
మృతదేహాల వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు
చిత్తూరు, శ్రీకాళహస్తి: తోడ పుట్టకపోయినా వారు ముగ్గురూ వరసకు అన్నదమ్ములు.. అంతకుమించి ప్రాణ స్నేహితులు.. కష్టమైనా సుఖమైనా పంచుకునేవారు. ఎక్కడికైనా కలిసే వెళ్లేవారు.. ఆఖరుకు మృత్యువు దగ్గరకూ కలిసే వెళ్లిపోయి పుట్టెడు విషాదాన్ని నింపారు. గురువారం రాత్రి భయానక వాతావరణంలో పిడుగుపాటుతో ముగ్గురూ విగతజీవులయ్యారు. ఈ దుర్వార్తతో తొట్టంబేడు మండలం ఎగువ సాంబ య్యపాళెం శోకంలో మునిగిపోయింది.
తొట్టంబేడు మండలం ఎగువ సాంబయ్యపాళెం గ్రామానికి చెందిన దగ్గొలు మునేంద్రరెడ్డి(23), దగ్గొలు దశర«థరెడ్డి (28), దగ్గొలు గురవారెడ్డి(42) చిన్నాన్న, పెద్దన్నాన్న పిల్లలు. వీరంతా వివాహితులే. ముగ్గురికీ పిల్లలున్నారు. వీరి అనుబంధం చూసి గ్రామస్తులు ముచ్చటపడేవారు. కొద్దిపాటి భూమి సాగు చేసుకుంటూ బతుకునీడుస్తున్న ఈ చిన్నరైతులు పంటల్లేనప్పుడు కూలి పనులకు వెళ్లేవారు. కుటుంబ పోషణకు ఆర్థిక ఇబ్బందులు తప్పేవికావు. దాంతో గురవారెడ్డి గొర్రెలను కొని పెంచితే బాగుంటుందని భావించి సోదరులకు చెప్పాడు. వారిద్దరూ సరేనన్నారు. కూడబెట్టుకున్న రూ.80 వేలు తీసుకుని గురువారం సాయంత్రం ముగ్గురూ కేవీబీపురం మండలంలోని కంచనపల్లికి వెళ్లారు. పని పూర్తి చేసుకున్నారు.
తిరుగు ప్రయాణంలో గురువారం రాత్రి తమ ఇంట వివాహ వేడుక కోసం బహుమతి కొందామని కంచనపల్లి నుంచి శ్రీకాళహస్తి వచ్చారు. బహుమతి తీసుకుని పెళ్లికి బయలుదేరారు. రాత్రి 9 గంటలకు చెన్నై రోడ్డులోని ఆర్‌సీపీ స్కూల్ సమీపంలోకి చేరుకున్నారు. వర్షం జోరందుకోవడంతో చెట్టు కింద ఆగారు. ఇంతలోనే పిడుగు పడింది. ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇదే సమయంలో వీరి కుటుంబ సభ్యులంతా వివాహ వేడుకలో ఉన్నారు. వీరి కోసం రాత్రంతా చూశారు. తెల్లారేసరికి వీరి మృతదేహాలను స్థానికులు గుర్తించారు. విగత జీవులుగా పడి ఉన్న దశర«థరెడ్డి,మునేంద్రరెడ్డి, గురవారెడ్డిని చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. డీఎస్పీ వెంకటకిశోర్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.