చాగలమర్రి మండలంలో కూలిన విద్యుత్ స్తంభం
కర్నూలు ,చాగలమర్రి: మండల పరిధిలోని సోమవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. పెనుగాలి తీవ్రత కారణంగా చెట్లు, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు కూలిపోవడంతో జనజీవనానికి అంతరాయం ఏర్పడింది. పెద్దబోధనం విద్యుత్ ఉప కేంద్రం పరిధిలోని నేలంపాడు, ఆవులపల్లె, గొట్లురు గ్రామాల్లో ట్రాన్స్ ఫార్మర్లు నేలకూలాయి. వందకు పైగా విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో ఆయా గ్రామాల్లో సరఫరాకు అంతరాయం ఏర్పడి అంధకారం నెలకొంది. మోటార్లు పనిచేయకపోవడంతో నీటి సరఫరా నిలిచిపోయి ఇబ్బందులు పడ్దారు. శెట్టివీడు గ్రామ పరిధిలో మునగ చెట్లు కూలిపోవడంతో తీవ్రంగా నష్టపోయామని బాధిత రైతులు వాపోయారు. పలు గ్రామాల్లో గాలి కారణంగా గడ్డి వాములు చెల్లా చెదరయ్యాయి. వరిగడ్డి.. వర్షం కారణంగా తడిచిపోవడంతో పనికి రాకుండా పోయిందని రైతులు తెలిపారు. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు కూలిపోవడంతో సంస్థకు రూ.20 లక్షల నష్టం వాటిల్లిందని ఆ శాఖ అధికారులు తెలిపారు.
ఉయ్యాలవాడ: మండల పరిధిలో సోమవారం సాయంత్రం కురిసిన అకాల వర్షం కారణంగా రైతులకు నష్టం వాటిల్లింది. కుందూనది తీరం వెంట సాగు చేసిన రెండవ విడత వరి దిగుబడులు కల్లాల్లో ఉండగానే వర్షం రావడంతో తడిచిపోయాయని రైతులు తెలిపారు. మండల పరిధిలోని ఇంజేడు, సుద్దమల్ల, నర్సిపల్లె, అల్లూరు తదితర గ్రామాల్లో ధాన్యం దిగుబడులు తడిచిపోవడంతో రైతులు నష్టపోయారు.
కొలిమిగుండ్ల: మండల పరిధిలో సోమవారం గాలివాన బీభత్సం సృష్టించింది. పెనుగాలుల ఉద్ధృతి కారణంగా ప్రజలు భయాందోళనకు గురయ్యారు. మండల పరిధిలోని పెద్ద వెంతుర్ల గ్రామంలో విద్యుత్ స్తంభం కూలిపోయింది. విద్యుత్ తీగలు వీధుల్లో పడ్డాయి. అయితే ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఎస్సీ కాలనీలో ఓ పశువుల కొట్టంపై చెట్టు విరిగిపడింది.
ఆళ్లగడ్డ రూరల్: పట్టణంతోపాటు పరిసర గ్రామాల్లో సోమవారం సాయంత్రం వర్షం కురిసింది. చిన్నపాటి చినుకులతో మొదలైన వానకు గాలి కూడా తోడు కావడంతో ఉద్ధృతి తీవ్రమై జనజీవనానికి ఇబ్బంది కల్గింది. జాతీయ రహదారిపై వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాహనదారులు ఎక్కడికక్కడే రోడ్డు పక్కగా నిలిపివేసి గాలి తగ్గిన తర్వాత వెళ్లిపోయారు. పేరాయిపల్లె, నల్లగట్ల, గోపాలపురం తదితర గ్రామాల్లో ఓ మోస్తరు వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది.
ఉద్యాన పంటలకురూ.1.27 కోట్ల నష్టం
కర్నూలు(అగ్రికల్చర్): రెండు, మూడు రోజులుగా గాలివాన తీవ్రత కారణంగా జిల్లావ్యాప్తంగా 31.9 హెక్టార్లలో పండ్లతోటలకు నష్టం వాటిల్లింది. జిల్లాలో మొత్తంగా రూ.1.27 కోట్ల నష్టం జరిగినట్లు ఉద్యాన అధికారులు ప్రకటించా రు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక పంపించారు. నంద్యాల డివిజన్‌లోని ఓర్వకల్లు, ఆత్మకూరు, శిరివెళ్ల, చాగలమర్రి మండలాల్లో 29.2 హెక్టార్లలో పండ్లతోటలు దెబ్బతిన్నాయి. 9.6 హెక్టార్లలో అరటి, 18.2 హెక్టార్లలో మామిడి, 1.4 హెక్టార్ల నిమ్మ తోటలకు నష్టం వాటిల్లిందని ఉద్యానశాఖ నంద్యాల ఏడీ రమణ తెలిపారు. అరటికి రూ.38.4 లక్షలు, మామిడికి రూ.78.8 లక్షలు, నిమ్మకు రూ.4.20 లక్షల నష్టం జరిగినట్లు నివేదిక పంపించారు. కర్నూలు డివిజన్ తుగ్గలి మండలంలోని కడమకుంట్ల గ్రామంలో 2.5 హెక్టార్లలో అరటి పంట దెబ్బతినింది. రూ.12.5 లక్షల నష్టం జరిగినట్లు కర్నూలు ఉద్యానశాఖ ఏడీ రఘునాథరెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment