తరిగొప్పుల(నర్మెట) : పది రోజుల క్రితం కురిసన వర్షాలకు మండల కేంద్రంలోని గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలు పూర్తిగా తడిసిపోయాయి. గురువారం ఆ పుస్తకాలను గ్రంథాలయ సిబ్బంది భవనం ముందు ఆరబెట్టడంతో ‘సాక్షి’ కంటపడింది. తరిగొప్పుల గ్రామ గ్రంథాలయం పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో పాఠకులు ఎప్పుడూ కూలుతుందోనని భయపడుతున్నారు.
భవనం పైకప్పు పెచ్చులు ఊడిపోతున్నాయి. దీంతో గ్రంథాలయానికి రావడానికి పాఠకులు జంకుతున్నారు. ఎంతో సమాచారం, చరిత్ర కలిగిన పుస్తకాలు పూర్తిగా నానిపోవడంతో సంచుల్లో ఓ గదిలో భద్రపరిచారు. మరికొన్ని వర్షానికి నానిపోయి చినిగిపోయాయి. సంబంధిత అధికారులు కాని, ప్రజాప్రతినిధులు కాని స్పందించి గ్రంథాలయానికి నూతన భవనం నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు.