
మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబీకులు, బంధువులు
తరిగొప్పుల: కంకుల కోసం చేనులోకి వెళ్లిన ఇద్దరిని మృత్యు వు కబలించింది. అకస్మాత్తుగా పిడుగు పడడంతో ఓ యువ కుడితో పాటు బాలుడు దుర్మరణం చెందారు. ఈ సంఘటన జనగామ జిల్లా తరిగొప్పుల మండలం బొంతగట్టునాగారం గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది.
కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బొంతగట్టునాగారానికి చెందిన సుంకరి రాజు, మంజుల దంపతుల కుమారుడు సుంకరి సతీష్ (20) పదో తరగతి పూర్తి చేసి మండల కేంద్రంలోని ఓ రైస్ మిల్లులో పనిచేస్తున్నాడు. అలాగే, సాంబయ్య, స్వరూప దంపతుల కుమారుడు పొగాకుల దినేష్ (15) తొమ్మిదో తరగతి పూర్తయింది.
ఇద్దరూ మంచి మిత్రులు కాగా, వేసవి సెలవులు రావడంతో ఆదివారం సాయంత్రం కంకుల కోసం ఇద్దరూ కలిసి గ్రామంలోని మొక్కజొన్న చేనులోకి వెళ్లారు. అదే సమయంలో పిడుగు పడడంతో సతీష్, దినేష్‌లు అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో ఇరు కుటుంబాలు చేసిన రోదనలు మిన్నంటాయి. ఎస్సై రాజేష్‌నాయక్ సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.