
సాక్షి, అమరావతి/విశాఖపట్నం : కొమరిన్, శ్రీలంక తీర ప్రాంతంపై ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల 29వ తేదీ వరకు ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు.. దక్షిణ అండమాన్ సముద్రంలో సోమవారం ఉదయం అల్పపీడనం ఏర్పడనుంది. ఇది తదుపరి 48 గంటల్లో బలపడి పశ్చిమ వాయువ్య దిశగా తీవ్ర అల్పపీడనంగా ప్రయాణించే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
దీని ప్రభావంతో రాష్ట్రమంతటా ఆది, సోమవారాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే సూచనలున్నాయని తెలిపారు. ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వెల్లడించారు. దీని ప్రభావంతో తీరం వెంబడి 30–40 కిమీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశముంది. మత్స్యకారులెవ్వరూ సోమవారం వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.