మహారాష్ట్ర నుంచి తీసుకొస్తున్న రైతులు
పెరిగిన కూలి... కుంగదీస్తున్న అకాల వర్షాలు
పెరుగుతున్న తేమతో మద్దతు’పై గుబులు
సాక్షి, ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు మూడు వైపులా మహారాష్ట్ర సరిహద్దుగా ఉంది. స్థానికంగా కూలీల కొరత కారణంగా మహారాష్ట్ర నుంచి వేల సంఖ్యలో కూలీలు ఏటా పత్తితీత కోసం ఇక్కడకు వస్తారు. కిన్వట్ తాలుకా యేందా అనే గ్రామం నుంచే సుమారు 500 మంది కూలీలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పనిచేస్తున్నారు.
ఇలా మహారాష్ట్రలోని అనేక గ్రామాల నుంచి ఈ సమయంలో కూలి పనుల కోసం ఇక్కడకు వస్తారు. 40 రోజుల పాటు ఇక్కడే ఉండి పత్తి ఏరుతున్నారు. ఈ సమయంలో దంపతులిద్దరూ రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు సంపాదిస్తున్నట్టు కూలి పనులకు వచ్చిన గణేశ్ చెప్పాడు.
పెరిగిన కూలి
పత్తితీతకు కూలి పెరిగింది. గతేడాది కిలో ఏరితే రూ.7 చెల్లించేవారు. ఈ ఏడాది రూ.8కు పెంచారు. కొన్ని పరిస్థితుల్లో కూలీలు దొరకకపోతే రూ.9 కూడా ఇస్తున్నారు. ప్రస్తుతం వానాకాలం పత్తి పంటకు సంబంధించి మొదటి తీత మొదలైంది. పంట విస్తీర్ణం బట్టి రైతులు కూలీలను ఏర్పాటు చేసుకుంటున్నారు.
ఒక్కో కూలీ రోజు సుమారు 60 నుంచి 70 కిలోల వరకు పత్తి ఏరుతారని జామిడికి చెందిన రైతు నాగిరెడ్డి చెప్పాడు. స్థానిక కూలీలకు రోజువారి డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని, మహారాష్ట్ర కూలీలకైతే వారంవారం లేనిపక్షంలో మొత్తం పని అయిపోయిన తర్వాత వారు ఊరికి వెళ్లే సమయంలో తీసుకుంటారన్నాడు.
తాంసి మండలం పొన్నారి గ్రామం వద్ద ఓ రైతు రోడ్డు పక్కన నిల్చుండి ఆదిలాబాద్ నుంచి ఆటోలో రావాల్సిన కూలీల కోసం ఎదురుచూస్తున్నాడు. పత్తితీత కోసం ముందుగానే కూలీలను మాట్లాడుకున్నాడు. ఉదయం వారి కోసం ఎదురుచూస్తుండగా ఓ ఆటో ఆ గ్రామం దాటుకొని వెళుతోంది. దాంట్లో తాను మాట్లాడిన కూలీలే ఉండటంతో ఆటోను నిలిపాడు. కూలీలను ఆటో దిగి తన చేనులోకి రావాలని పిలిచాడు.
అయితే ఆ కూలీలు మరో ఊరిలో కూలి డబ్బు ఎక్కువ ఇస్తున్నారని, అక్కడకు వెళుతున్నామని చెప్పారు. అంతే కూలి తానే ఇస్తానని చెప్పి వారిని ఆటో దింపి తన చేనులోకి తీసుకెళ్లాడు. ప్రస్తుతం పత్తితీత కొనసాగుతుండగా, ఆదిలాబాద్ చుట్టుపక్కల గ్రామాల్లో కూలీల కోసం రైతులు పడుతున్న ఆవేదన అంతాఇంతా కాదు. ఆటోలను నిలిపి మరీ కూలీలను చేనులోకి తీసుకెళ్లేందుకు ఇలా పలువురు పడరాని పాట్లు పడుతున్నారు. ‘సాక్షి’బుధవారం పత్తి చేల పరిశీలనకు వెళ్లినప్పుడు ఈ దృశ్యం కనిపించింది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 11 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగవుతోంది. నల్లరేగడి భూముల్లో 8 నుంచి 10 క్వింటాళ్లు, చెలక భూముల్లో 6 నుంచి 8 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని రైతులు పేర్కొంటున్నారు. కొద్దిరోజులుగా స్వల్పంగా కురుస్తున్న అకాల వర్షాలతో రైతుల్లో మద్దతు ధరపై బెంగ నెలకొంది. నాణ్యమైన పత్తికి ప్రభుత్వ మద్దతు ధర రూ.7,521 ఉంది. ప్రైవేట్‌లో మాత్రం రూ.7వేల లోపే పలుకుతోంది.
వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్ తదితర జిల్లాల్లో సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోళ్లు ప్రారంభించింది. ఆదిలాబాద్‌లో శుక్రవారం నుంచి సీసీఐ కొనుగోళ్లు ప్రారంభించనుంది. అయితే పత్తిలో తేమ కారణంగా మద్దతు ధరలో కోత పెడతారన్న బెంగ ప్రస్తుతం పత్తి రైతుల్లో కనిపిస్తోంది. దీంతో గిట్టుబాటు ధర వస్తుందో.. లేదోనన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment