భారీవర్షాలకు ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లాలో నిలిచిన వరద నీరు
సాక్షి, విశాఖపట్నం/అమరావతి: ఒడిశాలోని కళింగపట్నం, పూరిల మధ్య తీరం దాటిన దయె తుపాన్ మరింత బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారింది. ప్రస్తుతం దక్షిణ ఒడిశాలోని టిట్లాఘర్‌కు తూర్పు ఆగ్నేయంగా ఇది కేంద్రీకృతం అయింది. ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. సముద్రం అలజడిగా ఉన్నందున మరో 12 గంటల పాటు మత్స్యకారులు చేపలవేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది. కాగా, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం బలపడి గురువారం రాత్రికి తుపానుగా మారిన సంగతి తెలిసిందే.
ఉత్తరకోస్తాలో భారీ వర్షాలు, ఈదురుగాలులు
దయె తుఫాన్ కారణంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో ఒడిశాలోని పలు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో కూడా పలుచోట్ల వర్షాలు పడుతున్నాయి. అంతకుముందు తుపాన్ ప్రభావంతో విశాఖపట్నం, గంగవరం, కళింగపట్నం, భీమునిపట్నం పోర్టుల్లో మూడో నంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. కాకినాడ, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో రెండో నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. తాజాగా తుపాన్ బలహీనపడి వాయుగుండంగా మారడంతో అధికారులు వాటిని ఉపసంహరించారు.
Comments
Please login to add a commentAdd a comment