సాక్షి, హైదరాబాద్: వర్షంలో బయటికి వెళ్లాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. తడిసిపోతామనో లేక బురదగా ఉంటుందనో. కానీ, గృహ అన్వేషణ కోసం ఇదే సరైన సమయం అంటున్నారు రియల్టీ నిపుణులు. వానల్లోనే ఇంటి నిర్మాణ నాణ్యత, ప్రాంతం పరిస్థితి క్షుణ్ణంగా తెలుస్తుంది కాబట్టి సొంతింటి ఎంపికకు ఇదే సరైన కాలమని సూచిస్తున్నారు.
గృహ కొనుగోలుదారులు అంతిమ నిర్ణయం తీసుకునే ముందు ప్రాజెక్ట్ ఉన్న ప్రాంతం వాస్తవ పరిస్థితిని తెలుసుకోవాలంటే వర్షంలో ప్రాజెక్ట్‌ను పరిశీలించాలి. నగరం ఏదైనా సరే వానొస్తే చాలు రహదారులన్నీ ట్రాఫిక్ జామ్ అవుతాయి. వర్షం నీరు వెళ్లే చోటు లేక రోడ్లన్నీ మునిగిపోతాయి. ఇది ఇల్లు ఉన్న ప్రాంతం వాస్తవ పరిస్థితిని తెలియజేస్తుంది. ప్రాజెక్ట్ ఉన్న ప్రాంతంలో ప్రజా రవాణా వ్యవస్థ ఎలా ఉంది? ఇంటి నుంచి బస్ స్టాండ్ లేక రైల్వే స్టేషన్‌కు చేరుకునేందుకు ఎంత సమయం పడుతుంది. వంటి వాస్తవ పరిస్థితులు తెలుస్తాయి.
నాణ్యత తెలుస్తుంది..
ప్రాజెక్ట్ ఉన్న ప్రాంతంతో పాటూ ఇంటి నిర్మాణ నాణ్యత బయటపడేది కూడా వానాకాలమే. గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ప్రాజెక్ట్‌లో కొనుగోలు చేసే కొనుగోలుదారులు మాత్రం వానాకాలంలో ఇంటి నాణ్యత చెక్ చేసుకోవటం ఉత్తమం. ఎందుకంటే ఒక్కసారి గృహ ప్రవేశమయ్యాక కామన్‌గా ఏర్పాటుచేసిన వసతుల్లో లీకేజ్‌లను పునరుద్ధరించడం కొంత కష్టం. వర్షా్షకాలంలో ప్రాజెక్ట్ లోపాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇంట్లోని వాష్‌రూమ్, సీలింగ్, ప్లంబింగ్, డ్రైనేజీ లీకేజ్ వంటివి తెలుస్తాయి. ఆయా లోపాలను పునరుద్ధరించమని డెవలపర్‌ను కోరే వీలుంటుంది.
రీసేల్ ప్రాపర్టీలనూ..
రీసేల్ ప్రాపర్టీలను కొనేవారైతే వర్షాకాలంలో ఆయా ప్రాపర్టీలను స్వయంగా పరిశీలించడం ఉత్తమం. ఎందుకంటే వానల్లోనే ప్రాపర్టీ నిర్వహణ ఎలా ఉందో అవగతమవుతుంది. గోడల ధృడత్వం, డ్రైనేజీ, ప్లంబింగ్ లీకేజీలు వంటివి తెలుసుకునే వీలుంటుంది. ప్రాపర్టీ లోతట్టు ప్రాంతంలో ఉందా? వరదలు ఎక్కువగా వచ్చే అవకాశముందా అనేది తెలుస్తుంది. వరద నీరు భూమిలోకి ఇంకిపోయే ఏర్పాట్లు ఉన్నాయా? లేక అపార్ట్‌మెంట్ సెల్లార్ నీటిలో మునిగిపోతుందా? అనేది తెలుస్తుంది.
వర్షంలో రాయితీలు..
వర్షాకాలంలో గృహ కొనుగోళ్లు అంతగా జరగవు. కాబట్టి ఇలాంటి సమయంలో నిజమైన గృహ కస్టమర్లు వచ్చినప్పుడు వారిని డెవలపర్లు స్వాగతిస్తారు. ధర విషయంలో బేరసారాలు ఆడే వీలుంటుంది. రాయితీలు, ఇతర ప్రత్యేక వసతుల విషయంలో డెవలపర్లతో చర్చించవచ్చు. పైగా సెప్టెంబర్–అక్టోబర్ పండుగ సీజన్ కావటంతో భారీ డిస్కౌంట్లు, ప్రత్యేక రాయితీలతో అమ్మకాలను ప్రకటిస్తుంటారు డెవలపర్లు.
గృహల కొనుగోళ్లపై రాయితీలు ఎప్పుడు వస్తాయో తెలుసా ..
Published Sat, Jul 17 2021 3:36 PM | Last Updated on Sat, Jul 17 2021 7:01 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment