సాక్షి, హైదరాబాద్ : నైరుతి రుతుపవనాల ప్రవేశంతో దేశ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజుల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర బిహార్ నుంచి తెలంగాణ వరకు.. జార్ఖండ్, ఒడిశా, దక్షిణ ఛత్తీస్‌గఢ్ మీదుగా దాదాపు 7.6 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీంతో తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
కోస్తా ఆంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సుమారుగా 40 నుంచి 42 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. సాధారణం కన్నా 3 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయని సమాచారం. ఉత్తర కోస్తాంధ్రలో కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రేపు(ఆదివారం) కోస్తాంధ్రలో పలుచోట్ల వర్షం పడే అవకాశం ఉందని, సోమవారం అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. రాయలసీమలో కూడా రానున్న మూడు రోజుల్లో పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment