పాఠశాల వద్ద
మండల కేంద్రంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పక్కనే విద్యుత్ స్తంభంపై సోమవారం పెద్ద శబ్ధంతో పిడుగుపడింది. దీంతో స్థానికులు, ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది ఉలిక్కిపడ్డారు. విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. పాఠశాలకు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మధ్యలో విద్యుత్ స్తంభంపై పిడుగుపడింది.
ప్రభుత్వ పాఠశాల పక్కన విద్యుత్ స్తంభంపై పడిన పిడుగు
తెగిపడిన విద్యుత్ తీగలు
వ్యాపించిన మంటలు
ఆందోళనకు గురైన స్థానికులు
సంతకవిటి: మండల కేంద్రంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పక్కనే విద్యుత్ స్తంభంపై సోమవారం పెద్ద శబ్ధంతో పిడుగుపడింది. దీంతో స్థానికులు, ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది ఉలిక్కిపడ్డారు. విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. పాఠశాలకు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మధ్యలో విద్యుత్ స్తంభంపై పిడుగుపడింది. ఆ సమయంలో విద్యుత్ తీగలు తెగిపడడంతో పాటు పెద్దగా మంటలు వ్యాపించాయి. స్తంభం పక్కనే ఉన్న తరగతి గదిలో విద్యార్థులు, ఉపాధ్యాయులు సురక్షితంగా ఉన్నారు. హెచ్‌ఎం కె.విజయ్‌కుమార్‌తో పాటు మిగిలిన ఉపాధ్యాయులు వెంటనే విద్యార్థులను వేరే తరగతి గదిలోకి తరలించారు. ఇదిలావుండగా ఇదే సమయంలో వెలుగు కార్యాలయం వైపు నడిచివస్తున్న సిరిపురం గ్రామానికి చెందిన వెలుగు సీఎఫ్ పొట్నూరు రాజేశ్వరి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పిడుగుపాటు శబ్ధానికి ఈమె సొమ్మసిల్లి పడిపోయింది. స్థానికులు వెంటనే సంతకవిటి పీహెచ్‌సీకి తరలించగా అక్కడి వైద్యాధికారి డాక్టర్ భార్గవి ప్రాథమిక చికిత్స అందించారు.
అధికారుల పరిశీలన
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వద్ద పిడుగుపడిన విషయం తెలుసుకున్న స్థానిక మండల పరిషత్ అధికారి ఎ.శ్రీనాథస్వామి, తహసీల్దార్ జి.సత్యనారాయణ, సూపరింటెండెంట్ శంకరరావు, ఏపీఎం సీతారాం, ఎంఈవో యాగాటి దుర్గారావు, సంతకవిటి సర్పంచ్ ప్రతినిధి గట్టి తిరుమలరావు తదితరులు అక్కడకు చేరుకున్నారు. హెచ్‌ఎం కె.విజయ్‌కుమార్‌తో పాటు విద్యార్థుల వద్ద వివరాలు సేకరించారు. సంతకవిటి పీహెచ్‌సీకి చేరుకుని చికిత్స పొందుతున్న రాజేశ్వరిని పరామర్శించారు. ఎలక్ట్రికల్ ఏఈ టంకాల వెంకటశ్రీనివాసరావు సిబ్బందిని పంపించి పిడుగుపడిన స్థలంలో తెగిపడిన విద్యుత్ తీగలును సరిచేయించారు.