సాక్షి, గుంటూరు: గుంటూరు జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. పిడుగుపాటుకు జిల్లాల్లో ఆరుగురు వ్యక్తులు, గుండెపోటుతో మరొకరు మృతిచెందారు. కోట్లాది రూపాయాల ఆస్తి నష్టం వాటిల్లింది. ప్రత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండలం, పుసులూరు గ్రామంలో పిడుగు పాటుకు ఇద్దరు మృతి చెందారు. సీతారపు మాధవి(35), కొండేపాటి వెంకట్రావు(50) పొలంలోని మిర్చి కల్లంలో పట్టలు కప్పుతుండగా పిడుగు పడడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. ఉరుముల శబ్దానికి తాడికొండ మండలంలో కశమ్ కుమారి(55) అనే మహిళ గుండెపోటుతో మృతి చెందారు.
బెల్లంకొండ మండలం వెంకటాయపాలెంలో పిడుగుపాటుకు ఇద్దరు మృతిచెందారు. వట్టిచెరుకూరు మండలం అనంతవరప్పాడు గ్రామంలో పొలం నుంచి తిరిగి వస్తుండగా పిడుగుపడి వేజెండ్ల రత్నకుమారి(40) చనిపోయారు. సత్తెనపల్లి మండలం, పెదమక్కెనలో గుంటుపల్లి గోపి(26) పిడుగుపాటుకు మృతి. రాజుపాలెం గ్రామంలో గేదెల కాపరి జె.గోపి అనే పిల్లవాడిపై పిడుగు పడి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సత్తెనపల్లి నియోజకవర్గంవ్యాప్తంగా ఈదురు గాలులకు 8 పూరిళ్లు, రేకుల షెడ్లు నేలకూలాయి. పెదకాకాని మండలం వెనిగండ్లలో పిడుగుపాటుకు ఇద్దరు గొర్రెల కాపరులు పసుపులేటి శ్రీనివాసరావు, తోట అంకమ్మరావులకు తీవ్ర గాయాలయ్యాయి.
మంగళగిరి నియోజకవర్గంలో 450 ఎకరాల్లో అరటి పంట నేల కూలి 4.25 కోట్ల ఆస్తి నష్టం జరిగింది.
పొన్నూరు నియోజకవర్గంలో 8వేల ఎకరాల్లో నీట మునిగిన మొక్కజొన్న 2కోట్ల మేర ఆస్తి నష్టం.
మిర్చి యార్డులో సుమారు 1.50 మిర్చి బస్తాలు నీట మునిగాయి.
Comments
Please login to add a commentAdd a comment