‘పిడుగు’ విషాదం | 'Thunderbolt' tragedy | Sakshi
Sakshi News home page

‘పిడుగు’ విషాదం

Published Sun, Sep 29 2013 1:20 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM

'Thunderbolt' tragedy

యలమంచిలి / రాంబిల్లి / ఎస్.రాయవరం, న్యూస్‌లైన్: యలమంచిలి ప్రాంతంలో శనివారం సాయంత్రం పిడుగులు బీభత్సం సృష్టించాయి. యలమంచిలి, రాంబిల్లి, ఎస్.రాయవరం మండలాల్లో పిడుగులుపడి ఆరుగురు దుర్మరణం చెందారు. వీరిలో ఐదుగురు మహిళా కూలీలు, ఒకరు రైతు. వరినాట్లు వేస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. యలమంచిలి మండలం పోతిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన పెద్దాడ రాజు (35) గ్రామంలోని ఇత్తంశెట్టి గంగరాజు అనే రైతు పొలంలో వరినాట్లు పనికి వెళ్లింది. చినుకులు పడుతున్నాయని ఐదుగురు కూలీలు పొలంలోనుంచి బయటకు వస్తుండగా పెద్దాడ రాజుపై పిడుగుపడింది. తలపై తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతిచెందింది. ఆమె వెనుక ఉన్న చీపురుపల్లి చెల్లయ్యమ్మ సొమ్మసిల్లి పడిపోయింది. ఈమెను యలమంచిలి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నట్టు వైద్యులు తెలిపారు.

 ఎస్.రాయవరం మండలంలో...

 రెండు గ్రామాల్లో ఇద్దరు మృతి చెందడంతో ఎస్.రాయవరం మండలవాసులు కలవర పాటుకు గురయ్యారు. జేవిపాలెం గ్రామానికి చెందిన కట్టుమూరి పెదమల్లయ్య(60) పొలంలో పారపని చేస్తుండగా పిడుగుపడి అక్కడిక్కడే మృతి చెందాడు. కొత్త సోమిదేవపల్లికి చెందిన భీమరాజు సత్యవతి(38) వరినాట్లు వేసేపనికి పేటసూదిపురం వెళ్లింది. వర్షం పడుతున్నదని పొలంలో నుంచి ఒడ్డుకు పరుగెడుతుండగా తలపై పిడుగుపడి అక్కడికక్కడే మృతిచెందింది. మిగతా కూలీలు, రైతులు భయాందోళనలతో పరుగులు తీశారు. సత్యవతి,పెదమల్లయ్య కుంటుంభ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.  

 దిమిలిలో విషాదం

 గ్రామానికి చెందిన ముగ్గురు మహిళా కూలీల మృతితో రాంబిల్లి మండలం దిమిలిలో విషా దం అలుముకుంది. మండలంలోని కట్టుబోలు రెవెన్యూ పరిధిలో వరినాట్లు వేస్తుండగా పిడుగుపాటుకు సిగిరెడ్డి కళావతి (35), సిగిరెడ్డి అమ్మాజీ (40), నగిరెడ్డి దేవుడమ్మ (58) అక్కడికక్కడే మృతి చెందారు. మాదాటి వెంకటలక్ష్మి అపస్మారక స్థితికి చేరింది. ఆమెను యలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరందరిది దిమిలి గ్రామం. మృతుల్లో కళావతి, అమ్మాజీ తోటి కోడళ్లు. మృతులు ముగ్గురూ నిరుపేద వ్యవసాయ కూలీలు. అమ్మాజీకి పదేళ్ల కుమారుడితో పాటు భర్త ఉన్నారు. దేవుడమ్మకు వివాహమైన కుమార్తె ఉంది. కళావతికి పిల్లలు లేరు. సంఘటన స్థలంలో మృతదేహాలు ఉన్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. యలమంచిలి సీఐ కె.రామారావు, రాంబిల్లి ఎస్.ఐ. వి.కృష్టారావు సంఘటనాస్థలాన్ని పరిశీలించి కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్.ఐ. తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement