tarigoppala
-
పదేళ్లుగా మంచినీళ్లు ముట్టని ముసలవ్వ
సాక్షి, తరిగొప్పుల(వరంగల్) : ఈ ఫొటోలో ఉన్న అవ్వను చూశారా.. ఓ విలక్షణ లక్షణం ఆమె సొంతం. అదేంటో తెలిస్తే.. ఎవరైనా, ఔరా.. అనక మానరు! దాహమంటే.. ఏమిటో ఆమెకు తెలియదు. ఒకటి, రెండు రోజులు కాదు.. ఏకంగా పదేళ్లపాటు ఆమె చుక్కనీరు ముట్టితే ఒట్టు! బుక్కెడు బువ్వ తినకుండా ఉపాసం ఉండొచ్చుకానీ.. గుక్కెడు మంచి నీళ్లు తాగకుండా ఉండలేం. అలాంటిది పదేళ్లుగా చుక్క నీరు తాగకుండా ఉంటోంది జనగామ జిల్లా తరిగొప్పుల మండల కేంద్రానికి చెందిన పింగిళి ప్రమీల (70). ఆకలేసినప్పుడు అన్నం తిన్నా మంచినీళ్లు మాత్రం తాగదు. అన్నం తిన్నప్పుడు ఛాతీ భాగంలో తట్టుకున్నట్టు అనిపిస్తే.. నాలుకపై కొంచెం కారం వేసుకుంటే సరిపోతుందని ఈమె చెబుతోంది. పదేళ్ల క్రితం వరకు మంచినీళ్లు తాగిన ప్రమీలకు ఒక్కసారిగా తాగునీటిపై అనాసక్తి ఏర్పడటంతో మానేసినట్లు చెబుతోంది. చదవండి: చికెన్.. చికెన్.. మటన్.. చికెన్ చదవండి: కరోనా సోకితే 8 నెలలు సేఫ్? -
పిడుగు పాటుకు ఇద్దరి మృతి
తరిగొప్పుల: కంకుల కోసం చేనులోకి వెళ్లిన ఇద్దరిని మృత్యు వు కబలించింది. అకస్మాత్తుగా పిడుగు పడడంతో ఓ యువ కుడితో పాటు బాలుడు దుర్మరణం చెందారు. ఈ సంఘటన జనగామ జిల్లా తరిగొప్పుల మండలం బొంతగట్టునాగారం గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బొంతగట్టునాగారానికి చెందిన సుంకరి రాజు, మంజుల దంపతుల కుమారుడు సుంకరి సతీష్ (20) పదో తరగతి పూర్తి చేసి మండల కేంద్రంలోని ఓ రైస్ మిల్లులో పనిచేస్తున్నాడు. అలాగే, సాంబయ్య, స్వరూప దంపతుల కుమారుడు పొగాకుల దినేష్ (15) తొమ్మిదో తరగతి పూర్తయింది. ఇద్దరూ మంచి మిత్రులు కాగా, వేసవి సెలవులు రావడంతో ఆదివారం సాయంత్రం కంకుల కోసం ఇద్దరూ కలిసి గ్రామంలోని మొక్కజొన్న చేనులోకి వెళ్లారు. అదే సమయంలో పిడుగు పడడంతో సతీష్, దినేష్లు అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో ఇరు కుటుంబాలు చేసిన రోదనలు మిన్నంటాయి. ఎస్సై రాజేష్నాయక్ సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. -
శిథిలావస్థలో గ్రంథాలయం
తరిగొప్పుల(నర్మెట) : పది రోజుల క్రితం కురిసన వర్షాలకు మండల కేంద్రంలోని గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలు పూర్తిగా తడిసిపోయాయి. గురువారం ఆ పుస్తకాలను గ్రంథాలయ సిబ్బంది భవనం ముందు ఆరబెట్టడంతో ‘సాక్షి’ కంటపడింది. తరిగొప్పుల గ్రామ గ్రంథాలయం పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో పాఠకులు ఎప్పుడూ కూలుతుందోనని భయపడుతున్నారు. భవనం పైకప్పు పెచ్చులు ఊడిపోతున్నాయి. దీంతో గ్రంథాలయానికి రావడానికి పాఠకులు జంకుతున్నారు. ఎంతో సమాచారం, చరిత్ర కలిగిన పుస్తకాలు పూర్తిగా నానిపోవడంతో సంచుల్లో ఓ గదిలో భద్రపరిచారు. మరికొన్ని వర్షానికి నానిపోయి చినిగిపోయాయి. సంబంధిత అధికారులు కాని, ప్రజాప్రతినిధులు కాని స్పందించి గ్రంథాలయానికి నూతన భవనం నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు.