పిడుగు పాటు సమయంలో వచ్చే మెరుపులు..
పరిగి : వర్షాకాలం వచ్చిందంటే చాలు ఏటా జిల్లాలో పదుల సంఖ్యలో పిడుగు పాటుకు గురై మృత్యువాత పడుతున్నారు. అనుకోకుండా వచ్చి పడే భయోత్పాతానికి బలవుతున్నవారిలో రైతన్నలు, పశువుల కాపరులే ఎక్కువ శాతం ఉంటున్నారు. ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో పడే పిడుగుల కారణంగా ఏడాదికి 24 వేల మంది మృత్యువాత పడుతుండగా మరో రెండు లక్షల మంది వరకు గాయాలపాలవుతున్నట్లు ప్రపంచ ప్రకృతి వైపరీత్యాల గణాంకాలు చెబుతున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సెకనుకు 100కు పైగా పిడుగులు పడుతున్నట్లు అంచనా వేస్తున్నారు. అయితే ఉరుములు..మెరుపులు వచ్చే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం.. అప్రమత్తంగా ఉండటం వల్ల పిడుగు పాటు నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. పోలీసులు పిడుగు పాటు అంశంపై ఓ వీడియోనూ రూపొందించి అవగాహన కల్పిస్తున్నారు.
సూర్యుని ఉపరితల ఉష్ణోగ్రత కంటే ఐదు రెట్లు అధికం..
పిడుగు పాటు విషయంలో ప్రధానంగా పల్లెటూర్లలో అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. దేవదానవ యుద్ధం కారణంగా ఇలా ఉరుములు, మెరుపులు వస్తాయని.., అయితే మెరుపులు వచ్చే సమయంలో అర్జున..ఫాల్గున అంటే వారు మనల్ని పిడుగుల బారి నుంచి రక్షిస్తారని పెద్దలు చెబుతూ ఉండటం మనందరికి తెలిసిందే... అయితే పిడుగు పడినప్పుడు ఉత్పన్నమయ్యే ఉష్ణోగ్రతలు మామూలు ఉష్ణోగ్రతకు ఐదు రెట్లు ఉంటాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. నిరంతరం మండుతున్న అగ్నిగోళంగా చెప్పుకునే సూర్యుని ఉపరితలంపై 5700 సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. కానీ పిడుగు పడినప్పుడు ఉత్పన్నమయ్యే ఉష్ణోగ్రత సూర్యుని ఉపరితల ఉష్ణోగ్రతకు సుమారు ఐదు రెట్లు అధికంగా అంటే 29000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుందట...
అసలు పిడుగు అంటే ఏమిటి...
మేఘాల వద్ద ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటం వల్ల నాటి ఆవిరి చిన్న చిన్న నీటి బిందువుల రూపంలో ఉంటుంది. ఇదే సమయంలో విపరీతమైన గాలులు వీచినప్పుడు ఆ మంచు కణాలు, నీటి బిందువుల మధ్య రాపిడి జరిగి ఎలక్ట్రికల్ చార్జి ఉత్పన్నమవుతుంది. దీంతో పాజిటివ్.. నెగెటివ్ చార్జి ఉన్న కణాలు విడుదల అవుతాయి. వీటిలో పాజిటివ్ చార్జి కణాలు తేలికగా ఉండటం వల్ల అవి మేఘంలోని పై భాగానికి..
అలాగే నెగెటివ్ కణాలు బరువుగా ఉండటం వల్ల కింది భాగానికి చేరుకుంటాయి. ఇప్పుడు అవి అయస్కాంతంలోని ఉత్తర దక్షిణ ధృవాలు ఎలా ఆకర్షించుకుంటాయో అలాగే అక్కడ జరుగుతుంది. రెండు వేర్వేరు మేఘాలు దగ్గరగా వచ్చినప్పుడు.. పై మేఘంలో ఉండే నెగెటివ్ చార్జ్ కణాలు..కింద మేఘంలో ఉన్న పాజిటివ్ చార్జి కణాల మధ్య రాపిడి జరుగుతుంది. దీంతో ఆ రెండింటి మధ్య మెరుపు. (విద్యుత్తు).. ఉరుము(శబ్దం) ఉత్పన్నమవుతాయి.
ఈ సమయంలోనే మేఘంలోని కింది భాగంలో ఉండే నెగెటివ్ చార్జి కణాలు భూ ఉపరితలంపై ఉండే పాజిటివ్ చార్జి కణాల చేత ఆకర్షించబడతాయి. ఇలా నెగెటివ్ చార్జి కణాలు భూమిని చేరే క్రమంలో మేఘాల్లో రాపిడికి ఉత్పన్నమైన విదుత్తు భూమిని చేరుతుంది. దీన్నే మనం పిడుగు అంటాం.. ప్రధానంగా ఈ నెగెటివ్ చార్జి కణాలు భూమిని చేరే క్రమంలో ఎత్తయిన ప్రదేశాలు.. చెట్లు, కొండలు, మనుషులు, జంతువులను ఎంచుకుని వాటి ద్వారా భూమిని చేరుతాయి. ఆ చేరే క్రమంలో ఆ కణాలు దేని ద్వారా చేరితే..అవి మసి అయిపోతూ ఉండటం మనం చూస్తుంటాం...
ఈ జాగ్రత్తలు తీసుకోవాలి....కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటం వల్ల పిడుగు పాటు నుంచి బయటపడవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
* ఉరుములు, మెరుపులు పిడుగులు పడే సమయంలో ల్యాండ్‌లైన్ ఫోన్ మాట్లాడకూడదు.
* ల్యాండ్‌లైన్ ఫోన్‌కు బదులు కార్డ్‌లెస్ ఫోన్‌గానీ, సెల్ ఫోన్‌గానీ వాడవచ్చు. అదీ ఇంట్లో ఉండిమాత్రమే.
* ఉరుములు, మెరుపుల సమయంలో టీవీ చూడటం ప్రమాదం. ఇంకా చెప్పాలంటే స్విచ్‌బోర్డుల నుంచి ప్లగ్‌లు తీసి వేయాలి. లేదంటే ఎలక్ట్రిక్ వస్తువులన్నీ పాడయ్యే ప్రమాదముంది.
* ఉరుములు, మెరుపుల సమయంలో ట్యాప్ కింద చేతులు కడగటం, గిన్నెలు కడగటం, షవర్ కింద స్నానం చేయటం లాంటివి చేయకూడదు.
* ఇంటి కిటికీలు, తలుపుల దగ్గర నిల్చోవటం. వాటి దగ్గర నిల్చుని బయటకు చూడటం మంచిది కాదు.
* ఉరుములు, మెరుపుల సమయంలో బయట ఉంటే షెల్టర్ వెతుక్కోవాలి. కానీ చెట్ల కిందకి మాత్రం ఎట్టి పరిస్థితిలో వెళ్లకూడదు. ఎందుకంటే చెట్లు, కరెంటు స్తంభాలు పిడుగులను సులువుగా ఆకర్షిస్తాయి. అందుకే చెట్లపైన ఎక్కువగా పిడుగులు పడే ప్రమాదం ఉంది.
* పిడుగులు పడే సమయంలో వర్షంలో తడిసినా పరవాలేదు.. కానీ గొడుగు వాడకూడదు. దగ్గరలో కారు ఉంటే..ఏదైనా షెడ్డు ఉన్నా దాంట్లో కూర్చోవచ్చు. ఎఫ్‌ఎం రేడియో వినకూడదు..
* ఎక్కడా షెల్టర్ దొరక్కుంటే ఎత్తు తక్కువగా ఉండే ప్రదేశాల్లో కూర్చుని తలకిందకు వంచి చెవులు, కళ్లు మూసుకుని కూర్చోవాలి.
* పెంపుడు జంతువులైన ఆవులు, గేదెలు, కు క్కలు లాంటి వాటిని బయట వదిలేయకుం డా షెడ్లలో ఉంచాలి. లేదంటే బయట ఉంటే చెట్లకిందకు వెళ్లకుండా చూసుకోవాలి.
* ఉరుములు, మెరుపుల సమయంలో మన శరీరం జలదరింపుకు గురి కావటం, వెంట్రుకలు నిక్కబొడుచుకోవటం లాంటి సంకేతాలు పిడుగులు పడే సమయంలో కనిపిస్తాయి. ఇలా జరిగితే పిడుగు మీ దగ్గరలో పడుతున్నట్లు అర్థం. అప్పుడు మరింత అప్రమత్తం కావాలి.
Comments
Please login to add a commentAdd a comment