అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సుమారు ఏడాది సమయం వుంది. ఈలోపే ఎన్నికల వేడి మొదలైనట్లు అక్కడి వాతావరణం గమనిస్తే అర్ధమవుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు దానికి బలాన్ని చేకూరుస్తున్నాయి. డోనాల్డ్ ట్రంప్ రూపంలో అమెరికాలో ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందంటూ బైడెన్ వ్యాఖ్యలు చేయడం ప్రారంభించారు. ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఇది నాలుగోసారి. కాకపోతే ఇప్పటివరకూ పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు.ఇప్పుడు తొలిసారిగా ట్రంప్‌ను, అతని అనుచరులను ఉద్దేశిస్తూ నేరుగా విరుచుకుపడ్డారు.
బరిలోకి ట్రంప్.. బైడెన్ విసుర్లు
అదే సమయంలో, రిపబ్లికన్ పార్టీపైనా విసుర్లు విసిరారు. అరిజోనాలో తన ఒకప్పటి సహచరుడు, దివంగత జాన్ మైకెన్ స్మృతిగా చేపట్టిన లైబ్రరీ నిర్మాణ కార్యక్రమం వేదికగా బైడెన్ తన వాగ్బాణాలను ఎక్కుపెట్టారు. రిపబ్లికన్ పార్టీ తరుపున మళ్ళీ డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడి బరిలో దిగే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఆ పార్టీ సభ్యుల మద్దతు బలంగా కూడగట్టుకొనే దిశగా ట్రంప్ తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే తనకంటూ ఒక వర్గాన్ని నిర్మించుకున్నారు. గత మిడ్ టర్మ్ ఎన్నికల్లో డెమోక్రాట్స్ ఓడిపోవడంతో రిపబ్లికన్స్ లో ఆశలు చిగురిస్తున్నాయి.
డెమోక్రట్లకు కాస్త కలిసివచ్చింది
ప్రస్తుతం అమెరికాలో జో బైడెన్ రేటింగ్స్ పడిపోవడం, 80ఏళ్ళ ముదుసలి ప్రాయానికి దగ్గర కావడం మొదలైన అంశాలు డోనాల్డ్ ట్రంప్‌కు తన విజయం పట్ల విశ్వాసాన్ని కలుగజేస్తున్నట్లు భావించాలి. ఎన్నికలకు ఇంకా సంవత్సరం సమయం వున్నప్పటికీ ఇప్పటి నుంచే ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ బీదపలుకులు పలకడం ఏమీ బాగాలేదు. దీని ద్వారా తన ఓటమి, తన పార్టీ ఓటమి తధ్యమని సంకేతం ఇచ్చినట్లైంది. మొన్నటి మిడ్ టర్మ్ ఎన్నికల ముందు ట్రంప్‌పై ఎదురుదాడికి దిగిన సందర్భం డెమోక్రట్లకు కాస్త కలిసివచ్చింది.
చదవండి: అమెరికాను ముంచెత్తిన వరదలు... న్యూయార్క్ అతలాకుతలం!
ట్రంప్ సునిశిత పరిశీలన
అదేంటంటే? అతి స్వల్ప తేడాతో మెజారిటీని కోల్పోయారు. లేకపోతే, ఇంకా ఎక్కువ బలహీన పడివుండేవారనే వ్యాఖ్యలు వినపడ్డాయి. ఈ అంశాన్ని డెమోక్రట్స్ తేలికగా తీసుకోరాదు. జో బైడెన్ పాలనలోని ప్రతి తప్పటడుగును ట్రంప్ చాలా సునిశితంగా పరిశీలిస్తున్నారు. బైడెన్/ డెమోక్రట్స్ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సందర్భం వచ్చేసింది. గతంలో డోనాల్డ్ ట్రంప్ పాలన గొప్పగా లేకపోయినా, నేటి బైడెన్ పాలన అద్భుతంగా వుందని చెప్పడానికి వాతావరణం పెద్దగా కనిపించడం లేదు. కాకపోతే ట్రంప్ నియంతగా, అహంకారిగా,సంపన్నుల పక్షపాతిగా కనిపిస్తాడు.అంతకు మించి శ్వేత జాత్యహంకారం, మిగిలిన జాతుల పట్ల వివక్ష ట్రంప్ లో పతాకస్థాయిలో కనిపిస్తాయి.జో బైడెన్ ఆ పార్టీ పేరుకు తగ్గట్టుగా ప్రజాస్వామ్యయుతంగా కనిపిస్తాడు.
మూర్ఖంగా ప్రవర్తించి పరువుపోగొట్టుకున్నాడు
పిచ్చిచేష్టలు, కోవిడ్ కష్టాలు మొదలైనవి ట్రంప్ పాలనపై తీవ్ర ప్రజావ్యతిరేకతను రగల్చడంతో మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలవ్వక తప్పలేదు. ట్రంప్ ఎన్నికల్లో ఓడిన తర్వాత కూడా మూర్ఖంగా ప్రవర్తించి పరువుపోగొట్టుకున్నాడు. తన పరిపాలనాకాలంలో అంతర్జాతీయ సంబంధాలను కూడా అడగంటించాడు. అభివృద్ధి ఎటూ లేదు. మంచిపేరు కూడా తెచ్చుకోలేకపోయాడు. దేశం పరువూ పోగొట్టాడు. కాకపోతే, శ్వేత జాతీయుల్లో తమ జాతినేతగా ముద్రవేయడంలో కొంత విజయం సాధించాడు. ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ విషయానికి వస్తే, బలమైన నేతగా ముద్రవేసుకోలేకపోయాడని చెప్పవచ్చు.
ఏడాది ఆగాల్సిందే
డెన్ ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ అని నినాదం పదే పదే వినిపిస్తున్నారు. అమెరికా గొప్పతనం తగ్గుముఖం పట్టిందని, మళ్ళీ పూర్వ వైభవం రావాలని ఆ వాఖ్యలే చెప్పకనే చెబుతున్నాయి. ఆర్ధిక మాంద్యం కష్టాలు అమెరికాను వెంటాడుతూనే వున్నాయి. ఏ రీతిన చూసినా అటు అమెరికా పరిస్థితి ఇటు జో బైడెన్ స్థితి అంత ఆశాజనకంగా లేవు. ఈ సంవత్సర కాలంలో ఏవైనా బలమైన మార్పులు జరిగితే, బైడెన్‌కు కొంత అనుకూల వాతావరణం వస్తుంది. డెమోక్రాటిక్ పార్టీ తరపున అధ్యక్ష పదవి రేసులో ఇంకా కొందరు నేతలు లేకపోలేదు. కమలా హ్యారిస్ అభ్యర్థిత్వంపై కూడా కొన్ని ఆలోచనలు అలుముకుంటున్నాయి. ఏది ఏమైనా, అగ్రరాజ్యంలో అధ్యక్ష ఎన్నికల అగ్గి మొదలైంది. రాజెవరో రెడ్డవరో తేలాలంటే ఒక ఏడాది ఆగాల్సిందే.
-మాశర్మ సీనియర్ జర్నలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment