బంధువులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే అన్నా రాంబాబు రాజమ్మ (ఫైల్)
ప్రకాశం, అర్ధవీడు: మండలంలోని వెలగలపాయలో ఉపాధి హామీ పనికి వెళ్లిన మహిళ అడవిలో దొరికే జాన పండ్ల కోసం వెళ్లి దారితప్పి అక్కడే పిడుగుపాటుకు గురై మృతి చెందింది. ఈ సంఘటన నాలుగు రోజుల తర్వాత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. గ్రామానికి చెందిన గరిక రాజమ్మ (40) నాలుగు రోజుల క్రితం ఉపాధి హామీ పథకం పనికి గ్రామస్తులతో కలిసి వెళ్లింది. పని ముగిసిన తర్వాత అడవిలో దొరికే జాన పండ్ల కోసం తోటి కూలీలకు చెప్పకుండా కొద్ది దూరం వెళ్లింది. మిగిలిన కూలీలు గమనించలేదు. ఎవరింటికి వారు వెళ్లి పోయారు. భర్త పుల్లయ్య తన భార్య ఇంటికి రాక పోవడంతో తోటి కూలీలను ప్రశ్నించడంతో అడవిలో పండ్లు కోసుకుంటోందని సమాధానమిచ్చారు. పుల్లయ్య గ్రామస్తులను వెంటబెట్టుకొని అడవిలో వెతికారు.
రాజమ్మ జాడ కనిపించక పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ సాంబశివరావు తన సిబ్బందితో కలిసి ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయినా ఆమె జాడ తెలియలేదు. గ్రామస్తులంతా కలిసి అడవంతా జల్లెడ పట్టడంతో మంగళవారం సాయంత్రం అడవిలో రాజమ్మ మృతదేహం లభ్యమైంది. శరీరమంతా కమిలిపోయి, కరెంట్‌షాక్ తగిలిన గుర్తులుండటంతో అడవిలో పిడుగుపాటుకు గురై ఉంటుందని భర్త, గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఎస్‌ఐ సాంబశివరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మార్కాపురం సీఐ కేవీ రాఘవేంద్ర కంభం ప్రభుత్వ వైద్యశాలలో మృతుల బంధువులను విచారించారు. విషయం తెలుసుకున్న గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు కంభం ప్రభుత్వ వైద్యశాలలో మృతురాలి బంధువులను పరామర్శించి ధైర్యం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment