సాక్షి, నెట్‌వర్క్: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సోమ వారం కురిసిన అకాల వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులు, పిడుగులు, వడగండ్లతో కూడిన వర్షం పలుచోట్ల నష్టాన్ని మిగిల్చింది. పిడుగులకు పలువురు మృత్యువాతపడగా.. మూగజీలూ ప్రా ణాలు కోల్పోయాయి. మరికొన్ని చోట్ల కోతకొచ్చిన పంట ఒరిగిపోయి.. ధాన్యం రాలిపోగా.. ఇంకొన్ని చోట్ల యార్డుల్లో ఉంచిన ధాన్యం తడిసిపోయింది.
దంపతుల దుర్మరణం..
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని లింగోజిగూడెం గ్రామానికి చెందిన రైతు దంపతులు సోమవారం పిడుగుపాటుకు గురై దుర్మరణం చెందారు. బండారు కరుణాకర్‌రెడ్డి (65), ఆయన భార్య వేణమ్మ (55) సోమవారం సాయంత్రం వ్యవసాయ బావి వద్ద గేదెకు పాలు తీసేందుకు వెళ్లారు. వర్షం పడుతుండగా పక్కనే ఉన్న చింతచెట్టు కిందకు వెళ్లారు. చెట్టుపై పిడుగుపడటంతో దంపతులు అక్కడికక్కడే మరణించారు. పాడిగేదె కూడా మృతి చెందింది.
ఓ వృద్ధుడు మృతి
యాదాద్రి భువనగిరి జిల్లాలో సోమవారం సాయం త్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కుసింది. బొమ్మలరామారం మండలం మర్యాల గ్రామానికి చెందిన మన్నె రాములు (70) మామిడి చెట్టుకింద నిలబడగా పిడుగుపడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. చౌటుప్పల్ కేంద్రంలోని వ్యవసాయమార్కెట్ యార్డులో రైతుల ధాన్యం కుప్పలు తడిశాయి. మోటకొండూరు మండలంలోని కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన వరి ధాన్యం తడిసింది. ఆత్మకూరు (ఎం)లో పిడుగుపడటంతో ధనబోయిన యాదయ్యకు చెందిన ఓ గేదె, ఆరు గొర్రెలు మృతి చెందాయి. రామన్నపేట మండలం బోగారం గ్రామంలో బలమైన గాలులు వీయడంతో రాశులపై కప్పిన కవర్లు ఎగిరిపోయి ధాన్యం తడిసింది.
పిడుగుపాటుకు ముగ్గురు మృత్యువాత..
ఉమ్మడి మెదక్ జిల్లాలో పిడుగుల ధాటికి ముగ్గురు వ్యక్తులు మరణించారు. పదుల సంఖ్యలో మూగజీవాలు మృత్యువాత పడ్డా యి. సిద్దిపేట జిల్లా దౌల్తా బాద్ మండలం ఇందూప్రి యాల్ గ్రామానికి చెందిన సంబాగ రామయ్య(60) పొలం వద్ద పనులు చేస్తుండగా.. వర్షం రావడంతో సమీపంలోని చెట్టు కిందకి వెళ్లాడు. పిడుగు పడి అక్కడికక్కడే మృతి చెందాడు. రాయపోలు మండలంలోని మంతూరులో పొలం పనులు చేస్తున్న పట్నం నర్సింహులు(32) పిడుగుపడి మృత్యువాత పడ్డాడు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేటలో పిడుగుపడటంతో ఇటుక బట్టీ కార్మికుడు దొగ్రి ఈశ్వర్ (42) మృతి చెందాడు. మరో కార్మికుడు సంజయ్ అపస్మారక స్థితికి చేరుకోగా ఆస్పత్రికి తరలించారు. తొగుట మండలంలోని వెంకట్రావుపేటకు చెందిన మిద్దె లక్ష్మి, భీమరి ఎల్లవ్వ, బెస్త వెంకటవ్వ, బెజ్జరమైన సుజాత వ్యవసాయ పనికి వెళ్లారు. వర్షం రావడంతో సమీపంలోని ట్రాక్టర్ ట్రాలీ కిందకు వెళ్లి కూర్చున్నారు. సమీపంలో పిడుగుపడి ట్రాలీకి విద్యుత్ ప్రసారం కావడంతో సొమ్మసిల్లి పడిపోయారు. గ్రామంలో ప్రాథమిక చికిత్స చేయించడం తో కోలుకున్నారు. ముత్యంపేట, ముబరాస్‌పర్ గ్రామాల్లో పిడుగుపాటుతో 3 పశువులు మృత్యువాత పడ్డాయి. గొల్లపల్లిలో పిడుగుపడి 15 మేకలు మృతిచెందాయి. చేర్యాల మండలం గుర్జకుంటలో పిడిగుపడి 5 మేకలు మృత్యువాత పడ్డాయి.
జనగామ జిల్లాలో వడగండ్ల వాన
జనగామ జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. పలు చోట్ల వడగండ్లు పడ్డాయి. జనగామ జిల్లాలోని స్టేషన్ ఘన్‌పూర్, రఘునాథపల్లి, దేవరుప్పుల, జఫర్‌గఢ్, లింగాల ఘణపురం మండలాల్లో ఈ ప్రభావం కనిపించింది. ఈ గాలివాన కారణంగా కోతకు వచ్చిన వరి, మొక్కజొన్న పంటలు నేలావాలాయి. చాలా చోట్ల మామిడి తోటల్లో కాయలు నేల రాలడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మామిడి, అరటి తోటలకు నష్టం
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సోమవారం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఎర్రుపాలెం మండ లం బుచ్చిరెడ్డిపాలెం, నర్సింహాపురం, వెంకటాపురం, రాజుపాలెం, భీమవరం, మామునూరు, బనిగండ్లపాడు, జమలాపురంలో మామిడి తోటలు, వరి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. జమలాపురంలో ఓ రైతుకు చెందిన నాలుగెకరాల అరటి తోట నేలమట్టమైంది. కల్లాల్లో ఆరబెట్టిన మిర్చిని కాపాడుకునేందుకు రైతులు నానా పాట్లు పడ్డారు.
ఉమ్మడి నిజామాబాద్‌లో..
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలో, కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ప్రాంతంలో కురిసిన వడగండ్ల వానతో పంట నష్టం వాటిల్లింది. నువ్వులు, వరి, ఇతర పంటలు దెబ్బతిన్నాయి. తమను ఆదుకోవాలని పంటలు నష్టపోయిన రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
పిట్టల్లా రాలిన జనం: పిడుగులతో 6 మంది దుర్మరణం
Published Tue, Apr 13 2021 2:21 AM | Last Updated on Tue, Apr 13 2021 10:29 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment