thunder bolt
-
పిడుగుపాటుకు ఐదుగురు బలి
సాక్షి, నెట్వర్క్: పిడుగుపాటుకు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 20 మూగజీవాలు సైతం బలయ్యాయి. నారాయణపేట జిల్లా విఠలపురం గ్రామానికి చెందిన ఆశన్న (58) పత్తి విత్తనాలు విత్తేందుకు కుటుంబసభ్యులను, కూలీలతో పొలానికి వెళ్లాడు. సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో అందరూ సమీపంలోని చెట్టు కిందకు వెళ్లారు. ఈ క్రమంలో పిడుగు పడటంతో ఆశన్నతో పాటు వ్యవసాయ కూలీ కౌసల్య (54) అక్కడికక్కడే మృతిచెందారు. ఆశన్న భార్య సైదులమ్మ, మనవరాలు శ్రావణికి స్వల్పగాయాలయ్యాయి. ఇంటికొస్తూ.. చెట్టుకిందకు వెళ్లి.. మెదక్ జిల్లా చిటు్కల్ గ్రామానికి చెందిన బోయిని నర్సమ్మ (52), భర్త ఎల్లయ్యతో కలిసి వ్యవసాయ పనులు ముగించుకొని సాయంత్రం ఇంటికి వస్తోంది. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో కూ డిన వర్షంతోపాటు, ఒక్కసారిగా పిడుగుపడి నర్స మ్మ అక్కడికక్కడే మృతి చెందింది. కళ్లెదుటే భార్య మృతి చెందడంతో ఎల్లయ్య భోరున విలపించాడు. ఇదే జిల్లా రాజ్‌పల్లి గ్రామానికి చెందిన సిద్ధిరాములు (55), రాధమ్మ దంపతులు గురువారం రాత్రి పొలంలో వరి విత్తనాలు తూకం పోస్తున్న క్రమంలో వర్షం పడింది. దంపతులు చెట్టు కిందకి వెళ్లగా, అదే సమయంలో పిడుగుపడింది. సిద్ధిరాములు అక్కడికక్కడే మృతిచెందాడు. అస్వస్థతకు గురైన రాధమ్మను ఆస్పత్రికి తరలించారు. గొర్రెలను మేపేందుకు వెళ్లి.. కామారెడ్డి జిల్లా గోర్గల్ గ్రామానికి చెందిన కురుమ కృష్ణమూర్తి (22) శుక్రవారం గొర్రెలను మేపేందుకు అటవీ ప్రాంతానికి వెళ్లాడు. సాయంత్రం సమయంలో పిడుగుపడి మృతిచెందాడు. గొర్రెలు ఇంటికి వచ్చినా కృష్ణమూర్తి రాకపోయేసరికి బంధువులు అడవిలోకి వెళ్లి గాలించగా అతడి మృతదేహం కనిపించింది. మూగజీవాల మృత్యుఘోష ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా శుక్రవారం పిడుగుపాటుకు గురై పెద్దసంఖ్యలో మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. వికారాబాద్ జిల్లా కుస్మసముద్రం, లింగాన్‌పల్లి గ్రామాల్లో 7 పాడిగేదెలు, రంగారెడ్డి జిల్లా మామిడిపల్లిలో 4 మేకలు, 4 గొర్రెలు, సంకటోనిపల్లిలో 2, సంగెం, ఆగిర్యాల్, గౌరారంలో ఒక్కోటి చొప్పున పాడిఆవులు మృతిచెందాయి. జీవనోపాధిని కోల్పోయామని బాధిత రైతులు వాపోయారు. మేత మేస్తూ.. మృత్యువాత విద్యుదాఘాతానికి 11 మూగజీవాలు బలి చిన్నగూడూరు: విద్యుదాఘాతంతో పదకొండు పశువులు మృతిచెందాయి. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలంలో గురువారం రాత్రి కురిసిన గాలివానకు పలుచోట్ల విద్యుత్ వైర్లు తెగి పడిపోయాయి. శుక్రవారం పశువులు పొలాల్లో మేత మేస్తూ తెగిన తీగలను తాకడంతో మండలంలోని మంగోరిగూడెంలో 7 ఎడ్లు, ఒక ఆవు, మేఘ్యాతండాలో 3 ఎడ్లు మృత్యువాతపడ్డాయి. దీంతో యజమానులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వీటి విలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుందని, ప్రభుత్వం పరిహారం చెల్లించాలని వారు కోరారు. -
హైదరాబాద్‌లో పిడుగుపాటు.. తృటిలో తప్పించుకున్న యువకుడు
హైదరాబాద్: హైదరాబాద్‌లో మంగళవారం కురిసిన భారీ వర్షం నగరాన్ని ముంచెత్తింది. నిముషాల వ్యవధిలో మొత్తం నగరమంతా నీట మునిగింది. పెద్ద పెద్ద ఉరుములతో కురిసిన వానకు నగరం అస్తవ్యస్తమైంది. ఎక్కడికక్కడ నీరు చేరింది. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఇదిలా ఉండగా రాజేంద్ర నగర్లో పిడుగు పడిన దృశ్యం ఇప్పుడు ఇంటర్నెట్లో వీర విహారం చేస్తోంది. అదృష్టవశాత్తు ఒక వ్యక్తి పిడుగుపాటు నుండి తృటిలో తప్పించుకున్నాడు. వీడియో చూస్తేనే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. గత వారం రోజులుగా దేశవ్యాప్తంగా కురిసిన వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఎట్టకేలకు వర్షం తెరపినివ్వడంతో నగర వాసులు ఎవరి పనులకు వారు ఉపక్రమించారు. అంతలోనే మళ్లీ మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. పెద్ద ఉరుములతో, ఎరువులతో కురిసిన వర్షానికి నగరవాసులు చాలా ఇబ్బందులు పడ్డారు. వాహనదారులైతే గంటల పాటు హోరువానలో తడుస్తూ ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కున్నారు. వర్షానికి హైదరాబాద్ వీధులన్నీ జలమయమయ్యాయి. రాజేంద్ర నగర్లో ఒక సీసీటీవీ ఫుటేజీలో రికార్డైన దృశ్యాలు అందరీ విస్మయానికి గురిచేసింది. వీడియోలో ఒకవ్యక్తి ఒక ఇంటి నుండి మరో నాట్లొకి వెళ్తున్నాడు. అతను అలా రోడ్డు దాటి ఇంటిలోకి వెళ్ళగానే పెద్ద పిడుగుపడింది. ఏ వీడియో చోసిన వారు అదృష్టవశాత్తు అతను ఆ పిడుగుపాటు నుండి తప్పించుకున్నాడు. లేదంటే ఘోరం జరిగి ఉండేదని అభిప్రాయపడుతున్నారు. #HyderabadRains A massive lightening struck on a luckily empty street in Attapur in #Hyderabad during the mad downpour last night. The guy who was seen walking missed it by a whisker. Luckily no one was hurt, some electronics reportedly damaged! #StaySafeHyderabad pic.twitter.com/B9VMs1uvfV — Revathi (@revathitweets) July 25, 2023 ఇది కూడా చదవండి: ఆగ్రాలో మరో దారుణం.. అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తిపై మూత్ర విసర్జన -
వేసవిలో వర్షాలు ప్రమాదకరం.. ఈ పనులు మాత్రం చేయకండి
సాక్షి, పార్వతీపురం జిల్లా: గత నెల 17న కురుపాం మండలంలోని చాపరాయిగూడ గిరిజన గ్రామంలో పిడుగుపడి చెట్టు ఓ కొబ్బరిచెట్టు కాలిపోయింది. తాజాగా ఆదివారం పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో ఆకాశం గర్జించింది. ఎక్కడ పిడుగులు పడుతున్నాయోనని జనం తీవ్రభయాందోళనకు గురయ్యారు. వేసవి కాలంలో కురిసే వర్షాలు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. ఈ కాలంలో వర్షం వచ్చే సమయంలో ఎక్కువగా ఉరుములతో పాటు పిడుగులు పడుతుంటాయి. పిడుగుపాటు బారిన పడి గ్రామీణ ప్రాంతాల్లో పొలాల్లో తిరుగాడే పశువుల కాపర్లు, రైతులు, ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఒక్కోసారి చెట్లు, మూగజీవాలు పిడుగుపాటుకు గురై చనిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పిడుగులు పడే ప్రాంతాల సమాచారాన్ని వాతావరణశాఖ ముందస్తుగానే తెలియజేస్తోంది. ఆకాశం గర్జించే సమయంలో ఆపద నుంచి గట్టెక్కాలంటే అప్రమత్తంగా ఉండడమే శ్రీరామరక్ష అని, పిడుగు ఎలా పడుతుంది? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలను నిపుణులు సాక్షికి వివరించారు. ఆ వివరాలు వారి మాటల్లోనే.. ఏం చేయకూడదంటే.. ►ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసేట ప్పుడు చెట్ల కింద నిలబడడం, రైతులు పొలాల్లో ఉండడం చేయకూడదు. ►మెరుపు కనిపించిన తర్వాత 30 సెకన్లలో లేదా అంత కన్నా తక్కువ సమయంలో ఉరుము వినిపిస్తే మనకు 10 కిలోమీటర్ల దూరం లోపు పిడుగు పడే అవకాశం ఉంది. ►మెరుపు కనబడిన తర్వాత 30 నిమిషాల పాటు బయటకు వెళ్లే ప్రయత్నం చేయరాదు. ►గొడుగులపై లోహపు బోల్టులు, చేతుల్లో సెల్ఫోన్లు లేకుండా చూసుకోవాలి. సెల్‌ఫోన్ ఉంటే స్విచ్ఆఫ్ చేయాలి. ►వర్షం పడే సమయంలో విద్యుత్ తీగల కింద, ట్రాన్స్ఫార్మర్ల సమీపంలో ఉండకూడదు. ఆ సమయంలో చెప్పులు లేకుండా బయటకు వెళ్లకూడదు. అత్యధిక విద్యుత్ ప్రవాహమే పిడుగు మెరుపుల ద్వారా ఏర్పడే అత్యధిక విద్యుత్ ప్రవాహమే పిడుగు. విద్యుదావేశం పేరుకుపోయిన మేఘాలకు సమీపంలో వ్యతిరేక విద్యుదావేశం కలిగిన మేఘాలు ఉన్నప్పుడు స్థిరంగా విద్యుత్ భూమి వైపు ప్రవహిస్తుంది. అప్పుడు ఏర్పడే విద్యుత్ క్షేత్ర తీవ్రత మీటరుకు 2లక్షల ఓల్టులతో సమానం. పిడుగు పడినప్పుడు వస్తువులను బట్టి నష్ట తీవ్రత ఉంటుంది. పొట్నూరు రాజీవ్, ఇస్త్రో శాస్త్రవేత ప్రథమ చికిత్స చేయాలి పిడుగుపాటుకు గురైన వ్యక్తిని వెంటనే పొడి ప్రదేశంలో తిన్నగా పడుకోబెట్టి తడి బట్టలు తీసివేయాలి. తలను ఒక పక్కకు తిప్పి రెండు కాళ్లు ఒక అడుగు పైకి ఎత్తి గాలి తగిలే ప్రదేశంలో ఉంచి, అవసరమైతే నోటి ద్వారా గాలి ఊది ప్రథమ చికిత్స చేయాలి. వెంటనే దగ్గరలో ఉన్న పీహెచ్‌సీకి తరలించి వైద్యసేవలు అందజేయాలి. జె.రవీంద్రకుమార్, సూపరింటెండెంట్,ఏరియా ఆస్పత్రి, పాలకొండ -
వైరల్: ప్రశాంతంగా ప్రయాణం.. అంతలో కారుపై పిడుగు
వార్షాకాలంలో పిడుగు పడటం దగ్గర నుంచి చూడకపోయినా వింటుంటాం. దూరం నుంచైనా సరే ఆ శబ్దం వింటేనే శరీరమంతా వణుకు పుట్టడంతో పాటు భయం కూడా వేస్తుంది. ఇక అదే పిడుగును లైవ్‌లో చూశామంటే చెమటలు పట్టాల్సిందే మరి. అలాంటిది లైవ్ కాకుండా మనం ప్రయాణిస్తున్న వాహనం మీద పిడుగు ప్రతాపం చూపెడితే, సరిగ్గా ఇలాంటి విపత్కర పరిస్థితే ఓ కుటుంబానికి ఎదురైంది. అందుకే అంటారు ఏ నిమిషానకి ఏం జరుగుతుందో ఎవరు కూడా ఊహించలేమని! ఒక్క సారిగా పెద్ద మెరుపు ఆ కారుని కుదిపేసింది వివరాల్లోకి వెళితే.. ఇటీవల అమెరికాలోని కాన్సస్‌లో ఓ కుటుంబం కారులో ప్రయాణిస్తున్నారు. చూట్టూ మబ్బులు కమ్మేసి జోరుగా వర్షం కురవడంతో నింపాదిగా వెళ్తున్న వాళ్ల కారుపై అకస్మాత్తగా పిడుగు పడింది. ఆ భీకర శబ్దానికి కారులో ఉన్న ఐదుగురు వణికిపోయారు. ఆ కారులో ముగ్గురు పిల్లలు మూడేండ్ల వయసులోపు ఉన్నవారే. అదృష్టవశాత్తు అందులో ఉన్న ఐదుగురు క్షేమంగా బయటపడ్డారు. ఎలాంటి ప్రాణపాయం జరగకపోవడంతో ఆ కుటుంబం ఊపిరి పీల్చుకుంది. ఇదంతా ఆ కారు వెనుకాలే ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి.. ఆ పిడుగు పడటాన్ని చిత్రీకరించి సోషల్‌మీడియాలో షేర్ చేశాడు. కాగా ఈ ఘటన జూన్ 25న చోటు చేసుకోగా.. ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారి హల్ చల్ చేస్తోంది. అంత పెద్ద పిడుగు పడినప్పటికీ కారులోని పిల్లలకు ఏ ప్రమాదం జరగకపోయేసరికి ‘యూ ఆర్ లక్కీ’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. -
చూస్తుండగానే క్షణాల్లో వారి ప్రాణాలు గాల్లోకి..
సాక్షి, భువనేశ్వర్(రాయగడ): పిడుగుపాటుకు గురై భార్యాభర్తలు మృతి చెందిన విషాద సంఘటన జిల్లాలోని బిసంకటక్ సమితి, కొరండిగుడ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. ఇదే ఘటనలో మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు హుటాహటిన ఘటన స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేశారు. అనంతరం వైద్యసేవల నిమిత్తం బిసంకటక్ ఆస్పత్రికి క్షతగాత్రులను తరలించారు. వివరాలిలా ఉన్నాయి.. కొరండిగుడకి చెందిన భార్యాభర్తలు మినియాక బుర్షా(56), మినియాక రామి(53), తమ కొడుకు కోడలు కస్తరి మినియాక(25), వలా మినియాక(29)లతో కలిసి ఉదయం పొలానికి వెళ్లారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన వీరంతా తలదాచుకునేందుకు అక్కడి ఓ చెట్టు కిందకు చేరారు. క్షణాల్లో వారి ప్రాణాలు గాల్లో.. ఈ క్రమంలో అదే చెట్టుపై పడిన పిడుగుతో మినియాక బుర్షా, అతడి భార్య రామి మినియాక అక్కడికక్కడే మృతి చెందగా, వలా మినియాక, కస్తరి మినియాకలకు తీవ్రగాయలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని, పోలీసులు, అంబులెన్స్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులంతా ఇలా పడుగుపాటుకు గురవ్వడం పట్ల చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు విచారం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: ఆంబులెన్స్ రాలేదు, నిండు గర్భిణిని 3 కిలోమీటర్ల వరకు.. -
Big Mango: యే దిల్ ‘మ్యాంగో’ మోర్..
సమ్మర్.. అంటే మామిడి పళ్ల సీజన్.. ఒకదాని మీద ఒకటి ఆపకుండా లాగించేసేవాళ్లు ఎందరో.. అయితే, చిత్రంలోని మామిడి పండును మాత్రం ఒకదాని మీద ఒకటి లాగించేయాలంటే అస్సలు కుదరదు.. ఎందుకంటే.. ఈ పండు బరువే అచ్చంగా 4.25 కిలోలు! చూశారుగా.. మిగతావాటితో పోలిస్తే.. ఏ సైజులో ఉందో.. చివరికి గిన్నిస్ వారు కూడా నోరెళ్లబెట్టేసి.. ప్రపంచంలోనే అత్యంత బరువైన మ్యాంగోగా దీనికి రికార్డు కట్టబెట్టేశారు. గత రికార్డు 3.43 కిలోలుగా ఉంది. పండు ఒకే.. ఇంతకీ అది ఎక్కడ కాసిందో చెప్పలేదు కదూ.. కొలంబియాకు చెందిన జర్మన్ ఒర్లాండో, రీనాలకు చెందిన తోటలోనిది భారీ ఫలం. రికార్డు బద్దలు కాగానే.. పండును కుటుంబమంతా కలిసి ఆరగించారట. -
పిట్టల్లా రాలిన జనం: పిడుగులతో 6 మంది దుర్మరణం
సాక్షి, నెట్వర్క్: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సోమ వారం కురిసిన అకాల వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులు, పిడుగులు, వడగండ్లతో కూడిన వర్షం పలుచోట్ల నష్టాన్ని మిగిల్చింది. పిడుగులకు పలువురు మృత్యువాతపడగా.. మూగజీలూ ప్రా ణాలు కోల్పోయాయి. మరికొన్ని చోట్ల కోతకొచ్చిన పంట ఒరిగిపోయి.. ధాన్యం రాలిపోగా.. ఇంకొన్ని చోట్ల యార్డుల్లో ఉంచిన ధాన్యం తడిసిపోయింది. దంపతుల దుర్మరణం.. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని లింగోజిగూడెం గ్రామానికి చెందిన రైతు దంపతులు సోమవారం పిడుగుపాటుకు గురై దుర్మరణం చెందారు. బండారు కరుణాకర్‌రెడ్డి (65), ఆయన భార్య వేణమ్మ (55) సోమవారం సాయంత్రం వ్యవసాయ బావి వద్ద గేదెకు పాలు తీసేందుకు వెళ్లారు. వర్షం పడుతుండగా పక్కనే ఉన్న చింతచెట్టు కిందకు వెళ్లారు. చెట్టుపై పిడుగుపడటంతో దంపతులు అక్కడికక్కడే మరణించారు. పాడిగేదె కూడా మృతి చెందింది. ఓ వృద్ధుడు మృతి యాదాద్రి భువనగిరి జిల్లాలో సోమవారం సాయం త్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కుసింది. బొమ్మలరామారం మండలం మర్యాల గ్రామానికి చెందిన మన్నె రాములు (70) మామిడి చెట్టుకింద నిలబడగా పిడుగుపడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. చౌటుప్పల్ కేంద్రంలోని వ్యవసాయమార్కెట్ యార్డులో రైతుల ధాన్యం కుప్పలు తడిశాయి. మోటకొండూరు మండలంలోని కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన వరి ధాన్యం తడిసింది. ఆత్మకూరు (ఎం)లో పిడుగుపడటంతో ధనబోయిన యాదయ్యకు చెందిన ఓ గేదె, ఆరు గొర్రెలు మృతి చెందాయి. రామన్నపేట మండలం బోగారం గ్రామంలో బలమైన గాలులు వీయడంతో రాశులపై కప్పిన కవర్లు ఎగిరిపోయి ధాన్యం తడిసింది. పిడుగుపాటుకు ముగ్గురు మృత్యువాత.. ఉమ్మడి మెదక్ జిల్లాలో పిడుగుల ధాటికి ముగ్గురు వ్యక్తులు మరణించారు. పదుల సంఖ్యలో మూగజీవాలు మృత్యువాత పడ్డా యి. సిద్దిపేట జిల్లా దౌల్తా బాద్ మండలం ఇందూప్రి యాల్ గ్రామానికి చెందిన సంబాగ రామయ్య(60) పొలం వద్ద పనులు చేస్తుండగా.. వర్షం రావడంతో సమీపంలోని చెట్టు కిందకి వెళ్లాడు. పిడుగు పడి అక్కడికక్కడే మృతి చెందాడు. రాయపోలు మండలంలోని మంతూరులో పొలం పనులు చేస్తున్న పట్నం నర్సింహులు(32) పిడుగుపడి మృత్యువాత పడ్డాడు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేటలో పిడుగుపడటంతో ఇటుక బట్టీ కార్మికుడు దొగ్రి ఈశ్వర్ (42) మృతి చెందాడు. మరో కార్మికుడు సంజయ్ అపస్మారక స్థితికి చేరుకోగా ఆస్పత్రికి తరలించారు. తొగుట మండలంలోని వెంకట్రావుపేటకు చెందిన మిద్దె లక్ష్మి, భీమరి ఎల్లవ్వ, బెస్త వెంకటవ్వ, బెజ్జరమైన సుజాత వ్యవసాయ పనికి వెళ్లారు. వర్షం రావడంతో సమీపంలోని ట్రాక్టర్ ట్రాలీ కిందకు వెళ్లి కూర్చున్నారు. సమీపంలో పిడుగుపడి ట్రాలీకి విద్యుత్ ప్రసారం కావడంతో సొమ్మసిల్లి పడిపోయారు. గ్రామంలో ప్రాథమిక చికిత్స చేయించడం తో కోలుకున్నారు. ముత్యంపేట, ముబరాస్‌పర్ గ్రామాల్లో పిడుగుపాటుతో 3 పశువులు మృత్యువాత పడ్డాయి. గొల్లపల్లిలో పిడుగుపడి 15 మేకలు మృతిచెందాయి. చేర్యాల మండలం గుర్జకుంటలో పిడిగుపడి 5 మేకలు మృత్యువాత పడ్డాయి. జనగామ జిల్లాలో వడగండ్ల వాన జనగామ జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. పలు చోట్ల వడగండ్లు పడ్డాయి. జనగామ జిల్లాలోని స్టేషన్ ఘన్పూర్, రఘునాథపల్లి, దేవరుప్పుల, జఫర్‌గఢ్, లింగాల ఘణపురం మండలాల్లో ఈ ప్రభావం కనిపించింది. ఈ గాలివాన కారణంగా కోతకు వచ్చిన వరి, మొక్కజొన్న పంటలు నేలావాలాయి. చాలా చోట్ల మామిడి తోటల్లో కాయలు నేల రాలడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మామిడి, అరటి తోటలకు నష్టం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సోమవారం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఎర్రుపాలెం మండ లం బుచ్చిరెడ్డిపాలెం, నర్సింహాపురం, వెంకటాపురం, రాజుపాలెం, భీమవరం, మామునూరు, బనిగండ్లపాడు, జమలాపురంలో మామిడి తోటలు, వరి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. జమలాపురంలో ఓ రైతుకు చెందిన నాలుగెకరాల అరటి తోట నేలమట్టమైంది. కల్లాల్లో ఆరబెట్టిన మిర్చిని కాపాడుకునేందుకు రైతులు నానా పాట్లు పడ్డారు. ఉమ్మడి నిజామాబాద్‌లో.. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలో, కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ప్రాంతంలో కురిసిన వడగండ్ల వానతో పంట నష్టం వాటిల్లింది. నువ్వులు, వరి, ఇతర పంటలు దెబ్బతిన్నాయి. తమను ఆదుకోవాలని పంటలు నష్టపోయిన రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. -
జాన పండ్ల కోసం వెళ్లి తప్పిపోయిన మహిళ
ప్రకాశం, అర్ధవీడు: మండలంలోని వెలగలపాయలో ఉపాధి హామీ పనికి వెళ్లిన మహిళ అడవిలో దొరికే జాన పండ్ల కోసం వెళ్లి దారితప్పి అక్కడే పిడుగుపాటుకు గురై మృతి చెందింది. ఈ సంఘటన నాలుగు రోజుల తర్వాత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. గ్రామానికి చెందిన గరిక రాజమ్మ (40) నాలుగు రోజుల క్రితం ఉపాధి హామీ పథకం పనికి గ్రామస్తులతో కలిసి వెళ్లింది. పని ముగిసిన తర్వాత అడవిలో దొరికే జాన పండ్ల కోసం తోటి కూలీలకు చెప్పకుండా కొద్ది దూరం వెళ్లింది. మిగిలిన కూలీలు గమనించలేదు. ఎవరింటికి వారు వెళ్లి పోయారు. భర్త పుల్లయ్య తన భార్య ఇంటికి రాక పోవడంతో తోటి కూలీలను ప్రశ్నించడంతో అడవిలో పండ్లు కోసుకుంటోందని సమాధానమిచ్చారు. పుల్లయ్య గ్రామస్తులను వెంటబెట్టుకొని అడవిలో వెతికారు. రాజమ్మ జాడ కనిపించక పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ సాంబశివరావు తన సిబ్బందితో కలిసి ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయినా ఆమె జాడ తెలియలేదు. గ్రామస్తులంతా కలిసి అడవంతా జల్లెడ పట్టడంతో మంగళవారం సాయంత్రం అడవిలో రాజమ్మ మృతదేహం లభ్యమైంది. శరీరమంతా కమిలిపోయి, కరెంట్‌షాక్ తగిలిన గుర్తులుండటంతో అడవిలో పిడుగుపాటుకు గురై ఉంటుందని భర్త, గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఎస్ఐ సాంబశివరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మార్కాపురం సీఐ కేవీ రాఘవేంద్ర కంభం ప్రభుత్వ వైద్యశాలలో మృతుల బంధువులను విచారించారు. విషయం తెలుసుకున్న గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు కంభం ప్రభుత్వ వైద్యశాలలో మృతురాలి బంధువులను పరామర్శించి ధైర్యం చెప్పారు. -
పొట్టకూటి కోసం వెళ్లి పరలోకాలకు..
ఉదయగిరి: ఎండాకాలంలో ఉదయగిరి ప్రాంతంలో గడ్డి ఉండదు. దీంతో ఇక్కడి వారు గొర్రెలను తీసుకుని డెల్టా ప్రాంతానికి వెళతారు. వర్షాలు కురిసే వరకు అక్కడే ఉంటారు. తొలకరి తర్వాత తిరిగి వస్తారు. ఈ నేపథ్యంలో వరికుంటపాడు మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులు గొర్రెలను మేపేందుకు దగదర్తి మండలం చెన్నూరుకు వెళ్లారు. గురువారం మధ్యాహ్నం పిడుగులు పడడంతో ఇద్దరూ మృత్యువాత పడ్డారు. వీరికి దిక్కెవరు.. వరికుంటపాడు మండలం మహ్మదాపురం పంచాయతీ గొల్లపల్లికి చెందిన గంగవరపు శ్యామ్‌కు భార్య వజ్రమ్మ, స్నేహ, వందన అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పిల్లలు ఇంటర్, పదో తరగతి చదువుతున్నారు. కొంతకాలం క్రితం శ్యామ్ తల్లిదండ్రులిద్దరూ మృతి చెందారు. గొర్రెలు మేపగా వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇటీవల శ్యామ్ సోదరుడు కూడా చనిపోయాడు. తన సోదరుడి కుటుంబాన్ని కూడా తానే పోషిస్తున్నాడు. కాగా పిడుగుపాటుకి శ్యామ్ చనిపోవడంతో వారంతా దిక్కులేని వారిగా మారారు. అనాథలయ్యారు మృతుడు అంజయ్యకు ఇద్దరు కుమారులు, భార్య మల్లేశ్వరి ఉన్నారు. పిల్లలు 5, 2వ తరగతులు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. అంజయ్య తండ్రి కొంత కాలం క్రితం మృతి చెందగా, తల్లి వృద్ధాప్యంలో ఉంది. ఈ కుటుంబానికి కూడా అంజయ్య దిక్కుగా మారారు. గొర్రెలు మేపగా వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంటాడు. పిడుగుపాటుతో అంజయ్య మృతిచెందడంతో భార్యాబిడ్డలు, తల్లి అనాథలుగా మారారు. రెండు కుటుంబాల్లో విషాదం నాయుడుపేటటౌన్: అకాల వర్షం.. ఊహించని విధంగా పిడుగులు పడడంతో రెండు నిండు ప్రాణాలు బలయ్యాయి. మండలంలోని పూడేరు గ్రామానికి చెందిన గుండాల శ్రీనివాసులు (37) సన్నకారు రైతు. అతడికి తల్లిదండులు వెంకటరత్నం, నాగభూషణమ్మ, భార్య సరస్వతీ, బాబు, పాప ఉన్నారు. కొద్దిపాటి పొలమే వారి జీవనాధారం. గురువారం వేరుశనగ పంట వేసేందుకు ట్రాక్టర్ తీసుకెళ్లి పొలం సాగు చేశాడు. మధ్యాహ్నం సమీపంలో ఉన్న చెట్టు వద్దకు వెళ్లి భోజనం చేస్తున్నాడు. ఒక్క సారిగా చెట్టుపై పిడుగులు పడ్డాయి. దీంతో అతను మృతి చెందాడు. ఒక్కగానొక్క కుమారుడు మృత్యువాత పడడంతో తల్లిదండ్రుల ఆవేదనకు అంతులేకుండా ఉంది. సేద తీరుతుండగా.. గొట్టిప్రోలు పంచాయతీ రామరత్నం కాలనీకి చెందిన ఆవుల గురవయ్య (55) వ్యవసాయ కూలి. ప్రస్తుతం కరోనా ప్రభావంతో పనుల్లేకపోవడంతో గేదెల నుంచి వచ్చే పాల ను విక్రయిస్తున్నాడు. గురువారం మధ్యాహ్నం మేత నిమిత్తం గేదెలను సమీపంలో ఉన్న పొలాలకు తో లాడు. గురువయ్య సమీపంలో చెట్టు వద్ద నిలుచుకుని సేద తీరుతుండగా ఒక్కసారిగా పిడుగు పడి అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. భర్త చనిపోవడంతో భార్య కృష్ణమ్మ రోదనకు అంతులేకుండా పోయింది. -
చదువుతుండగా...
లక్కవరపుకోట: భవిష్యత్‌లో ప్రయోజకుడై ఆదుకుంటాడనుకుని ఆ తల్లి బిడ్డను కళ్లల్లో పెట్టి చూసుకుంది. నాలుగు సంవత్సరాల కిందట తండ్రి చనిపోతే ఆ లోటు తెలియకుండా పెంచుతూ వచ్చింది. మంచి చదువులు చదివి ఉన్నత స్థానానికి చేరుకుంటాడని ఆశ పడిన ఆ తల్లికి పుత్రశోకం మిగిలింది. మరో పది రోజుల్లో 10వ తరగతి పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతున్న ఆ విద్యార్థి పిడుగు పాటుకు బలైపోయాడు. వివరాల్లోకి వెళితే.. మండలంలో గురువారం మధ్యాహ్నం పిడిగులతో కూడిన వర్షం పడింది. భూమిరెడ్డిపాలెంలో గ్రామానికి చెందిన భూమిరెడ్డి అప్పలనాయుడు (16) తోటి విద్యార్థులతో కలసి గురువారం మధ్యాహ్నం మంచంపై చదువుకుంటుండగా... ఒక్కసారిగా పిడుగు పడింది. దీంతో అప్పలనాయుడు కుప్పకూలిపోవడంతో వెంటనే సమీపంలో ఉన్నవారు స్పందించి 108 వాహనంలో ఎస్.కోట సీహెచ్‌సీకి తరలించారు. అయితే అప్పటికే అప్పలనాయుడు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇదిలా ఉంటే విద్యార్థి చందులూరు జిల్లా పరిషత్ హైస్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. కరోనా వైరస్ కారణంగా పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో తోటి పిల్లలతో కలిసి చదువుకుంటున్నాడు. ఇంతలో పిడుగు పడడంతో అప్పలనాయుడు మృతి చెందాడు. నాలుగు సంవత్సరాల కిందటే విద్యార్థి తండ్రి మృతి చెందడంతో తల్లి పద్మ కష్టపడి కుమారుడ్ని పెంచింది. నన్నెవరు పెంచుతారురా... కన్నా...అంటూ తల్లి రోదిస్తున్న తీరు చూపరులను కలిచివేసింది. పాడి గేదె, రెండు మేకలు మండలంలోని రేగ గ్రామానికి చెందిన రావాడ శ్రీరామ్మూర్తికి చెందిన పాడి గేదె మృతి చెందింది. పశువుల పాక వద్ద ఒక్కసారిగా పిడుగు పడడంతో గేదె అక్కడికి అక్కడే మృతి చెందినట్లు రైతు శ్రీరామ్మూర్తి తెలిపారు. గేదె విలువ సుమారు రూ. 45 వేలు ఉంటుందని అంచనా. అలాగే కళ్లేపల్లి గ్రామానికి చెందిన కడియాల మంగయ్య, కోరాడ శ్రీనులకు చెందిన రెండు మేకలు పిడుగుపాటుకు మృతి చెందాయి. గ్రామానికి సమీపంలో గల పొలంలో మేకల మంద కాస్తుండగా ఒక్కసారిగా పిడుగు పడడంతో మేకలు మృతి చెందినట్లు పెంపకందారులు తెలిపారు. సరయ్యవలసలో 18 మేకలు.. దత్తిరాజేరు: మండలంలోని సరయ్యవలసలో గురువారం సాయంత్రం పిడుగు పడడంతో 18 మేకలు మృతి చెందినట్లు వైఎస్సార్సీపీ నాయకుడు సారికి రామునాయుడు తెలిపారు. తట్టబోను లకు‡్ష్మ అప్పారావు, అప్పలస్వామి, తదితరులు గ్రామ సమీపంలో మేకల మంద కాస్తుండగా.. పిడుగు పడడంతో ఒక్కసారి 18 మేకలు మృతి చెందాయి. బాధిత కుటుంబాలను వైఎస్సార్సీపీ నాయకులు మంత్రి అప్పలనాయుడు, మండల శ్రీనువాసాసరావు, సారికి అప్పలనాయుడు, సాలాపు పాపారావు, టీడీపీ నాయకులు చప్ప చంద్రశేఖర్, బెజవాడ బంగారునాయుడు పరామర్శించారు. పిడుగు పడి గొర్రెల కాపరి .. జామి: మండలంలోని అలమండ పంచాయతీ నారాయణపురం గ్రామానికి చెందిన గొర్రెల కాపరి పిడుగు పడడంతో గురువారం సాయంత్రం మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన వియ్యపు రమణ (46) అనే వ్యక్తి, బోగ రాములమ్మ, తదితరులు పద్మనాభం మండలం గంధవరం కోమటి చెరువు వద్ద గొర్రెలు కాస్తున్నారు. ఇంతలో ఒక్కసారిగా పిడుగు పడడంతో రమణ అక్కడికక్కడే మృతి చెందగా.. రాములమ్మ అస్వస్థతకు గురైంది. ఆమెను అలమండ పీహెచ్‌సీకి తరలించగా.. మెరుగైన వైద్యం కోసం విజయనగరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడు రమణకు భార్య రమణమ్మ, కుమార్తె, కుమారుడు ఉన్నారు. -
ఏజెన్సీలో పిడుగుల బీభత్సం
కొయ్యూరు,జి.మాడుగుల,జీకేవీధి(పాడేరు), గొలుగొండ(నర్సీపట్నం): ఏజెన్సీలో గురువారం పిడుగులు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షం కురవడంతో పాటు పెద్ద శబ్దాలతో పిడుగులు పడ్డాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాం దోళనకు గురయ్యారు. పిడుగు పాటుతో కొయ్యూరు, జీకేవీధి మండలాలకు చెందిన ఇద్దరు దుర్మరణం చెందగా, జి.మాడుగుల, జీకే వీధి మండలాల్లో పశువులు మృత్యువాత పడ్డాయి.కొయ్యూరు మండలం చింతలపూడి పంచాయతీ గింజర్తికి చెందిన వల్లూరి వీర్రాజు(55) అనే వ్యక్తి రుణ బకాయి జమ చేసేందుకు గొలుగొండ మండలం కృష్ణాదేవిపేటలో బ్యాంకుకు వెళ్లేందుకు ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. కృష్ణదేవి పేటకు సమీపంలో పల్లవూరు దగ్గరకు వెళ్లే సరికి భారీ వర్షం పడింది. దీంతో సమీపంలో ఉన్న పాకలోకి వెళ్లేందుకు వాహనం స్టాండ్ వేస్తుండగానే అతనిపై పిడుగుపడింది. కుప్పకూలిపోయిన అతనిని గమనించిన స్థానికలు 108 వాహనానికి ఫోన్ చేశారు. ఆ సిబ్బంది వచ్చి పరీక్షించి, అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. మృతునికి భార్య,పిల్లలున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. జీకే వీధి మండలం వంచుల చెరపల్లి గ్రామానికి చెందిన సీతమ్మ(42) అనే గిరిజన మహిళ వ్యవసాయ పనులకు వెళ్లింది. భారీ వర్షం కురవడంతో తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో పిడుగుపడింది. దీవంతో తీవ్ర అస్వస్థతకు గురైన ఈమెను కుటుంబ సభ్యులు అంబులెన్స్ సాయంతో చింతపల్లి ఆస్పత్రికి తరలించే సమయానికి మృత్యువాత పడింది. పిడుగుపాటు వల్ల దామనాపల్లి గ్రామానికి చెందిన గెమ్మెలి బొజ్జన్నకు చెందిన రెండు దుక్కిటెద్దులు మృత్యువాత పడ్డాయి. జి.మాడుగుల మండలంలో పలు గ్రామాల్లో గురువారం పిడుగులు పడడంతో 11 పశువులు మృతి చెందగా, సిల్వర్ ఓక్ తోటలో చెట్లు ధ్వంసమయ్యాయి.మండలంలో నుర్మతి పంచాయతీ దానుడుకొండ గ్రామానికి చెందిన సాగేని పుల్లయ్య పశువులు గ్రామ సమీపంలో కొండకు మేతకు వెళ్లగా ఆ సమయంలో వర్షంతోపాటు పిడుగుపడడంతో ఏడు పశువులు మృత్యువాత పడ్డాయి. వంజరి పంచాయతీ కిముడుపల్లి గ్రామానికి చెందిన చెట్టి సింహాచలానికి చెందిన మూడు మేకలు, బోనంగి రాంబాబుకు చెందిన ఓ ఎద్దు పిడుగుపాటుకు మృతి చెందాయని బాధితులు తెలిపారు. జి.మాడుగుల–పాడేరు రోడ్డులో ఈదులబయలు గ్రామానికి చెందిన లువ్వాబు అప్పలస్వామికు చెందిన రహదారికి అతి సమీపంలో గల సిల్వర్ ఓక్, కాఫీ తోటల్లో పిడుగుపడటంతో సిల్వర్ ఓక్ చెట్లు ధ్వంసమయ్యాయి. పశువులను కోల్పయిన బాధితులను ఆదుకోవాలని ఆయా గ్రామస్తులు అధికారులను కోరారు. -
వేసవిలోనూ పిడుగు‘పాట్లు’
శ్రీకాకుళం న్యూకాలనీ: వేసవిలో ఉష్ణోగ్రతలు తారస్థాయికి చేరుతున్నాయి. వాతావరణంలో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఉరుములతో కూడిన వర్షం, పిడుగులు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు, నిర్వహణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా పిడుగులు పడే సమయంలో సెల్‌ఫోన్‌ను వినియోగించే వారు ప్రమాదాల బారిన పడుతున్నారు. వర్షం వచ్చే సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడుతుంటాయి. పిడుగుపాటు వల్ల విడుదలయ్యే పెద్ద పెద్ద ధ్వనులు, వెలుతురుతోపాటు విద్యుత్‌శక్తి విడుదల అవుతుంది. అసలు పిడుగు ఎలా పడుతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంపై కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే పిడుగు పాటు బారి నుంచి తప్పించుకోచవ్చనని నిపుణులు చెబుతున్నారు. మెరుపు, ఉరుము, పిడుగు అంటే..? పిడుగు అంటే ఆకాశంలో సహజసిద్ధంగా ఉత్పన్నమయ్యే విద్యుదాపాతం. మేఘాలు ఢీకొన్నప్పుడు వెలువడే కాంతిని మెరుపు అని, శబ్ధాన్ని ఉరుము అని, ఉత్పన్నమయ్యే విద్యుత్‌ను పిడుగుగా పిలుస్తారు. మేఘాల్లో అతిశీతల రేణువులు విద్యుదావేశాలను జనింపచేస్తాయి. మేఘాల దిగువభాగంలోని రుణవిద్యుత్ ఆవేశాలు భూమిపై ధన విద్యుదావేశాన్ని ప్రేరేపిస్తాయి. ఈ రెండు విద్యుదావేశాలు అనుసంధానమైనప్పుడు విద్యుత్ శక్తి ఉత్పన్నమవుతుంది. దీన్నే పిడుగు అంటారు. పైన వైశాల్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, మేఘాల్లోని విద్యుదావేశాలు ప్రవాహాన్ని ఆకర్షిస్తుంటాయి. వేడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్లబడితే ఎంతో ఉపశమనం కలుగుతుంది. ఆ సమయంలో పొలం పనుల్లోను ఇతర అవసరాలకో బయటకు వెళ్లినప్పుడు ఈ పిడుగుబారిన పడే ప్రమాదం ఉంది. ఒక్క పిడుగులో.. ఒక్క పిడుగులో ఒక పట్టణ అవసరాలకు ఆరునెలల పాటు విద్యుత్‌ను అందించగలిగే శక్తి ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. విరుద్ధ ఆవేశాలు ఉన్న మేఘాలు మద్ధ రాపిడి జరిగినప్పుడు మెరుపులు, ఉరుములు ఏర్పడతాయి. ఆ సమయంలో మేఘాల్లో రాపిడితో జనించే ఉష్ణం 50వేల డిగ్రీల ఫారెన్ గ్రేడ్ వరకు ఉంటుందని అంచనా. ఈ వేడి అనువులన్నీ కలిసి, ఒక నాళం మాదిరిగా ఏర్పడి భూమిమీద ఉన్న పాజిటివ్ ఎనర్జీతో కలిస్తే పిడుగు అవుతుంది. ఒక మిల్లీ సెకను కాలంలో మెరుపులతో కూడిన పిడుగు 20 ఆంపియర్ల విద్యుత్ ప్రవాహాన్ని ఏర్పరుస్తుంది. మేఘాలు ఢీకొన్నప్పుడు జనించే విద్యుత్ తరంగాలు సన్నని మార్గంలో భూమిమీదకు చేరేందుకు వాహకాలను వెతుకుతుంటాయి. ఎత్తైన చెట్లు, ఇనుప స్తంభాలు, ధ్వజ స్తంభాలు, ఎత్తైన భవనాలు కూడా వాహకాలుగా మారే అవకాశం ఉంది. క్యుములో నింబస్ మేఘాలతో ప్రమాదం వాతావరణలో వెంటవెంటనే జరిగే మార్పులతోనే పిడుగులు పడుతుంటాయి. అడవుల శాతం తగ్గిపోవడం, ఉన్న చెట్లను ఇష్టారాజ్యంగా నరికివేడయంతో వాతావరణం వేడేక్కిపోతోంది. పడిన వర్షం ఆవిరిగా మారి మేఘాల్లోకి చేరడం, మళ్లీ మేఘావృతమై వర్షాలు పడతుండటం జరుగుతుంది. ఈ సమయంలో పిడుగులు ఎక్కువగా పడుతుంటాయి. క్యుములో నింబస్ మేఘాలు ఇందుకు సహకరిస్తుంటాయి. లైట్నింగ్ కండక్టర్ ఏర్పాటు చేసుకోవాలి.. పిడుగుపాటు నుంచి తప్పించుకునేందుకు ఎత్తైన ప్రదేశం నుంచి నేరుగా భూమిలోకి లైట్నింగ్ కండక్టర్‌ను ఏర్పాటు చేసుకోవాలి. దీన్ని ఏర్పాటు చేసుకోవడం పట్ల పిడుగులో ఉన్న విద్యుదావేశం భూమిలోకి ఆకర్షించుకుంటుంది. ఎత్తైన టవర్స్ ఏర్పాటు చేసినప్పుడు ఇలాంటి జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. ప్రథమ చికిత్స ఇలా.. ♦ పిడుగుపాటుతోపాటు అస్వస్థతకు గురైన వారిని వెంటనే గాలి, వెలుతురు తగిలే విశాలమైన ప్రాంతంలో ఉంచాలి. ♦ తడి దుస్తులు తొలగించి, పొడివి వేయాలి. ♦ తిన్నగా పడుకోబెట్టి, రెండుకాళ్లు పైకి ఎత్తి ఉంచాలి. తలను ఒకవైపు తిప్పిపెట్టాలి. ♦ ఆ సమయంలో నోటి ద్వారా నీరు, ఇతర ఎలాంటి ఆహారాన్ని అందించకూడదు. ♦ వెంటనే అందుబాటులో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యసేవలు అందించారు. అప్రమత్తతే శ్రీరామ రక్ష.. ♦ మెరుపు, ఉరుము వచ్చే సమయంలో చెవులు గట్టిగా మూసుకోవాలి. పిడుగు శబ్ధంతో వినికిడి శక్తి కోల్పోయే ప్రమాదం తగ్గుతుంది. ♦ ఉరుములు, మెరుపులు సమయంలో సురక్షిత ప్రాంతానికి వెళ్లే అవకాశం లేకపోతే.. నేలమీదకు పూర్తిగా కిందకు వంగాలి. నేలపై పడుకోకూడదు. నేలపై కూర్చున్నప్పడు పాదాలు ముందుభాగం మాత్రమే నేలను తాకాలి. శరీరంలోని మరే ఇతర భాగం నేలను తాకకుండా చూసుకోవాలి. ♦ పాదాల మడమల ముందు ఒకదానికొకటి తాకేలా ఉండాలి. అలా చేయడం వల్ల పిడుగు పడే సమయంలో నేలపై పడి దాని విద్యుత్‌శక్తి ఒక పాదం నుంచి శరీరంలోకి ప్రవహించినా వెంటనే అది రెండో పాదం నుంచి తిరిగి భూమిలోకి ప్రవేశిస్తుంది. శరీరంలోకి విద్యుత్ ప్రవహించే అవకాశాలు తగ్గుతాయి. ♦ ఇండ్లకు విద్యుత్ కరెంట్ ఎర్త్ చేపించాలి. ♦ మేఘాలు దట్టంగా కమ్ముకున్నప్పుడు.. పిడుగులు పడతాయనే ఆలోచనకు రావాలి. ♦ కళ్లు మూసుకోవడం వల్ల ప్రసారకాంతి నుంచి తప్పించుకోచ్చు. ♦ భూమిపై ఉన్న ఎలాంటి లోహాలను తాకకూడదు. ♦ పొలాల్లో ఆరుబయట ఉన్నప్పుడు చెట్టు కిందకు వెళ్లకూడదు. ఎత్తైన చెట్లు, స్తంభాలు పిడుగులను ఆకర్షిస్తాయి. ఏం చేయకూడదు..? ♦ వర్షం కురిసేటప్పుడు చెట్ల కిందన నిలబడరాదు. ♦ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం వస్తే రైతులు పొలాల్లో ఉండకూడదు. ♦ మెరుపు కనిపించిన తర్వాత సమయాన్ని లెక్కిస్తే 30 సెకన్లు లేదా అంతకంటే తక్కువలోపు ఉరుము వినిపిస్తే.. మనకు పది కిలోమీటర్ల దూరంలోపు పిడుగు పడే అవకాశం ఉందని అర్థం చేసుకోవచ్చు. ♦ మెరుపు కనిపించిన తర్వాత 30 నిమిషాలపాటు బయటకు వెళ్లే ప్రయత్నం చేయకూడదు. ♦ గొడుగులపై లోహపు బోట్లు, చేతుల్లో సెల్ఫోన్లు లేకుండా చూసుకోవాలి. ♦ ముఖ్యంగా సెల్ఫోన్లను స్విచ్చాఫ్ చేసుకోవాలి. ఒకవేళ ఇవి ఉంటే రేడియేషన్ తరంగాలకు గురై ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ♦ వర్షం పడే సమయంలో విద్యుత్ తీగల కింద, ట్రాన్స్ఫార్మర్ల సమీపంలో ఉండకూడదు. ♦ కొండలు వాగులు, చెరువులకు నీరు ప్రాంతానికి దూరంగా ఉండాలి. ♦ ఇనుము(ఐరన్) ఉండే ప్రాంతాలలో ఉండకూడదు. ♦ ఉరుములు, మెరుపుల సమయంలో చెప్పులు లేకుండా బయటకు వెళ్లరాదు. ♦ గుండె సంబంధిత వ్యాదులు ఉన్నవారు ఉరుములు, మెరుపులకు భయాందోళనలకు గురయ్యే అవకాశం ఉంది. ధైర్యంగా ఉండాలి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా జిల్లాలోని వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఏప్రిల్, మే నెలల్లో పిడుగులు పడే అవకాశం ఉంది. వాతావరణశాఖ అధికారులు కూడా అదే విషయాన్ని చెబుతున్నారు. విపరీతంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతోపాటు క్యుములో నింబస్ మేఘాల కారణంగా పిడుగులు పడే అవకాశం ఉంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. వర్షం వస్తుందని ముందస్తుగా తెలుస్తుంది. సాధ్యమైనంతవరకు బయటకు వెళ్లకుండా ఉంటే ప్రమాదం నుంచి తప్పించుకున్నట్టే.– జి.వెంకటేశ్వరరావు,ఫిజిక్స్ సీనియర్ అధ్యాపకులు -
పిడుగుపాటుకు బాలుడి మృతి
గిద్దలూరు రూరల్: పిడుగుపాటుకు బాలుడు మృతి చెందగా అతడి సోదరుడు, తల్లి గాయపడ్డారు. ఈ సంఘటన మండలంలోని ఓబులాపురం తండాలో సోమవారం జరిగింది. అందిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బుక్కె వెంకటేశ్వర నాయక్, లక్ష్మీబాయిల కుమారుడు సుశాంత్‌నాయక్(4) పిడుగు కారణంగా మృతి చెందాడు. సాయంత్రం వీచిన ఈదురు గాలులు, ఉరుములతో కూడిన పిడుగు పడటంతో ఇంట్లో ఉన్న సుశాంత్ నాయక్ మృతి చెందాడు. తల్లి లక్ష్మీబాయి, ఆమె మరో కుమారుడు సాత్విక్ నాయక్‌లకు గాయాలయ్యాయి. అనంతరం స్థానికులు క్షతగాత్రులను చికిత్స కోసం పట్టణలోని ఏరియా వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని సుశాంత్ మృతిపై కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ముక్కుపచ్చలారని తన బిడ్డ పిడుగు కారణంగా మృతి చెందడంతో తల్లి లక్ష్మీబాయి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. కలెక్టర్ ఆదేశాల మేరకు మృతుడి కుటుంబానికి తహసీల్దార్ రూ.10 వేలు ఇచ్చారు. -
అయినవారి కోసం వచ్చి.. అనంత లోకాలకు..
చిత్తూరు, ఎర్రావారిపాళెం : వేసవి దృష్ట్యా అయినవారింటికి వచ్చి పల్లెలో ఆనందంగా గడపాలనుకున్న ఓ మహిళను పిడుగు రూపంలో మృత్యువు కబళించింది. గ్రామస్తుల వివరాల మేరకు.. తిరుపతిరూరల్ సి.మల్లవరం గ్రామంలో ఉంటున్న ఎస్.మస్తాన్ భార్య ఎస్.డిల్లు(ముభినా)(35) గృహిణి. ఆమె భర్త గల్ఫ్‌లో ఉంటున్నాడు. వేసవిలో తన బంధువులతో కలసి ఆనందంగా గడపాలని డిల్లు ఆదివారం ఎర్రావారిపాళెం మండలం కోటకాడపల్లి పంచాయతీ చెంగాడివాండ్లపల్లికి చేరింది. బంధువులతో కలసి సిద్ధలగండి చెరువు చూడటానికి వెళ్లింది. అందరూ కలిసి సరదాగా గడుపుతున్న సందర్భంలో ఈదురగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దాంతో తలదాచుకునేందుకు డిల్లు పక్కనే ఉన్న చెట్టు కిందికి చేరింది. ఇంతలో ఆమెకు సమీపంలో పిడుగు పడింది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. డిల్లు మృతితో చెంగాడివాండ్లపల్లిలో విషాదం నెలకొంది. పిడుగుపాటుతో ఆవు మృత్యువాత.. మండలంలోని కోటకాడపల్లికి చెందిన కోటకొండ రమణకు చెందిన పాడిఆవు పిడుగుపాటుకు మృతిచెందింది. ఆవు వీఆర్‌కాలనీ సమీపంలో మేత మేస్తుండగా పిడుగుపడడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఆవు పూటకు 7లీటర్ల పాలు ఇస్తుందని, ఆవు మృతితో తన జీవనాధారం పోయిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాడు. -
గుంటూరు జిల్లాలో పిడుగుపాటుకు ఐదుగురు మృతి
సాక్షి, గుంటూరు : గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఒకే రోజు పిడుగుపాటుకు ఐదుగురు మృతి చెందారు. వినుకొండ మండలం ఉప్పరపాలెంలో పిడుగు పడి గుమ్మా చిన్నయ్య (55), ఈపూరు మండలం అగ్నిగుండాల్లో పిడుగు పడి వెంకటేశ్వర్ రెడ్డి (70), నూజెండ్ల మండలం దాసుపాలెంలో పిడుగు పడి వెంకట కోటయ్య (30), కారంపూడి పంట పొలాల్లో పిడుగు పడి మిరప కోతకు వెళ్ళిన షేక్ మస్తాన్, నూజెండ్ల మండలం పమిడిపాడులో పిడుగు పడి కెనాల్ దగ్గర పనికి వెళ్లిన కూలీ మృతి చెందారు. -
రేపు ఉరుములు, వడగండ్లతో వర్షం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంపైకి తూర్పుదిశ నుండి గాలులు వీస్తున్న కారణంగా గురువారం రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొని ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్రవారం అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షం, ఒకట్రెండు చోట్ల వడగండ్లతోపాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు తెలిపారు. -
ముగ్గురిపై పిడుగు
బుధవారం మూడుచోట్ల పిడుగులు పడ్డాయి. ముగ్గురిని బలిగొన్నాయి. తిరుమలాయపాలెం మండలంలో ఇద్దరు, కూసుమంచి మండలంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. కూసుమంచిలో మహిళ... సాక్షి, కూసుమంచి: కూసుమంచికి చెందిన గంజి నాగేశ్వరరావు, రెండెకరాల భూమిని కౌలు చేస్తు న్నాడు. అతని భార్య సుజాత(35), రోజులాగా నే బుదవారం చేనుకు వెళ్లింది. వర్షం వస్తుం డడంతో వేప చెట్టు కిందకు వెళ్లింది. కొద్దిసేపటికి సరిగ్గా అక్కడే పిడుగు ప డింది. అక్కడిక్కడే మృతిచెందింది. చు ట్టుపక్కల రైతులు వచ్చారు. ఇంటి వద్దనున్న ఆమె భర్తకు చెప్పారు. వీరికి కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఎదుళ్లచెరువు క్రాస్ రోడ్డులో రైతు... తిరుమలాయపాలెం: ఓ రైతు ప్రాణాలను పిడుగు బలిగొంది. మండలంలోని పిండిప్రోలు పంచాయతీ పాపాయిగూడెం గ్రామ రైతు ఏలూరి వీరయ్య(72), బుధవారం ఉదయం తన గేదెలను మేపేందుకు చేల వద్దకు వెళ్లాడు. సాయంత్రం 4.00 గంటల సమయంలో ఒక్కసారిగా కారుమబ్బులు కమ్ముకున్నాయి. ఉరుములు, మెరుపులతో వర్షం మొదలైంది. వేప చెట్టు కిందనున్న బండపై కూర్చున్నాడు. అతనితోపాటు మరో రైతు రామనబోయిన శ్రీను కూడా అక్కడకు వచ్చాడు. కొద్దిసేపటి తరువాత, విద్యుత్ మోటార్‌పై పట్టా కప్పేందుకని రామనబోయిన శ్రీను లేచాడు. కొన్ని అడుగుల దూరం వెళ్లాడో లేదో... కళ్లు బైర్లు కమ్మేలా, చెవులు చిల్లులు పడేలా పెద్ద మెరుపు, భీకర శబ్దంతో వేప చెట్టు సమీపంలో పిడుగు పడింది. శ్రీను తన రెండు చెవులను గట్టిగా మూసుకున్నాడు. అసలేం జరిగిందో కొన్ని క్షణాల వరకు అతనికి అర్థమవలేదు. ఆ తరువాత తేరుకున్నాడు. చెట్టు కిందనున్న వీరయ్య వైపు చూశాడు. దగ్గరగా వెళ్లాడు. ఆయన శరీరంపై చొక్కా, పంచె కాలిపోయి కనిపించాయి. అచేతనంగా పడిపోయిన వీరయ్య వద్దకు వెళ్లాడు. చేతులు, కాళ్లు రుద్దాడు. శ్వాస ఆడడం లేదు. వీరయ్య ప్రాణాలు పోయాయి. పాపాయిగూడెం గ్రామంలోకి వెళ్లి విషయం చెప్పాడు. అందరూ వచ్చారు. వీరయ్య మృతదేహంపై పడి కుటుంబీకులు భోరున విలపించారు. వీరయ్యకు భార్య బుచ్చమ్మ, కుమారులు శ్రీనివాసరావు, సిద్ధార్థ ఉన్నారు. మరో కుమారుడు కృష్ణ, కొన్నేళ్ల క్రితం మృతిచెందాడు. ప్రమాద స్థలాన్ని ఎస్ఐ సర్వయ్య పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. తెట్టెలపాడులో రైతు... తిరుమలాయపాలెం: మండలంలోని తెట్టెలపాడు గ్రామంలో పిడుగుపాటుతో రైతు మృతిచెందాడు. ఈ గ్రామ రైతు పుసులూరి లక్ష్మీనారాయణ(55), గేదెలను మేపేందుకు బుధవారం బీడు భూమికి వెళ్లాడు. సాయంత్రం ఉరుములు, మెరుపులతో వర్షం మొదలవడంతో చెట్టు కిందకు వెళ్లాడు. సరిగ్గా ఆ చెట్టు పైనే పిడుగు పడింది. అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. సాయంత్రం వరకు లక్ష్మినారాయణ ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు బీడు భూముల వద్దకు వెళ్లారు. అక్కడ ఓ చెట్టు కింద విగతుడిగా లక్ష్మినారాయణ కనిపించాడు. బోరున విలపిస్తూ, మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు. ఆయనకు భార్య నర్సమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసును ఎస్ఐ సర్వయ్య దర్యాప్తు చేస్తున్నారు. -
మరణంలోనూ వీడని స్నేహబంధం
బాలాజీనగర్‌తండా(నకరికల్లు): శంకర్‌నాయక్, కోటయ్యలు ఇద్దరు గత ముప్పై ఏళ్లుగా ప్రాణ స్నేహితులు. ఒకరిని విడిచి ఒకరు ఒక్కరోజు ఉండలేనంత స్నేహం వారిది. ఇద్దరు మేకలు కాసుకొని జీవనం సాగిస్తున్నారు. ఒకరికి ఏదైనా పని ఉంటే మేకలను మరొకరు కాసేవారు. వేర్వేరు గ్రామాలైనా ఇద్దరు నిత్యం కలసి కబుర్లు చెప్పుకోవాల్సిందే. వారిద్దరు చివరకు మరణంలోనూ కలిసి ఉండడంతో స్థానికులు వారి స్నేహం గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే శుక్రవారం కురిసిన పిడుగుల వానకు ఇద్దరు మృత్యువాత పడగా, 22మేకలు మృతి చెందాయి. ఈ ఘటన నకరికల్లు మండలంలోని గుండ్లపల్లి పంచాయితీ పరిధిలో గల బాలాజీనగర్‌తండా సమీపంలోని క్వారీ వద్ద శుక్రవారం జరిగింది. గుండ్లపల్లి గ్రామానికి చెందిన తేలుకుట్ల కోటయ్య(52), బాలాజీనగర్తండాకు చెందిన పాల్త్యా శంకర్‌నాయక్(50)లు మేకలు కాసుకొని జీవనం సాగి స్తారు. యథావిధిగా మేకలను తోలుకొని తండా సమీపంలోని పొలానికి వెళ్లారు. మధ్యాహ్నం సమయంలో వర్షం కురుస్తుండడంతోఇద్దరు కలసి మేకలను తోలుకొని సమీపంలోని చెట్టు కిందకు చేరారు పెద్దశబ్దంతో చెట్టుమీద పిడుగుపడడంతో. వారిద్దరితో పాటు 22మేకలు కూడా అక్కడికక్కడే మృతి చెందాయి. వర్షం తగ్గాక చాలాసేపటి తరువాత అటుగా వెళుతున్న ఓ రైతు మేకలను చూసి ఆగి చెట్టు వద్దకు వెళ్లాడు. చెట్టు కిందనే విగతజీవులుగా పడి ఉన్న ఇద్దరిని చూసి గ్రామస్తులకు సమాచారం అందించాడు. విషయం తెలుసుకున్న బంధువులు, గ్రామస్తులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. బంధువుల రోదనలతో ఆప్రాంతం మిన్నంటింది. నకరికల్లు ఎస్ఐ జి.అనిల్‌కుమార్, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును ఆరాతీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలి పారు. మృతుడు శంకర్‌కు భార్య, నలుగురు పిల్లలు ఉండగా, మరో మృతుడు కోటయ్యకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. చెట్ల కింద ఉండకూడదు వర్షం పడే సమయంలో చెట్ల కింద ఉండడం కాని, సెల్‌ఫోన్ మాట్లాడడం కాని చేయకూడదని తహసీల్దార్ ఎం.లీలాసంజీవకుమారి సూచించారు. పిడుగులు ఎక్కువ శాతం చెట్ల కిందే పడతాయి కాబట్టి అప్రమత్తంగా ఉండాలని కోరారు. -
మృత్యువులోనూ వీడని బంధం
ఉన్నట్టుండి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశం మేఘావృతమైంది. చిరుజల్లులు మొదలయ్యాయి. ఇంతలో ఉరుములు, మె రుపులు మొదలయ్యాయి. ఒక్కసారిగా ఆకాశం విడిగిపడిందా అన్న ఆలోచనలో ఉండగానే జరగరాని ఘోరం జరిగిపోయింది. పొలం గట్టున కూర్చుని గొర్రెలను మేపుతున్న భార్యాభర్తలపై పిడుగుపడడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన శనివారం మిర్యాలగూడ మండలంలోని అవంతీపురం గ్రామ శివారులో జరిగింది. స్థానికులు, రూరల్ ఎస్ఐ సైదాబాబు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడరూరల్ : ఆలగడప గ్రామానికి చెందిన ఎల్లావుల వెంకయ్య (60), నారమ్మ (55)భార్యాభర్తలు. వెంకయ్య అవంతీపురం గ్రామానికి చెందిన మల్లారెడ్డి అనే రైతు వద్ద గొర్రెల కాపరిగా పనిచేస్తున్నాడు. రోజూ మాదిరిగానే ఉదయాన్నే ఆలగడప గ్రామం నుంచి పక్కనే ఉన్న అవంతీ పురం వచ్చి యజమాని గొర్రెలను మేపేందుకు గ్రామ శివారులోని జమాయిల్ తోట వద్దకు తోలు కెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత నారమ్మ ఇంట్లో ఒం టరిగా ఉండడంతో పాలుపోతలేదని భర్త గొర్రెలు మేపే ప్రదేశానికి వచ్చింది. భార్యాభర్తలిద్దరూ గొర్రెలను కనిపెడుతూ పొలం గట్టుపై కూర్చున్నా రు. ఇంతలో పిడుగుపడడంతో దంపతులిద్దరూ మృతిచెందారు. విషయం తెలుసుకున్న రూరల్ సీఐ రమేశ్‌బాబు, ఎస్ఐ డి.సైదాబాబు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పరి శీలించి పిడుగుపాటుకే మృతిచెందినట్టు నిర్ధారించారు. దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వీరికి వివాహాలు అయ్యాయి. పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఎమ్మెల్యే నివాళి పిడుగుపాటుతో భార్యాభర్తలిద్దరూ మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న మిర్యాలగూడ ఎ మ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నాడు. వివరాలు తెలుసుకున్నాడు. మృతుల ఆత్మకు శాంతికలగాలని నివాళులర్పించారు. దంపతుల కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చాడు. నివాళులర్పించిన వారిలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, జెడ్పీటీసీ మట్టపల్లి నాగలక్ష్మిసైదులుయాదవ్, ఎంపీటీసీ నల్లగొండ భవాని, సర్పంచ్ వీరమ్మ తదితరులు ఉన్నారు. -
తండ్రి పోయాడు..బిడ్డ బతికాడు
టేకులపల్లి భద్రాద్రి జిల్లా: ఉరుము ఉరిమింది... పిడుగు పడింది.. యువకుడిని బలిగొంది. ఆ యువకుడి పక్కనే ఉన్న కుమారుడైన చిన్నారి మృత్యుంజయుడిగా నిలిచాడు. ఒకట్రెండు నిమిషాల ముందు అక్కడి నుంచి పక్కకు వెళ్లిన భార్య.. ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు... మండలంలోని తడికలపూడి పంచాయతీ కోక్యాతండాకు చెందిన భూక్య పూల్‌సింగ్(30)కు కొన్నేళ్ల క్రితం స్వప్నతో వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు కీర్తన (05), ప్రవణీత(3), చిన్ని మణికంఠ (01). డిగ్రీ వరకు చదివిన పూల్‌సింగ్, కొంతకాలం ఆర్మీలో కూడా పనిచేశాడు. కొద్ది రోజులపాటు కొత్తగూడెంలోని షాపులో చేశాడు. కొన్నాళ్లు ఆటో నడిపాడు. ప్రస్తుతం కూలి పనులు చేస్తున్నాడు. శుక్రవారం తన భార్య స్వప్న, కుమారుడు మణికంఠతో కలిసి ద్విచక్ర వాహనంపై కొత్తగూడెం వెళ్లాడు. అక్కడి నుంచి తిరిగొస్తుండగా ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం మొదలైంది. మార్గమధ్యలోగల సీతారాంపురం స్టేజీ సమీపంలో రోడ్డు పక్కన వాహనాన్ని ఆపాడు. ఆక్కడే ఉన్న చెట్టు కిందకు వెళ్లారు. మూత్ర విసర్జన కోసమని స్వప్న కొంత దూరం వెళ్లింది. ఏడాది వయసున్న చిన్ని మణికంఠను భర్త వద్దనే ఉంచింది. ఆమె అలా వెళ్లిందో.. లేదో... భారీ శబ్దంతో ఆ చెట్టు సమీపంలోనే పిడుగు పడింది. ఆ తాకిడికి పూల్‌సింగ్ అక్కడికక్కడే మృతిచెందాడు. చిన్న మణికంఠ మాత్రం మృత్యుంజయుడిగా నిలిచాడు. వెంటనే స్వప్న పరుగెత్తుకుంటూ వచ్చేసరికి విగతుడిగా భర్త కనిపించాడు. మృతదేహంపై పడి గుండె అవిసేలా రోదించింది. పోలీసులు పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
పౌల్ట్రీఫాంపై పిడుగు.. 500 కోళ్లు మృతి
షాబాద్(చేవెళ్ల : పిడుగు పడి బాయిలర్ కోళ్లు మృ తిచెందిన సంఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపుల తో కూడిన వర్షంలో పిడుగుపడి బాయిలర్ కోళ్లు మృతిచెందిన ఘటన షాబాద్ మండల పరిధిలోని నరెడ్లగూడలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపి న వివరాల ప్రకారం... మండల పరిధిలోని నరెడ్లగూడ గ్రామానికి చెందిన ఎర్రోళ్ల చంద్రలింగం పౌల్ట్రీఫామ్‌లో పిడుగుపాటుకు గురై సుమారు 500 వరకు కోళ్లు మృతి చెందాయి. తమను ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. అప్పులు చేసి కోళ్ల పరిశ్రమను నడిపిస్తున్న తమకు పిడుగు రూపాన తీరని నష్టం ఏర్పడిందని వాపోతున్నారు. పిడుగుపాటుకు గురై ముగ్గురు మహిళలకు గాయాలు... పిడుగుపడి ముగ్గురు మహిళలకు తీవ్ర గాయాలైన సంఘటన షాబాద్ మండల పిరిధిలోని ఆస్పల్లిగూడ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం...ఆస్పల్లిగూడ గ్రామానికి చెందిన రైతు పొలంలో గురువారం రాత్రి అదే గ్రామానికి చెందిన కొందరు మహిళలు కూలీ పనులు చేస్తుండగా సాయంత్రం ఈదులు గాలులు, వర్షం కురవడంతో వారంతా పక్కనే ఉన్న చెట్టు కిందికి వెళ్లారు. అంతలోనే ఉరుములు రావడంతో చెట్టుపై పిడుగు పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన యాదమ్మ, మౌనిక, రాములమ్మలను షాద్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్సలు నిర్వహించారు. -
పిడుగుపోటు.. మృత్యుకాటు
చాలా రోజుల తర్వాత వానజల్లులు కురుస్తున్నాయనుకున్నారు.. కానీ వారి బతుకులపైనే పిడుగుల వాన కురుస్తుందని గుర్తించలేకపోయారు.. ఆకాశంలో మెరుపుల వెలుగు చూసి కళ్లు మూసుకున్నారు.. ఆ వెనుకే మృత్యువై వచ్చిన పిడుగు తమ కళ్లను శాశ్వతంగా మూసేస్తుందని గమనించలేకపోయారు.. జోరువానకు చల్లబడుతున్న నేల తల్లిని చూసి మురిసిపోయారు.. ఆ వానతోపాటు వచ్చిన పిడుగులు తమను అదే నేలలో కలిపేస్తాయని తెలుసుకోలేకపోయారు. గురువారం జిల్లా వ్యాప్తంగా పిడుగుల ధాటికి ఏడుగురు మృత్యువాత పడ్డారు. వీరిలో ఇద్దరు ప్రకాశం జిల్లావాసులు కాగా.. ఒక మహిళ ఉన్నారు. ఆకాశం నుంచి పడిన పిడుగుల దెబ్బకు మృతుల కుటుంబాల గుండెలు కన్నీటి ధారలు మారాయి. సాక్షి, అమరావతి బ్యూరో: జిల్లాలో ఈదురు గాలులుతో కూడిన భారీ వర్షం బీభత్సాన్ని సృష్టించింది. గురువారం ఒక్కసారిగా మారిన వాతావరణంతో పలుచోట్ల పడిన పిడుగులు ధాటికి ఏడుగురు మృత్యువాత పడ్డారు. చాలా చోట్ల చెట్లు నెలకొరిగాయి. నరసరావుపేట మండలంలో పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందగా, నలుగురికి గాయాలయ్యాయి. దొండపాడులో గేదెలను మేతకు తీసుకెళ్లిన చిన్నపురెడ్డి శివారెడ్డి(60) పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. సమీపంలో పశువులను మేపేందుకు వచ్చిన అంచా శివకుమారి స్వల్పంగా గాయపడింది. శివారెడ్డి మృతికి తహసీల్దార్ విజయజ్యోతికుమారి, వీఆర్వో బ్రహ్మేశ్వరరావు సంతాపం తెలిపారు. ప్రభుత్వం తరఫున సాయం అందిస్తామన్నారు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు గురుజేపల్లికి చెందిన నలుగురు పమిడిమర్రు సమీపంలో గొర్రెలను మేపేందుకు వచ్చారు. వర్షం కురుస్తుండటంతో గొర్రెలతో సహా చెట్టు కిందకు చేరారు. ఇదే సమయంలో చెట్టుపై పిడుగుపడటంతో అనంత పెద్దబ్బాయి(36) అక్కడికక్కడే మృతి చెందగా, దారా లక్ష్మయ్య, దారా కోటేశ్వరరావు, చిన్నం పూర్ణయ్యలు తీవ్రంగా గాయపడ్డారు. అపస్మారక స్థితిలో ఉన్న వీరిని నరసరావుపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో 20 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండలోని త్రిముఖ శివలింగంపై పిడుగు పడింది. ఈ ఘటనలో శివలింగం త్రిశూలం స్వల్పంగా దెబ్బతింది. ⇔ ఫిరంగిపురం మండలంలోని యర్రగుంట్లపాడు గ్రామంలో శివాలశెట్టి ప్రసాద్ (57) అతని స్నేహితుడుపి.నాగేశ్వరరావులు జీవాలు మేపుకునేందుకు గ్రామ సమీపంలోని పొలానికి వెళ్లారు. సాయంత్రం 4.30 సమయంలో పిడుగు వారి సమీపంలో పడింది. ఈ ఘటనలో ప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందగా నాగేశ్వరరావుకు గాయాలయ్యాయి. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గాయాలైన నాగేశ్వరరావును చికిత్సకోసం 108లో సత్తెనపల్లి వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ పార్థసారథి , వీఆర్వో అంజలిలు మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. ⇔ క్రోసూరు మండలంలోని 88 త్యాళ్లూరులో కుంభా కోటేశ్వరమ్మ(60) కూలిపనులకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో పిడుగుపడి మృతి చెందింది. ఈ ఘటనలో మరో ఇద్దరు మహిళా కూలీలకు స్వల్ప గాయాలైనట్టు తెలుస్తోంది. ఇదే గ్రామంలో పొలంలో మేత మేస్తున్న గేదె, దూడ కూడా మృత్యువాత పడ్డాయి. ⇔ నాగార్జున సాగర్ డ్యాం దిగువన ఉన్న కొత్త బ్రిడ్జీ సమీపంలో పిడుగుపడి దుగ్యాల అంజయ్య(35) స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే హిల్‌కాలనీలోని ప్రభుత్వ కమలానెహ్రూ ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందాడు. అంజయ్య సాగర్ డ్యాం దిగువన కృష్ణానదిపై ఉన్న కొత్తబ్రిడ్జీపై బత్తాయి జ్యూస్ అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. భార్య నాగమ్మ, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ముగ్గురు చిన్నపిల్లలే. సాగర్‌కు వచ్చే పర్యాటకులకు అంజయ్య, నాగమ్మలు సుపరిచితులు. ⇔ ముప్పాళ్ల మండలంలో మండలంలోని నార్నెపాడు గ్రామానికి చెందిన దాసరి బొల్లయ్య(27) గేదెలు మేపుకునేందుకు వెళ్లాడు. వాతావరణం మారడంతో ఇంటికి వెళ్దామని బయలు దేరాడు. ఈ క్రమంలో మార్గ మధ్యంలో పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఒక కుమారుడు ఉన్నాడు. తల్లిదండ్రులు జగన్నాథం, నారాయణమ్మలకు ఒక్కడే కొడుకుకావటంతో మరణవార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. ⇔ సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లలో పోపూరి అశోక్(28) పొలంలో ఉన్న ఎద్దులను తోలకొచ్చేందుకు వెళ్లాడు. ఎద్దులు ఇంటికొచ్చినప్పటికీ అశోక్ రాకపోవడంతో కుటుంబ సభ్యులు పొలం వైపు వెళ్లగా పిడుగుపాటుకు గురై మృతి చెంది ఉండడాన్ని గమనించారు. మృతుడికి భార్య నాగలక్ష్మి, కుమారుడు ఉన్నారు. ⇔ సత్తెనపల్లి నియోజకవర్గంలో ఈదరుగాలుల ధాటికి విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. పట్టణంలో రెండు, రెంటపాళ్లలో ఒకటి, లక్ష్మీపురంలో ఒకటి, మరో ఆరు చోట్ల విద్యుత్ స్తంభాలు కూలి పోయాయి. బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ సర్వర్ డౌన్ అయ్యింది. సత్తెనపల్లి మండలం గోరంట్ల గ్రామ సమీపంలోని పొలాల్లో పిడుగుపాటుకు కట్టమూరు గ్రామంలో నందిగం ప్రకాశంకు చెందిన రూ.1.40 లక్షలు విలువ చేసే రెండు గేదెలు, రెంటపాళ్లలో పాలపాటి వెంకటప్పయ్యకు చెందిన రూ.65 వేలు విలువ చేసే గేదె, నంబుల సైదయ్యకు చెందిన రూ.50 వేలు విలువ చేసే గేదె, పట్టణంలోని శాస్త్రీనగర్‌లో సీతారామయ్యకు చెందిన రెండు గేదెలు, సుందరయ్య కాలనీలో శేషగిరికి చెందిన ఒక గేదె మృతి చెందాయి. అలాగే కంకణాలపల్లి గ్రామం వద్ద రెండు చెట్లు పడి పోవడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. రైతులు పంట ఉత్పత్తులను కాపాడుకునేందుకు ఉరుకులు, పరుగులు పెట్టారు. పలు వార్డుల్లో కాలువలకు వర్షపు నీరు చేరండంతో మురుగు రోడ్లపై ప్రవహించింది. రాజుపాలెం మండలం కస్తుర్బా పాఠశాల వద్ద, పులిచింత ఆర్ అండ్ ఆర్ సెంటర్ వద్ద చెట్లు కూలి పోయి ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. -
అమ్మో పిడుగు
జిల్లాలో రెండేళ్లుగా భారీగా పిడుగులు పడుతున్నాయి. ఒకట్రెండు కాదు.. పదులు అంత కన్నా కాదు.. వందలు ఎంతమాత్రం కాదు.. వేల సంఖ్యలో పిడుగులు పడుతుండటంతో ఆందోళన కలిగిస్తోంది. అందులోనూ ఏడాదంతా కాదు.. కేవలం కొన్నినెలల వ్యవధిలోనే భారీగా పిడుగులు పడుతుండటం కొసమెరుపు. పిడుగుల వానతో ప్రాణనష్టం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ రెండేళ్ల కాలంలో భారీగా పిడుగుల వర్షం కురిసిందనే చెప్పడానికి రాష్ట్ర విపత్తుల శాఖ రికార్డు చేసిన గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. సాక్షి, కడప : ప్రసుత్తం కురుస్తున్న వర్షాలకు పిడుగులు పడడం సర్వసాధారణంగా మారింది. ఆకాశంలో క్యూములోనింబస్ మేఘాలు విస్తృతస్థాయిలో ఆవరించి ఉండడం, భూమిపై భౌగోళిక పరిస్థితులతో వాతావరణం మారడం, వర్ష సూచనలు లేకుండా ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షాలు పడుతున్నాయి. ఈక్రమంలో పదుల సంఖ్యలో ప్రాణనష్టం వాటిల్లుతోంది. దీంతో ప్రజలు వర్షమంటే బెంబేలెత్తుతున్నారు. వర్షాకాలంలో కన్నా ఇతర సీజన్లల్లో వాన కురిసే సమయంలోనే అధికంగా పిడుగులు పడుతున్నట్లు వాతావరణశాఖ నిపుణులు చెబుతున్నారు. రాష్ట్ర విపత్తుల శాఖ హెచ్చరిస్తున్నా.. రాష్ట్రంలో ప్రత్యేకంగా ఏర్పాటైన రాష్ట్ర విపత్తుల శాఖ పిడుగులపై ప్రత్యేక హెచ్చరికలు చేస్తోంది. ఆయా జిల్లాల్లోని ఫలానా మండలంలో పిడుగు పడుతుందని తెలియజేస్తోంది. ఈ సమాచారం నేరుగా మండల తహసీల్దార్‌తోపాటు ఇతర అధికారులకు అందుతుంది. తద్వారా మండలంలో విస్తృత ప్రచారాన్ని మీడియా ద్వారా కల్పిస్తున్నా, పొలాలు, దూర ప్రాంతాల్లో ఉన్నవారికి సమాచారం అందకపోవడంవల్ల పిడుగు పాటుకు గురై మరణిస్తున్నారు. మృత్యువాత : జిల్లాలో ప్రతి ఏడాది పిడుగుపాటుకు గురై పదులసంఖ్యలో జనం మృత్యువాతపడుతున్నారు. ప్రధానంగా ఇంటి వద్ద ప్రమాదాలు తక్కువగా కనిపిస్తున్నా, ఊరి బయట అడవిలోనే పిడుగుపాటుకు ఎక్కువగా గురవుతున్నారు. 2018లో ఇప్పటివరకు అధికారిక లెక్కల ప్రకారం..నలుగురు పిడుగుపాటుకు గురై చనిపోయారు. అంతేకాకుండా పశువులు కూడా పిడుగుపాటుకు బలైపోతున్నాయి. ఇదిలాఉండగా పిడుగుపడి చనిపోతున్న వారు కొందరైతే, ఉరుముల శబ్దానికి భయపడి గుండె ఆగి మరణిస్తున్నా వారు ఉన్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ♦ పిడుగులు పడే సమయంలో కిటికీలు, తలుపులు మూయడం ♦ కిటికీలు, తలుపులు, అడ్డుగోడలు, ద్వారమండపాలు, గోడలకు దూరంగా ఉండటం ♦ ఉరుములు చివరి శబ్దం విన్న తర్వాత 30 నిమిషాల వరకు ఇళ్లలోనే ఉండాలి. ♦ బహిరంగ ప్రదేశాలలో ఉన్నట్లయితే సత్వరమే సురక్షిత ప్రాంతానికి వెళ్లడం ♦ ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లు, మోటారు సైకిళ్లు తదితర వాటికి దూరంగా ఉండటం ♦ గాలివానలో వాహనాన్ని నడుపుతున్న సమయంలో మంచి రహదారి కోసం ప్రయత్నించడం, చెట్లు లేని, వరదలు రానీ ప్రాంతాలకు వెళ్లడం వేలాడుతున్న విద్యుత్లైన్లకు దూరంగా ఉండాలిపిడుగులు పడే సమయంలోచేయకూడని పనులు ♦ ఎలక్ట్రిక్ అనుసంధానం ఉన్న విద్యుత్ పరికరాలను వినియోగించరాదు. తాకరాదు ♦ పిడుగులు పడే సమయంలో సెల్ఫోన్లకు దూరంగా ఉండాలి. ♦ పిడుగులు పడే సమయంలో దుస్తులను ఉతకడం, పాత్రలను శుభ్రం చేయడం వంటి పనులు చేయరాదు. ♦ పిడుగు పడే సమయంలో చెట్ల కింద, చెట్ల సమీపంలో ఉండరాదు ♦ బహిరంగ ప్రదేశాలలో విడిగా ఉన్న షెడ్లు, ఇతర చిన్న నిర్మాణాల వద్ద ఉండరాదు. ♦ ఏప్రిల్ 2న చాపాడు మండలంలోని వెదురూరుకి చెందిన తల్లీకూతురు షేక్ ఖాసింబీ, అయేషాలు పొలంలో పనుల నిమిత్తం వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చేందుకు సిద్ధమవుతుండగా, ఒక్కసారిగా గాలివాన రావడం, పిడుగుపాటుతో అక్కడికక్కడే పొలం వద్దనే కుప్పకూలిపోయి చనిపోయారు. ♦ మే 13న వల్లూరు మండలం బీచువారిపల్లెలో పిడుగుపాటుకు రైతుకూలీ దస్తగిరమ్మ మృ త్యువాత పడగా, ముగ్గురు మహిళలకు గా యాలయ్యాయి. అదేరోజు బి.కోడూరు మండలం మేకవారిపల్లెలో పిడుగుపాటుకు వెంకటరమణారెడ్డి కూడా మృత్యువాతపడ్డాడు. ♦ మే 13న రైల్వేకోడూరు పరిధిలోని సి.కమ్మపల్లెలో పిడుగుపాటుకు ఒక గేదె మృతిచెందగా, సుండుపల్లె మండలంలోని మడుంపాడు సమీపంలోని గోపాలకృష్ణపురంలో రెండు గొర్రెలు, ఏడు మేకలు కూడా పిడుగుపాటుకు గురై మృతిచెందాయి. ♦ మే 29న కలసపాడు మండలం ముదిరెడ్డిపల్లెలో పిడుగుపాటుకు గురై నడిపి పీరాన్ సాహేబ్ (55) మృతిచెందారు. పశువులను మేపేందుకు సమీప అడవికి వెళ్లి తిరిగివస్తుండగా ఒక్కసారిగా పిడుగుపడి అక్కడికక్కడే మృతిచెందారు. ♦ ఇదీ గత రెండు నెలలుగా జిల్లాలో పిడుగుల వాన. వాన మొదలైందంటే చాలు ఉరుములు, మెరుపులు ఆపై భారీగా పిడుగులు పడుతున్నాయి. దీంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అసలు ఎప్పుడు లేని విధంగా ఇలా వేసవిలో పిడుగుల వాన ఏంటోనని హడలిపోతున్నారు. -
చెట్టుకిందికి చేరొద్దు..గొడుగు వాడొద్దు
పరిగి : వర్షాకాలం వచ్చిందంటే చాలు ఏటా జిల్లాలో పదుల సంఖ్యలో పిడుగు పాటుకు గురై మృత్యువాత పడుతున్నారు. అనుకోకుండా వచ్చి పడే భయోత్పాతానికి బలవుతున్నవారిలో రైతన్నలు, పశువుల కాపరులే ఎక్కువ శాతం ఉంటున్నారు. ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో పడే పిడుగుల కారణంగా ఏడాదికి 24 వేల మంది మృత్యువాత పడుతుండగా మరో రెండు లక్షల మంది వరకు గాయాలపాలవుతున్నట్లు ప్రపంచ ప్రకృతి వైపరీత్యాల గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సెకనుకు 100కు పైగా పిడుగులు పడుతున్నట్లు అంచనా వేస్తున్నారు. అయితే ఉరుములు..మెరుపులు వచ్చే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం.. అప్రమత్తంగా ఉండటం వల్ల పిడుగు పాటు నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. పోలీసులు పిడుగు పాటు అంశంపై ఓ వీడియోనూ రూపొందించి అవగాహన కల్పిస్తున్నారు. సూర్యుని ఉపరితల ఉష్ణోగ్రత కంటే ఐదు రెట్లు అధికం.. పిడుగు పాటు విషయంలో ప్రధానంగా పల్లెటూర్లలో అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. దేవదానవ యుద్ధం కారణంగా ఇలా ఉరుములు, మెరుపులు వస్తాయని.., అయితే మెరుపులు వచ్చే సమయంలో అర్జున..ఫాల్గున అంటే వారు మనల్ని పిడుగుల బారి నుంచి రక్షిస్తారని పెద్దలు చెబుతూ ఉండటం మనందరికి తెలిసిందే... అయితే పిడుగు పడినప్పుడు ఉత్పన్నమయ్యే ఉష్ణోగ్రతలు మామూలు ఉష్ణోగ్రతకు ఐదు రెట్లు ఉంటాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. నిరంతరం మండుతున్న అగ్నిగోళంగా చెప్పుకునే సూర్యుని ఉపరితలంపై 5700 సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. కానీ పిడుగు పడినప్పుడు ఉత్పన్నమయ్యే ఉష్ణోగ్రత సూర్యుని ఉపరితల ఉష్ణోగ్రతకు సుమారు ఐదు రెట్లు అధికంగా అంటే 29000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుందట... అసలు పిడుగు అంటే ఏమిటి... మేఘాల వద్ద ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటం వల్ల నాటి ఆవిరి చిన్న చిన్న నీటి బిందువుల రూపంలో ఉంటుంది. ఇదే సమయంలో విపరీతమైన గాలులు వీచినప్పుడు ఆ మంచు కణాలు, నీటి బిందువుల మధ్య రాపిడి జరిగి ఎలక్ట్రికల్ చార్జి ఉత్పన్నమవుతుంది. దీంతో పాజిటివ్.. నెగెటివ్ చార్జి ఉన్న కణాలు విడుదల అవుతాయి. వీటిలో పాజిటివ్ చార్జి కణాలు తేలికగా ఉండటం వల్ల అవి మేఘంలోని పై భాగానికి.. అలాగే నెగెటివ్ కణాలు బరువుగా ఉండటం వల్ల కింది భాగానికి చేరుకుంటాయి. ఇప్పుడు అవి అయస్కాంతంలోని ఉత్తర దక్షిణ ధృవాలు ఎలా ఆకర్షించుకుంటాయో అలాగే అక్కడ జరుగుతుంది. రెండు వేర్వేరు మేఘాలు దగ్గరగా వచ్చినప్పుడు.. పై మేఘంలో ఉండే నెగెటివ్ చార్జ్ కణాలు..కింద మేఘంలో ఉన్న పాజిటివ్ చార్జి కణాల మధ్య రాపిడి జరుగుతుంది. దీంతో ఆ రెండింటి మధ్య మెరుపు. (విద్యుత్తు).. ఉరుము(శబ్దం) ఉత్పన్నమవుతాయి. ఈ సమయంలోనే మేఘంలోని కింది భాగంలో ఉండే నెగెటివ్ చార్జి కణాలు భూ ఉపరితలంపై ఉండే పాజిటివ్ చార్జి కణాల చేత ఆకర్షించబడతాయి. ఇలా నెగెటివ్ చార్జి కణాలు భూమిని చేరే క్రమంలో మేఘాల్లో రాపిడికి ఉత్పన్నమైన విదుత్తు భూమిని చేరుతుంది. దీన్నే మనం పిడుగు అంటాం.. ప్రధానంగా ఈ నెగెటివ్ చార్జి కణాలు భూమిని చేరే క్రమంలో ఎత్తయిన ప్రదేశాలు.. చెట్లు, కొండలు, మనుషులు, జంతువులను ఎంచుకుని వాటి ద్వారా భూమిని చేరుతాయి. ఆ చేరే క్రమంలో ఆ కణాలు దేని ద్వారా చేరితే..అవి మసి అయిపోతూ ఉండటం మనం చూస్తుంటాం... ఈ జాగ్రత్తలు తీసుకోవాలి....కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటం వల్ల పిడుగు పాటు నుంచి బయటపడవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. * ఉరుములు, మెరుపులు పిడుగులు పడే సమయంలో ల్యాండ్‌లైన్ ఫోన్ మాట్లాడకూడదు. * ల్యాండ్‌లైన్ ఫోన్‌కు బదులు కార్డ్‌లెస్ ఫోన్‌గానీ, సెల్ ఫోన్‌గానీ వాడవచ్చు. అదీ ఇంట్లో ఉండిమాత్రమే. * ఉరుములు, మెరుపుల సమయంలో టీవీ చూడటం ప్రమాదం. ఇంకా చెప్పాలంటే స్విచ్‌బోర్డుల నుంచి ప్లగ్‌లు తీసి వేయాలి. లేదంటే ఎలక్ట్రిక్ వస్తువులన్నీ పాడయ్యే ప్రమాదముంది. * ఉరుములు, మెరుపుల సమయంలో ట్యాప్ కింద చేతులు కడగటం, గిన్నెలు కడగటం, షవర్ కింద స్నానం చేయటం లాంటివి చేయకూడదు. * ఇంటి కిటికీలు, తలుపుల దగ్గర నిల్చోవటం. వాటి దగ్గర నిల్చుని బయటకు చూడటం మంచిది కాదు. * ఉరుములు, మెరుపుల సమయంలో బయట ఉంటే షెల్టర్ వెతుక్కోవాలి. కానీ చెట్ల కిందకి మాత్రం ఎట్టి పరిస్థితిలో వెళ్లకూడదు. ఎందుకంటే చెట్లు, కరెంటు స్తంభాలు పిడుగులను సులువుగా ఆకర్షిస్తాయి. అందుకే చెట్లపైన ఎక్కువగా పిడుగులు పడే ప్రమాదం ఉంది. * పిడుగులు పడే సమయంలో వర్షంలో తడిసినా పరవాలేదు.. కానీ గొడుగు వాడకూడదు. దగ్గరలో కారు ఉంటే..ఏదైనా షెడ్డు ఉన్నా దాంట్లో కూర్చోవచ్చు. ఎఫ్ఎం రేడియో వినకూడదు.. * ఎక్కడా షెల్టర్ దొరక్కుంటే ఎత్తు తక్కువగా ఉండే ప్రదేశాల్లో కూర్చుని తలకిందకు వంచి చెవులు, కళ్లు మూసుకుని కూర్చోవాలి. * పెంపుడు జంతువులైన ఆవులు, గేదెలు, కు క్కలు లాంటి వాటిని బయట వదిలేయకుం డా షెడ్లలో ఉంచాలి. లేదంటే బయట ఉంటే చెట్లకిందకు వెళ్లకుండా చూసుకోవాలి. * ఉరుములు, మెరుపుల సమయంలో మన శరీరం జలదరింపుకు గురి కావటం, వెంట్రుకలు నిక్కబొడుచుకోవటం లాంటి సంకేతాలు పిడుగులు పడే సమయంలో కనిపిస్తాయి. ఇలా జరిగితే పిడుగు మీ దగ్గరలో పడుతున్నట్లు అర్థం. అప్పుడు మరింత అప్రమత్తం కావాలి. -
ఏం సమాధానం చెప్పాలి
చిట్టి చిట్టి పాదాలతో నా గుండెలపై గెంతుతుంటే పులకరించిపోయానే.. ఆట వచ్చినా రాకున్నా ఒకరికి మించి ఒకరు ఆడేందుకు పోటీ పడుతుంటే వారి పట్టుదల చూసి సంబరపడ్డానే.. చిచ్చర పిడుగుల్లా ఆటలో చెలరేగుతుంటే వారి ప్రతిభ చూసి ముసిముసిగా నవ్వుకున్నానే.. భగవంతుడా..! మాయదారి పిడుగు ఇక్కడే పడాలా. నిండా 20 ఏళ్లు కూడా నిండలేదు కదయ్యా.. నా ఎదలోతులను చీల్చినా భరించేదాన్నే.. నా చెంత ఆడుకునే బిడ్డలను నిలువునా చిదిమేశావు.. ఆటాడేందుకు నాపై నిలిపిన ఈ రాళ్లు.. మళ్లీ బిడ్డల పాదాల చప్పుడు ఎక్కడ అంటూ ప్రశ్నిస్తుంటే పొంగుకొస్తున్న దుఃఖాన్ని ఎలా ఆపుకోవాలి. బిడ్డల తల్లిదండ్రుల గర్భశోకానికి ఏమని సమాధానం చెప్పాలి. వారి గుండెల్లో బాధాగ్నిని ఏ వర్షపు చుక్క ఓదార్చాలి.– మైదానం ఆత్మఘోష అమరావతి, గురజాల: కూలీనాలీ చేసుకుని పొట్టపోసుకునే తమ బిడ్డలతో విధి ఆటాడుకుందని ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదించారు. గురజాల మండలం సమాధానం పేటలో పిడుగుపడి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. మేరాజోత్ దేవానాయక్, భూలక్ష్మిల కుమారుడు మనోహర్ నాయక్ నాయనమ్మ సైదమ్మ వద్ద ఉండి చదువుకుంటాడు. తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చి వెళ్లిపోయాడు. బోజావత్ హనుమంతు నాయక్, కోటమ్మల కుమారుడు శ్రీహరి నాయక్ చిన్నబ్బాయి. కుమారుడి మృతితో ఆ తల్లిదండ్రులు విలవిలలాడుతున్నారు. మూడవత్ సేవా నాయక్, అంజలి భాయ్ దంపతులకు కుమారుడు పవన్ నాయక్. వేసవి సెలవులు కావడంతో అమ్మమ్మ ఇంటికి వచ్చి విగతజీవిగా మారాడు.