north coastal Andhra Pradesh
-
Cyclone Gulab: దూసుకొస్తున్న గులాబ్ తుపాను
-
నేడు ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: ఉత్తర కోస్తా తీరంలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో గురువారం భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం పేర్కొంది. రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురుస్తాయని బుధవారం వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం దక్షిణాంధ్ర పరిసర ప్రాంతాల మీదుగా కర్ణాటక, రాయలసీమ, తెలంగాణపై ఆవరించి ఉందని తెలిపింది. -
పొంచివున్న ‘ఫొని’ ప్రమాదం
సాక్షి, విశాఖపట్నం: ఊహించినట్టుగానే ‘ఫొని’ తుపాను తీవ్రరూపం దాల్చింది. అతి తీవ్ర తుపానుగా మారి ఉత్తర కోస్తాంధ్ర తీరం సమీపం నుంచి ఒడిశా వైపు దూసుకెళ్తోంది. గంటకు 16 కిలోమీటర్ల వేగంతో పెను విధ్వంసం సృష్టించే దిశగా పయనిస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తుపాను సోమవారం సాయంత్రానికి తీవ్ర తుపానుగా మారింది. ఇది చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 690, మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 760 కిలోమీటర్ల దూరంలోనూ కేంద్రీకృతమై ఉంది. మంగళవారం నాటికి అతి తీవ్ర తుపానుగా మారనుంది. ఒకటో తేదీ వరకు వాయవ్య దిశగా పయనిస్తూ పెను తుపాను (సూపర్ సైక్లోన్)గా బలపడనుంది. అనంతరం ఉత్తర వాయవ్య దిశగా మలుపు తిరిగి ఒడిశా తీరం వైపుగా కదులుతోంది. పెను తుపాను ఒకటో తేదీ నుంచి నాలుగో తేదీ వరకు అదే తీవ్రతతో కొనసాగనుంది. ఇదే ఇప్పుడు అందరిలోనూ తీవ్ర ఆందోళనను రేపుతోంది. బంగాళాఖాతంలో మంగళవారం గంటకు 135 నుంచి 160, బుధవారం నుంచి శుక్రవారం (3వ తేదీ) వరకు 160–200 కిలోమీటర్లు, 4వ తేదీన 150–190 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీయనున్నాయి. ఒకటి, రెండు తేదీల్లో ఉత్తరాంధ్ర, ఒడిశాల్లో గంటకు 60–85 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. ఈ ఫొని తుపాను ప్రభావం ఉత్తరాంధ్రపై అధికంగా ఉండనుంది. మంగళ, బుధవారాల్లో ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్రలో కొన్నిచోట్ల, గురువారం నుంచి ఒడిశా, ఉత్తరాంధ్రల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం సోమవారం రాత్రి విడుదల చేసిన ప్రత్యేక బులెటిన్‌లో వెల్లడించింది. మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నాయి. మే 4వ తేదీ వరకు పెనుగాలుల ధాటికి సముద్రం అల్లకల్లోలంగా మారనుంది. అలలు ఉవ్వెత్తున ఎగసిపడనున్నాయి. అందువల్ల మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని ఐఎండీ హెచ్చరించింది. విశాఖపట్నం, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో రెండో నంబరు, కాకినాడ, గంగవరం పోర్టుల్లో ఐదో నంబరు ప్రమాద హెచ్చరికను జారీచేశారు. ఎన్డీఆర్ఎఫ్, నేవీ కూడా హై అలర్ట్ ప్రకటించాయి. సుదీర్ఘ తుపాను.. ఫొని తుపాను ఎన్నో మలుపులు తిరుగుతోంది. ఇది తీవ్రరూపం దాల్చడమే కాదు.. దీని వేగం రోజుకో విధంగా ఉంటోంది. నెమ్మది నెమ్మదిగా కదులుతూ మరింత బలం పుంజుకుంటోంది. ఎక్కువ రోజులు సముద్రంలోనే ఉంటూ రోజురోజుకు తీవ్రతను పెంచుకుంటోంది. దాదాపు పది రోజులపాటు కొనసాగుతూ అరుదైన తుపానుగా ప్రత్యేకతను సంతరించుకుంటోంది. సాధారణంగా అల్పపీడనం ఏర్పడ్డాక వాయుగుండం, తీవ్ర వాయుగుండం, తుపాను, తీవ్ర తుపానుగాను బలపడుతూ తీరాన్ని దాటతాయి. కానీ, ఈ ఫొని తుపాను అల్పపీడనంగా ఏర్పడిన రెండు రోజుకే తుపానుగా మారి వారం రోజుల పాటు బంగాళాఖాతంలోనే వివిధ రూపాలు మార్చుకుంటూ, బలం పెంచుకుంటూ సూపర్ సైక్లోన్ స్థాయికి చేరుకుంటోంది. ఇలాంటి తుపానులు అత్యంత అరుదని, ఇటీవల కాలంలో ఇంత సుదీర్ఘంగా కొనసాగిన తుపానులు లేవని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. కోస్తా అంతటా అప్రమత్తం: ఎల్వీ అంతకు ముందు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. తుపాను ఎదుర్కొనేందుకు తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలను వివరించారు. ఇప్పటికే అందరు కోస్తా తీరప్రాంత జిల్లాల కలెక్టర్లకు తగిన ఆదేశాలు జారీచేశామని ఆయన తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, కోస్టుగార్డు, ఫైర్ సర్వీసెస్ తదితర ఏజెన్సీలను అప్రమత్తం చేశామన్నారు. తుపాను సమాచారాన్ని ఎప్పటికప్పుడు వాట్సప్, ఐవీఆర్ఎస్ ద్వారా కూడా తెలియబరుస్తున్నామని సీఎస్ వివరించారు. కాగా, రాష్ట్రానికి ఎన్డీఆర్ఎఫ్ కింద.. కరువు సహాయ చర్యల కింద రూ.500 కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉందని, ఎన్నికల నియామవళితో ఆ నిధులు రాలేదని సీఎస్ చెప్పగా దానికి ఎన్నికల నియామవళి అడ్డురాదని ఆ నిధులు కేంద్రం నుంచి విడుదల అవుతాయని కేబినెట్ కార్యదర్శి సిన్హా చెప్పారు. తుపానును ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధం నాలుగు రాష్ట్రాల సీఎస్‌లతో కేంద్ర కేబినెట్ కార్యదర్శి సిన్హా సమీక్ష సాక్షి, అమరావతి : బంగాళాఖాతంలో ఏర్పడిన ‘ఫొని’ తుపానును ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సర్వసన్నద్ధంగా ఉన్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం కేంద్ర కేబినెట్ కార్యదర్శి ప్రదీప్‌కుమార్ సిన్హాకు వివరించారు. ఈ తుపానును ఎదుర్కొనేందుకు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలపై సిన్హా ఆయా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో సోమవారం ఢిల్లీ నుంచి వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు పూర్తి కార్యాచరణ ప్రణాళికలతో అన్ని విధాలా సన్నద్ధమై ఉండాలని, కేంద్రం నుంచి అవసరమైన సహాయ సహకారాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నామని సిన్హా భరోసా ఇచ్చారు. ఈ తుపాను మరో 24 గంటల్లో అతి తీవ్ర తుపానుగా రూపాంతరం చెందే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నందున తమిళనాడు నుంచి పశ్చిమ బెంగాల్ వరకు గల నాలుగు తీరప్రాంత రాష్ట్రాల యంత్రాంగం పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని, మత్య్సకారులు ఎవ్వరూ సముద్రంలో చేపల వేటకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఇప్పటికే వేటకు వెళ్లి ఉంటే వారిని తిరిగి తీరానికి చేరుకునేలా ఏర్పాట్లు చేయాలన్నారు. -
ఉత్తర కోస్తా వైపు దూసుకొస్తున్న ‘ఫొని’
సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న ‘ఫొని’ తుపాన్ ఉత్తర కోస్తా వైపు దూసుకోస్తుంది. మే 2 నుంచి ఫొని ఉత్తరాంధ్రపై ప్రభావం చూపనుందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 840 కి.మీ దూరంలో, మచిలీపట్నానికి 990 కి.మీ దూరంలో తుపాన్ కేంద్రీకృతమై ఉంది. ఫొని మంగళవారం లేదా బుధవారం అతి తీవ్ర తుపాన్‌గా మారనుంది. తుపాన్ ప్రభావంతో దక్షిణ కోస్తాలో మంగళవారం నుంచి తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. మే 3వ తేదీ నుంచి ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. దీంతో అధికారులు అన్ని ప్రధాన పోర్టులో రెండో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీచేశారు. -
తీవ్ర వాయుగుండంగా మారిన దయె తుపాన్
సాక్షి, విశాఖపట్నం/అమరావతి: ఒడిశాలోని కళింగపట్నం, పూరిల మధ్య తీరం దాటిన దయె తుపాన్ మరింత బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారింది. ప్రస్తుతం దక్షిణ ఒడిశాలోని టిట్లాఘర్‌కు తూర్పు ఆగ్నేయంగా ఇది కేంద్రీకృతం అయింది. ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. సముద్రం అలజడిగా ఉన్నందున మరో 12 గంటల పాటు మత్స్యకారులు చేపలవేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది. కాగా, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం బలపడి గురువారం రాత్రికి తుపానుగా మారిన సంగతి తెలిసిందే. ఉత్తరకోస్తాలో భారీ వర్షాలు, ఈదురుగాలులు దయె తుఫాన్ కారణంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో ఒడిశాలోని పలు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో కూడా పలుచోట్ల వర్షాలు పడుతున్నాయి. అంతకుముందు తుపాన్ ప్రభావంతో విశాఖపట్నం, గంగవరం, కళింగపట్నం, భీమునిపట్నం పోర్టుల్లో మూడో నంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. కాకినాడ, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో రెండో నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. తాజాగా తుపాన్ బలహీనపడి వాయుగుండంగా మారడంతో అధికారులు వాటిని ఉపసంహరించారు. -
పొంచివున్న పిడుగుల గండం
సాక్షి, విశాఖపట్నం: ఉత్తర కోస్తాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో శని, ఆదివారాల్లో ఈదురుగాలులతో కూడిన అకాల వర్షంతో పాటు అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శుక్రవారం రాత్రి నివేదికలో తెలిపింది. అదే సమయంలో కోస్తాంధ్ర, రాయలసీమల్లో తేలికపాటి జల్లులు గాని, వర్షం గాని కురవవచ్చని పేర్కొంది. ప్రస్తుతం కొమరిన్ ప్రాంతం నుంచి కర్ణాటక వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. శుక్రవారం రాష్ట్రంలో అనేకచోట్ల ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో ఎక్కడా వేసవి తీవ్రత కనిపించలేదు. రాష్ట్రంలో అత్యధికంగా అనంతపురంలో 39 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. గడిచిన 24 గంటల్లో కోడూరులో 15, తిరుమలలో 10, కదిరి, ఓబులదేవరచెరువు, నూజివీడు, నల్లమడ, పాకాలల్లో 7, అవనిగడ్డ, ముండ్లమూరు, వింజమూరు, ఆళ్లగడ్డ, తిరుపతిల్లో 6, పెనగలూరు, చిత్తూరు, ముద్దనూరు, చిత్తూరుల్లో 5, బెస్తవారిపేట, చింతపల్లి, తెనాలి, పులివెందల, ధోన్, నందికొట్కూరుల్లో 4 సెం.మీల వర్షపాతం నమోదైంది. -
అల్పపీడనంగా మారిన ద్రోణి
విశాఖపట్నం : నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంకకు సమీపంలో ఏర్పడిన ద్రోణి అల్పపీడనంగా మారిందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం గురువారం వెల్లడించింది. అల్పపీడన ప్రాంతంలో 4.5 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలిపింది. వచ్చే 24 గంటల్లో దక్షిణ కోస్తాలో చెదురుమదురు వర్షాలు పడతాయని చెప్పింది. ఈ నేపథ్యంలో ఉత్తర కోస్తాలో అక్కడక్కడా వర్షాలు పడతాయని పేర్కొంది. కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం తెలిపింది. -
ఉత్తర కోస్తాలో విస్తారంగా వర్షాలు
విశాఖపట్నం: బంగాళాఖాతంలో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం శనివారం వెల్లడించింది. ఈ రోజు రాత్రి లేదా రేపు ఉదయం తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఉపరితల అవర్తనం, అల్పపీడన ద్రోణి కొనసాగుతుందని వివరించింది. ఈ నేపథ్యంలో ఉత్తర కోస్తాలో వర్షాలు విస్తారంగా కురుస్తాయని... అలాగే ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని... దీంతో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. -
ఉత్తర కోస్తాకు విస్తారంగా వర్షాలు
విశాఖపట్నం: పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం బలంగా కొనసాగుతుందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరో కొన్ని గంటల్లో అది అల్పపీడనంగా మారే అవకాశం ఉందని తెలిపింది. ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకూ... కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతుందని పేర్కొంది. ఉత్తర కోస్తాకు ఈ మధ్యాహ్నం నుంచి విస్తారంగా వర్షాలు పడతాయని... అలాగే రాయలసీమ, తెలంగాణలలో పలుచోట్ల అక్కడక్కడా వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం వివరించింది. -
వాయుగుండంగా మారిన అల్పపీడనం
మరోవైపు కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి ప్రస్తుతం ఒడిశాకు ఈశాన్యంగా జార్ఖండ్‌లోని జంషెడ్పూర్ వద్ద స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావం మనకు లేకపోయినా ఛత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్, ఒడిశాలపై ఎక్కువగా ఉంది. ఆ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఛత్తీస్‌ఘడ్ నుంచి దక్షిణ కోస్తా, తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో వచ్చే 48 గంటల్లో శ్రీకాకుళం, విజయనగరం, తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మంలోని చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. కోస్తాంధ్ర, తెలంగాణలోని మిగిలిన ప్రాంతాల్లో ఓ మాదిరి వర్షాలు పడనున్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది. మరోవైపు తీరం వెంబడి పశ్చిమ దిశగా గంటకు 50 నుంచి 55 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. -
రాగల 24 గంటల్లో 25 సెంటీమీటర్లకు పైగా వర్షం
ఒడిశాలో రాగల 24 గంటల్లో దాదాపు 25 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం పడే అవకాశం కనిపిస్తోంది. అలాగే రాష్ట్రంలోని ఉత్తరకోస్తా జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో కూడా భారీగా వర్షాలు పడునున్నాయి. వీటితోపాటు రాగల 48 గంటల్లో ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలు అధికంగా ఉన్నాయి. ఒడిశాలో ఈ రోజు తెల్లవారుజామున గాలులు ప్రచండ వేగంతో వీస్తున్నాయి. అయితే ఆ గాలుల వేగం ఈ రోజు సాయంత్రానికి క్రమంగా తగ్గే అవకాశం ఉంది. కాగా ఆ గాలుల వల్ల పాకలు, పురి గుడిసెలు పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది. అలాగే విద్యుత్, సమాచార వ్యవస్థలు మరింతంగా దెబ్బతింటుంది. వీటితోపాటు రవాణ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్థం అవుతుంది. విపరీతమైన ఈదురుగాలులు, భారీ వర్షాల కారణంగా పంట పోలాలు నీటి మునగనున్నాయి.