభావంతో గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు పడనున్నాయి. మధ్య అండమాన్ సముద్రం, దానికి ఆనుకుని ఉన్న ప్రాంతాల మీదుగా అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం విస్తరించాయి. అల్ప పీడనం పశ్చిమ వాయువ్య దిశలో ప్రయాణించి గురువారం నాటికి వాయుగుండంగా బలపడుతుందని భారత వాతావరణ శాఖ బుధవారం తెలిపింది.
చదవండి: రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకుంటే.. నగదు, ‘ప్రశంస’లు
తదుపరి 24 గంటల్లో మధ్య బంగాళాఖాతంలో జవాద్ తుపానుగా మారుతుందని, అనంతరం వాయువ్య దిశలో ప్రయాణిస్తూ మరింత బలపడి 4వ తేదీ నాటికి ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరానికి చేరుకుంటుందని వివరించింది. దీనివల్ల ఉత్తర కోస్తాలో గురువారం ఒకట్రెండు చోట్ల తేలికపాటి వర్షం, శుక్రవారం మోస్తరు నుంచి ఉరుములతో కూడిన జల్లులు, పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
దక్షిణ కోస్తా, రాయలసీమల్లో రెండు రోజులపాటు ఒకటి రెండుచోట్ల తేలికపాటి జల్లులు పడతాయని తెలిపింది. కాగా, 3, 4 తేదీల్లో తీరం వెంబడి గంటకు 80 నుంచి 90 కి.మీ., గరిష్టంగా 100 కి.మీ. వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, అలలు ఎగసిపడతాయన్నారు. ఈ నెల 5వ తేదీ వరకు మత్స్యకారులెవరూ సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కోతకు సిద్ధంగా ఉన్న పంటను కాపాడుకునేందుకు సురక్షిత ప్రాంతానికి తరలించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment