చినుకు.. కునుకు | Khariff problems with rains | Sakshi
Sakshi News home page

చినుకు.. కునుకు

Published Mon, Jul 3 2017 1:15 AM | Last Updated on Tue, Sep 5 2017 3:02 PM

చినుకు..  కునుకు

చినుకు.. కునుకు

కురవని మేఘాలు
► ఎండుతున్న పైర్లు
► ముందుకు సాగని ఖరీఫ్‌
►అయోమయంలో రైతన్న
► ఈ ఏడాది నష్టాలేనని పెదవి విరుపు


పైరు బతుకుతుందో లేదో?
మాకు రెండు ఎకరాల మెట్ట భూమి ఉంది. గత ఏడాది వర్షాభావంతో సాగు చేసిన కంది పూర్తిగా దెబ్బతినింది. పెట్టిన పెట్టుబడిలో 50 శాతం కూడా దక్కలేదు. ఈ సారైనా..వ్యవసాయం కలసివస్తుందనే అశతో ఖరీఫ్‌కు సిద్ధమయ్యాం. ఇంతవరకు వర్షాలు అంతంతమాత్రంగానే పడ్డాయి. పైరు మొలక దశలోనే ఎండిపోతోంది. బతుకుతుందో లేదో? – చిన్న చెంచన్న, నేరడుచెర్ల గ్రామం, ప్యాపిలి మండలం

కర్నూలు అగ్రికల్చర్‌ /పత్తికొండ రూరల్‌ : ముందస్తుగా ఊరించిన వర్షాలు ఆ తరువాత మొండికేశాయి. పలు మండలాల్లో ఇరవై రోజులుగా చినుకే కరువైంది. తొలకరి జల్లులతో పంటలు సాగు చేసుకున్న వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. భూమిలో తేమ శాతం లేకపోవడంతో మొలకదశలోనే పైర్లు వాడిపోతున్నాయి. జూన్‌ నెలలో 13 మండలాల్లో వర్షాలు అంతంతమాత్రంగానే కురిశాయి. వివిధ మండలాల్లో సాధారణం మేరకు వర్షాలు పడినప్పటికీ భూమిలో పదును శాతం తక్కువగా ఉంది.

గత ఏడాది జూన్‌ నెలలో సాధారణ వర్షపాతంకంటే 98 శాతం అధికంగా వర్షాలు కురిశాయి. గత ఏడాది ఇదే సమయానికి చెరువులు, కుంటలు, వాగులు, వంకలు నీటితో నిండి కళకళలాడుతూ కనిపించాయి. ఈ ఏడాది కూడా  జూన్‌ నెలలో సాధారణం కంటే ఎక్కువే వర్షాలు కురిసినా పలు మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. చెరువులు, కుంటలు, వాగులు, వంకలు..నీరు లేక వెలవెలబోతున్నాయి.

వేరుశనగ సాగుకు జూలై 15వరకు  అవకాశం ఉందని.. అంతవరకు విత్తనాలు పంపిణీ చేస్తామని వ్యవసాయ అధికారులు ప్రకటించారు. అయితే వర్షాలుకురవకపోవడంతో విత్తనాలకు డిమాండ్‌ అంతగా కనిపించడం లేదు. జిల్లాకు వేరుశనగ 60,600 క్వింటాళ్లు కేటాయించగా 36వేల క్వింటాళ్లు మాత్రమే పంపిణీ అయ్యాయి. జిల్లాకు బీటీ విత్తన ప్యాకెట్లు 10.15 లక్షలు కేటాయించగా..4లక్షల ప్యాకెట్లు మాత్రమే అమ్మకం అయ్యాయి.

వానలు తక్కువే.. ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో వర్షాలు తక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ చేస్తోంది. ఈ మేరకు ఎర్రనేలల్లో పత్తి వేయవద్దని వ్యవసాయ శాస్త్ర వేత్తలు సూచిస్తునఆనరు. వర్షాధారం క్రింద నల్లరేగడిలో మాత్రమే పత్తి సాగు చేయాలని సూచిస్తున్నారు. సాగు చేసిన వేరుశనగ, కంది, పత్తి పంటల్లో ఒకసారి గుంటెక పాయడం వల్ల పైపొర కదిలి బెట్టకు రాకుండా ఉంటాయని సలహాలు ఇస్తున్నారు.

నీటి పారుదల పరిస్థితి..
గత ఏడాది జూన్‌ నెలలో విస్తారంగా వర్షాలు పడటంతో జూలై నెలలోనే రైతులు వరి నారు పోసుకున్నారు. ఈ సారి వర్షాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. దీంతో ఆయకట్టు సాగుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేసీ కెనాల్‌ కింద 1,21,678 హెక్టార్లు, బోర్లు, బావులు కింద 1,14,703 హెక్టార్లు, లిప్ట్‌ ఇతర నీటి వసతి కింద 20,278 హెక్టార్ల భూములు ఉన్నాయి. వర్షాలు అంతంతమాత్రంగా ఉండటంతో ఆయకట్టు సాగు కలసి వస్తేందా లేదా అనేది ప్రశ్నార్థకం అవుతోంది.  

ఈయన పేరు కాలయ్య ఆచారి. పత్తికొండ–రాతన పొలాల్లో సొంత పొలం 2ఎకరాలు ఉండగా 18ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. ముందస్తు వర్షాలతో 12ఎకరాల్లో పత్తి  సాగు చేశాడు. విత్తనాలు, సేద్యపు పనులకు,  కూలీలకు ఎకరాకు రూ.5వేల ప్రకారంగా 12ఎకరాలకు రూ.60వేలు పెట్టుబడి పెట్టాడు. పైరు మొలకెత్తిన తరువాత వానలు లేక మొక్కలు వాడుముఖం పట్టాయి. వాన కోసం ఈ రైతు ఆశగా ఆకాశం కేసీ ఎదురు చూస్తున్నాడు.

పదును ఆరుతోంది:
నాకున్న 6 ఎకరాల పొలంలో పత్తి పంట వేశాను.  విత్తనాలు, కూలీలకు రూ. 30వేల వరకు పెట్టుబడి పెట్టాను. మేఘాలు ఊరిస్తున్నాయి గానీ వర్షం మాత్రం రావడం లేదు. మొలకదశలోనే పైర్లు ఎండిపోతున్నాయి.  ఇరవై రోజులుగా చినుకు జాడ లేదు. భూమిలో తేమ తగ్గి పదును అరుతోంది. - గజ్జికాశీనాథ్, రైతు, పుచ్చకాయలమాడ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement