పిడుగుపాటుకు మృతి చెందిన డిల్లు(ముభినా)
చిత్తూరు, ఎర్రావారిపాళెం : వేసవి దృష్ట్యా అయినవారింటికి వచ్చి పల్లెలో ఆనందంగా గడపాలనుకున్న ఓ మహిళను పిడుగు రూపంలో మృత్యువు కబళించింది. గ్రామస్తుల వివరాల మేరకు.. తిరుపతిరూరల్ సి.మల్లవరం గ్రామంలో ఉంటున్న ఎస్.మస్తాన్ భార్య ఎస్.డిల్లు(ముభినా)(35) గృహిణి. ఆమె భర్త గల్ఫ్‌లో ఉంటున్నాడు. వేసవిలో తన బంధువులతో కలసి ఆనందంగా గడపాలని డిల్లు ఆదివారం ఎర్రావారిపాళెం మండలం కోటకాడపల్లి పంచాయతీ చెంగాడివాండ్లపల్లికి చేరింది.
బంధువులతో కలసి సిద్ధలగండి చెరువు చూడటానికి వెళ్లింది. అందరూ కలిసి సరదాగా గడుపుతున్న సందర్భంలో ఈదురగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దాంతో తలదాచుకునేందుకు డిల్లు పక్కనే ఉన్న చెట్టు కిందికి చేరింది. ఇంతలో ఆమెకు సమీపంలో పిడుగు పడింది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. డిల్లు మృతితో చెంగాడివాండ్లపల్లిలో విషాదం నెలకొంది.
పిడుగుపాటుతో ఆవు మృత్యువాత..
మండలంలోని కోటకాడపల్లికి చెందిన కోటకొండ రమణకు చెందిన పాడిఆవు పిడుగుపాటుకు మృతిచెందింది. ఆవు వీఆర్‌కాలనీ సమీపంలో మేత మేస్తుండగా పిడుగుపడడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఆవు పూటకు 7లీటర్ల పాలు ఇస్తుందని, ఆవు మృతితో తన జీవనాధారం పోయిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment