Cyclone Fani Latest Updates | అతి తీవ్ర తుపానుగా మారిన ‘ఫొని’ | Fani Cyclone LIVE/Current Status - Sakshi
Sakshi News home page

అతి తీవ్ర తుపానుగా మారిన ‘ఫొని’

Published Tue, Apr 30 2019 11:32 AM | Last Updated on Tue, Apr 30 2019 1:35 PM

Cyclone Fani Intensifies Into Severe Cyclonic Storm - Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఊహించినట్టుగానే ‘ఫొని’ తుపాను తీవ్రరూపం దాల్చింది. అతి తీవ్ర తుపానుగా మారి ఉత్తర కోస్తాంధ్ర తీరం సమీపం నుంచి ఒడిశా వైపు దూసుకెళ్తోంది. గంటకు 16 కిలోమీటర్ల వేగంతో పెను విధ్వంసం సృష్టించే దిశగా పయనిస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తుపాను సోమవారం సాయంత్రానికి తీవ్ర తుపానుగా మారింది. ఇది చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 690, మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 760 కిలోమీటర్ల దూరంలోనూ కేంద్రీకృతమై ఉంది. మంగళవారం నాటికి అతి తీవ్ర తుపానుగా మారనుంది. ఒకటో తేదీ వరకు వాయవ్య దిశగా పయనిస్తూ పెను తుపాను (సూపర్‌ సైక్లోన్‌)గా బలపడనుంది. అనంతరం ఉత్తర వాయవ్య దిశగా మలుపు తిరిగి ఒడిశా తీరం వైపుగా కదులుతోంది. పెను తుపాను ఒకటో తేదీ నుంచి నాలుగో తేదీ వరకు అదే తీవ్రతతో కొనసాగనుంది. ఇదే ఇప్పుడు అందరిలోనూ తీవ్ర ఆందోళనను రేపుతోంది. బంగాళాఖాతంలో మంగళవారం గంటకు 135 నుంచి 160, బుధవారం నుంచి శుక్రవారం (3వ తేదీ) వరకు 160–200 కిలోమీటర్లు, 4వ తేదీన 150–190 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీయనున్నాయి.

ఒకటి, రెండు తేదీల్లో ఉత్తరాంధ్ర, ఒడిశాల్లో గంటకు 60–85 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. ఈ ఫొని తుపాను ప్రభావం ఉత్తరాంధ్రపై అధికంగా ఉండనుంది. మంగళ, బుధవారాల్లో ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్రలో కొన్నిచోట్ల, గురువారం నుంచి ఒడిశా, ఉత్తరాంధ్రల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం సోమవారం రాత్రి విడుదల చేసిన ప్రత్యేక బులెటిన్‌లో వెల్లడించింది. మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నాయి. మే 4వ తేదీ వరకు పెనుగాలుల ధాటికి సముద్రం అల్లకల్లోలంగా మారనుంది. అలలు ఉవ్వెత్తున ఎగసిపడనున్నాయి. అందువల్ల మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని ఐఎండీ హెచ్చరించింది. విశాఖపట్నం, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో రెండో నంబరు, కాకినాడ, గంగవరం పోర్టుల్లో ఐదో నంబరు ప్రమాద హెచ్చరికను జారీచేశారు. ఎన్డీఆర్‌ఎఫ్‌, నేవీ కూడా హై అలర్ట్‌ ప్రకటించాయి.

సుదీర్ఘ తుపాను..
ఫొని తుపాను ఎన్నో మలుపులు తిరుగుతోంది. ఇది తీవ్రరూపం దాల్చడమే కాదు.. దీని వేగం రోజుకో విధంగా ఉంటోంది. నెమ్మది నెమ్మదిగా కదులుతూ మరింత బలం పుంజుకుంటోంది. ఎక్కువ రోజులు సముద్రంలోనే ఉంటూ రోజురోజుకు తీవ్రతను పెంచుకుంటోంది. దాదాపు పది రోజులపాటు కొనసాగుతూ అరుదైన తుపానుగా ప్రత్యేకతను సంతరించుకుంటోంది. సాధారణంగా అల్పపీడనం ఏర్పడ్డాక వాయుగుండం, తీవ్ర వాయుగుండం, తుపాను, తీవ్ర తుపానుగాను బలపడుతూ తీరాన్ని దాటతాయి. కానీ, ఈ ఫొని తుపాను అల్పపీడనంగా ఏర్పడిన రెండు రోజుకే తుపానుగా మారి వారం రోజుల పాటు బంగాళాఖాతంలోనే వివిధ రూపాలు మార్చుకుంటూ, బలం పెంచుకుంటూ సూపర్‌ సైక్లోన్‌ స్థాయికి చేరుకుంటోంది. ఇలాంటి తుపానులు అత్యంత అరుదని, ఇటీవల కాలంలో ఇంత సుదీర్ఘంగా కొనసాగిన తుపానులు లేవని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

కోస్తా అంతటా అప్రమత్తం: ఎల్వీ
అంతకు ముందు సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. తుపాను ఎదుర్కొనేందుకు తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలను వివరించారు. ఇప్పటికే అందరు కోస్తా తీరప్రాంత జిల్లాల కలెక్టర్లకు తగిన ఆదేశాలు జారీచేశామని ఆయన తెలిపారు. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, ఆర్మీ, నేవీ, కోస్టుగార్డు, ఫైర్‌ సర్వీసెస్‌ తదితర ఏజెన్సీలను అప్రమత్తం చేశామన్నారు. తుపాను సమాచారాన్ని ఎప్పటికప్పుడు వాట్సప్, ఐవీఆర్‌ఎస్‌ ద్వారా కూడా తెలియబరుస్తున్నామని సీఎస్‌ వివరించారు. కాగా, రాష్ట్రానికి ఎన్డీఆర్‌ఎఫ్‌ కింద.. కరువు సహాయ చర్యల కింద రూ.500 కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉందని, ఎన్నికల నియామవళితో ఆ నిధులు రాలేదని సీఎస్‌ చెప్పగా దానికి ఎన్నికల నియామవళి అడ్డురాదని ఆ నిధులు కేంద్రం నుంచి విడుదల అవుతాయని కేబినెట్‌ కార్యదర్శి సిన్హా చెప్పారు.

తుపానును ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధం
నాలుగు రాష్ట్రాల సీఎస్‌లతో కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి సిన్హా సమీక్ష

సాక్షి, అమరావతి : బంగాళాఖాతంలో ఏర్పడిన ‘ఫొని’ తుపానును ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సర్వసన్నద్ధంగా ఉన్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి ప్రదీప్‌కుమార్‌ సిన్హాకు వివరించారు. ఈ తుపానును ఎదుర్కొనేందుకు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలు తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలపై సిన్హా ఆయా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో సోమవారం ఢిల్లీ నుంచి వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు పూర్తి కార్యాచరణ ప్రణాళికలతో అన్ని విధాలా సన్నద్ధమై ఉండాలని, కేంద్రం నుంచి అవసరమైన సహాయ సహకారాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నామని సిన్హా భరోసా ఇచ్చారు.

ఈ తుపాను మరో 24 గంటల్లో అతి తీవ్ర తుపానుగా రూపాంతరం చెందే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నందున తమిళనాడు నుంచి పశ్చిమ బెంగాల్‌ వరకు గల నాలుగు తీరప్రాంత రాష్ట్రాల యంత్రాంగం పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని, మత్య్సకారులు ఎవ్వరూ సముద్రంలో చేపల వేటకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఇప్పటికే వేటకు వెళ్లి ఉంటే వారిని తిరిగి తీరానికి చేరుకునేలా ఏర్పాట్లు చేయాలన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement