విశాఖపట్నం : నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంకకు సమీపంలో ఏర్పడిన ద్రోణి అల్పపీడనంగా మారిందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం గురువారం వెల్లడించింది. అల్పపీడన ప్రాంతంలో 4.5 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలిపింది. వచ్చే 24 గంటల్లో దక్షిణ కోస్తాలో చెదురుమదురు వర్షాలు పడతాయని చెప్పింది. ఈ నేపథ్యంలో ఉత్తర కోస్తాలో అక్కడక్కడా వర్షాలు పడతాయని పేర్కొంది. కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం తెలిపింది.