
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, విశాఖపట్నం: ఉత్తర కోస్తాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో శని, ఆదివారాల్లో ఈదురుగాలులతో కూడిన అకాల వర్షంతో పాటు అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శుక్రవారం రాత్రి నివేదికలో తెలిపింది. అదే సమయంలో కోస్తాంధ్ర, రాయలసీమల్లో తేలికపాటి జల్లులు గాని, వర్షం గాని కురవవచ్చని పేర్కొంది. ప్రస్తుతం కొమరిన్ ప్రాంతం నుంచి కర్ణాటక వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది.
శుక్రవారం రాష్ట్రంలో అనేకచోట్ల ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో ఎక్కడా వేసవి తీవ్రత కనిపించలేదు. రాష్ట్రంలో అత్యధికంగా అనంతపురంలో 39 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. గడిచిన 24 గంటల్లో కోడూరులో 15, తిరుమలలో 10, కదిరి, ఓబులదేవరచెరువు, నూజివీడు, నల్లమడ, పాకాలల్లో 7, అవనిగడ్డ, ముండ్లమూరు, వింజమూరు, ఆళ్లగడ్డ, తిరుపతిల్లో 6, పెనగలూరు, చిత్తూరు, ముద్దనూరు, చిత్తూరుల్లో 5, బెస్తవారిపేట, చింతపల్లి, తెనాలి, పులివెందల, ధోన్, నందికొట్కూరుల్లో 4 సెం.మీల వర్షపాతం నమోదైంది.