నైరుతి రుతుపవనాలపై భారీ ఆశలు | Telangana Farmers Keeping More Expectations On Raining Season | Sakshi
Sakshi News home page

‘నైరుతి’పై భారీ ఆశలు

Published Sat, Jun 13 2020 2:34 AM | Last Updated on Sat, Jun 13 2020 7:47 AM

Telangana Farmers Keeping More Expectations On Raining Season - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోకి సకాలంలో నైరుతి రుతుపవనాల ప్రవేశంతో ఈ ఏడాది కూడా వర్షాలపై రైతాంగంలో భారీ ఆశలు కనిపిస్తున్నాయి. ఈ సీజన్‌లో సాధారణంకన్నా ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేయడం, రుతుపవనాలు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించడంతో సిరుల పంటలపై రైతుల్లో ధీమా వ్యక్తమవుతోంది.

గత పదేళ్లలో ఐదేళ్లే మంచి వానలు... 
గత పదేళ్ల రికార్డులు పరిశీలిస్తే ఐదేళ్లు మాత్రమే వానాకాలం సీజన్‌ రాష్ట్ర రైతాంగానికి కలిసొచ్చింది. వానాకాలం సీజన్‌లో సాధారణ వర్షపాతం 759.3 మిల్లీమీటర్లుకాగా 2010, 2012, 2013, 2016, 2019లోనే ఆ మేర, అంతకన్నా ఎక్కువ వర్షం కురిసింది. మరోవైపు 2011, 2014, 2015, 2017, 2018 సంవత్సరాల్లో సాధారణంకన్నా తక్కువ వర్షాలు కురిసి రైతులను నిరాశపరిచాయి. 2010లో అత్యధికంగా సాధారణంకన్నా 32 శాతం ఎక్కువ వర్షాలు కురవగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన 2014లో ఏకంగా 34 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. అయితే గతేడాది సాధారణంకన్నా 6 శాతం ఎక్కువ వర్షాలు కురవడంతో ఈసారి కూడా వరుణుడి కరుణ రాష్ట్రంపై ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇందుకు తగ్గట్లు వాతావరణ సంకేతాలు కూడా ఉండటం రైతుల్లో ఆశలు రేకెత్తిస్తోంది.

వాస్తవానికి వానాకాలం సీజన్‌ నాలుగు నెలల్లో జూన్‌ (135.5), జూలై (242.4), ఆగస్టు (218), సెప్టెంబర్‌ (171.4) మిల్లీమీటర్ల వర్షం కురవాలి. గతేడాది వివరాలు పరిశీలిస్తే జూన్‌లో 35 శాతం తక్కువగా 85.7 మి.మీ, జూలైలో 7 శాతం తక్కువగా 218.8 మి.మీ, ఆగస్టులో 14 శాతం ఎక్కువగా 260 మి.మీ, సెప్టెంబర్‌లో 47 శాతం ఎక్కువగా 241.1 మి.మీల వర్షం కురిసింది. జిల్లాలవారీగా చూస్తే 6 చోట్ల అధికంగా, 22 చోట్ల సాధారణం, 3 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. ఈసారి కూడా వర్షాలు సాధారణంకన్నా ఎక్కువ వస్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. తెలంగాణలో జూన్‌ నుంచి సెప్టెంబర్‌ మధ్య వర్షపాతం 102 శాతం (8 శాతం +/–) ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీంతో ఈసారి వర్షాలు బాగానే కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సిద్దిపేటలో కుండపోత.. 
సిద్దిపేట జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం 8:30 గంటల వరకు సిద్దిపేట జిల్లా కేంద్రంలో అత్యధికంగా 21.6 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. జిల్లాలోని మరో 5 ప్రాంతాల్లో 10 సెం.మీ.కన్నా ఎక్కువ వర్షం పడింది. అలాగే జనగామ, పెద్దపల్లి, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్‌ జిల్లాల్లోనూ జోరుగా వర్షాలు కురిశాయి. మొత్తంమీద రాష్ట్రవ్యాప్తంగా 20 చోట్ల 8 సెం.మీ. కన్నా ఎక్కువ వర్షపాతం నమోదైంది. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌లో 6.2, మంచిర్యాల జిల్లా జన్నారంలో 4.7, అదే జిల్లా పరిధిలోని ఖవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌లో 4.2, వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఐనవోలులో 4.1 సెం.మీ. చొప్పున వర్షం కురిసినట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. మిగిలిన చోట్ల సాధారణ వర్షాలు కురిశాయని పేర్కొంది.
మరో 2 రోజులు వర్షాలు.. 
రాష్ట్రవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం శుక్రవారం వెల్లడించింది. ఉత్తర కోస్తాంధ్ర, ఒడిశా, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని, దీనికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది. ఇది ఎత్తు పెరిగేకొద్దీ నైరుతి దిశ వైపునకు వంపు తిరుగుతోందని, ఆగ్నేయ మధ్యప్రదేశ్, పరిసర ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొది. దీంతో తెలంగాణలో శని, ఆదివారాల్లో అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వివరించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమురం భీం, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, వరంగల్‌–పట్టణ, వరంగల్‌–గ్రామీణ, ఖమ్మం జిల్లాల్లో శనివారం అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement