మృతుల్లో రైతులు, వ్యవసాయ కూలీలు
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 20 మూగజీవాలు మృతి
సాక్షి, నెట్‌వర్క్: పిడుగుపాటుకు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 20 మూగజీవాలు సైతం బలయ్యాయి. నారాయణపేట జిల్లా విఠలపురం గ్రామానికి చెందిన ఆశన్న (58) పత్తి విత్తనాలు విత్తేందుకు కుటుంబసభ్యులను, కూలీలతో పొలానికి వెళ్లాడు.
సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో అందరూ సమీపంలోని చెట్టు కిందకు వెళ్లారు. ఈ క్రమంలో పిడుగు పడటంతో ఆశన్నతో పాటు వ్యవసాయ కూలీ కౌసల్య (54) అక్కడికక్కడే మృతిచెందారు. ఆశన్న భార్య సైదులమ్మ, మనవరాలు శ్రావణికి స్వల్పగాయాలయ్యాయి.
ఇంటికొస్తూ.. చెట్టుకిందకు వెళ్లి..
మెదక్ జిల్లా చిటు్కల్ గ్రామానికి చెందిన బోయిని నర్సమ్మ (52), భర్త ఎల్లయ్యతో కలిసి వ్యవసాయ పనులు ముగించుకొని సాయంత్రం ఇంటికి వస్తోంది. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో కూ డిన వర్షంతోపాటు, ఒక్కసారిగా పిడుగుపడి నర్స మ్మ అక్కడికక్కడే మృతి చెందింది. కళ్లెదుటే భార్య మృతి చెందడంతో ఎల్లయ్య భోరున విలపించాడు.
ఇదే జిల్లా రాజ్‌పల్లి గ్రామానికి చెందిన సిద్ధిరాములు (55), రాధమ్మ దంపతులు గురువారం రాత్రి పొలంలో వరి విత్తనాలు తూకం పోస్తున్న క్రమంలో వర్షం పడింది. దంపతులు చెట్టు కిందకి వెళ్లగా, అదే సమయంలో పిడుగుపడింది. సిద్ధిరాములు అక్కడికక్కడే మృతిచెందాడు. అస్వస్థతకు గురైన రాధమ్మను ఆస్పత్రికి తరలించారు.
గొర్రెలను మేపేందుకు వెళ్లి..
కామారెడ్డి జిల్లా గోర్గల్ గ్రామానికి చెందిన కురుమ కృష్ణమూర్తి (22) శుక్రవారం గొర్రెలను మేపేందుకు అటవీ ప్రాంతానికి వెళ్లాడు. సాయంత్రం సమయంలో పిడుగుపడి మృతిచెందాడు. గొర్రెలు ఇంటికి వచ్చినా కృష్ణమూర్తి రాకపోయేసరికి బంధువులు అడవిలోకి వెళ్లి గాలించగా అతడి మృతదేహం కనిపించింది.
మూగజీవాల మృత్యుఘోష
ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా శుక్రవారం పిడుగుపాటుకు గురై పెద్దసంఖ్యలో మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. వికారాబాద్ జిల్లా కుస్మసముద్రం, లింగాన్‌పల్లి గ్రామాల్లో 7 పాడిగేదెలు, రంగారెడ్డి జిల్లా మామిడిపల్లిలో 4 మేకలు, 4 గొర్రెలు, సంకటోనిపల్లిలో 2, సంగెం, ఆగిర్యాల్, గౌరారంలో ఒక్కోటి చొప్పున పాడిఆవులు మృతిచెందాయి. జీవనోపాధిని కోల్పోయామని బాధిత రైతులు వాపోయారు.
మేత మేస్తూ.. మృత్యువాత
విద్యుదాఘాతానికి 11 మూగజీవాలు బలి
చిన్నగూడూరు: విద్యుదాఘాతంతో పదకొండు పశువులు మృతిచెందాయి. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలంలో గురువారం రాత్రి కురిసిన గాలివానకు పలుచోట్ల విద్యుత్ వైర్లు తెగి పడిపోయాయి.
శుక్రవారం పశువులు పొలాల్లో మేత మేస్తూ తెగిన తీగలను తాకడంతో మండలంలోని మంగోరిగూడెంలో 7 ఎడ్లు, ఒక ఆవు, మేఘ్యాతండాలో 3 ఎడ్లు మృత్యువాతపడ్డాయి. దీంతో యజమానులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వీటి విలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుందని, ప్రభుత్వం పరిహారం చెల్లించాలని వారు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment