
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాలకు దగ్గరలో వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఉత్తర ఒడిశా, పశ్చిమబెంగాల్ తీరాల్లో గురువారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా సముద్ర మట్టానికి 7.6 కి.మీ. ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో శుక్రవారం పలు చోట్ల భారీ వర్షాలు, ఒకట్రెండు చోట్ల అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
⇔కోస్తా, రాయలసీమల్లో నేడు, రేపు చాలా చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. 15, 16 తేదీల్లో ఉత్తర కోస్తాలో పలుచోట్ల భారీ వర్షాలు పడనున్నాయి.
⇔ ముఖ్యంగా ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని హెచ్చరించారు.
⇔ కోస్తా తీరం వెంబడి గంటకు 45 కి.మీ. నుంచి 55 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలుం డటంతో.. రానున్న 24 గంటల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు.
విస్తరంగా వర్షాలు
⇔ రాష్ట్రంలో పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసాయి. విశాఖ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు గురువారం దారాలమ్మ ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగి పడటంతో అంతర్రాష్ట్ర సరిహద్దు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
⇔ చింతూరు మండలంలో కుయి గూరు వాగు పొంగి జాతీయ రహదారి పైనుంచి ప్రవహిస్తుండటంతో 16 గ్రామాలతో పాటు ఆంధ్రా, ఒడిశా నడుమ రాకపోకలు స్తంభించాయి.
⇔ గోదావరి వరదనీరు తొయ్యేరు వద్ద రహదారి పైకి చేరడంతో దేవీపట్నంతో సహా పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ముంపు భయంతో నిర్వాసితులు గ్రామాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు.
⇔ కృష్ణా జిల్లాలోని మున్నేరు నది లింగాల వద్ద కాజ్‌వేకు ఆనుకుని 10 అడుగుల మేర వరదనీరు వస్తోంది. దీంతో కాజ్‌వేకు ఇరువైపులా కాపలా ఏర్పాటు చేశారు. చందమామపేటకు చెందిన పశువుల కాపరి శ్రీను మున్నేటి లంకలో ఇరుక్కున్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు గజ ఈతగాళ్ల సహాయంతో కాపాడారు.
Comments
Please login to add a commentAdd a comment