సాక్షి, పార్వతీపురం జిల్లా: గత నెల 17న కురుపాం మండలంలోని చాపరాయిగూడ గిరిజన గ్రామంలో పిడుగుపడి చెట్టు ఓ కొబ్బరిచెట్టు కాలిపోయింది. తాజాగా ఆదివారం పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో ఆకాశం గర్జించింది. ఎక్కడ పిడుగులు పడుతున్నాయోనని జనం తీవ్రభయాందోళనకు గురయ్యారు. వేసవి కాలంలో కురిసే వర్షాలు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. ఈ కాలంలో వర్షం వచ్చే సమయంలో ఎక్కువగా ఉరుములతో పాటు పిడుగులు పడుతుంటాయి. పిడుగుపాటు బారిన పడి గ్రామీణ ప్రాంతాల్లో పొలాల్లో తిరుగాడే పశువుల కాపర్లు, రైతులు, ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్నారు.
ఒక్కోసారి చెట్లు, మూగజీవాలు పిడుగుపాటుకు గురై చనిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పిడుగులు పడే ప్రాంతాల సమాచారాన్ని వాతావరణశాఖ ముందస్తుగానే తెలియజేస్తోంది. ఆకాశం గర్జించే సమయంలో ఆపద నుంచి గట్టెక్కాలంటే అప్రమత్తంగా ఉండడమే శ్రీరామరక్ష అని, పిడుగు ఎలా పడుతుంది? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలను నిపుణులు సాక్షికి వివరించారు. ఆ వివరాలు వారి మాటల్లోనే..
ఏం చేయకూడదంటే..
►ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసేట ప్పుడు చెట్ల కింద నిలబడడం, రైతులు పొలాల్లో ఉండడం చేయకూడదు.
►మెరుపు కనిపించిన తర్వాత 30 సెకన్లలో లేదా అంత కన్నా తక్కువ సమయంలో ఉరుము వినిపిస్తే మనకు 10 కిలోమీటర్ల దూరం లోపు పిడుగు పడే అవకాశం ఉంది.
►మెరుపు కనబడిన తర్వాత 30 నిమిషాల పాటు బయటకు వెళ్లే ప్రయత్నం చేయరాదు.
►గొడుగులపై లోహపు బోల్టులు, చేతుల్లో సెల్‌ఫోన్లు లేకుండా చూసుకోవాలి. సెల్‌ఫోన్ ఉంటే స్విచ్‌ఆఫ్ చేయాలి.
►వర్షం పడే సమయంలో విద్యుత్ తీగల కింద, ట్రాన్స్‌ఫార్మర్ల సమీపంలో ఉండకూడదు. ఆ సమయంలో చెప్పులు లేకుండా బయటకు వెళ్లకూడదు.
అత్యధిక విద్యుత్ ప్రవాహమే పిడుగు
మెరుపుల ద్వారా ఏర్పడే అత్యధిక విద్యుత్ ప్రవాహమే పిడుగు. విద్యుదావేశం పేరుకుపోయిన మేఘాలకు సమీపంలో వ్యతిరేక విద్యుదావేశం కలిగిన మేఘాలు ఉన్నప్పుడు స్థిరంగా విద్యుత్ భూమి వైపు ప్రవహిస్తుంది. అప్పుడు ఏర్పడే విద్యుత్ క్షేత్ర తీవ్రత మీటరుకు 2లక్షల ఓల్టులతో సమానం. పిడుగు పడినప్పుడు వస్తువులను బట్టి నష్ట తీవ్రత ఉంటుంది.
పొట్నూరు రాజీవ్, ఇస్త్రో శాస్త్రవేత
ప్రథమ చికిత్స చేయాలి
పిడుగుపాటుకు గురైన వ్యక్తిని వెంటనే పొడి ప్రదేశంలో తిన్నగా పడుకోబెట్టి తడి బట్టలు తీసివేయాలి. తలను ఒక పక్కకు తిప్పి రెండు కాళ్లు ఒక అడుగు పైకి ఎత్తి గాలి తగిలే ప్రదేశంలో ఉంచి, అవసరమైతే నోటి ద్వారా గాలి ఊది ప్రథమ చికిత్స చేయాలి. వెంటనే దగ్గరలో ఉన్న పీహెచ్‌సీకి తరలించి వైద్యసేవలు అందజేయాలి.
జె.రవీంద్రకుమార్, సూపరింటెండెంట్,ఏరియా ఆస్పత్రి, పాలకొండ
Comments
Please login to add a commentAdd a comment