కర్నూలు (వైఎస్‌ఆర్ సర్కిల్): ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉక్కపోత.. తట్టుకోలేని ఎండ వేడిమి. సాయంత్రం అయితే ఒక్కసారిగా వాతావరణంలో మార్పు. తెలుపు రంగులోని మేఘాలు నలుపు రంగుంలోకి మారడం, చల్లని జల్లులుగా మొదలై భారీ వర్షం కురుస్తోంది. అదే సమయంలో ఫెళఫెళమంటూ ఉరుములు, కళ్లు మిరుమిట్లు గొలుపుతూ ఆకాశాన్ని చీల్చుకుంటూ భూమి వైపు దూసుకొస్తున్న మెరుపులు. ఆ మెరుపులే మృత్యు తీగలుగా మారుతున్నాయి. ప్రకృతి ప్రకోపానికి అభాగ్యులు బలవుతున్నారు. ప్రకృతి సిద్ధంగా రుతువుల ప్రకారం కురిసే వర్షాల సమయంలో మేఘాలు భూమికి చాలా ఎత్తులో ప్రయాణిస్తుంటాయి. ఆ సమయంలో వాటి మధ్య ఏర్పడే విద్యుత్ తరంగాలు ఉరుములు, మెరుపులుగానే బీభత్సం సృష్టిస్తాయి. ఇలాంటి సమయాల్లో పిడుగులు పడే అవకాశం అరుదు. అకాల వర్షాలు కురిసే సమయంలో మాత్రం మేఘాలు తక్కువ ఎత్తులో ఉంటాయి. ఈ సమయంలో వాటి నుంచి ఏర్పడే విద్యుత్ తరంగాలు భూమిని చేరుకుని పిడుగులుగా మారి ప్రాణాలను హరిస్తున్నాయి.
‘ఆపద్బంధువు’తో ఆసరా..
పిడుగు పాటుకు గురై ఎవరైనా మృతి చెందితే అపద్బంధు పథకం ద్వారా మృతుడి కుటుంబానికి రూ.50వేల ఆర్థిక సహాయం అందుతుంది. చాలా మంది గ్రామీణులకు ఈ విషయంపై అవగాహన లేక రెవెన్యూ , పోలీసు అధికారులకు సమాచారం ఇవ్వకనే దహన క్రియలు పూర్తి చేస్తున్నారు. 18 నుంచి 60 ఏళ్ల లోపు వ్యక్తి పిడుగుపాటుకు మృతి చెందితే వెంటనే వీఆర్వోకు సమాచారం అందించి ఆపద్బంధువు ద్వారా ఆర్థిక భరోసా పొందవచ్చు.
అధికారుల నిర్లక్ష్యం.. పేదల బతుకుల్లో విషాదం
♦ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చి ఎక్కడ, ఎప్పుడు.. పిడుగు పడుతుందనే సమాచారాన్ని విపత్తుల నివారణ శాఖ కచ్చి తంగా ముందుగానే ప్రకటిస్తున్నా స్థానిక అధికారులు చర్యలు తీసుకోవడం విఫలమవుతున్నారు. ముందుగానే చెప్పినట్లుగా జిల్లాలో పిడుగులు పడిన సందర్భాలు ఉన్నాయి. అయినా పిడుగుపాటుపై ప్రజల్లో అవగాహన కల్పించడంపై అధికారులు విఫలమవుతున్నారు. 15 రోజుల్లో జిల్లాలో నలుగురు మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అలాగే మేత కోసం మైదానం ప్రాంతానికి వెళ్లిన పశువులు పదుల సంఖ్యలో మృత్యువాత పడ్డాయి.
♦ ఏప్రిల్ 17వ తేదీన హాలహర్వి మండలంలో చింతకుంట గ్రామానికి చెందిన ఎర్రిస్వామి పొలం పనులకు వెళ్లి పిడుగుపాటుకు గురై దుర్మరణం చెందాడు. అదే రోజు హాలహర్వి మండలం హొళగుంద గ్రామానికి చెందిన ఈడిగ శేషన్న పిడిగుపాటుకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
♦ ఇదే నెల 22వ తేదీన నందికొట్కూరు నియోజ కవర్గం కొత్తపల్లె మండలం ముసళ్ల చెరువు గ్రామానికి చెందిన ఊసెన్న మృతి చెందాడు.
♦ 23వ తేదీన బనగానపల్లె సమీపంలో పిడుగు పడటంతో హుస్సేన్‌బాషా తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నాడు.
♦ మృతుల్లో అధిక శాతం మంది జీవనోపాధి నిమిత్తం పొలాలకు వెళ్లిన వారే. విపత్తుల నివారణ శాఖ సూచన మేరకు అధికారులు అప్రమత్త మై ప్రజల్లో అవగాహన కల్పిస్తే మృతుల సంఖ్యను తగ్గించే అవకాశం ఉంది.
అప్రమత్తతే ప్రాణాలకు రక్ష
♦ రెప్పపాటులో జరిగే ప్రమాదాన్ని అప్రమత్తతతోనే నివారించవచ్చు. పిడుగులు ఎప్పుడూ ఎత్తైన భవనాలు, స్తంభాలు, వృక్షాలపై పడే అవకాశం ఉంది. పిడుగులు పడే సూచనలు కనిపించినప్పుడు తప్పనిసరిగా ఎల్తైన వాటికి దూరంగా ఉండాలి.
♦ ఉరుముల సమయంలో తప్పించుకోవడానికి ఎక్కడా స్థలం లేకపోతే కిందకు వంగాలి. పొడువుగా మాత్రం పడుకోకూడదు.
♦ కూర్చొన్నప్పుడు పాదాల ముందు భాగం మాత్రం నేలను తాకాలి. మిగిలిన ఏ భాగం నేలను తాకకుండా జాగ్రత్త పడాలి.
♦ పాదాల మడమల రెండూ ఒకదానికొకటి తాకేలా ఉంచుకోవాలి. దీంతో పిడుగు పడినప్పుడు విద్యుత్ తరంగాలు శరీరంలోకి ఒక పాదం నుంచి రెండో పాదం ద్వారా భూమిలోకి ప్రవేశించే ఆస్కారం ఉండదు. దీంతో ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు.
♦ ఉరుములు, మెరుపుల సమయంలో సెల్‌ఫోన్‌లో మాట్లాడకూడదు. మేఘాల్లోని విద్యుత్ తరంగాలతో ఎలక్ట్రానిక్ పరికరాలు పేలుడుకు గురయ్యే ప్రమాదం ఉంది. గృహాల్లో టీవీలు, ్రíఫిజ్‌లు, ఇన్వర్టర్లు తదితర ఎలక్ట్రానిక్ పరికరాలకు విద్యుత్ కనెక్షన్ తొలగించాలి.
పిడుగంటే ?
ఆవిరి రూపంలో ఉన్న నీటితో కూడిన మేఘాలు పరస్పరం ఒకదానితో మరొకటి ఢీ కొనడంతో సంభవించేదే పిడుగు. రెండు మేఘాలు ఢీ కొన్న సమయంలో కలిగే ఒత్తిడిలో ఉత్పత్తి అయ్యే విద్యుత్ తరంగాల శక్తి లక్షల ఓల్టుల్లో, శబ్దం లక్షల డెసిబుల్స్‌లో ఉంటుంది. ఆ సమయంలో ఏర్పడే విద్యుత్, ధ్వని తరంగాలు భూమిపైకి చేరేందుకు వీలుగా సన్నటి మార్గం ఏర్పడుతుంది. ఆ మార్గం గుండా ధ్వని, విద్యుత్ తరంగాలు భూమిని చేరుతాయి. ఈ సమయంలో అవి ప్రవహించే మార్గంలో 50 వేల డిగ్రీల వేడి నమోదవుతోంది. అలా భూ ఉపరితలం మీద నుంచి భూమిలోకి వెళ్తాయి. ఇలా వెళ్లాలంటే వాటికి మరో సాధనం కావాలి. అవి ఎత్తయిన చెట్లు, ఇనుప స్తంభాలు, ఆలయాల్లోని ధ్వజస్తంభాలు వంటి వాటి ద్వారా ఈ విద్యుత్ తరంగాలు భూమిలోకి వెళ్తాయి. ఒక్కోసారి మైదాన ప్రాంతాల్లో కూడా విద్యుత్ తరంగాలు భూమిలోకి వెళ్లే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ సమయంలో అక్కడ ఉన్న ప్రజలు ప్రమాదానికి గురవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment