
ఆకాశంలో ఉరుములతో కూడిన మెరుపులు
పశ్చిమ గోదావరి, తణుకు : కళ్లు మిరుమిట్లు గొలిపే వెలుగు.. తర్వాత చెవులు చిల్లులు పడే శబ్ధం.. జరిగే నష్టం స్వల్పమే అయినా దాని శక్తి అపారం. ఇప్పటివరకు దాని తాకిడి నుంచి బతికి బయట పడినవాళ్లు ఎవరూ లేరు. అంత భయంకరమైంది పిడుగు. గత రెండ్రోజులుగా మారిన వాతావరణ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా పిడుగులతో జిల్లా దద్దరిల్లిపోతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంటే జిల్లాలో సైతం 22 మండలాల్లో పిడుగుల ప్రభావం ఉందని వాతావరణ నిపుణులు గణాంకాలు చెబుతున్నారు. ఒక్క మంగళవారం రోజునే జిల్లాలోని పలు ప్రాంతాల్లో 768 పిడుగులు నేలను తాకినట్టు విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. బుధవారం అర్థరాత్రి సైతం పెద్ద ఎత్తున పిడుగులు భూమిని తాకాయి. గత రెండ్రోజులుగా జిల్లాలో ఈదురుగాలులు, అకాల వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో భారీ ఆస్తినష్టం జరగ్గా అయిదుగురు మృత్యువాత పడగా మరికొన్ని మూగజీవాలు చనిపోయినట్టు తెలుస్తోంది. ఏటా పిడుగు పాటుకు ప్రపంచ వ్యాప్తంగా 24 వేల మంది చనిపోతుండటంతో పాటు 2 లక్షలపైగా గాయపడుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయంటే వీటి తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
పిడుగు అంటే..
సాధారణంగా మేఘాల్లో ధన, రుణ దిశల్లో విద్యుత్ ఆవేశం ఒకదానితో ఒకటి సంఘర్షించిన తర్వాత ఏర్పడే శక్తి భూమిమీదకు ప్రవహించడమే పిడుగు అంటారు. రుతుపవనాల కారణంగా ఏర్పడే మేఘాలు విపరీతమైన వేగంతో ప్రయాణిస్తుంటాయి. వర్షించడానికి మేఘాల్లో ఉండే పీడనం అది ప్రయాణించే వేగానికి అమితమైన శక్తిని పుంజుకుంటుంది. ఇది మరో మేఘాన్ని తాకినప్పుడు ఈ రెండు శక్తులు ఢీకొని అమితమైన వెలుగుతో పాటు శక్తిని వెదజల్లుతుంది. వెలుగు ద్వారా ప్రయాణించే శక్తి భూమిని తాకడాన్నే పిడుగుపాటుగా పిలుస్తుంటారు. పిడుగుపాటు ఎంత తీవ్రంగా ఉంటుందంటే అందులో ఉండే విద్యుత్ ఆవేశం వల్ల గాలిలో ఏర్పడే ఉష్ణం 54 వేల డిగ్రీల ఫారెన్ హీట్ డిగ్రీలు ఉంటుంది.
భూమి మీద నుంచి వేడి, తేమగాలులు అలలుగా ఆకాశాన్ని చేరతాయి. ఆ అలలు ఆకాశంలో చల్లబడి మేఘాల్లో చేరతాయి. ఈ మేఘాలు తేమగాలులతో బరువెక్కిన తర్వాత వీటి ప్రయాణంలో వేగం పెరుగుతుంది. ఈ ప్రయాణ సమయంలోనే భూమి గురుత్వాకర్షణశక్తి గాలి ఒత్తిడికి విద్యుత్ ఆవేశం పొందుతాయి. ఇవి ఒకదానికొకటి సంఘర్షించినప్పుడే ఆకాశంలో కొన్నివేల కోట్ల కెమెరాల ఫ్లాష్ వెలుగు ఒకేసారి వెలిగిదాని కంటే వేల కోట్ల రెట్టింపు వెలుగుతో పిడుగులు ఏర్పడతాయి. మెరుపు మెరిసినప్పుడు 30 వేల డిగ్రీల ఉష్ణం విడుదల కావడంతో గాలి వేగంగా వ్యాకోచిస్తుంది. ఇలా అత్యధిక వేడితో ముందుగా మెరుపులు తర్వాత ఉరుములు వస్తుంటాయి. ఇవే పిడుగుల రూపంలో నేలమీద పడి విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. సాధారణంగా మనకు కనిపించే మేఘాలు రెండు రకాలుగా ఉంటాయి. పైన ఉన్న భాగం పాజిటివ్ ఛార్జ్‌తో ఉంటే కింద ఉన్న మేఘం నెగెటివ్ ఛార్జ్‌తో ఉంటాయి. ప్రతి మేఘం పాజిటివ్, నెగెటివ్ ఛార్జ్‌లతో నిర్మితమవుతుంది. ఇలా నెగెటివ్ ఎనర్జీ.. పాజిటివ్ ఎనర్జీతో భూమి మీద కలిస్తే పిడుగుగా మారుతుంది.
క్యుములో నింబస్‌తోనే..
జిల్లాలో గత కొద్ది రోజులుగా ఎండ తీవ్రతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో రెండ్రోజులుగా వాతావరణంలో ఆనూహ్య పరిణామాలు చోటు చేసుకోవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. మరోవైపు క్యుములో నింబస్ మేఘాల కారణంగానే ఉరుములతోపాటు పిడుగులు పడుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ మేఘాలు ఏర్పడే అవకాశం ఉందని అందరూ జాగ్రత్తగా ఉండాలని వారంటున్నారు. పిడుగులు అత్యధిక వేడితో భూమి మీద పడుతుంటాయి. పిడుగు నేరుగా మనిషిపై లేదా జంతువులపై పడితే మాడిమసైపోవడం ఖాయం. గతంలో తీపర్రు ఇసుక ర్యాంపులో పిడుగు పడటంతో ఐదుగురు వ్యక్తులు తీవ్ర గాయాలపాలయ్యారు. తాజాగా పిడుగుల ధాటికి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. పిడుగులు సాధారణంగా ఎత్తయిన భవనాలు, పెద్ద చెట్లుపై పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
పిడుగు పడినప్పుడు చేయకూడనివి
పిడుగులు పడుతున్నప్పుడు చేయకూడని పనులు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా పిడుగు పడుతున్నప్పుడు ల్యాండ్ ఫోన్ మాట్లాడకూడదు. పిడుగు దగ్గర్లోని టెలిఫోన్ స్తంభాన్ని తాకే అవకాశం ఉంటుంది. దాని నుంచి విడుదలైన శక్తి మన శరీరాన్ని కూడా తాకుతుంది. పిడుగులు పడుతున్న సమయంలో టీవీ చూడకూడదు. ముందుగా స్విచ్‌బోర్డు నుంచి అన్ని ప్లగ్‌లు తీసివేయాలి. లేకపోతే ఎలక్ట్రిక్ వస్తువులన్నీ పాడయ్యే అవకాశం ఉంది. పిడుగు పడే సమయంలో షవర్ కింద స్నానం చేయడం.. టాప్ కింద చేతులు కడగటం.. పాత్రలు కడగటం వంటివి చేయకూడదు. ఇంటి కిటికీలు, తలుపుల వద్ద నిలబడకూడదు.
ఒకవేళ బయట ఉంటే చెట్లు, కరెంటు స్తంభాల కింద మాత్రం ఉండకుండా జాగ్రత్త పడాలి. ఇవి పిడుగులను సులువుగా ఆకర్షిస్తాయి. పిడుగులు పడుతున్న సమయంలో వర్షంలో గొడుగు వాడకూడదు. ఒకవేళ కారులో ప్రయాణిస్తే ఎఫ్‌ఎం ఆన్ చేయకూడదు.
Comments
Please login to add a commentAdd a comment