అమెరికాలో భారీ వర్షాలు, పిడుగుల కారణంగా ఆదివారం(జులై 16) 2,600లకు పైగా విమానాలు రద్దయ్యాయి. సుమారు 8 వేల విమానాలు ఆలస్యంగా నడిచాయి. ఈ మేరకు ఏబీసీ న్యూస్ వార్తా సంస్థ పేర్కొంది. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌ఏఏ) ప్రకారం అత్యధికంగా ఈశాన్య ప్రాంతంలోనే రద్దయ్యాయి.
ఒక్క న్యూజెర్సీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచే 350 కిపైగా విమానాలు రద్దయినట్లు ఎన్‌బీసీ న్యూస్ నివేదించింది. తీవ్ర ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్ కెన్నడీ ఎయిర్‌పోర్ట్, లా గార్డియన్ విమానాశ్రయాలు కూడా స్తంభించినట్లు పేర్కొంది.
ఇదీ చదవండి ➤ ఆకాశంలో ఉండగా.. ఎయిరిండియా విమానంలో కలకలం
ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఎయిర్‌పోర్ట్‌కు వచ్చే ముందే ఫ్లయిట్ టైమింగ్, వాతావరణ పరిస్థితులను సరిచూసుకోవాలని ఎయిర్‌లైన్స్ సంస్థలు ప్రయాణికులకు ట్విటర్ ద్వారా విజ్ఞప్తులు చేశాయి.
కాగా ఆ దేశంలోని ఈశాన్య రాష్ట్రాలను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్, పెన్సిల్వేనియా, మసాచుసెట్స్, వెర్మాంట్ ప్రాంతాల్లో వరద హెచ్చరికలు జారీ అయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో ప్రాణాంతక వరదలు సైతం నమోదైనట్లు నేషనల్ వెదర్ సర్వీస్ పేర్కొంది.
ఇది ఇలా ఉంటే, రికార్డు స్థాయి ఉష్ణోగ్రతల కారణంగా ఆ దేశంలోని కొన్ని పశ్చిమ, దక్షిణ ప్రాంతాల్లో వడ గాల్పుల హెచ్చరికలు జారీ చేశారు. నైరుతి, పశ్చిమ గల్ఫ్ కోస్ట్, దక్షిణ ఫ్లోరిడాలోని కొన్ని ప్రాంతాలలో తీవ్ర ఉష్ణోగ్రతలు బెంబేలెత్తిస్తున్నాయి. రాబోయే వారంలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని ఎన్‌డబ్ల్యూఎస్ హెచ్చరించింది.
Comments
Please login to add a commentAdd a comment