Rain season
-
వానాకాలం..వ్యాధులు ప్రబలే కాలం..మీ పిల్లలు జరభద్రం!
వానల్లో... మొన్నటిదాకా మండించిన ఎండలు ఇప్పుడు చల్లటి వర్షాలను తీసుకువచ్చాయి. వర్షాకాలం అంటే ఇష్టం లేనిదెవరికి? ముఖ్యంగా పిల్లలకు మరీ ఇష్టం. ఎందుకంటే కాస్త గట్టి వానలు పడితే సెలవలు వస్తాయి. ప్రస్తుతం తెలంగాణ అంతా భారీ వర్షాల కారణంగా అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. ఆంధ్రాలో కూడా కొన్ని ప్రాంతాలలో వానాకాలం సెలవలే. సెలవల వరకు బాగానే ఉంది కానీ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవలసిన పెద్దలకు మాత్రం కాస్త కష్టమే. ఆ మాటకొస్తే అంటువ్యాధులు ప్రబలే ఈ కాలంలో పెద్దవాళ్లు కూడా జాగ్రత్తగా ఉండాల్సిందే. ఆ జాగ్రత్తలేమిటో చూద్దాం... వానరాకడా... మరొకటీ తెలియదని సామెత. ఒక్కోసారి మబ్బులు పట్టిన ఆకాశం ఉరుముతూ వర్షాలకు సిద్ధంగా ఉండమని హెచ్చరిస్తుంది. ఒకోసారి ఏవిధమైన హెచ్చరికలూ చేయకుండానే వర్షం వచ్చి మీదపడుతుంది. అందువల్ల వాతావరణ హెచ్చరికల గురించి తెలుసుకోవడం మంచిది. తగిన దుస్తులు: వర్షాకాలంలో పిల్లలే కాదు, ఎవరైనా సరే, తేలికగా ఆరిపోయే దుస్తులు ధరించడం మంది. తేలికపాటి దుస్తులను పిల్లలకు ధరింపజేయాలి. అసౌకర్యం, చికాకు కలిగించే దుస్తులను ఈ కాలంలో వారికి తొడగకపోవడం చాలా మంది. పాదరక్షల ఎంపిక: వర్షాకాలంలో మీ పిల్లలకు తగిన పాదరక్షలను ఎంచుకోండి. తడి ఉపరితలాలపై జారకుండా నిరోధించడానికి మంచి ట్రాక్షన్‌తో ఉండే వాటర్‌ప్రూఫ్ బూట్లు లేదా చెప్పులను ఎంచుకోండి. దోమల నుంచి రక్షణ: వర్షాకాలంలో దోమల వల్ల వచ్చే వ్యాధులు ఎక్కువగా ఉంటాయి. దోమల నిరోధకాలను లేదా దోమతెరలను ఉపయోగించడంతోపాటు ఇంటి చుట్టూ దోమలకు సంతానోత్పత్తి కేంద్రాలుగా వరే నీటి వనరులు ఉండకుండా చూసుకోవడం మంచిది. పరిశుభ్రత పద్ధతులు: పిల్లలకు మంచి పరిశుభ్రత అలవాట్లను నేర్పాలి. క్రమం తప్పకుండా చేతులు శుభ్రంగా కడుక్కోవడాన్ని నొక్కి చెప్పండి, భోజనానికి ముందు, టాయిలెట్ తర్వాత చేతులు శుభ్రం చేసుకోవడం అంటువ్యాధుల వ్యాప్తిని నిరోధించడంలో సహాయపడుతుంది. నీళ్లు నిలవకుండా చూసుకోవాలి ఇంటి ఆవరణలో నిలిన నీరు, నీటి కుంటలు లేదా మురికి గుంటలు ఉన్న ప్రదేశాలలో ఆడుకోవడం వల్ల కలిగే ప్రమాదాల గురిం పిల్లలకు అవగాహన కల్పించండి. అటువంటి నీటిలో వ్యాధులకు కారణమయ్యే హానికరమైన బ్యాక్టీరియా, వైరస్లు ఉంటాయి కాబట్టి నిల్వ ఉన్న నీటి లో ఆడకుండా చూడండి. ఆహార భద్రత: వర్షాకాలంలో ఆహార పరిశుభ్రతపై అదనపు శ్రద్ధ అవసరం. స్ట్రీట్ ఫుడ్ లేదా అపరిశుభ్రంగా ఉన్న ప్రదేశాలలో నిల్వ ఉండే ఆహారం తీసుకోకుండా చూడాలి. పండ్లు, క్యారట్, బీట్రట్ వంటి పచ్చి కరగాయలను తినేముందు శుభ్రంగా కడుక్కోవడం తప్పనిసరి చేయడం అవసరం. తగినంత వెంటిలేషన్: భారీ వర్షాల సమయంలో కిటికీలు మూసి ఉంచడం చాలా కీలకమైనప్పటికీ, మీ ఇంటిలో సరైన వెంటిలేషన్ ఉండేలా చూసుకోవడం తేమ పెరగకుండా నిరోధించడానికి, ఆరోగ్యకరమైన ఇండోర్ వాతావరణాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది. అలర్జీలు, ఆస్తమా నిర్వహణ: మీ పిల్లలకు అలర్జీలు లేదా ఆస్తమా ఉన్నట్లయితే, వర్షాకాలం వారి ఇబ్బందులను మరింత తీవ్రతరం చేస్తుంది. ఇలాంటప్పుడు ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో ముందుగానే మీ ఫ్యామిలీ డాక్టర్‌ను అడిగి తెలుసుకోవడం, అవసరమైతే తగిన మందులను సిద్ధం చేసుకోవడం మంచిది. పరిశుభ్రమైన నీరు: కాచి చల్లార్చిన నీటిని తాగడం పిల్లలకే కాదు, పెద్దలకూ మంచిదే. రింగ్వార్మ్: ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఎరుపు, రింగ్–ఆకారపు దద్దురును కలిగిస్తుంది. దురద లేదా పొలుసులుగా ఉంటుంది. ఇది శరీరంలోని ఏ భాగానికైనా రావచ్చు, తలమీద, గజ్జల్లో , పాదాలపై సర్వసాధారణంగా ఉంటుంది. దీని బారినుంచి పిల్లలను రక్షించుకోవాలి. ఈ కాలంలో రోజువారీ తీసుకోవాల్సిన సూపర్‌ఫుడ్ మారుతున్న సీజన్‌తో, ఆహార శైలులను కూడా మార్చడం అత్యవసరం. వ్యాధులు పెరుగుతున్న సమయంలో కొన్ని ఆహారాలు, సుగంధ ద్రవ్యాలను తీసుకోవాలి. పసుపు కలిపిన పాలు, శొంటి కషాయం, విటమిన్ సి అధికంగా ఉండే ఆహారం, మొలకలు వంటి ఆరోగ్యకరమైన రుతిండి ఇవ్వాలి. పెరుగు వంటి ప్రోబయోటిక్స్ పిల్లల్లో మం బ్యాక్టీరియాను పెంచటానికి సహాయపడుతుంది. ఇది చెడు బ్యాక్టీరియా లేదా వ్యాధిని కలిగించే బ్యాక్టీరియాలతో పోరాడటానికి సహాయపడుతుంది. ఆకుపచ్చ కరగాయలు పోషకాలతో నిండి ఉంటాయి. వెల్లుల్లి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అల్లంలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి కాబట్టి ఏదోరకంగా పిల్లలకు ఇవ్వాలి. తప్పనిసరిగా తీసుకోవలసిన జాగ్రత్తలు చర్మాన్ని శుభ్రంగా, పొడిగా ఉంచండి: ఈత లేదా స్నానం చేసిన తర్వాత పూర్తిగా శరీరాన్ని ఆరనివ్వటం మంచిది. (చదవండి: దెబ్బ తగిలిన ప్రతీసారీ టీటీ ఇంజెక్షన్ తీసుకోవాల్సిందేనా? ఎలాంటప్పుడూ అవసరం?..) -
వర్షాకాలంలో పెరుగుతున్న ఉష్ణతాపం.. వైజాగ్ వాసుల అవస్థలు
సాక్షి, విశాఖపట్నం: ప్రస్తుతం వర్షాకాలం నడుస్తోంది. కానీ వాతావరణం వేసవి అనుభూతిని కలిగిస్తోంది. ఒకపక్క ఉష్ణతాపం, మరోపక్క ఉక్కపోత వెరసి జనాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనాలు, వాయుగుండాల ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. ఆ సమయంలో చల్లదనం పరచుకుంటున్నా, అవి బలహీన పడ్డాక సూర్యుడు చుర్రుమంటున్నాడు. కొద్దిరోజుల నుంచి ఈ పరిస్థితులే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకంటే ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో వీటి తీవ్రత ఒకింత ఎక్కువగానే ఉంటోంది. కొన్నాళ్లుగా విశాఖపట్నంలో సాధారణం కంటే 2–4 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవి వేడిని వెదజల్లుతున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఆకాశంలో కొద్దిపాటి మబ్బులు కమ్ముకుంటున్నా వాతావరణంలో అంతగా చల్లదనం కనిపించడం లేదు. మేఘాలు కనుమరుగయ్యాక భానుడు ప్రతాపం చూపుతున్నాడు. కొద్దిపాటి సమయానికే సూర్య తాపం తీవ్రత పెరిగి చిర్రెత్తిస్తున్నాడు. మరోవైపు దీనికి ఉక్కపోత కూడా తోడవుతోంది. సాధారణంగా ఇతర ప్రాంతాలకంటే ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉక్కపోత అధికంగా ప్రభావం చూపుతుంది. వేసవిలో మరింత తీవ్రరూపం దాలుస్తుంది. కానీ ప్రస్తుతం వర్షాల సీజనే అయినా అధిక ఉష్ణోగ్రతలతో పాటు ఉక్కపోత కూడా కొనసాగుతోంది. ఫలితంగా జనానికి ముచ్చెమటలు పోస్తున్నాయి. దీంతో వేసవి సీజనులో మాదిరిగా పగలే కాదు.. రాత్రి వేళల్లోనూ ఇళ్లలో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలను విరివిగా వినియోగిస్తూ ఉపశమనం పొందుతున్నారు. ఇదీ కారణం.. కొద్దిరోజులుగా బంగాళాఖాతంలో అల్పపీడనాలు/ద్రోణులు గాని, ఆవర్తనాలు గాని లేవు. దీంతో వర్షాలు కూడా కురవడం లేదు. ప్రస్తుతం పశ్చిమం నుంచి తేమతో కూడిన గాలులు వీస్తున్నాయి. ఇలా విశాఖలో గాలిలో తేమ శాతం 60 నుంచి దాదాపు 90 శాతం వరకు ఉంటోంది. సాధారణంగా గాలిలో తేమ 50 శాతం ఉంటే ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. అంతకుమించితే ఉక్కపోత ప్రభావం మొదలవుతుంది. (క్లిక్: గిరిజనులకు పీఎంఏవై ఇళ్లు ఇవ్వండి) ఆకాశంలో మేఘాలు ఏర్పడుతున్నా అవి వచ్చి పోతున్నాయి తప్ప స్థిరంగా ఉండడం లేదు. దీంతో సూర్య కిరణాలు నేరుగా భూ ఉపరితలంపైకి ప్రసరిస్తున్నాయి. ప్రస్తుతం విపరీతమైన ఉక్కపోతకు గాలిలో అధిక తేమ, ఉష్ణోగ్రతలు పెరుగుదలకు మేఘాలు, వర్షాలు లేకపోవడం వంటివి కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితి బంగాళాఖాతంలో ఏదైనా అల్పపీడనం వంటిది ఏర్పడే వరకు కొద్దిరోజుల పాటు కొనసాగుతుందని వీరు పేర్కొంటున్నారు. (క్లిక్: గిరిజనులకు విలువిద్యలో శిక్షణ) -
వాన పాటకి చాన్స్ వస్తే కాదంటానా?
అలా కన్ను కొట్టి ఇలా ఫేమస్ అయిపోయారు ప్రియా ప్రకాశ్ వారియర్. తొలి సినిమా ‘ఒరు అడార్ లవ్’ ప్రచారంలో భాగంగా విడుదల చేసిన ఈ కన్ను కొట్టే సీన్ ఆమెకు ‘వింక్ బ్యూటీ’ అనే పేరు తెచ్చింది. ఈ కేరళ కుట్టి ఇప్పుడు తెలుగు సినిమాల్లోనూ నటిస్తున్నారు. ఇక.. ఈ బ్యూటీని ‘వానాకాలమ్’ ముచ్చట్లు అడిగి తెలుసుకుందాం. ► చిన్నప్పటి వర్షాకాలపు జ్ఞాపకాలు... వర్షాకాలం రాగానే కొత్త గొడుగు కొనడం నాకో సరదా. అది కూడా ట్రాన్స్ప్యారంట్ గొడుగు, రెయిన్ కోట్ కొనుక్కునేదాన్ని. ఆ గొడుగు, రెయిన్ స్లిప్పర్స్ వేసుకుని, స్కూల్ బస్ కోసం వెయిట్ చేసి, స్కూల్‌కి వెళ్లడం అంటే నాకు భలేగా ఉండేది. బస్ కోసం వెయిట్ చేస్తున్న సమయంలో వేరే వాహనాలు వెళ్లినప్పుడు మా యూనిఫామ్ మీద బురదనీళ్లు పడేవి. చిన్నప్పటి వర్షాకాలపు జ్ఞాపకాలంటే నాకివే. ఆ రోజులే వేరు. ► మామూలుగా పిల్లలను వర్షంలో తడవనివ్వరు. మరి.. మీ ఇంట్లో? వానలో తడిచినా ఏమీ అనేవాళ్లు కాదు. మా సొసైటీలో ఉండే పిల్లలమంతా వానలో తడుస్తూ ఆడుకునేవాళ్లం. వానలో తడుస్తూ దాగుడుమూతలు ఆడేవాళ్లం. చివరికి బ్యాడ్మింటన్ కూడా ఆడుకునేవాళ్లం. అయితే వానలో తడిచి, జ్వరం తెచ్చుకుంటే అప్పుడు తిట్లు పడేవి. ► కాగితపు పడవలు చేసేవారా? చేసేదాన్ని. అది మాత్రమే కాదు.. వర్షం నీళ్లను సీసాల్లో పట్టి, ఆడుకునేదాన్ని. ► చివరిసారిగా ఫుల్లుగా ఎప్పుడు తడిశారు? రష్యాలో... షాపింగ్ కోసం బయటకెళ్లాం. ఒక్కసారిగా బాగా వర్షం వచ్చింది. పరిగెత్తుకుంటూ పక్కనే ఉన్న చర్చిలోకి వెళ్లాం. అప్పటికే కొంచెం తడిసిపోయాం. ► వర్షాకాలం ఇష్టమేనా? చాలా. నేను మాన్సూన్ లవింగ్ పర్సన్‌ని. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి నా మూడ్ కూడా అలానే ఉంటుంది. మంచి మ్యూజిక్ వింటూ, ఎంజాయ్ చేస్తుంటాను. ► నచ్చే రెయినీ ఫుడ్? మా అమ్మగారు చేసే ఫుడ్ ఏదైనా ఇష్టమే. వాన అంటే మాత్రం న్యూడుల్స్ తినాల్సిందే. ► మరి.. వాన పాటల్లో నటించడం ఇష్టమేనా? నేను ఫిల్మీ పర్సన్. వాన పాటకి చాన్స్ వస్తే కచ్చితంగా చేస్తాను. అంతెందుకు.. షవర్ కింద నిలబడి దాన్నే వాన అనుకుని, ఎంజాయ్ చేస్తుంటాను. ఇక వాన పాట అంటే కాదంటానా? ► రెయినీ సీజన్లో వర్క్ చేయడం ఇష్టమేనా? అస్సలు ఇష్టం ఉండదు. ఇంటి నుంచి కాలు బయటపెట్టడానికి ఏమాత్రం ఇష్టపడను. ► నచ్చిన వాన పాట? చాలా పాటలు ఉన్నాయి. ఒక్క పాట అంటే చెప్పలేను. అయితే రెయినీ సీజన్లో మెలోడీ సాంగ్స్ వింటాను. రెయినీ సీజన్ కోసం ప్రత్యేకంగా నా ప్లే లిస్ట్‌లో కొన్ని పాటలు పెట్టుకున్నాను. అవి వింటుంటాను. ► వర్షాకాలంలో ఇబ్బందులకు గురైన సందర్భాలు... వ్యక్తిగతంగా నాకెలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదు. అయితే గతంలో కేరళలో వరదలు వచ్చినప్పుడు చాలా బాధపడ్డాను. దినదిన గండంలా గడిపారు. ఆ సమయంలో స్వయంగా క్యాంప్స్‌కి వెళ్లి నాకు చేతనైనంత సాయం చేశాను. ఇళ్లు కొట్టుకుపోవడంతో ఎక్కడ తలదాచుకోవాలో తెలీక వాళ్లు పడిన బాధ చూసి చలించిపోయాను. -
వానలకు పర్ఫెక్ట్ అవే
‘టిప్ టిప్ బర్సా పానీ’ పాట అంటే నభా నటేశ్‌కి చాలా ఇష్టం. అక్షయ్‌కుమార్, రవీనా టాండన్ తడుస్తూ పాడుకున్న వాన పాట ఇది. ఈ పాట అంటే నభాకి చాలా ఇష్టం కానీ వానలో తడవడం అంటే ఆమెకు కష్టం. మరి.. ఏడాదంతా దాదాపు వానలు చూస్తూ పెరిగితే అలానే ఉంటుంది. ఇక ‘వానాకాలమ్’ గురించి నభా నటేశ్ చెప్పిన విశేషాలు తెలుసుకుందాం. ► వర్షాలప్పుడు కాగితపు పడవలు చేసేవారా? కాగితపు పడవల ఎంజాయ్మెంట్ మిస్సయ్యేదాన్ని కాదు. ఇంటి దగ్గరే చిన్న స్ట్రీట్‌లో పడవలు వదిలేదాన్ని. అది కూడా నేను తడవకుండా. ► చివరిసారిగా ఫుల్లుగా ఎప్పుడు తడిశారు? ఓ సినిమా షూట్లో భాగంగా బాగా తడిశాను. కానీ సినిమా షూటింగ్ కోసం ఏర్పాటు చేసిన కృత్రిమ వర్షం అది. అయితే వర్షాల్లో తడవడం నాకు ఇష్టం ఉండదు. ► వర్షాకాలాన్ని ఎలా ఆస్వాదిస్తారు? రెయినీ సీజన్లో ఫుడ్‌ను బాగా ఎంజాయ్ చేస్తాను. పుట్టింది తినడం కోసమే అన్నట్లుగా తింటాను. మా అమ్మ చేసే ఫ్రైడ్ అండ్ స్పైసీ మిర్చి బజ్జీలు, కాఫీ నా ఫేవరెట్. వర్షం పడుతున్నప్పుడు ఇవి పర్ఫెక్ట్. ► వానా కాలంలో మీరు తీసుకునే జాగ్రత్తలు? చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటాను. కొంచెం తడిసినా నాకు వెంటనే జలుబు చేస్తుంది. అందుకే పెద్దగా తడవాలనుకోను. ఎప్పుడు బయటకు వెళ్లినా నా వెంట గొడుగును తీసుకుని వెళతాను. టిష్యూ పేపర్స్‌ను కూడా క్యారీ చేస్తుంటాను. ► ఈ సీజన్లో మీ డ్రెస్సింగ్ స్టయిల్ ఎలా ఉంటుంది? వర్షాకాలంలో బయటకు వెళితే ఎవరూ గుర్తుపట్టలేనంతగా నన్ను నేను కవర్ చేసుకుంటాను. స్వెటర్, షూస్, రెయిన్ కోట్, క్యాప్... ఇలా నా ముఖం తప్పు ఇంకేమీ కనిపించకుండా కవర్ చేసుకుంటాను. ► మామూలుగా పిల్లలను వర్షంలో తడనివ్వరు. మరి.. చిన్నప్పుడు మీ ఇంట్లో? వర్షాలు అప్పుడప్పుడూ అంటే ఓ మజా ఉంటుంది. కానీ మా ప్రాంతంలో ఎప్పుడూ అవే కదా. పైగా బాగా చలిగా ఉండేది. దాంతో నాకే బయటకు వెళ్లాలనిపించేది కాదు. మా అమ్మకు కోప్పడే పని తప్పింది (నవ్వుతూ). ► మరి.. వానపాటల్లో నటించడం మీకిష్టమేనా? పెద్దగా ఇష్టం లేదు కానీ వాన కురుస్తున్నప్పుడు ఇంట్లోనే ఉండి, రెయినీ సాంగ్స్‌కు డ్యాన్స్ చేయడం ఇష్టం. ► నచ్చిన వాన పాట? ‘టిప్ టిప్ బర్సా పానీ’ (అక్షయ్‌కుమార్, రవీనా టాండన్ నటించిన ‘మొహ్రా’ చిత్రంలోని పాట) అంటే చాలా ఇష్టం. ► చిన్నప్పటి వర్షాకాలపు జ్ఞాపకాలు... వర్షపాతం ఎక్కువగా నమోదయ్యే చిక్మగలూర్ నా స్వస్థలం. నా చిన్నతనంలో మాప్రాంతం ఎప్పుడూ చిత్తడి చిత్తడిగా ఉండేది. అంతా బురదమయం. వర్షాకాలంలో నేను నాలుగైదు రకాల స్లిప్పర్స్‌ను మార్చేదాన్ని. అందుకే ఈ సీజన్ అంటే నాకు పెద్దగా ఇష్టం ఉండదు. ఏదైనా పని కోసం బయటకు వెళ్లినప్పుడు వర్షంలో చిక్కుకుపోవాల్సి వస్తుంది. భారీ వర్షాలు కురిసినప్పుడు స్కూల్స్‌కు వారాల పాటు సెలవులు ఇచ్చేవారు. వర్షాకాలపు జ్ఞాపకాలంటే ఇబ్బందులు తప్ప తీపి అనుభూతులు ఏవీ లేవు. -
అందుకే వాన పాటల గురించి ఆలోచించడం లేదు: నిధీ అగర్వాల్
చిరుజల్లులను చూడటం నిధీకి ఎంతో ఇష్టం. వానలో తడవడం చాలా చాలా ఇష్టం. వాన పాటలంటే ఇష్టం. మరి.. వాన పాట చేయడం నిధీకి ఇష్టమేనా? ఆ విషయంతో పాటు ‘వర్షం సాక్షి’గా నిధీ అగర్వాల్ చెప్పిన ‘వానాకాలమ్’ కబుర్లు తెలుసుకుందాం. ► చిన్నప్పటి వానాకాలపు జ్ఞాపకాలు... నిధీ అగర్వాల్: చిన్నప్పుడు వర్షం అంటే.. వేడి వేడి టీ తాగుతూ, పకోడీలు తినేదాన్ని. ► మామూలుగా పిల్లలను వర్షంలో తడవనివ్వరు. మరి.. మీ అమ్మగారు తిట్టేవారా? వర్షంలో తడవడం ఏ పిల్లలకు ఇష్టం ఉండదు చెప్పండి. మా అమ్మగారు తడవడానికి అనుమతించేవారు కాదు కానీ, మనం ఆగం కదా (నవ్వుతూ). నేను మాత్రం వర్షంలో బాగా ఆడుకునేదాన్ని. ఇక రెయినీ సీజన్లో స్కూల్‌కి వెళ్లడం అంటే పండగే. ఫుల్లుగా తడిచేదాన్ని. ► కాగితపు పడవలు చేసేవారా? ఈ మధ్య చేయలేదు. 10, 11 ఏళ్లప్పుడు చేశాను. బోట్ చేయడం.. నీళ్లల్లో వదలడం.. భలే సరదాగా అనిపించేది. ► చివరిసారిగా ఫుల్లుగా తడిసిందెప్పుడు? ఈ మధ్యే. ఒక షూటింగ్లో ఉన్నప్పుడు ఒకేసారి భారీగా వర్షం వచ్చింది. షూటింగ్ లొకేషన్ దగ్గర్లోనే ఉన్న నా వ్యాన్‌లోకి వెళ్లేలోపే తడిసిపోయాను. ► ఈ సీజన్లో ఎలాంటి రంగు దుస్తులు వేసుకుంటారు? వర్షాకాలంలో తెలుపు రంగు దుస్తులకు నో. అది కాకుండా ఏదైనా ఓకే. ► నచ్చిన వాన పాట? వాన బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే రొమాంటిక్ సాంగ్ ఏదైనా ఇష్టమే. బాగా నచ్చే పాట అంటే... ఐశ్వర్యా రాయ్ ‘బరసో రే మేఘా.. మేఘా...’ (‘గురు’ సినిమా). నాకు ఐశ్వర్యా రాయ్ అంటే చాలా చాలా ఇష్టం. ఈ పాటే కాదు.. నటిగా ఆమె ఏం చేసినా ఇష్టమే. ► వాన పాటల్లో నటించడం ఇష్టమేనా? వాన పాటలు చేయడం అంత ఈజీ కాదు. నటిస్తున్నప్పుడు తడవడం, షాట్ గ్యాప్‌లో ఆరడం, మళ్లీ తడవడం.. బాబోయ్... ముఖ్యంగా వాన పడుతుంటే కళ్లు తెరిచి ఉంచి, నటించడం అంటే కష్టమే. అందుకే వాన పాటల గురించి ఆలోచించడంలేదు. ► వానలో ఇరుక్కున్న ఘటన ఏదైనా? ముంబయ్‌లో ఉన్నప్పుడు జరిగింది. జోరు వాన కారణంగా ఫ్లయిట్ టైమింగ్స్ మారడంతో నేను ఒకే ఫ్లయిట్లో కాకుండా కనెక్టింగ్ ఫ్లయిట్స్‌లో జర్నీ చేయాల్సి వచ్చింది. అలా ఫ్లయిట్లు మారడం ఇబ్బందిగా అనిపించింది. ఈ మధ్య వర్షం కారణంగా ఓ సినిమా షూటింగ్ క్యాన్సిల్ అయింది. అలా జరగడంవల్ల ఇంకో రోజు జర్నీ చేసి, మళ్లీ ఆ షూట్లో పాల్గొనాల్సి వచ్చింది. ► వానాకాలంలో తీసుకునే జాగ్రత్తలు? జలుబు చేయకూడదని ఈ సీజన్లో ఎక్కువగా వేడి నీళ్లు తాగుతుంటాను. ►వర్షాలప్పుడు షూటింగ్లో పాల్గొనడం ఇష్టమేనా? సంవత్సరం మొత్తంలో వాన రోజు తప్ప ఏరోజైనా షూటింగ్లో పాల్గొనడం ఇష్టమే. రెయినీ డే మాత్రం ఇంట్లోనే ఉండిపోవాలనిపిస్తుంది. చక్కగా రూమ్‌లో కూర్చుని, కిటికీలోంచి వాన జుల్లులు చూస్తుంటే చాలా హాయిగా అనిపిస్తుంది. అప్పుడు వేడి వేడిగా ఏదైనా తింటూ, టీ తాగితే మాటల్లో ఎక్స్‌ప్రెస్ చేయలేనంత అనుభూతి కలుగుతుంది. -
గృహల కొనుగోళ్లపై రాయితీలు ఎప్పుడు వస్తాయో తెలుసా ..
సాక్షి, హైదరాబాద్: వర్షంలో బయటికి వెళ్లాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. తడిసిపోతామనో లేక బురదగా ఉంటుందనో. కానీ, గృహ అన్వేషణ కోసం ఇదే సరైన సమయం అంటున్నారు రియల్టీ నిపుణులు. వానల్లోనే ఇంటి నిర్మాణ నాణ్యత, ప్రాంతం పరిస్థితి క్షుణ్ణంగా తెలుస్తుంది కాబట్టి సొంతింటి ఎంపికకు ఇదే సరైన కాలమని సూచిస్తున్నారు. గృహ కొనుగోలుదారులు అంతిమ నిర్ణయం తీసుకునే ముందు ప్రాజెక్ట్ ఉన్న ప్రాంతం వాస్తవ పరిస్థితిని తెలుసుకోవాలంటే వర్షంలో ప్రాజెక్ట్‌ను పరిశీలించాలి. నగరం ఏదైనా సరే వానొస్తే చాలు రహదారులన్నీ ట్రాఫిక్ జామ్ అవుతాయి. వర్షం నీరు వెళ్లే చోటు లేక రోడ్లన్నీ మునిగిపోతాయి. ఇది ఇల్లు ఉన్న ప్రాంతం వాస్తవ పరిస్థితిని తెలియజేస్తుంది. ప్రాజెక్ట్ ఉన్న ప్రాంతంలో ప్రజా రవాణా వ్యవస్థ ఎలా ఉంది? ఇంటి నుంచి బస్ స్టాండ్ లేక రైల్వే స్టేషన్‌కు చేరుకునేందుకు ఎంత సమయం పడుతుంది. వంటి వాస్తవ పరిస్థితులు తెలుస్తాయి. నాణ్యత తెలుస్తుంది.. ప్రాజెక్ట్ ఉన్న ప్రాంతంతో పాటూ ఇంటి నిర్మాణ నాణ్యత బయటపడేది కూడా వానాకాలమే. గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ప్రాజెక్ట్‌లో కొనుగోలు చేసే కొనుగోలుదారులు మాత్రం వానాకాలంలో ఇంటి నాణ్యత చెక్ చేసుకోవటం ఉత్తమం. ఎందుకంటే ఒక్కసారి గృహ ప్రవేశమయ్యాక కామన్‌గా ఏర్పాటుచేసిన వసతుల్లో లీకేజ్‌లను పునరుద్ధరించడం కొంత కష్టం. వర్షా్షకాలంలో ప్రాజెక్ట్ లోపాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇంట్లోని వాష్‌రూమ్, సీలింగ్, ప్లంబింగ్, డ్రైనేజీ లీకేజ్ వంటివి తెలుస్తాయి. ఆయా లోపాలను పునరుద్ధరించమని డెవలపర్‌ను కోరే వీలుంటుంది. రీసేల్ ప్రాపర్టీలనూ.. రీసేల్ ప్రాపర్టీలను కొనేవారైతే వర్షాకాలంలో ఆయా ప్రాపర్టీలను స్వయంగా పరిశీలించడం ఉత్తమం. ఎందుకంటే వానల్లోనే ప్రాపర్టీ నిర్వహణ ఎలా ఉందో అవగతమవుతుంది. గోడల ధృడత్వం, డ్రైనేజీ, ప్లంబింగ్ లీకేజీలు వంటివి తెలుసుకునే వీలుంటుంది. ప్రాపర్టీ లోతట్టు ప్రాంతంలో ఉందా? వరదలు ఎక్కువగా వచ్చే అవకాశముందా అనేది తెలుస్తుంది. వరద నీరు భూమిలోకి ఇంకిపోయే ఏర్పాట్లు ఉన్నాయా? లేక అపార్ట్మెంట్ సెల్లార్ నీటిలో మునిగిపోతుందా? అనేది తెలుస్తుంది. వర్షంలో రాయితీలు.. వర్షాకాలంలో గృహ కొనుగోళ్లు అంతగా జరగవు. కాబట్టి ఇలాంటి సమయంలో నిజమైన గృహ కస్టమర్లు వచ్చినప్పుడు వారిని డెవలపర్లు స్వాగతిస్తారు. ధర విషయంలో బేరసారాలు ఆడే వీలుంటుంది. రాయితీలు, ఇతర ప్రత్యేక వసతుల విషయంలో డెవలపర్లతో చర్చించవచ్చు. పైగా సెప్టెంబర్–అక్టోబర్ పండుగ సీజన్ కావటంతో భారీ డిస్కౌంట్లు, ప్రత్యేక రాయితీలతో అమ్మకాలను ప్రకటిస్తుంటారు డెవలపర్లు. -
రికార్డు వర్షాలు!
సాక్షి, హైదరాబాద్: వానాకాలం.. పదేళ్ల అనంతరం కొత్త రికార్డ్‌ను నెలకొల్పింది. నైరుతి రుతుపవనాలు, అల్పపీడనాలకు తోడు కొత్తగా ఏర్పడ్డ షీర్జోన్తో కురిసిన కుంభవృష్టి తెలంగాణను నిండు కుం డలా మార్చేసింది. జూన్ మొదటి వారంలో ప్రవేశించిన నైరుతి రుతుపవనాల ఉపసంహరణ సోమవారం నుంచి మొదలైంది. ఈ నాలుగు మాసాల్లో ఏకంగా 16 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదవ్వగా.. 11 జిల్లాల్లో అధిక వర్షపాతం, 6 జిల్లాల్లో సాధారణ వర్షపాతం రికార్డయింది. వాస్తవానికి నాలుగు మాసాల్లో 711.7 మి.మీ.ల సగటు వర్షం కురువాల్సి ఉండగా ఏకంగా 1,071 మి.మీ.ల వర్షం కురిసింది. ఇది సాధారణ సగటుతో పోలిస్తే దాదాపు 50 శాతం అధికం.. ఇంత భారీ ఎత్తున వర్షాలు గడిచిన పదేళ్లలో 2010లో సాధారణ సగటు కంటే 32 శాతం అధికంగా నమోదు కాగా ఈ మారు ఆ రికార్డు చెరిగిపోయింది. సగం రోజులు వానలే.. ఈ సీజన్ ప్రారంభం నుంచి తెలంగాణలోని పలు జిల్లాల్లో సగం రోజులు (రెయినీ డేస్) వర్షాలు కురిశాయి. అత్యధికంగా కామారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో జూలైలో 23 రోజులు, ఆగస్టులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 25, ములుగులో 24, మహబూబాబాద్‌లో 23, ఆగస్టులో రంగారెడ్డిలో 18, ఆదిలాబాద్‌లో 17 రోజులు వర్షాలు కురిశాయి. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఏర్పడ్డ 9 అల్పపీడనాల వల్ల కూడా భారీగా వర్షం నమోదైంది. జూన్ 9, జూలై 5, ఆగస్టులో 4, 9, 13, 19, 24, సెప్టెంబర్‌లో 13, 20 తేదీల్లో బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనాల ప్రభావ వర్షాలతో అన్ని పల్లెలు, పట్టణాలు తడిసి ముద్దయ్యాయి. వీటికి తోడు తెలంగాణ భూ ఉపరితలంపై 15–16 రేఖాంశాల మధ్య ఏర్పడ్డ షీర్‌జోన్ కూడా దక్షిణ తెలంగాణ, రాయలసీమ జిల్లాల్లో కుండపోతకు కారణమయ్యాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో టాప్ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రికార్డు వర్షాలు నమోదయ్యాయి. వనపర్తి జిల్లాలో 150 శాతం, నారాయణపేటలో 140, గద్వాలలో 130 శాతం వర్షాలు కురిశాయి. రాష్ట్రమంతా భారీ వర్షపాతం నమోదైనా.. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో కురువాల్సిన సాధారణ వర్షం కంటే కాస్త తక్కువగా నమోదు కావటం గమనార్హం. నిర్మల్‌లో 944.9 మి.మీ.కి 819 మి.మీలు, ఆదిలాబాద్‌లో 995.4 మి.మీకి గానూ 908.1 మి.మీ. కురిసింది. షీర్‌జోన్స్ అంటే.. వాతావరణ పరిభాషలో షీర్‌జోన్స్ అంటే.. తూర్పు, పడమర ప్రాంతాల్లో ఒకే అక్షాంశం (లాట్యిట్యూడ్)తో ఎదురెదురుగా ఉపరితల ఆవర్తనాలు ఏర్పడితే ఆ మధ్య ప్రాంతాన్ని షీర్‌జోన్స్ అంటారు. రెండు ఉపరితల ఆవర్తనాల మధ్య ప్రాంతం షీర్‌జోన్ అన్నమాట. ఇవి సాధారణంగా 15 లేదా 16 లేదా 17 డిగ్రీల లాట్యిట్యూడ్స్లో ఏర్పడతాయి. ఈసారి దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఈ షీర్‌జోన్స్ అధికంగా ఏర్పడటంతోనే ఆయా ప్రాంతాల్లో ఎన్నడూ లేనంతగా వర్షపాతం నమోదైంది. అత్యధిక అల్పపీడనాల వల్లే.. ఈ సీజన్లో ఏకంగా 9 అల్పపీడనాల వల్ల భారీగా వర్షం కురిసింది. వీటి వల్ల రెయినీడేస్ బాగా పెరిగాయి. అల్పపీడనాలతో ఉత్తర తెలంగాణ జిల్లాలు, చీర్ జోన్స్ ఏర్పడటంతో దక్షిణ తెలంగాణ, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. – రాజారావు, హైదరాబాద్ వాతావరణ అధికారి లానినో వల్లే.. ప్రతి ఐదేళ్లకు ఒకసారి వాతావరణంలో మార్పులు చోటు చేసుకుం టాయి.. అందులో భాగంగానే ఎల్‌నినో, లానినోలు ఏర్పడతాయి. ఈ మారు లానినో ప్రభావం వల్లే అత్యధిక వర్షాలు కురిశాయి. సాధారణ కంటే అధికంగా కురిస్తే లాభం కంటే నష్టమే అధికం. అయితే రెయినీ డేస్ ఎక్కువగా ఉండటం వల్ల భూగర్భ జలాలు వృద్ధి అయ్యేందుకు అవకాశముండటం సంతోషకర పరిణామం. –డా. సాయిభాస్కర్రెడ్డి, శాస్త్రవేత్త -
నైరుతి రుతుపవనాలపై భారీ ఆశలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోకి సకాలంలో నైరుతి రుతుపవనాల ప్రవేశంతో ఈ ఏడాది కూడా వర్షాలపై రైతాంగంలో భారీ ఆశలు కనిపిస్తున్నాయి. ఈ సీజన్లో సాధారణంకన్నా ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేయడం, రుతుపవనాలు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించడంతో సిరుల పంటలపై రైతుల్లో ధీమా వ్యక్తమవుతోంది. గత పదేళ్లలో ఐదేళ్లే మంచి వానలు... గత పదేళ్ల రికార్డులు పరిశీలిస్తే ఐదేళ్లు మాత్రమే వానాకాలం సీజన్ రాష్ట్ర రైతాంగానికి కలిసొచ్చింది. వానాకాలం సీజన్లో సాధారణ వర్షపాతం 759.3 మిల్లీమీటర్లుకాగా 2010, 2012, 2013, 2016, 2019లోనే ఆ మేర, అంతకన్నా ఎక్కువ వర్షం కురిసింది. మరోవైపు 2011, 2014, 2015, 2017, 2018 సంవత్సరాల్లో సాధారణంకన్నా తక్కువ వర్షాలు కురిసి రైతులను నిరాశపరిచాయి. 2010లో అత్యధికంగా సాధారణంకన్నా 32 శాతం ఎక్కువ వర్షాలు కురవగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన 2014లో ఏకంగా 34 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. అయితే గతేడాది సాధారణంకన్నా 6 శాతం ఎక్కువ వర్షాలు కురవడంతో ఈసారి కూడా వరుణుడి కరుణ రాష్ట్రంపై ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇందుకు తగ్గట్లు వాతావరణ సంకేతాలు కూడా ఉండటం రైతుల్లో ఆశలు రేకెత్తిస్తోంది. వాస్తవానికి వానాకాలం సీజన్ నాలుగు నెలల్లో జూన్ (135.5), జూలై (242.4), ఆగస్టు (218), సెప్టెంబర్ (171.4) మిల్లీమీటర్ల వర్షం కురవాలి. గతేడాది వివరాలు పరిశీలిస్తే జూన్‌లో 35 శాతం తక్కువగా 85.7 మి.మీ, జూలైలో 7 శాతం తక్కువగా 218.8 మి.మీ, ఆగస్టులో 14 శాతం ఎక్కువగా 260 మి.మీ, సెప్టెంబర్‌లో 47 శాతం ఎక్కువగా 241.1 మి.మీల వర్షం కురిసింది. జిల్లాలవారీగా చూస్తే 6 చోట్ల అధికంగా, 22 చోట్ల సాధారణం, 3 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. ఈసారి కూడా వర్షాలు సాధారణంకన్నా ఎక్కువ వస్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. తెలంగాణలో జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య వర్షపాతం 102 శాతం (8 శాతం +/–) ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీంతో ఈసారి వర్షాలు బాగానే కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సిద్దిపేటలో కుండపోత.. సిద్దిపేట జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం 8:30 గంటల వరకు సిద్దిపేట జిల్లా కేంద్రంలో అత్యధికంగా 21.6 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. జిల్లాలోని మరో 5 ప్రాంతాల్లో 10 సెం.మీ.కన్నా ఎక్కువ వర్షం పడింది. అలాగే జనగామ, పెద్దపల్లి, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్ జిల్లాల్లోనూ జోరుగా వర్షాలు కురిశాయి. మొత్తంమీద రాష్ట్రవ్యాప్తంగా 20 చోట్ల 8 సెం.మీ. కన్నా ఎక్కువ వర్షపాతం నమోదైంది. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌లో 6.2, మంచిర్యాల జిల్లా జన్నారంలో 4.7, అదే జిల్లా పరిధిలోని ఖవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో 4.2, వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలులో 4.1 సెం.మీ. చొప్పున వర్షం కురిసినట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. మిగిలిన చోట్ల సాధారణ వర్షాలు కురిశాయని పేర్కొంది. మరో 2 రోజులు వర్షాలు.. రాష్ట్రవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శుక్రవారం వెల్లడించింది. ఉత్తర కోస్తాంధ్ర, ఒడిశా, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని, దీనికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది. ఇది ఎత్తు పెరిగేకొద్దీ నైరుతి దిశ వైపునకు వంపు తిరుగుతోందని, ఆగ్నేయ మధ్యప్రదేశ్, పరిసర ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొది. దీంతో తెలంగాణలో శని, ఆదివారాల్లో అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వివరించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమురం భీం, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, వరంగల్–పట్టణ, వరంగల్–గ్రామీణ, ఖమ్మం జిల్లాల్లో శనివారం అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. -
ఎప్పుడూ..‘నాలా’గేనా ?!
సాక్షి, సిటీబ్యూరో: మహానగరంలో నాలాల సమస్య ఏళ్లు గడుస్తున్నా తీరడం లేదు. ప్రతి వర్షాకాలంలో వరద ముంపు సంభవించినప్పుడు సమస్య గురించి చర్చిస్తున్నారే తప్ప శాశ్వత పరిష్కారం లభించడం లేదు. విశ్వనగరంగా ఎదుగుతోన్న హైదరాబాద్ వర్షం వస్తే అనేక ప్రాంతాల్లో ముంపు సమస్యకు గురవుతోంది. నాలాల గుండా వెళ్లాల్సిన వరద నీరు.. రోడ్లపైకి చేరుతోంది. నాలాల్లో వేస్తున్న వివిధ రకాల వ్యర్థాలు ఇందుకు ఒక కారణం కాగా.. భారీ వర్షాలొస్తే తట్టుకునే సామర్ధ్యం నాలాలకు లేదు. గంటకు 2 సెం.మీ.ల కంటే ఎక్కువ వర్షం కురిసినా మునిగే ప్రాంతాలెన్నో ఉన్నాయి. ప్రధాన ర హదారుల వెంబడి వరదకాలువల్లో సాఫీగా నీరు వెళ్లేలా చేయడం.. పెద్ద వరదకాలువల్లో(నాలాల్లో) పూడిక లేకుండా చేయడంతోపాటు నాలాలను విస్తరించి ఆధునీకరించనిదే సమస్యకు పరిష్కారం ఉండదని కిర్లోస్కర్, ఓయెంట్స్ సొల్యూషన్స్ వంటి కన్సల్టెన్సీ సంస్థలు గతంలోనే సిఫారసు చేశాయి. జీహెచ్ఎంసీలో ఈ సమస్యల పరిష్కారానికి దాదాపు 390 కిలోమీటర్ల మేర పరిధిలోని మేజర్ నాలాల్ని విస్తరించాలంటే 12వేలకు పైగా ఆస్తులను తొలగించాల్సి ఉంటుందని టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక గుర్తించారు. ఇది సాధ్యమయ్యే పనికాదని భావించి తొలిదశలో అత్యంత సమస్యాత్మకంగా ఉన్న బాటిల్‌నెక్స్‌లోనైనా నాలాలను విస్తరిస్తే అతి తీవ్ర సమస్యలకు కొంతైనా పరిష్కారం లభిస్తుందని భావించారు. అలా దాదాపు 16 కి.మీ.ల మేరనైనా మేజర్ నాలాలను విస్తరించి, ఆధునీకరించాలని భావించారు. అందుకు దాదాపు వెయ్యి ఆస్తులు తొలగించాల్సి ఉంటుందని గుర్తించి దాదాపు 700 ఆస్తులకు సంబంధించి çపూర్తి సమాచారం సిద్ధం చేశారు. ఇప్పటి వరకు వాటిల్లో 25 శాతం ఆస్తులను కూడా తొలగించలేకపోయారు. అందుకు కారణాలనేకం. స్థానికుల వ్యతిరేకత, రాజకీయ కారణాలు, తదితరమైనవెన్నో వీటిల్లో ఉన్నాయి. రెండు దశాబ్దాలుగా .. దాదాపు రెండు దశాబ్దాల నాడు 2000 సంవత్సరం ఆగస్టులో కురిసిన భారీ వర్షానికి నగరం కకావికలమైంది. ఇందిరాపార్కు రోడ్డు, తదితర ప్రాంతాల్లో కార్లు సైతం రోడ్లపై వరదల్లో కొట్టుకుపోయాయి. వరదలతో ముంపు సమస్య తలెత్తకుండా ఉండాలంటే ఏంచేయాలని ఆనాటి నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ప్రభుత్వాలు మారాయి. ఎంసీహెచ్.. జీహెచ్ఎంసీగా అవతరించింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైంది. కానీ ఈ సమస్య మాత్రం నేటికీ పరిష్కారానికి నోచుకోలేదు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఈ సమస్య పరిష్కారానికి 28 వేల ఆక్రమణలు తొలగించాల్సి ఉంటుందని అంచనా వేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక స్వయానా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈసమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. రెవెన్యూ, టౌన్‌ప్లానింగ్, ఇంజినీరింగ్ అధికారులు సంయుక్తంగా సర్వే చేశారు. 12 వేలకు పైగా ఆస్తులు తొలగించాల్సి ఉంటుందని అంచనా వేశారు. ఎన్ని చేసినా పరిస్థితి మాత్రం మారలేదు. -
లోటు.. లోతు
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో వర్షాకాలంలోనూ భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి. ఓవైపు వర్షపాతం లోటు.. మరోవైపు భూగర్భ జలాల వినియోగం అనూహ్యంగా పెరగడంతో పలు మండలాల్లో అథఃపాతాళానికి చేరుకున్నాయి. హైదరాబాద్ జిల్లాలో 5 మినహా మిగతా 11 మండలాల్లో సరాసరిన ఒకటి నుంచి రెండు మీటర్ల మేర భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టగా... రంగారెడ్డి జిల్లా పరిధిలో మొత్తం 27 మండలాల్లోనూ సరాసరిన రెండు నుంచి నాలుగు మీటర్ల మేర భూగర్భ జలాలు తగ్గడం గమనార్హం. ఇక వర్షపాతం విషయానికి వస్తే జూన్ ఒకటి నుంచి సెప్టెంబర్ 8 మధ్య హైదరాబాద్ జిల్లా పరిధిలో 486.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా... 389.1 మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదైంది. అంటే సాధారణం కంటే 20శాతం లోటు వర్షపాతం. ఇక రంగారెడ్డి జిల్లా పరిధిలో సాధారణంగా 411.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా... 355.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ జిల్లాలోనూ 14శాతం లోటు వర్షపాతం నమోదవడం గమనార్హం. కారణాలెన్నో... వర్షకాలంలోనూ గ్రేటర్లో భూగర్భ జలాలు ఆశించిన స్థాయిలో పెరగలేదు. ఖైరతాబాద్, బండ్లగూడ, సైదాబాద్, అంబర్పేట్, ముషీరాబాద్ మినహా... మిగతా 11 మండలాల్లో భూగర్భ జలమట్టాలు గతేడాదితో పోలిస్తే తగ్గుముఖం పట్టాయి. ఇక రంగారెడ్డి జిల్లాలో మొత్తం 27 మండలాల్లో భూగర్భ జలాలు అథఃపాతాళంలోనే ఉండడం గమనార్హం. అరకొర వర్షపాతం, నీటిని ఒడిసిపట్టే ఇంకుడు గుంతలు చాలినన్ని లేకపోవడం, విచక్షణారహితంగా బోరుబావుల తవ్వకం, నీటి వినియోగం అనూహ్యంగా పెరగడంతో పాతాళగంగ అడుగంటుతోంది. శివారు ప్రాంతాల్లో గేటెడ్ కమ్యూనిటీలు, స్వతంత్ర గృహాలు, బహుళ అంతస్తుల భవంతుల నిర్మాణం ఊపందుకోవడం, కాంక్రీటు మహారణ్యాలు విస్తరిస్తున్న కారణంగా భూగర్భజలాల వినియోగం రెట్టింపవుతోంది. ఈ నేపథ్యంలో పలు మండలాల్లో సుమారు వెయ్యి అడుగులకు పైగా బోరుబావులను రెవెన్యూ శాఖ నిబంధనలకు విరుద్ధంగా తవ్వుతున్నప్పటికీ ఆయా విభాగాల అధికారులు చోద్యం చూస్తుండడం గమనార్హం. నిబంధనలకు ‘నీళ్లు’ భూగర్భజలశాఖ నుంచి సాధ్యాసాధ్యల నివేదిక (ఫీజిబిలిటీ) అందిన తర్వాతే రెవెన్యూశాఖ నూతన బోరుబావుల తవ్వకానికి అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. అదీ కేవలం 400 అడుగుల లోతు వరకు తవ్వేందుకు మాత్రమే అనుమతించాలి. అయితే ఈ నిబంధన గ్రేటర్ పరిధిలో కాగితాలకే పరిమితమవుతోంది. ప్రధాన నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో వెయ్యి అడుగులకు పైగా బోరుబావులు తవ్వుతున్నా.. రెవెన్యూ శాఖ ప్రేక్షక పాత్రకే పరిమితమవుతోంది. ప్రధానంగా కుత్బుల్లాపూర్, మియాపూర్, చందానగర్, గచ్చిబౌలి, మాదాపూర్, రాజేంద్రనగర్, శంషాబాద్, హయత్‌నగర్ తదితర ప్రాంతాల్లోని చెరువులు, కుంటల్లో నిబంధనలకు విరుద్ధంగా బోరుబావులు తవ్వేస్తున్న ట్యాంకర్ మాఫియా... ఈ నీటిని అపార్ట్మెంట్లు, గేటెట్ కమ్యూనిటీలు, హోటళ్లు, హాస్టళ్లు, ఫిల్టర్ వాటర్ ప్లాంట్లకు సరఫరా చేస్తూ జేబులు నింపుకుంటోంది. జలవిల... నగర జనాభా కోటి మార్కును దాటింది. సిటీలో భవంతుల సంఖ్య సుమారు 25లక్షలు కాగా.. బోరు బావులు 23 లక్షల మేర ఉన్నాయి. కానీ ఇంకుడు గుంతల సంఖ్య 5 లక్షలకు మించలేదు. మరోవైపు నగరం కాంక్రీట్ జంగిల్‌గా మారడంతో వర్షపు నీరు నేల గర్భంలోకి ఇంకడం చాలా ప్రాంతాల్లో కనాకష్టంగా మారింది. మరోవైపు రోజువారీగా ఆయా బోరు బావుల నుంచి సుమారు 650 కోట్ల లీటర్ల మేర భూగర్భ జలాలు తోడుతున్నట్లు అంచనా. ఇక నగరంలో ఏటా కురుస్తున్న వర్షపాతం భూగర్భంలోకి ఇంకేందుకు అవసరమైన ఇంకుడు గుంతలు, కుంటలు లేక సుమారు 65శాతం మేర వృథాగా రహదారులపై ప్రవహించి చివరగా మూసీలో కలుస్తోంది. దీంతో నగరంలో ఏటేటా భూగర్భ జలమట్టాలు అథఃపాతాళంలోకి పడిపోతున్నాయి. గ్రేటర్ శివార్లలో ప్రధానంగా భూగర్భజలాల వినియోగం అత్యధికంగా ఉంది. ఇంకుడు గుంత ఉండాలిలా... ఇళ్లల్లో బోరుబావికి సమీపంలో రెండు మీటర్ల లోతు, 1.5 మీటర్ల పొడవు, 1.5 మీటర్ల వెడల్పుతో ఇంకుడు గుంతను తవ్వాలి. ఈ గుంతను 50 శాతం 40ఎంఎం పరిమాణంలో ఉండే కాంక్రీటు రాళ్లతో నింపాలి. మరో 25శాతం జాగాను 20ఎంఎం పరిమాణంలో ఉండే రాళ్లను నింపాలి. మిగతా 25 శాతం ఖాళీ ప్రదేశాన్ని దొడ్డు ఇసుక(బఠాణా)తో నింపాలి. దీని చుట్టూ వ్యర్థాలు చేరకుండా ఒక అడుగు ఎత్తున చిన్న గోడ నిర్మించాలి. ఈ గుంతలోకి ఇంటి పైకప్పు నుంచి నేరుగా వర్షపు నీరు చేరేందుకు పెద్ద పైపును ఏర్పాటు చేయాలి. ఉపయోగాలివీ... ఈ ఇంకుడు గుంతలో సీజన్లో సాధారణ వర్షపాతం (20 మిల్లీమీటర్లు) నమోదయ్యే రోజుల్లో... రోజుకు 1600 లీటర్ల నీటిని భూగర్భంలోకి ఇంకించవచ్చు. ఈ నీరు నలుగురు సభ్యులున్న కుటుంబానికి మూడు రోజుల అవసరాలకు సరిపోవడం విశేషం. ఇంకుడు గుంతలు తవ్వడం ద్వారా మీ బోరు బావి ఎప్పటికీ వట్టిపోదు. అంతేకాదు భావితరాలకు మీరు జలబ్యాంక్ ఏర్పాటు చేసిన వారవుతారు. సామాజిక బాధ్యతగా ఇంకుడు గుంత తవ్వడం ద్వారా మీకే కాదు.. మీ ఇంట్లో పెంచుకునే మొక్కలకు సైతం జలం.. జీవం అందజేసిన వారవుతారు. -
అంటువ్యాధులకు 'జంట 'చికిత్స
సాక్షి, సిటీబ్యూరో: వర్షాకాల సీజన్లో అంటువ్యాధుల నివారణకు జీహెచ్ఎంసీ, వైద్యారోగ్య శాఖలు సంయుక్త కార్యాచరణకు శ్రీకారం చుట్టాయి. జీహెచ్ఎంసీలోని ఎంటమాలజీ విభాగం, గ్రేటర్ పరిధిలోని మూడు జిల్లాల వైద్యారోగ్య శాఖ, మలేరియా విభాగాల్లోని వివిధ స్థాయిల్లోని ఉద్యోగులతోప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆయా కార్యక్రమాల నిర్వహణను చేపట్టాయి. మలేరియా, డెంగీ తదితర వ్యాధులు వ్యాప్తి చెందిన ప్రాంతాలను గుర్తించి.. వాటితో పాటు మురుగు నీరు ఎక్కువగా పారే ప్రదేశాలు, మురికివాడలు తదితర ప్రాంతాల్లో ఈ బృందాలు ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరిస్తాయి. గ్రేటర్ పరిధిలోని దాదాపు రెండున్నర లక్షల ఇళ్లకు వెళ్లి నిత్యం దోమల నివారణ మందులు చల్లుతున్నారా? లేదా? అనేది తెలుసుకుంటాయి. అనారోగ్యంతో బాధపడేవారి రక్త నమూనాలు సేకరించి పరీక్షలకు పంపిస్తాయి. ఏదైనా వ్యాధి నిర్ధారణ అయితే చికిత్స అందిస్తాయి. ఆయా ప్రాంతాల్లో అంటువ్యాధులు వ్యాప్తి చెందకుండా నివారణ చర్యలు చేపడతాయి. అంటువ్యాధులు, నివారణ చర్యలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాయి. ఈ బృందాలు నిర్వహించే కార్యక్రమాలను జీహెచ్ఎంసీ ఎంటమాలజీ అధికారులు, ఫీల్డ్ అసిస్టెంట్లు పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తారు. వీటితో పాటు తొలి దశలో 275 ఉచిత వైద్యశిబిరాలు నిర్వహించనున్నారు. వీటిని గురువారం ప్రారంభించారు. శిబిరాలు ప్రారంభం... ఈ సీజన్లో అంటువ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు మురికివాడల్లో దోమల నివారణ మందు స్ప్రే చేయించడంతో పాటు 500 ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిశోర్ ప్రకటించిన నేపథ్యంలో... తొలి విడతలో 275 వైద్య శిబిరాల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ జిల్లాలో 122, రంగారెడ్డి జిల్లాలో 54, మేడ్చల్ జిల్లాలో 99 వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు కమిషనర్ ప్రకటించారు. ఆయా జిల్లాల వైద్యారోగ్యశాఖ అధికారులు, జిల్లా మలేరియా అధికారులు, జీహెచ్ఎంసీ మెడికల్ ఆఫీసర్లు, ప్రాజెక్ట్ ఆఫీసర్లు, ఎంటమాలజీ విభాగం అధికారులు సంయుక్తంగా ఈ వైద్య శిబిరాలను గ్రేటర్ పరిధిలోని అంటువ్యాధులు ప్రబలే సమస్యాత్మక ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారు. వైద్యశిబిరాల్లో వైద్యాధికారితో పాటు అర్బన్ పబ్లిక్ హెల్త్ సెంటర్ సిబ్బంది, ఏఎన్ఎంలు, హెల్త్ అసిస్టెంట్లు, హెల్త్ సూపర్వైజర్లు, ఆశా వర్కర్లు ఉంటారు. ఈ శిబిరాలతో పాటు దోమల వ్యాప్తి నిరోధానికి చేపట్టాల్సిన చర్యలపై జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం ఏఎల్ఓ టీమ్, జిల్లా మలేరియా హెల్త్ అసిస్టెంట్లు, హెల్త్ సూపర్వైజర్లు, వైద్యారోగ్యశాఖకు చెందిన సిబ్బందితో ప్రత్యేక కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ ఎంటమాలజీ బృందాలు లార్వా నివారణ మందు స్ప్రే చేయడంతో పాటు ఫాగింగ్ ఆపరేషన్లు చేస్తాయి. కిట్లు రెడీ... అన్ని పబ్లిక్ హెల్త్ సెంటర్లు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో స్వైన్‌ప్లూ, డెంగీ వ్యాధి నిర్ధారణ కిట్లు, మలేరియా ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ కిట్లు అందుబాటులో ఉంటాయని దానకిశోర్ పేర్కొన్నారు. ఎక్కడైనా డెంగీ, మలేరియా, స్వైన్‌ప్లూ తదితర వ్యాధులకు సంబంధించి కేసులు నమోదైతే.. అవి మరింత విస్తరించకుండా ఉండేందుకు సంబంధిత జీహెచ్ఎంసీ వైద్యాధికారులు, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ మెడికల్ అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడతారని కమిషనర్ తెలిపారు. రెండు అంతకన్నా ఎక్కువ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదైతే ఆయా ప్రాంతాల్లో కనీసం వంద ఇళ్లలో యాంటీ లార్వా ఆపరేషన్ల నిర్వహణ, 50 ఇళ్లలో పెరిథ్రియం స్ప్రే చల్లాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్టు స్పష్టం చేశారు. పాఠశాలలు, వార్డులు, సర్కిల్ కార్యాలయాలు తదితర ప్రముఖ ప్రాంతాల్లో అంటువ్యాధుల నివారణపై చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జూలై మాసాన్ని డెంగీ నివారణ మాసంగా పాటిస్తూ ఈ చర్యలకు శ్రీకారం చుట్టినట్లు జీహెచ్ఎంసీ పేర్కొంది. -
వరి వెద సాగు.. బాగు బాగు..!
వర్షాలు సరైన సమయంలో కురవకపోవడం, తద్వారా కాలువల్లో సాగునీరు ఆలస్యంగా విడుదలవడం వలన వరి నారు మడులు పోసుకోవడం, నాట్లు వేయడం ఆలస్యమై దిగుబడులు గణనీయంగా తగ్గుతున్నాయి. చెరువులు, కాలువలు, బావుల కింద పండించే పంటలు కాలక్రమేణా బోర్ల ద్వారా, భూగర్భ జలాల మీద ఆధారపడి వ్యవసాయం చేసే పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలో భూగర్భ జలాలు కూడా కొరవడుతున్నాయి. వీటితోపాటు కూలీల కొరత, అధిక కూలి రేట్లు వంటి సమస్యలతో రైతాంగం ఉక్కిరిబిక్కిరి అవుతున్న తరుణంలో నేరుగా విత్తే వరి సాగు పద్ధతులు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. పొడి నేలలో పొడి వరి విత్తనాన్ని వెద బెట్టడం, దమ్ము చేసిన మాగాణులలో డ్రమ్ సీడర్‌తో మొలకెత్తిన విత్తనం వేసుకోవటం లేదా వెద జల్లడం వంటి పద్ధతుల్లో వరి సాగు చేయడం మేలని బాపట్ల వ్యవసాయ పరిశోధనా స్థానం ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్ సి. వి. రామారావు సూచిస్తున్నారు. సార్వాలో వెద వరి పంట సకాలంలో తీసుకోగలిగితే మినుము, పెసరలను రెండో పంటగా వేసి మంచి దిగుబడులు సాధించడానికి వరి వెద పద్ధతి రైతాంగానికి ఎంతో ఉపయోగకరంగా ఉందని ఆయన తెలిపారు. ఈ పద్ధతిలో 20% నీరు ఆదా అవుతుంది. 10 రోజులు ముందుగానే కోతకొస్తుంది. పంట దిగుబడి 15% పెరుగుతుంది. అధిక నీరు అవసరమయ్యే పంట కావడంతో వరి సాగుకు వాతావరణ మార్పులు శాపంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో నారుపోసి నాట్లు వేయడం కన్నా నేరుగా విత్తుకోవడం మేలు. వరి నేరుగా విత్తే విధానంలో ముఖ్యంగా రెండు పద్ధతులున్నాయి: 1 పొడి విత్తనాన్ని విత్తే పద్ధతి : పొడి విత్తనాలను పొడి నేలపై వెద జల్లడం ద్వారా గాని, డ్రిల్లింగ్ చేయడం ద్వారా గాని, వెద సాగు పరికరాల(విత్తన గొర్రు)తో గాని విత్తుతారు. వరి విత్తనాన్ని పొడి వాతావరణంలో విత్తి, తరువాత వానలు మొదలై కాలువలకు నీళ్లు వచ్చిన అనంతరం మాగాణి పంటల మాదిరిగా సాగు చేస్తారు. తొలకరి వానలు పడగానే విత్తనాలు విత్తుతారు. అటు వర్షపు నీటిని, కాలువల నీటిని ఉపయోగించుకుంటూ వరిని సాగు చేస్తారు. 2 తడి విత్తనాన్ని విత్తే పద్ధతి : ఈ పద్ధతిలో మొలకెత్తించిన విత్తనాలను దమ్ము చేసిన పొలంలో వెదజల్లడం ద్వారా గాని లేదా డ్రమ్ము సీడర్ ద్వారా గాని విత్తుతారు. తడి విత్తనాన్ని అంటే.. నానబెట్టి, మండెకట్టి మొలకెత్తిన విత్తనాన్ని దమ్ము చేసిన మాగాణుల్లో వెదజల్లడం ద్వారా గాని, డ్రమ్ సీడరు ద్వారా గాని విత్తుతారు. విత్తన ఎంపికలో మెలకువలు ♦ పొడి విత్తనాన్ని వెద పద్ధతి ద్వారా, తడి విత్తనాన్ని డ్రమ్ సీడరు ద్వారా లేదా వెదజల్లడం ద్వారా నేరుగా విత్తే పద్ధతులను అనుసరించేటప్పుడు వరి రకాలను ఎంపికచేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ♦ సార్వాలో 140–150 రోజులు, దాళ్వాలో 120–125 రోజుల కాలపరిమితి గల రకాలను ఎంచుకోవాలి. ♦ ఈ పద్ధతిలో చేను పడిపోయే అవకాశాలు ఎక్కువ. కాబట్టి, కాండం దృఢంగా ఉండి చేనుపై పడిపోని రకాన్ని ఎంపిక చేసుకోవాలి. ♦ మొక్క శాఖీయ పెరుగుదల దశలో వేగంగా పెరిగి కలుపును అణగదొక్కగల సామర్థ్యం కలిగి ఉండాలి. ♦ ఆయా ప్రాంతాల్లో అధికగా వచ్చే చీడపీడలను తట్టుకొనే శక్తిని కలిగి ఉండాలి. ♦ ఎంపిక చేసుకునే రకం 2–3 వారాలు నిద్రావస్థ కలిగినదై ఉండాలి. ♦ తక్కువగా గింజ రాలే రకాలను ఎంపిక చేసుకోవాలి. ♦ అధిక దిగుబడితో పాటు మంచి గింజ నాణ్యత కలిగి ఉండాలి. ఈ సూచనలను దృష్టిలో ఉంచుకొని రైతులు గింజ రకాలను ఎంపిక చేసుకోవాలి. పొలం తయారీ: వెద పద్ధతిలో వరి సాగు చేసేటప్పుడు వేసవిలోనే నేలను కలియదున్నాలి. నేల స్వభావాన్ని బట్టి నాలుగు మూలలు సమానంగా ఉండేటట్లు పెద్ద పెద్ద మట్టి గడ్డలు లేకుండా పొలం సమతలంగా ఉండేటట్లు చూసుకోవాలి. తడి విత్తన పద్ధతిలో సాగు చేసేటప్పుడు సాధారణ నాట్లు పద్ధతిలో ఎలాగైతే భూమిని తయారు చేస్తామో అలాగే తయారు చేయాలి. చివరి సారి దమ్ము చేసిన తర్వాత పొలమంతా ఎత్తుపల్లాలు లేకుండా సమానంగా చదును చేయాలి. పొలాన్ని చిన్నచిన్న మడులుగా విభజించుకుంటూ చదును చేయడం వలన నీరు పెట్టడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. మట్టి పేరుకున్న తరువాత బురద పదునులో ప్రతి రెండు మీటర్లకు 20 సెం.మీ. కాలువలు చేయాలి. వీటి ద్వారా ఎక్కువగా నీరు, మురుగు నీరు బయటకు పోవడానికి వీలవుతుంది. విత్తన మోతాదు వెదజల్లే పద్ధతిలో అయితే రకాన్ని బట్టి ఎకరానికి 12 నుంచి 16 కిలోల విత్తనం, డ్రమ్సీడరుతో విత్తుకుంటే 10 నుంచి 12 కిలోల విత్తనం అవసరం అవుతుంది. వెదపద్ధతిలో ఎకరానికి పొడి విత్తనం 10 నుంచి 15 కిలోల విత్తనం వాడాలి. విత్తనశుద్ధి ఒక లీటరు నీటికి ఒక గ్రాము కార్బండిజమ్‌ను కలిపి కిలో విత్తనాన్ని 24 గంటలు నానబెట్టి తర్వాత మండె కట్టి మొలకవచ్చిన తర్వాత వెదజల్లడం గాని, డ్రమ్ సీడరుతో గాని విత్తుకోవాలి. వెదజల్లే పద్ధతిలో సాగు చేసేటప్పుడు ఒక కిలో విత్తనానికి 3 గ్రా. కార్బెండిజమ్‌ను కలిపి వెద పెట్టడం వల్ల విత్తనం ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్లను తక్కువ ఖర్చుతో నివారించవచ్చు. (సేంద్రియ పద్ధతిలో సాగు చేసే రైతులు బీజామృతం లేదా ఇతర పద్ధతుల్లో విత్తనశుద్ధి చేసుకోవాలి). వెద పద్ధతిలో విత్తే విధానం వెద పద్ధతిలో వరి విత్తనాలను పొలంలో చల్లడం కాక పొలంలో సాళ్లుగా విత్తితే మంచి ఫలితాలనిస్తాయి. దీనికి పొలాన్ని సాంప్రదాయ పద్ధతిలో దున్నకూడదు. విత్తన గొర్రు ఉపయోగిస్తే కనీసం 2–4 సెం.మీ. వెడల్పు, 4–7 సెం.మీ. ఎత్తు ఉండే గాడులు ఏర్పడి అందులో విత్తనాలు సమానలోతు, సమాన దూరంలో నాటుకుంటాయి. 2–3 సెం.మీ. లోతులో విత్తితే మొలక శాతం బాగుంటుంది. దీనికన్నా ఎక్కువ లోతులో విత్తితే మొలక రావడం కష్టమవుతుంది. ఈ విధానంలో పొలంలో నేల ఎక్కువ కదలికకు గురికాదు. నీరు పెట్టినప్పుడు అది సాఫీగా ప్రవహించి మొక్కలకు చేరుకుంటుంది. సాంప్రదాయ పద్ధతిలో దున్నినప్పుడు నేలంతా కదలడం వలన నీరు పెట్టినప్పుడు చాలా వరకు పీల్చుకుపోయి మొక్కకు చేరడానికి ఎక్కువ నీరు అవసరమవుతుంది. వెదసాగు యంత్రంలో విత్తనాలకు, కలుపు మందుకు, ఎరువుకు విడి విడిగా అరలు ఉంటాయి. విత్తనంతో పాటే ఎరువు కూడా నేరుగా చేలో పడుతుంది. అనుభవం కలిగిన ట్రాక్టరు డ్రైవరు ఈ వెదసాగు యంత్రంతో గంటలో ఒక ఎకరాన్ని విత్తగలరు. వెదజల్లే విధానంలో విత్తేముందు పొలం వైశాల్యాన్ని బట్టి ఎన్ని మడులున్నాయో చూసుకొని ఆ ప్రకారం విత్తనాన్ని 24 గంటలు నానబెట్టి, 24 గంటలు మండెకట్టి, మొలకెత్తిన విత్తనాన్ని అన్ని భాగాలుగా చేసుకుంటే, విత్తనాలు సమానంగా నేలమీద పడతాయి. మొక్కల సాంద్రత సమంగా ఉంటుంది. విత్తిన రెండు వారాల తరువాత వత్తుగా ఉన్న మొక్కలను తీసివేసి పలుచగా ఉన్న చోట నాటుకోవాలి. డ్రమ్ సీడరుతో వరి విత్తే విధానం డ్రమ్ సీడరుతో విత్తేటప్పుడు విత్తనాన్ని 24 గంటలు నానబెట్టి 24 గంటలు మండెకట్టి గింజల నుంచి మొలక ఆరంభదశలో వున్నప్పుడు డ్రమ్‌లలో నింపుకోవాలి. అలా కాక మొలక పొడువగా ఉంటే డ్రమ్‌లలో పోసినప్పుడు అవి అల్లుకుపోయి రంధ్రాలకు అడ్డుపడి విత్తనాలు సులువుగా రాలవు. ఈ విధంగా మొలక ఆరంభ దశలో వున్న విత్తనాలను డబ్బాలలో 3/4 వంతు వరకు నింపి ముందుగా దమ్ము చేసి చదును చేసిన పొలంలో డ్రమ్ సీడరును దానికున్న పిడి సహాయంతో లాగడం వలన చక్రాలతో పాటు డ్రమ్ములు తిరిగి డ్రమ్ములకున్న రంధ్రాల ద్వారా విత్తనాలు పొలంలో వరుసగా పడతాయి. ఇలా ఒకసారి డ్రమ్‌సీడరును లాగితే 8 వరుసలలో వరుసకు వరుసకు మధ్య 20 సెం.మీ. దూరంలో 5 నుంచి 8 గింజలు పడతాయి. వరుసలు పాడవకుండా ఉండాలంటే పొలంలో వారం వరకు బుదర పదునుగా నీరు పలుచగా ఉండాలి. అయితే, నీరు పలుచగా ఉండటం వలన కలుపు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కావున కలుపు మందును తగు మోతాదులో 6–7 రోజుల లోపు వేసుకోవాలి. ఈ డ్రమ్‌సీడరును ఉపయోగించి రోజుకు 2–3 ఎకరాలు విత్తుకోవచ్చు. ఒక ఎకరం పొలాన్ని ఇద్దరు కూలీలు రెండున్నర గంటలలో విత్తగలరు. నీటి యాజమాన్యం విత్తిన తరువాత మొక్కల మొదటి ఆకు పూర్తిగా పురి విచ్చుకొనే వరకు (అంటే సుమారు 7–10 రోజులు) ఆరు తడులను ఇవ్వాలి. మొక్కలు 4–5 ఆకులు తొడిగిన తరువాత పొలంలో పలుచగా అంటే 2–3 సెం.మీ.ల లోతు నీరుండాలి. అంతకు మించి నీరు ఎక్కువగా ఉంటే పైరు బాగా దుబ్బు చేయదు. పైరు పిలక తొడిగి దుబ్బు కట్టుట పూర్తి అయిన తరువాత నుంచి కోతకు సుమారు 10 రోజుల ముందు వరకు 5 సెం. మీ. లోతు నీరుండాలి. పంటకోత నేరుగా విత్తే పద్ధతిలో సాంప్రదాయ ఊడ్పు విధానం కన్నా పంట 7–10 రోజులు ముందే కోతకు వస్తుంది. పంటను కూలీల ద్వారా లేక కోత–నూర్పిడి యంత్రం ద్వారా కోయవచ్చు. నేరుగా విత్తే పద్ధతిలో జాగ్రత్తలు 1 పొలమంతా సమానంగా ఎత్తుపల్లాలు లేకుండా చదును చేసుకోవాలి. దీనితో పొలమంతా నీరు సమానంగా పారి ఎరువుల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. 2 ఎకరానికి సిఫారసు చేసిన విత్తన మోతాదు ప్రకారమే విత్తుకోవాలి. ఎక్కువ విత్తనం వాడితే మొక్కలు ఒత్తుగా, తక్కువ వాడితే పలుచగా వుండి దిగుడులు తగ్గుతాయి. నేలలో విత్తనాన్ని 3 సెం.మీ. కంటే ఎక్కువ లోతులో వెద పెట్టకూడదు. 3 విత్తనాన్ని నాటిన రెండు రోజులలోపే కలుపును అరికట్టాలి. సరైన మందులను, సరైన కాలంలో, సరైన మోతాదులో వాడాలి. 4 విత్తనం పూర్తిగా మొలకెత్తిన తరువాత మొదటి నీటి తడిని భూమి స్వభావాన్ని బట్టి 7 నుంచి 15 రోజుల తర్వాత ఇవ్వవచ్చు. 5 విత్తిన రెండు వారాల తరువాత ఒత్తుగా ఉన్నచోట మొక్కలు తీసి పలుచగా వున్నచోట నాటుకుంటే మొక్కల సాంద్రత పొలమంతా సమానంగా ఉంటుంది. 6 నానబెట్టి, మండెకట్టిన విత్తనాలకు మొలక ఎక్కువగా పెరగనివ్వకూడదు. పెరిగినట్లైతే విత్తేటప్పుడు లేదా వెదజల్లేటప్పుడు మొలక విరిగి పోయే ప్రమాదం ఉంది. 7 విత్తిన 10 రోజుల వరకు ఆరు తడులనివ్వాలి. నీరు ఎక్కువగా ఉంటే మురుగు కాల్వల ద్వారా తీసివేయాలి. లేదంటే మొలక మురిగిపోతుంది. దుబ్బు దశ నుంచి నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. – డాక్టర్ సి.వి. రామారావు,(94949 97701), ముఖ్య శాస్త్రవేత్త, వరి విభాగం, బాపట్ల వ్యవసాయ పరిశోధనా స్థానం,ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వరిని నేరుగా విత్తితే లాభాలు 1 తొలకరి వానలు పడిన వెంటనే వరి సాగు మొదలు పెట్టుకోవచ్చు. 2 అటు వర్షపు నీరు, ఇటు కాలువ నీరును ఉపయోగించుకుంటూ పంటను పండించవచ్చు. 3 దీని వలన పంటకాలం నష్టపోకుండా సకాలంలో సాగు చేయడానికి వీలవుతుంది. 4 ఈ పద్ధతిని పాటించడం వలన కాలువలలో నీరు ఆలస్యంగా వచ్చినా వరి పంట తరువతా మినుము, పెసర వంటి పైర్లను సకాలంలో విత్తవచ్చు. 5 ఈ పద్ధతిలో తక్కువ మోతాదు విత్తనం వాడటం వల్ల విత్తన ఖర్చు, నారు పెంచడానికి, నారు తీయడానికి, నారు మోయడానికి, నాట్లు వేయడానికి అయ్యే ఖర్చు ఆదా అవుతుంది. 6 సరి అయిన సమయంలో విత్తడం వల్ల నాట్ల పద్ధతిలో కన్నా చీడపీడల బెడద తక్కువగా ఉంటుంది. అందువల్ల సస్యరక్షణ ఖర్చులు తగ్గుతాయి. 7 విత్తనం భూమిపై తక్కువ లోతులో మొలకెత్తడం వలన వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది.. పైరు నీటిని, పోషక పదార్థాలను సక్రమంగా వినియోగించుకుంటుంది. 8 నాట్ల పద్ధతిలో కన్నా ఈ విధానంలో 20% నీరు ఆదా అవుతుంది. 9 నాట్ల పద్ధతిలో కన్నా 7–10 రోజుల ముందుగా వరి పంట కోతకు వస్తుంది. నేరుగా విత్తే పద్ధతిని అనుసరించడం వలన సాగు ఖర్చు తగ్గడంతో పాటు 10–15% అదనపు దిగుబడులు కూడా సాధించవచ్చు. వరి నేరుగా విత్తే పద్ధతిలో సమస్యలు 1 సరైన లోతులో విత్తుకోవటం 2 ప్రారంభ దశలో కలుపు నిర్మూలన 3 సరైన నీటి యాజమాన్యం 4 పొలాన్ని సరిగ్గా చదును చేసుకోవడం తెలంగాణలో నేరుగా విత్తే వరి సాగుకు అనువైన రకాలు సాధారణ నాట్ల పద్ధతితో పాటు వెద పద్ధతిలో కూడా సాగు చేయడానికి అనువైన మూడు వరి రకాలు తెలంగాణ రైతులకు అందుబాటులో ఉన్నాయి. ఆర్.ఎన్.ఆర్. 15048 (తెలంగాణ సోన) – 120 రోజుల పంట. ఖరీఫ్‌లో జూలై ఆఖరు, రబీలో డిసెంబర్ ఆఖరు వరకు విత్తుకోవచ్చు. రసాయనిక ఎరువులు మోతాదుకు మించి వాడితో పొలంలో పంట పడిపోతుంది. కె.ఎన్.ఎం. 118 (కూనారం సన్నాలు)– 120 రోజులు. మామూలుగా, ఆలశ్యంగా కూడా విత్తుకోవచ్చు. ఖరీఫ్‌లో జూన్–జూలై, రబీలో నవంబర్ ఆఖరు నుంచి డిసెంబర్ ఆఖరు వరకు విత్తుకోవచ్చు. జగిత్యాల మషూరి (జెజె 11470) – 135 రోజులు. ఖరీఫ్‌లో జూన్ 30లోగా, రబీలో నవంబర్ 30 లోగా విత్తుకోవాలి. – డా. చెన్నమాధవుని దామోదర్‌రాజు(94402 25385), ప్రధాన శాస్త్రవేత్త, వరి విభాగం, ప్రొ.జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం చీడపీడలను దరిచేరనీయని నవార వరి నవార రకం దేశీ వరిని తెలుగు రాష్ట్రాల్లో (ఖరీఫ్, రబీ) ఏ ప్రాంతంలోనైనా పండించవచ్చు. ఎకరానికి 15 కిలోల విత్తనం అవసరం. శ్రీ పద్ధతిలో 2 కిలోలు చాలు. పంటకాలం ఖరీఫ్‌లో 110–115 రోజులు, రబీలో 120–125 రోజులు. ఎకరానికి 18–20 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. నవార అన్ని రకాల చీడపీడలను తట్టుకుంటుంది. విత్తనాలు నల్లగా, బియ్యం ఎర్రగా ఉంటాయి. నవార బియ్యం తిన్నవారిలో షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంటుంది. ఇడ్లీ, దోసెలలో ఎక్కువగా వాడుతారు. అయితే, వడగళ్ల వానకు పంట కింద పడిపోయి గింజలు రాలిపోతాయి. గడ్డిని పశువులు ఇష్టంగా తింటాయి. ఈ విత్తనాల కోసం సికింద్రాబాద్ తార్నాక నాగార్జున నగర్‌లోని సి.ఎస్.ఎ. కార్యాలయాన్ని 1800 120 3244 నంబరులో సంప్రదించవచ్చు. జూలై చివరి వరకూ విత్తుకోవచ్చని శాస్త్రవేత్త డా. రాజశేఖర్(83329 45368) తెలిపారు. అటవీ కృషిపై 30, జూలై 1 తేదీల్లో డా. ఖాదర్ వలి సదస్సులు తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం, రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో అటవీ కృషి పద్ధతుల్లో సిరిధాన్యాల మిశ్రమ సాగుపై స్వతంత్ర శాస్త్రవేత్త డా. ఖాదర్ వలి రైతులకు శిక్షణ ఇస్తారు. 30(ఆదివారం) ఉ. 10 గం. నుంచి సా. 4 గం. వరకు నిజామాబాద్ జిల్లా బోధన్‌లోని కొత్త రమాకాంత్ ఫంక్షన్ హాల్లో జరిగే రైతు సదస్సులో డా. ఖాదర్ ప్రసంగిస్తారు. వివరాలకు.. అభిలభారత రైతు సమన్వయ సమితి నేత అప్పిరెడ్డి –83090 24948. నిజామాబాద్‌లోని లక్ష్మీ కల్యాణ మండపం (ఆర్మూర్ రోడ్డు)లో 30న సా. 5 గం. నుంచి సిరిధాన్యాలపై ఆరోగ్య సదస్సులో డా. ఖాదర్ వలి ప్రసంగిస్తారు. వివరాలకు.. జి. దామోదర్‌రెడ్డి – 94407 02029. జూలై 1(సోమవారం)న మెదక్‌లోని వైస్రాయ్ గార్డెన్లో ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉ. 10 గం. నుంచి 12 గం. వరకు డాక్టర్ ఖాదర్ వలి ప్రసంగిస్తారు. వివరాలకు.. డా. శ్యాంసుందర్‌రెడ్డి – 99082 24649. జూలై 1(సోమవారం)న సా. 4 గం. నుంచి జనగామలోని ఎన్.ఎం.ఆర్. ఫంక్షన్ హాల్ (సూర్యాపేట రోడ్డు)లో వాలంతరి ఆధ్వర్యంలో జరిగే రైతు సదస్సులో డా. ఖాదర్‌వలి ప్రసంగిస్తారు. వివరాలకు.. శంకరప్రసాద్ – 77029 70001. ఈ సభలకు ప్రవేశం ఉచితం. 30న సేంద్రియ మిరప, పత్తి, వరి సాగుపై శిక్షణ రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడు రైతు శిక్షణ కేంద్రంలో ఈ నెల 30(ఆదివారం) సేంద్రియ వ్యవసాయ విధానంలో మిరప, పత్తి, వరి సాగుపై ప్రకృతి వ్యవసాయదారులు శ్రీమతి లావణ్య, రమణారెడ్డి శిక్షణ ఇస్తారు. వివరాలకు 97053 83666. -
తొలకరి లేత గడ్డితో జాగ్రత్త!
వర్షాకాలంలో పశువులకు సోకే వ్యాధుల్లో బ్యాక్టీరియా వ్యాధి గొంతు వాపు / గురక వ్యాధి (హిమరేజిక్ సెప్టిసీమియా) ముఖ్యమైనది. పాస్టురెల్లా మల్టొసై అనే బ్యాక్టీరియా వల్ల ఇది సోకుతుంది. తొలకరి వర్షాల తర్వాత మొలకెత్తిన లేత గడ్డి మీద పేరుకుపోయిన ఈ బ్యాక్టీరియా, మేత ద్వారా పశువు శరీరంలోకి ప్రవేశిస్తుంది. దాదాపుగా అన్ని పశువులు ఈ వ్యాధి బారిన పడతాయి. ఈ దిగువ తెలిపిన కారణాల వల్ల వ్యాధి తీవ్రమవుతుంది. ♦ పశువులకు పరాన్న జీవుల / వైరస్ / బ్యాక్టీరియా వ్యాధులు ముందుగానే ఉన్నట్లయితే.. ♦ దున్నపోతులు ఎక్కువగా పనిచేసి అలసిపోయినప్పుడు.. ♦ పశులు రవాణా సమయంలో.. ఉన్నట్లుండి మేత మార్పిడి వలన.. ♦ వాతావరణ మార్పులు – ఎక్కువగా వేడి, గాలిలో తేమ.. ♦ నీరసంగా ఉన్న పశువులు.. ♦ వ్యాధి సోకిన పశువులను వేరుగా ఉంచడం / ఉంచకపోవడం.. వ్యాధి లక్షణాలు ♦ వ్యాధి త్వరగా సంక్రమించడం ♦ ఎక్కువగా జ్వరం ♦ నోటిలో చొంగ కార్చడం ♦ కళ్ల కలక, కంటి వెంబడి నీరు కారడం ♦ నెమరు నిలిచిపోవడం ♦ రొప్పడం, వైద్యం అందకపోతే చనిపోవడం ఎక్యూట్ కేసులలో అయితే, ఆయాసపడడం, నొప్పిగా అరవడం, ఊపిరికి కష్టపడడం, మెడ క్రింద భాగాన, గంగడోలు ప్రాంతాల్లో నీరు చేరి ఉబ్బరింపుగా ఉండడం (బ్రిస్కట్ ఎడిమా) ముందర కాళ్లు కూడా నీరు పట్టినట్లు కనబడడం లాంటి లక్షణాలను కనబరుస్తుంది. పశువు గొంతులో ఈ సూక్ష్మక్రిములు ఒక్కోసారి తిష్ట వేసుకుంటాయి. పశువు నీరసించి పోయినప్పుడు లేదా పశువులో వైరల్ వ్యాధులు ఇతర పరాన్నజీవులు దాడి చేసినప్పుడు, ఈ గొంతులోని సూక్ష్మక్రిములు విజృంభిస్తాయి. బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించిన 30 గంటలకు వ్యాధి లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. 6 నెలలు – 3 సంవత్సరాల పెయ్య / పడ్డలకు సోకుతుంది. నివారణ ♦ పరిశుభ్రమైన పాకలు, మంచి యాజమాన్యపు పద్ధతులు, ముందుగా వ్యాధి నిరోధక టీకా వేయించడం, ఆరోగ్యవంతమైన పశువులను వ్యాధి ప్రబలిన ప్రాంతాలకు వెళ్లకుండా కట్టడి చేయడం, చనిపోయిన పశువులను సక్రమంగా పాతిపెట్టడం చేయాలి. రైతులకు అవగాహన కలగజేయాలి. ♦ వ్యాధి సోకిన పశువులకు వైద్యం కోసం సల్పాడిమిడైన్ 50 కేజీల బరువుకు 30 మిల్లీ లీటర్లు చొప్పున కండకు ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. పెన్సిలిన్, టెట్రాసైక్లిన్లు ఎక్కువ మోతాదులో ఇవ్వాల్సి ఉంటుంది. 2 లేదా 3 రూపాయలతో నివారణ టీకా వేయించుకోవడం మేలు. ♦ ఏ టీకా అయినా పూర్తి స్థాయిలో పశువుకు పనిచేయాలంటే కనీసం 2 వారాల సమయం పడుతుంది. కాబట్టి రైతు సోదరులారా త్వరపడడండి. – డా. ఎం.వి.ఎ.ఎన్.సూర్యనారాయణ ,(99485 90506), ప్రొఫెసర్ అండ్ హెడ్, పశుగణ క్షేత్ర సముదాయం, పశువైద్య కళాశాల, తిరుపతి -
మురుగు ముప్పు
సాక్షి, సిటీబ్యూరో: వర్షాకాలం త్వరలో ప్రారంభం కానుంది. గ్రేటర్ పరిధిలో సుమారు 6వేల కిలోమీటర్లకు పైగా ఉన్న మురుగునీటి పైపులైన్లు, మరో 1,500 కి.మీ మార్గంలోని నాలాలను బల్దియా సమూలంగా ప్రక్షాళన చేయకపోవడంతో ముంపు ముప్పు పొంచి ఉంది. మూడు సెంటీమీటర్ల మేర వర్షపాతం కురిసినా లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలు, నాలాలకు ఆనుకొని ఉన్న బస్తీలు మునిగిపోతుండడం ప్రతిఏటా పరిపాటిగా మారింది. భారీ వర్షం కురిసిన ప్రతిసారీ నాలాలు ఉగ్రరూపం దాల్చడం, వరద, మురుగునీరు లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారులను ముంచెత్తడం తెలిసిందే. ప్రధానంగా మహానగరంలో సుమారు 120 బస్తీలతో పాటు తరచూ మురుగు సమస్యలు తలెత్తే 2,258 ప్రాంతాలకు సంబంధించి జలమండలి ప్రత్యేక మ్యాపులు సిద్ధం చేసింది. కానీ ఈ ప్రాంతాల్లో ప్రక్షాళన చర్యలు చేపట్టే విషయంలో బల్దియా, జలమండలి విభాగాలు విఫలమయ్యాయి. దీంతో ఈ సీజన్లోనూ ముంపు ముప్పు తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి. సమస్యల వర్గీకరణ.. గ్రేటర్లో ముంపు సమస్యలను నివారించేందుకు జీహెచ్ఎంసీ, జలమండలి ప్రాంతాలను నాలుగు విభాగాలుగా విభజించింది. అయినప్పటికీ ఆయా ప్రాంతాల్లో పూడికతీత, ఇతర ప్రక్షాళన పనులతో పాటు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో ఆయా విభాగాలు విఫలమయ్యాయి. ఎ కేటగిరీ: మురుగు ఉప్పొంగడానికి ఆస్కారమున్నవి. వీటిని మినీ ఎయిర్‌టెక్ యంత్రాలతో తరచూ శుభ్రం చేయడం. సిల్ట్ తొలగించి మురుగు ప్రవాహానికి ఆటంకాలు లేకుండా చేయడం. బి కేటగిరీ: నిర్వహణ డివిజన్లకు నెలవారీగా విడుదల చేసే లెటర్ ఆఫ్ క్రెడిట్ నిధులతో ఈ సమస్యలను పరిష్కరించడం. మ్యాన్‌హోళ్ల మరమ్మతులు, పునరుద్ధరణ, డీసిల్టింగ్ తదితర పనుల నిర్వహణ. సి కేటగిరీ: తరచూ మురుగు ఉప్పొంగే ప్రాంతాల్లో తక్షణ పరిష్కారానికి స్వల్ప దూరానికి పురాతన పైపులైన్ల మార్పు లాంటి పనులను వాటర్ బోర్డు సొంత నిధులతో చేపట్టడం. డి కేటగిరీ: భారీ మురుగునీటి పైపులైన్ల మార్పునకు సంబంధించినవి ఈ విభాగం కిందకు వస్తాయి. వీటి పరిష్కారానికి ప్రభుత్వానికి నివేదించడం. సర్కారు విడుదల చేసే నిధులతో భారీ పైపులైన్లు ఏర్పాటు చేయడం. -
పూడిక పూర్తయ్యేనా?
సాక్షి, సిటీబ్యూరో: మరికొన్ని రోజుల్లో వర్షాకాలం ప్రారంభం కానుంది. కానీ ప్రతిఏటా మాదిరే ఈసారీ పూడికతీత పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. వర్షాలు పడేలోపు పనులు పూర్తవుతాయో లేదో కూడా అనుమానంగానే ఉంది. వర్షాకాలానికి ముందే పూడికతీత పనులు పూర్తి చేస్తామని అధికారులు ప్రతిసారీ చెబుతున్నప్పటికీ... అమలుకు మాత్రం నోచుకోవడం లేదు. మే ముగుస్తున్న నేపథ్యంలో కనీసం జూన్ 7లోగానైనా పూడికతీత పనులు పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిశోర్ సంబంధిత ఇంజినీర్లను ఆదేశించారు. కానీ క్షేత్రస్థాయి పరిస్థితులను గమనిస్తే గడువులోగా పూడికతీత పూర్తవడం కష్టంగానే కనిపిస్తోంది. నెలల తరబడి పనులు పూర్తి చేయని అధికారులు... ఈ పది రోజుల్లో ఎలా పూర్తి చేస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గ్రేటర్ పరిధిలో దాదాపు 800 కి.మీ మేర నాలాల్లో పూడికతీత పూర్తి చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు కేవలం 465 కి.మీ మేర పనులే జరిగాయి. నగరంలో వర్షాకాలంలో కాలనీలు, రహదారులు జలమయం కావడానికి ప్రధాన కారణం... వరద నీరు వెళ్లాల్సిన నాలాల్లో పూడిక పేరుకుపోవడమే. వర్షాకాలం లోపు పూడికతీత పనులు పూర్తయితే ఎలాంటి సమస్యలు ఉండవు. కానీ ఏ సంవత్సరంలోనూ సకాలంలో పనులు పూర్తి కావడం లేదు. ఇందుకు అనేక కారణాలున్నాయి. ప్రతిఏటా జనవరి/ఫిబ్రవరిలోనే పూడికతీతకు టెండర్లు పిలిచి ఏప్రిల్/మే లోగా పనులు పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నప్పటికీ... ఈ పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేరు. ఈ పనులు చేసే కాంట్రాక్టర్లు, నాలాల్లో దిగి పూడిక తొలగించే కార్మికులు కొద్దిమంది మాత్రమే ఉన్నారు. రెండేళ్ల క్రితం పూడికతీత పేరుతో చేయని పనులు చూపిన కాంట్రాక్టర్లు, ఇంజినీర్లపై కేసులు నమోదు కావడంతో ఈ పనులంటేనే జడుసుకుంటున్నారు. అప్రమత్తం... ♦ రెండేళ్ల క్రితం సెంట్రల్ జోన్లో బిల్లుల చెల్లింపు సమయంలో పూడికను తరలించిన వాహనాలపై ఆడిట్ అధికారులకు అనుమానం రావడంతో విచారణ జరపగా... అవి ద్విచక్ర వాహనాలు, కార్ల నంబర్లని తేలడంతో అవాక్కయ్యారు. వాటిల్లో పూడిక తరలింపు అసాధ్యంకావడంతో విచారణ జరపగా కాంట్రాక్టర్లఅరెస్టులు, ఇంజినీర్ల సస్పెన్షన్లుజరిగాయి. ♦ ఈసారి పూడికను తరలించే వాహనాలకు అవి పూడిక తరలించే వాహనాలని తెలిసేలా పెద్ద అక్షరాలతో రాసి అంటించాలని ఆదేశించారు. సీసీ కెమెరాల్లో సైతం అక్షరాలు కనపడేలా ఉండేందుకు నిర్ణీత సైజుకు తగ్గకుండా అక్షరాలుండాలని నిర్దేశించారు. -
ప్రభుత్వంపై దూకుడుగానే!
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభంకానుండటంతో ఢిల్లీలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలన్నీ సమావేశమై వ్యూహాలు రచిస్తుండగా.. ఉభయసభలు సజావుగా సాగేం దుకు సహకరించాలంటూ అధికార బీజేపీ విపక్షాలను కోరింది. ఢిల్లీలో కాంగ్రెస్ నేతృత్వంలో సమావేశమైన విపక్ష పార్టీల నేతలు.. ఈ సమావేశాల్లో దూకుడుగా ప్రభుత్వాన్ని అడ్డుకోవాలని నిర్ణయించారు. అటు, పార్లమెంటు వ్యవహారాల సహాయ మంత్రి విజయ్ గోయల్.. సోమవారం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సహా ఎస్పీ, బీఎస్పీ, శివసేన, టీఆర్ఎస్, బీజేడీ, సీపీఐ తదితర పార్టీల నేతలను కలిసి దేశప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సభా కార్యక్రమాలు సాఫీగా సాగేందుకు సహకరించాలని కోరారు. జూలై 18 నుంచి ఆగస్టు 10 వరకు వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో ప్రభు త్వాన్ని ఇరుకున పెట్టేందుకు రాజ్యసభలో కాం గ్రెస్ పక్షనేత గులాంనబీ ఆజాద్ నేతృత్వంలో 12 విపక్ష పార్టీలకు చెందిన నేతలు రెండు దఫాలుగా సమావేశమయ్యారు. రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్ ఎన్నిక విషయంలోనూ ఐకమత్యంగా ముందుకెళ్లాలని నిర్ణయించారు. ప్రతిపక్షాల తరపున ఎవరిని బరిలో నిలిపినా తమ మద్దతుంటుందని కాంగ్రెస్ నేతలు ఆజాద్, మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. -
తొలకరి జల్లులు.. వ్యాధులు మొదలు
వానకాలం ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతోంది. ప్రస్తుతం చెదురుమదురు జల్లులు మాత్రమే కురుస్తున్నాయి. అయితే వానలు పూర్తిస్థాయిలో కురవడం ప్రారంభమయితే మురుగు కాలువలు పొంగిపొర్లుతాయి. చెత్తాచెదారాలు ఎక్కడికక్కడ పేరుకుపోయి నీటి వనరులు కలుషితమవుతాయి. ఏ మాత్రం అప్రమత్తంగా లేకపోయినా వ్యాధులు అంతుచూస్తాయి. నెల్లూరు(బారకాసు): వర్షాకాలం ప్రారంభంలోనే తొలకరితో మొదలయ్యే వ్యాధులు ఓ పట్టాన అంతు చిక్కవు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధుల విషయంలో వీటిని కట్టడి చేయడం సామాన్య విషయం కాదు. వర్షాలు పూర్గిగా పడక ముందే డయేరియా బాధితులు ఆస్పత్రులకు రావడం ప్రారంభమైంది. అయితే కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధులు దరికి చేరవని వైద్య నిపుణుల పేర్కొంటున్నారు. డ్రైనేజీ వ్యవస్థ వల్లే వ్యాధులు నగరంలో అస్తవ్యస్తంగా మారిన డ్రైనేజ్ వ్యవస్థ వల్ల అతిసార వంటి వ్యాధులు ప్రబలుతున్న విషయం తెలిసిందే. మంచినీటి పైపులైన్లలో లీకులు ఏర్పడి తాగునీరు కలుషితవుతోంది. అనంతరం ఆ నీటిని తాగిన ప్రజలు వాంతులు, విరేచనాలతో ఆస్పత్రుల పాలవుతున్నారు. కాగా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని శనివారం కలెక్టర్ ముత్యాలరాజు సమావేశం నిర్వహించి జిల్లా వైద్యారోగ్య, పంచాయితీరాజ్ శాఖల అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ముందస్తు చర్యల్లో భాగంగా 12 సంచార వాహనాలు ఏర్పాటు చేశారు. సీజనల్ వ్యాధులకు కారణాలివే ఈ కొలైన్, సాల్మోనెల్లా, రోటా వైరస్ అనే వేల రకాల వైరస్లు, బ్యాక్టీరియా నీరు, ఆహారంలో కలిసినప్పుడు అతిసార, డయేరియా వ్యాధులు సోకుతాయి. కొన్ని రకాల వైరస్ల కారణంగా నీళ్ల విరోచనాలతో పాటు, రక్త విరోచనాలు కూడా అయ్యే అవకాశాలున్నాయి. గాలిలో తేమ ఎక్కువగా ఉండటం, వర్షంలో తడవడం వల్ల జలుబుతో పాటు వైరల్ ఫీవర్లు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. అతిసార వ్యాధికి కారణాలు కలుషిత నీరు, ఆహారం.లక్షణాలురోజులో 10 నుంచి 20 సార్లు నీళ్ల విరేచనాలతో పాటు వాంతులు అవుతుంటాయి. కలుషిత నీటి వల్ల వచ్చే ఈ వ్యాధి రోగి కుటుంబ సభ్యులతో పాటు ఆ ప్రాంతంలో అధిక సంఖ్యలో ఒకేసారి సోకుతుంది. రోగి త్వరగా డీహైడ్రేషన్‌కు గురై షాక్‌లోకి వెళ్లిపోతారు. ఈ వ్యాధి చిన్నారులు, మధుమేహ రోగులు, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కళ్లు లోతుకు పోవడం, నీరసించిపోవడం, చురుకుదనం తగ్గి, మాట్లాడలేక పోవడం, చివరికి మూత్రం కూడా తగ్గి ఆ ప్రభావం కిడ్నీలపై పడుతుంది. అతిసారకు గురైన వారిని సాధ్యమైనంత త్వరగా ఆస్పత్రికి తీసుకువెళ్లాలి డయేరియా వ్యాధికి కారణాలు కలుషిత నీరు, కలుషిత ఆహారం, నిల్వ ఉన్న ఆహారం తీసుకోవడం లక్షణాలు నీళ్ల విరేచనాలు అవుతాయి. రోజులో నాలుగు నుంచి ఐదుసార్లు విరోచనం అయితే డయేరియాగా భావించాలి. చికిత్స ఎక్కువ సార్లు విరేచనాలు అవడం వల్ల శరీరంలోని నీరు, లవణాలు, పొటాషియం, గ్లూకోజ్ తగ్గిపోయి రోగి షాక్‌లోకి వెళ్లిపోతాడు. బీపీ పడిపోవడం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. రెండు మూడు సార్లు నీళ్ల విరేచనాలు అయినప్పుడు తక్షణమే వైద్యుని వద్దకు వెళ్లి చికిత్స పొందడం మంచిది. రక్త విరేచనాలు కలుషిత ఆహారం వల్ల వస్తాయి. తీవ్రమైన కడుపునొప్పితో రక్త విరేచనాలు అవుతుంటాయి. రక్తంతో కూడిన విరేచనం అవడం వల్ల ఇతర వ్యాధులని ప్రజలు అపోహ పడుతుంటారు. వీరి మలాన్ని పరీక్ష చేసి వ్యాధి కారకాన్ని గుర్తించాలి. జాగ్రత్తలు డయేరియా సోకిన రోగికి మామూలు వ్యక్తులు, చిన్నపిల్లలు దూరంగా ఉండాలి. లేకుంటే వారికి కూడా సోకే అవకాశం ఉంటుంది. రోగిని పట్టుకున్నప్పుడు చేతులను సబ్బుతో కడుక్కోవడం ద్వారా వ్యాధి సోకకుండా 90 శాతం అరికట్టవచ్చు వ్యాధి సోకిన రోగికి కొబ్బరినీళ్లు, మజ్జిగ, బార్లీనీళ్లు, ఓఆర్ఎస్ ద్రావణం ఇవ్వాలి. విరేచనాలు అవుతున్నప్పుడు పాలు, పండ్లు, ఆకుకూరలు ఇవ్వకూడదు. వేయించిన బ్రెడ్, లైట్ టీ, దోరగా పండిన అరటి పండు, అన్నం, పప్పు తీసుకోవచ్చు. విరేచనం తర్వాత తప్పనిసరిగా సుబ్బుతో చేతులు కడుక్కోవాలి. విరేచనాలు అవుతున్నప్పుడు ఒక లీటర్ నీటిలో ఓఆర్ఎస్ ప్యాకెట్‌ను కలిపి 3 నుంచి 4 గంటల వ్యవధిలో మొత్తం తాగాలి. -
డెంగీ బెంగ
రాయగడ : వర్షాకాలం ప్రారంభంలోనే డెంగీ జ్వరం ప్రభావం ఉండవచ్చన్న ముందస్తు ఆలోచనతో ప్రజలను చైతన్యవంతులను చేస్తూ గ్రామీణ ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆశకార్యకర్తలు, అంగన్వాడీ వర్కర్లకు జిల్లా యంత్రాంగం, జిల్లా వైద్య విభాగం ఆదేశాలు జారీ చేశాయి. ఇటీవల డెంగీ దినోత్సవాన్ని నిర్వహించి మరిన్ని సూచనలు ఇస్తూ డెంగీ జ్వరానికి మందులు లేవని పరిసరాల శుభ్రతతో సహా ఇళ్లలో వేపాకు పొగ వేస్తూ ఇంట్లో మంచినీటి నిలువలు ఉండకుండా ప్రజలు దొమతెరల్లో నిద్రించాలని సూచించారు. అయితే రాయగడ జిల్లా ఆస్పత్రికి 7కిలోమీటర్ల దూరంలో గల కొత్తపేట గ్రామపంచాయతీ వీరనారాయణపురం గ్రామంలో ప్రజలు జ్వరాలతో బాధ పడుతున్న సమాచారంతో జిల్లా వైద్యబృందం గ్రామానికి వెళ్లి 13మంది రక్తనామూనాలు సేకరించి కొరాపుట్ రక్తపరీక్ష కేంద్రానికి పంపగా ఆ నమూనాల్లో ఏడుగురు వ్యక్తులకు డెంగీ జ్వరం సోకినట్టు వైద్య పరీక్షలో తేలింది. గ్రామంలో పారిశుద్ధ్య లోపం గ్రామంలో సుమారు వంద కుటుంబాలు నివసిస్తున్నాయి. గ్రామంలో గొట్టపు బావుల ప్రాంతంలో బురద పేరుకుపోయి, కాలువల్లో టన్నుల కొద్దీ పూడికలు నిండిపోవడంతో జిల్లాలో మొట్టమొదటిసారిగా డెంగీ వ్యాధి బయటపడింది. పంచా యతీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా పారిశుద్ధ్య నిర్మూలన కార్యక్రమాలు, స్వచ్ఛభారత్ కార్యక్రమాలు సరిగా చేయకపోవడం, పంచాయతీ ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కారణంగా డెంగీ విజృంభించింది. గ్రామంలో సక్రమంగా దోమతెరలు వినియోగించక పోవడం, కాలువలు, గొట్టపు బావులు, ఇళ్ల దగ్గర నీటి నిలువలు నిలిచిపోవడంతో దోమలు విస్తరించి గ్రామస్తులు జ్వరాల బారిన పడుతున్నారు. గ్రామ సమీప జీమిడిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో డెంగీ జ్వరం సోకిన పవిత్ర కడ్రక మగవాడు(7) రంజిత తాడింగి(20) అర్జుమహనందియా(15) మధుబాయిసారక (23) కుమారిసారక(17)తదితరులు చికిత్స పొందుతున్నారు. గ్రామంలో ఇంకా జ్వరపీడితులు అధికంగా ఉన్నారు. -
చెట్టుకిందికి చేరొద్దు..గొడుగు వాడొద్దు
పరిగి : వర్షాకాలం వచ్చిందంటే చాలు ఏటా జిల్లాలో పదుల సంఖ్యలో పిడుగు పాటుకు గురై మృత్యువాత పడుతున్నారు. అనుకోకుండా వచ్చి పడే భయోత్పాతానికి బలవుతున్నవారిలో రైతన్నలు, పశువుల కాపరులే ఎక్కువ శాతం ఉంటున్నారు. ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో పడే పిడుగుల కారణంగా ఏడాదికి 24 వేల మంది మృత్యువాత పడుతుండగా మరో రెండు లక్షల మంది వరకు గాయాలపాలవుతున్నట్లు ప్రపంచ ప్రకృతి వైపరీత్యాల గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సెకనుకు 100కు పైగా పిడుగులు పడుతున్నట్లు అంచనా వేస్తున్నారు. అయితే ఉరుములు..మెరుపులు వచ్చే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం.. అప్రమత్తంగా ఉండటం వల్ల పిడుగు పాటు నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. పోలీసులు పిడుగు పాటు అంశంపై ఓ వీడియోనూ రూపొందించి అవగాహన కల్పిస్తున్నారు. సూర్యుని ఉపరితల ఉష్ణోగ్రత కంటే ఐదు రెట్లు అధికం.. పిడుగు పాటు విషయంలో ప్రధానంగా పల్లెటూర్లలో అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. దేవదానవ యుద్ధం కారణంగా ఇలా ఉరుములు, మెరుపులు వస్తాయని.., అయితే మెరుపులు వచ్చే సమయంలో అర్జున..ఫాల్గున అంటే వారు మనల్ని పిడుగుల బారి నుంచి రక్షిస్తారని పెద్దలు చెబుతూ ఉండటం మనందరికి తెలిసిందే... అయితే పిడుగు పడినప్పుడు ఉత్పన్నమయ్యే ఉష్ణోగ్రతలు మామూలు ఉష్ణోగ్రతకు ఐదు రెట్లు ఉంటాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. నిరంతరం మండుతున్న అగ్నిగోళంగా చెప్పుకునే సూర్యుని ఉపరితలంపై 5700 సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. కానీ పిడుగు పడినప్పుడు ఉత్పన్నమయ్యే ఉష్ణోగ్రత సూర్యుని ఉపరితల ఉష్ణోగ్రతకు సుమారు ఐదు రెట్లు అధికంగా అంటే 29000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుందట... అసలు పిడుగు అంటే ఏమిటి... మేఘాల వద్ద ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటం వల్ల నాటి ఆవిరి చిన్న చిన్న నీటి బిందువుల రూపంలో ఉంటుంది. ఇదే సమయంలో విపరీతమైన గాలులు వీచినప్పుడు ఆ మంచు కణాలు, నీటి బిందువుల మధ్య రాపిడి జరిగి ఎలక్ట్రికల్ చార్జి ఉత్పన్నమవుతుంది. దీంతో పాజిటివ్.. నెగెటివ్ చార్జి ఉన్న కణాలు విడుదల అవుతాయి. వీటిలో పాజిటివ్ చార్జి కణాలు తేలికగా ఉండటం వల్ల అవి మేఘంలోని పై భాగానికి.. అలాగే నెగెటివ్ కణాలు బరువుగా ఉండటం వల్ల కింది భాగానికి చేరుకుంటాయి. ఇప్పుడు అవి అయస్కాంతంలోని ఉత్తర దక్షిణ ధృవాలు ఎలా ఆకర్షించుకుంటాయో అలాగే అక్కడ జరుగుతుంది. రెండు వేర్వేరు మేఘాలు దగ్గరగా వచ్చినప్పుడు.. పై మేఘంలో ఉండే నెగెటివ్ చార్జ్ కణాలు..కింద మేఘంలో ఉన్న పాజిటివ్ చార్జి కణాల మధ్య రాపిడి జరుగుతుంది. దీంతో ఆ రెండింటి మధ్య మెరుపు. (విద్యుత్తు).. ఉరుము(శబ్దం) ఉత్పన్నమవుతాయి. ఈ సమయంలోనే మేఘంలోని కింది భాగంలో ఉండే నెగెటివ్ చార్జి కణాలు భూ ఉపరితలంపై ఉండే పాజిటివ్ చార్జి కణాల చేత ఆకర్షించబడతాయి. ఇలా నెగెటివ్ చార్జి కణాలు భూమిని చేరే క్రమంలో మేఘాల్లో రాపిడికి ఉత్పన్నమైన విదుత్తు భూమిని చేరుతుంది. దీన్నే మనం పిడుగు అంటాం.. ప్రధానంగా ఈ నెగెటివ్ చార్జి కణాలు భూమిని చేరే క్రమంలో ఎత్తయిన ప్రదేశాలు.. చెట్లు, కొండలు, మనుషులు, జంతువులను ఎంచుకుని వాటి ద్వారా భూమిని చేరుతాయి. ఆ చేరే క్రమంలో ఆ కణాలు దేని ద్వారా చేరితే..అవి మసి అయిపోతూ ఉండటం మనం చూస్తుంటాం... ఈ జాగ్రత్తలు తీసుకోవాలి....కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటం వల్ల పిడుగు పాటు నుంచి బయటపడవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. * ఉరుములు, మెరుపులు పిడుగులు పడే సమయంలో ల్యాండ్‌లైన్ ఫోన్ మాట్లాడకూడదు. * ల్యాండ్‌లైన్ ఫోన్‌కు బదులు కార్డ్‌లెస్ ఫోన్‌గానీ, సెల్ ఫోన్‌గానీ వాడవచ్చు. అదీ ఇంట్లో ఉండిమాత్రమే. * ఉరుములు, మెరుపుల సమయంలో టీవీ చూడటం ప్రమాదం. ఇంకా చెప్పాలంటే స్విచ్‌బోర్డుల నుంచి ప్లగ్‌లు తీసి వేయాలి. లేదంటే ఎలక్ట్రిక్ వస్తువులన్నీ పాడయ్యే ప్రమాదముంది. * ఉరుములు, మెరుపుల సమయంలో ట్యాప్ కింద చేతులు కడగటం, గిన్నెలు కడగటం, షవర్ కింద స్నానం చేయటం లాంటివి చేయకూడదు. * ఇంటి కిటికీలు, తలుపుల దగ్గర నిల్చోవటం. వాటి దగ్గర నిల్చుని బయటకు చూడటం మంచిది కాదు. * ఉరుములు, మెరుపుల సమయంలో బయట ఉంటే షెల్టర్ వెతుక్కోవాలి. కానీ చెట్ల కిందకి మాత్రం ఎట్టి పరిస్థితిలో వెళ్లకూడదు. ఎందుకంటే చెట్లు, కరెంటు స్తంభాలు పిడుగులను సులువుగా ఆకర్షిస్తాయి. అందుకే చెట్లపైన ఎక్కువగా పిడుగులు పడే ప్రమాదం ఉంది. * పిడుగులు పడే సమయంలో వర్షంలో తడిసినా పరవాలేదు.. కానీ గొడుగు వాడకూడదు. దగ్గరలో కారు ఉంటే..ఏదైనా షెడ్డు ఉన్నా దాంట్లో కూర్చోవచ్చు. ఎఫ్ఎం రేడియో వినకూడదు.. * ఎక్కడా షెల్టర్ దొరక్కుంటే ఎత్తు తక్కువగా ఉండే ప్రదేశాల్లో కూర్చుని తలకిందకు వంచి చెవులు, కళ్లు మూసుకుని కూర్చోవాలి. * పెంపుడు జంతువులైన ఆవులు, గేదెలు, కు క్కలు లాంటి వాటిని బయట వదిలేయకుం డా షెడ్లలో ఉంచాలి. లేదంటే బయట ఉంటే చెట్లకిందకు వెళ్లకుండా చూసుకోవాలి. * ఉరుములు, మెరుపుల సమయంలో మన శరీరం జలదరింపుకు గురి కావటం, వెంట్రుకలు నిక్కబొడుచుకోవటం లాంటి సంకేతాలు పిడుగులు పడే సమయంలో కనిపిస్తాయి. ఇలా జరిగితే పిడుగు మీ దగ్గరలో పడుతున్నట్లు అర్థం. అప్పుడు మరింత అప్రమత్తం కావాలి. -
కిలో రూ.200
బెల్లంపల్లి : వర్షాకాలంలో మాత్రమే లభించే బోడ కాకరకాయల ధర ఆకాశానికి ఎగబాకింది. ఖరీఫ్ సీజన్ ఆరంభమైన సరిగ్గా నెల రోజులకు మార్కెట్లో బోడ కాకరకాయలు అమ్మకానికి వచ్చాయి. ఆసిఫాబాద్ ప్రాంతం నుంచి బెల్లంపల్లికి బోడ కాకరకాయలను విక్రయానికి తీసుకొచ్చారు. కిలోకు రూ.200 చొప్పున అమ్మారు. వర్షాకాలంలో మాత్రమే అరుదుగా లభించే బోడ కాకరకాయలో ఔషధగుణాలు మెండుగా ఉండడంతో ధర ఎక్కువైనా అనేక మంది కొనుగోలు చేశారు. -
వర్షాకాలం... స్ప్రే, జెల్‌తో బలహీనం...
బ్యూటిప్స్ వర్షాకాలంలో శిరోజాల సంరక్షణ పెద్ద కష్టమేమీ కాదు. అలాగని, సులువుగా పూర్తిగా వదిలేయలేం. వెంట్రుకలు పొడిబారడం, చిట్లడం.. ఈ కాలం ప్రధాన సమస్యలుగా ఉంటాయి. ♦ఈ కాలం హెయిర్ స్ప్రేలు లేదా జెల్స్ ఉపయోగించకూడదు. వర్షంలో నానినప్పుడు స్ప్రే చేసినవి, జెల్ రసాయనాలు మాడుకు పట్టుకుంటాయి. ఇవి మాడును నిస్తేజంగా మార్చడం, వెంట్రుకల కుదుళ్లను బలహీనంగా మారుస్తాయి. ♦ ప్రతి రోజూ రాత్రి పడుకునేముందు మునివేళ్లతో మాడును మృదువుగా మర్దనా చేసుకోవాలి. దీంతో రక్తప్రసరణ మెరుగవుతుంది. ♦ చల్లగా ఉంటుంది కదా అని మరీ వేడి నూనెలను ఉపయోగించకూడదు. వారానికి ఒకసారి గోరువెచ్చని నూనెను మర్దనకు ఉపయోగించి, శుభ్రపరుచుకుంటే చాలు. ♦ పొడవాటి జుట్టును ఎక్కువసేపు గట్టిగా ముడివేయడం వంటివి కాకుండా, వీలైనంత వదులుగా ఉండేలా జాగ్రత్త తీసుకోవడం మంచిది. ♦ తలకు నూనె పెట్టి ఉండటం, అలాగే వర్షంలో తడవడం, ఆ తర్వాత రెండు రోజులకు శుభ్రం చే యడం ఇలాంటి విధానం వల్ల వెంట్రుకలు మరింత దెబ్బతినే అవకాశం ఉంటుంది. ♦ రాత్రిపూట తలకు నూనె పెట్టి మర్దన చేసి, మరుసటి రోజు ఉదయం షాంపూ లేదా శీకాకాయతో జుట్టును శుభ్రం చేసుకోవ డం మంచిది. -
‘హరితం’.. అధ్వానం
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న తెలంగాణ హరితహారం పథకం అమలు జిల్లాలో అధ్వానంగా మారింది. నియోజకవర్గానికి 40లక్షల మొక్కల చొప్పున వర్షాకాలం నాటికి రైతులకు పంపిణీ చేయాలని భావించారు. అధికారుల మధ్య సమన్వయలోపంతో ఈ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. అయితే వర్షాకాలం నాటికి మొక్కలు పెంచితేనే డిమాండ్ ఉంటుంది.. లేదంటే రైతులు విముఖత చూపే అవకాశం ఉంది. ఇదే జరిగితే కోట్ల రూపాయల నిధులు వృథాకాక తప్పదు..! మహబూబ్‌నగర్ వ్యవసాయం: పర్యావరణ పరిరక్షణతో పాటు వాతావరణ సమతుల్యత, భూసారాన్ని కాపాడేందుకు ఉద్దేశించిన హరితహారం పథకం అమలు జిల్లాలో నత్తనడకన సాగుతోంది. పొలం గట్లు, ఖాళీస్థలాల్లో పెంచేందుకు ఏడాదిలో సుమారు 5.60కోట్ల మొక్కలు పెంచి రైతులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయిచింది. కొన్నింటిని అటవీశాఖకు, మరికొన్నింటిని డ్వామాకు కేటాయించింది. అందులో భాగంగానే డ్వామా పరిధిలో జిల్లాలోని 62 మండలాల్లో 160 లక్షల మొక్కల చొప్పున 160 నర్సరీల ద్వారా పెంచేందుకు నిధులు విడుదల చేసింది. ఒక్కోనర్సరీలో లక్ష మొక్కలు పెంచేవిధంగా మూణ్నెళ్లక్రితం న ర్సరీలను కూడా మంజూరుచేసింది. ఈ క్రమంలో 1.44కోట్ల టేకుమొక్కలు పెంచేందుకు అధికారులు శ్రీకారం చుట్టగా.. కేవలం 62 నర్సరీల్లో మాత్రమే ఆ ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లాలో ఇంకా 82 నర్సరీలకు 82లక్షల టేకుస్టంప్స్ రావాల్సి ఉంది. 16లక్షల వెదురు మొక్కల పెంపకానికి అధికారులు సిద్ధమైనా పనులు సాగడం లేదు. ఇలా ఇప్పటివరకు కేవలం 62 నర్సరీల్లో మాత్రమే మొక్కలు పెంచుతున్నారు. జాప్యానికి కారణాలివే.. ఒక్కోస్టంప్కు 0.99పైసల చొప్పున కొనుగోలు చేసేందుకు ఇతర రాష్ట్రాలకు చెందిన పంపిణీదారులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మేరకు ఇప్పటివరకు జిల్లాకు కేవలం రూ.55లక్షల విలువచేసే 62లక్షల స్టంప్స్ మాత్రమే ఇవ్వగలిగారు. రూ.70 లక్షలు విలువచేసే 160లక్షల పాలిథిన్ కవర్లను గతనెల అందజేశారు. పాలిథిన్ సంచుల్లో మట్టి నింపేందుకు, నర్సరీ పనులు చేసేందుకు రెండు నెలలుగా కూలీలకు 70శాతానికి పైగా కూలీడబ్బులు చెల్లించాల్సి ఉంది.మట్టి తరలింపు, ఎరువులు, ట్రాక్టర్ తదితర పనులకు రైతులకు బిల్లులు రాకపోవడంతో నిరుత్సాహంతో చాలాచోట్ల అర్ధాంతరంగా పనులను నిలిపేశారు. ఇలా ఒక్కో నర్సరీకి రూ.7.60 లక్షలు ఖర్చవుతుందని అధికారులు అంచనావేశారు. లక్ష్యం మేరకు పనులు పూర్తయినా ఇప్పటివరకు 30శాతం కూడా చెల్లింపులు జరగలేదు. ఈ నేపథ్యంలో పంపిణీదారులు మిగతా స్టంప్స్ ఇవ్వడానికి ముందుకురావడం లేదు. అధికారుల మధ్య సమన్వయలోపం జిల్లాలో ఎంపీడీఓలు, ఏపీఓల మధ్య సమన్వయం లోపించడంతో హరితహారం పనులు సక్రమంగా జరగడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఉపాధిహామీ పనులను పర్యవేక్షణ బాధ్యతను ప్రభుత్వం మొదట్లో ఎంపీడీఓలకు అప్పగించింది. వారు విముఖత చూపడంతో గతేడాది అక్టోబర్‌లో పీఓలుగా అదనపుబాధ్యతలు అప్పగించింది. నాటినుంచి ఎంపీడీఓలు ఉపాధి పనుల పట్ల చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. పనులను పర్యవేక్షించిన దాఖలాలు చాలా తక్కువే. ఉపాధి పనులకు డీఎస్కే ద్వారా కూలీలు చెల్లించే బాధ్యత ఎంపీడీఓలపై ఉంటుంది. కాగా, వీటి విషయంలో సదరు అధికారులు అంటిముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో జిల్లాలో నాలుగునెలలుగా చెల్లింపులు ఆగిపోయాయి. సకాలంలో కూలీలకు డబ్బులు చెల్లించకపోవడంతో పనులు చేసేందుకు ముందుకురావడం లేదు. జూన్‌లోగా అందించకుంటే వృథాయే నర్సరీలో మొక్కల పెంపకానికి ఐదునెలల సమయం పడుతుంది. ఈనెల 15వ తేదీలోగా జిల్లాలోని నర్సరీల్లో మొక్కల పెంపకాన్ని ప్రారంభించాలని అధికారులు ప్రణాళిక సిద్ధంచేసినా ఇప్పటివరకు 62నర్సరీల్లో మాత్రమే పనులు మొదలయ్యాయి. మిగతా 98 నర్సరీల్లో పనులు మొదలుకావాల్సి ఉంది. వర్షాకాలం ప్రారంభమయ్యేలోగా మొక్కులు పెంచితేనే డిమాండ్ ఉంటుంది. లేదంటే విముఖత చూపే అవకాశం ఉంది. ఇదే జరిగితే కోట్లు ఖర్చుచేసి పెంచిన మొక్కులు వృథా అయ్యే అవకావం ఉంది. ఎంపీడీఓలు సహకరించాలి తెలంగాణ హరితహారం నర్సరీలకు సంబంధించిన బిల్లులను ఎప్పటికప్పుడు చెల్లించాల ని ఎంపీడీఓలకు చాలాసార్లు తెలి యజేశాం. అయినప్పటప్పటికీ డీఎస్కే ద్వారా బిల్లులు చెల్లిం చేందుకు ఎంపీడీఓలు ముందుకురావడం లేదు. దీంతో స్టంప్స్, పాలిథిన్ కవర్లు పంపిణీచేసిన వారికి బిల్లులు చె ల్లించకపోవడంతో కొత్తవాటిని ఇవ్వడం లేదు. కూలీలకు సకాలంలో డబ్బులు చెల్లించకపోవడంతో పనులు చే సేందుకు వారు ముందుకురావడం లేదు. ఎంపీడీఓలు వెంటనే నర్సరీలకు సంబంధించిన బిల్లులు చెల్లించి పనులు ముందుకుసాగే విధంగా సహకరించాలి. - సునందరాణి, డ్వామా పీడీ -
రైతుల రెక్కల కష్టం నేలపాలు
* ఐదు జిల్లాలో అకాల వర్షం * తడిసిన ధాన్యం * లబోదిబోమంటున్న రైతన్నలు న్యూస్‌లైన్ నెట్వర్క్: అకాల వర్షాలు రైతుల కంటిపై కునుకులేకుండా చేస్తున్నాయి. సోమవారం రాత్రి, మంగళవారం కురిసిన వర్షాలు చేతికి వచ్చిన పంటను నేలపాలుచేశాయి.నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్, నల్లగొండ జిల్లాల్లో ఈదురు గాలులు, వడగండ్ల వాన మార్కెట్లు, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వరి, పసుపు, మామిడి పంటలకు తీవ్రనష్టం కలిగించాయి. వివరాలివీ... నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలో సోమవారం రాత్రి కురిసిన అకాల వర్షంతో సజ్జ, వరి పంటలకు నష్టం వాటిల్లింది. మాక్లూర్ మండలంలో వరి, టమాటా, పసుపు పంటలు దెబ్బతిన్నాయి. ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్, ఠాణాకలాన్, పోచా రం తదితర గ్రామాలలో వరికి భారీ నష్టం వాటిల్లింది. నిజామాబాద్ మార్కెట్లోని ధాన్యం, పసుపు నిల్వలు భారీగా తడిసిపోయాయి. దీంతో రైతులు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలం టూ మార్కెట్లో ఆందోళనకు దిగారు. వరంగల్ జిల్లా ములుగు, వెంకటాపూర్, ఖానాపూర్, కేసముద్రం మండలాల్లో 1345 హెక్టార్లలో కోతకొచ్చిన వరి చేతికి రాకుండా పోయింది. పరకాల, భూపాలపల్లి, నర్సంపేట, పాలకుర్తి తదితర ప్రాంతాల్లో వరిపంటతో పాటు పండ్లు, కూరగాయల తోటలు నాశనమయ్యాయి. కళ్లాల్లో ఆరబోసిన మిర్చి తడిసింది. ములుగు, జనగామ, కేసముద్రం మార్కెట్లోకి తెచ్చిన ధాన్యం తడిసి ముద్దరుుంది. కరీంనగర్ జిల్లాలో సోమవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి ఉంచిన ధాన్యం తడిసిపోయింది. పదిహేను రోజులుగా కొనుగోళ్లలో జాప్యం జరుగుతుండటంతో గత వారం కురిసిన వర్షానికి ఓసారి ధాన్యం తడిసి ముద్దయింది. దానిని ఎండబెట్టి తూకం కోసం ఎదురుచూస్తున్న రైతుల ధాన్యం మళ్లీ సోమవారం నాటి వర్షం తడిసిపోయింది. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మంథని, బేగంపేట, కమాన్‌పూర్, కోరుట్ల మండలం అయిలాపూర్‌లో రైతులు రాస్తారోకోలు నిర్వహించారు. ఈదురు గాలులతో సూర్యాపేట, నల్లగొండ డివిజన్లలో కరెంటు స్తంభాలు నేలకూలి విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. ఆదిలాబాద్ జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలోని చెన్నూర్, కోటపల్లి, జైపూర్ మండలాల్లో 1,500 ఎకరాల్లో మామిడి కాయలు నేలరాలాయి. కోటపల్లి మండలంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆయా మండలాల్లో 20కి పైగా ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి. ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనూ ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ధాన్యం తడిసింది.. రైతు గుండె ఆగింది కోనరావుపేట, న్యూస్‌లైన్: ఐకేపీ సెంటర్లో అమ్మకానికి తెచ్చిన ధాన్యం అకాల వర్షానికి తడిసిపోవడంతో మనస్తాపానికి గురై కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లికి చెందిన గుమ్మడి చిన్న రాజయ్య(65) మంగళవారం గుండెపోటుతో మృతి చెందాడు. రాజయ్య తనకున్న రెండెకరాల పొలంతోపాటు గ్రామంలో ఎకరన్నర కౌలుకు తీసుకుని వరి సాగుచేశాడు. పొలం కోతకు వచ్చిన దశలో వారంక్రితం కురిసిన వర్షానికి వడ్లగింజలు రాలిపోయాయి. మిగిలిందైనా దక్కించుకుందామని సోమవారం హార్వెస్టర్‌తో పొలం కోయించాడు. సుమారు 95క్వింటాళ్ల ధాన్యం దిగుబడి రాగా.. నేరుగా ఐకేపీ కొనుగోలు కేంద్రంలో అమ్మకానికి తరలించాడు. అక్కడా ఆయనను దురదృష్టమే వెంటాడింది. కేంద్రంలో పోసి గంటలు కూడా గడవకముందే సోమవారం రాత్రి వర్షం కురిసి ధాన్యం మొత్తం తడిసిపోయింది. దీంతో మనస్తాపం చెందిన రాజయ్య మంగళవారం ఉదయం గుండెపోటుతో ఇంట్లో కుప్పకూలి చనిపోయాడు. కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు.