వరి వెద సాగు.. బాగు బాగు..! | Different Rice Crops For Easy Profits | Sakshi
Sakshi News home page

వరి వెద సాగు.. బాగు బాగు..!

Published Tue, Jun 25 2019 11:23 AM | Last Updated on Tue, Jun 25 2019 11:23 AM

Different Rice Crops For Easy Profits - Sakshi

వర్షాలు సరైన సమయంలో కురవకపోవడం, తద్వారా కాలువల్లో సాగునీరు ఆలస్యంగా విడుదలవడం వలన వరి నారు మడులు పోసుకోవడం, నాట్లు వేయడం ఆలస్యమై దిగుబడులు గణనీయంగా తగ్గుతున్నాయి. చెరువులు, కాలువలు, బావుల కింద పండించే పంటలు కాలక్రమేణా బోర్ల ద్వారా, భూగర్భ జలాల మీద ఆధారపడి వ్యవసాయం చేసే పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలో భూగర్భ జలాలు కూడా కొరవడుతున్నాయి. వీటితోపాటు కూలీల కొరత, అధిక కూలి రేట్లు వంటి సమస్యలతో రైతాంగం ఉక్కిరిబిక్కిరి అవుతున్న తరుణంలో నేరుగా విత్తే వరి సాగు పద్ధతులు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. పొడి నేలలో పొడి వరి విత్తనాన్ని వెద బెట్టడం, దమ్ము చేసిన మాగాణులలో డ్రమ్‌ సీడర్‌తో మొలకెత్తిన విత్తనం వేసుకోవటం లేదా వెద జల్లడం వంటి పద్ధతుల్లో వరి సాగు చేయడం మేలని బాపట్ల వ్యవసాయ పరిశోధనా స్థానం ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్‌ సి. వి. రామారావు సూచిస్తున్నారు. సార్వాలో వెద వరి పంట సకాలంలో తీసుకోగలిగితే మినుము, పెసరలను రెండో పంటగా వేసి మంచి దిగుబడులు సాధించడానికి వరి వెద పద్ధతి రైతాంగానికి ఎంతో ఉపయోగకరంగా ఉందని ఆయన తెలిపారు. ఈ పద్ధతిలో 20% నీరు ఆదా అవుతుంది. 10 రోజులు ముందుగానే కోతకొస్తుంది. పంట దిగుబడి 15% పెరుగుతుంది.

అధిక నీరు అవసరమయ్యే పంట కావడంతో వరి సాగుకు వాతావరణ మార్పులు శాపంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో నారుపోసి నాట్లు వేయడం కన్నా నేరుగా విత్తుకోవడం మేలు. వరి నేరుగా విత్తే విధానంలో ముఖ్యంగా రెండు పద్ధతులున్నాయి:
1 పొడి విత్తనాన్ని విత్తే పద్ధతి : పొడి విత్తనాలను పొడి నేలపై వెద జల్లడం ద్వారా గాని, డ్రిల్లింగ్‌ చేయడం ద్వారా గాని, వెద సాగు పరికరాల(విత్తన గొర్రు)తో గాని విత్తుతారు. వరి విత్తనాన్ని పొడి వాతావరణంలో విత్తి, తరువాత వానలు మొదలై కాలువలకు నీళ్లు వచ్చిన అనంతరం మాగాణి పంటల మాదిరిగా సాగు చేస్తారు. తొలకరి వానలు పడగానే విత్తనాలు విత్తుతారు. అటు వర్షపు నీటిని, కాలువల నీటిని ఉపయోగించుకుంటూ వరిని సాగు చేస్తారు.
2 తడి విత్తనాన్ని విత్తే పద్ధతి : ఈ పద్ధతిలో మొలకెత్తించిన విత్తనాలను దమ్ము చేసిన పొలంలో వెదజల్లడం ద్వారా గాని లేదా డ్రమ్ము సీడర్‌ ద్వారా గాని విత్తుతారు. తడి విత్తనాన్ని అంటే.. నానబెట్టి, మండెకట్టి మొలకెత్తిన విత్తనాన్ని దమ్ము చేసిన మాగాణుల్లో వెదజల్లడం ద్వారా గాని, డ్రమ్‌ సీడరు ద్వారా గాని విత్తుతారు.

విత్తన ఎంపికలో మెలకువలు
పొడి విత్తనాన్ని వెద పద్ధతి ద్వారా, తడి విత్తనాన్ని డ్రమ్‌ సీడరు ద్వారా లేదా వెదజల్లడం ద్వారా నేరుగా విత్తే పద్ధతులను అనుసరించేటప్పుడు వరి రకాలను ఎంపికచేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
సార్వాలో 140–150 రోజులు, దాళ్వాలో 120–125 రోజుల కాలపరిమితి గల రకాలను ఎంచుకోవాలి.
ఈ పద్ధతిలో చేను పడిపోయే అవకాశాలు ఎక్కువ. కాబట్టి, కాండం దృఢంగా ఉండి చేనుపై పడిపోని రకాన్ని ఎంపిక చేసుకోవాలి.
మొక్క శాఖీయ పెరుగుదల దశలో వేగంగా పెరిగి కలుపును అణగదొక్కగల సామర్థ్యం కలిగి ఉండాలి.
ఆయా ప్రాంతాల్లో అధికగా వచ్చే చీడపీడలను తట్టుకొనే శక్తిని కలిగి ఉండాలి.
ఎంపిక చేసుకునే రకం 2–3 వారాలు నిద్రావస్థ కలిగినదై ఉండాలి.
తక్కువగా గింజ రాలే రకాలను ఎంపిక చేసుకోవాలి.
అధిక దిగుబడితో పాటు మంచి గింజ నాణ్యత కలిగి ఉండాలి. ఈ సూచనలను దృష్టిలో ఉంచుకొని రైతులు గింజ రకాలను ఎంపిక చేసుకోవాలి.

పొలం తయారీ: వెద పద్ధతిలో వరి సాగు చేసేటప్పుడు వేసవిలోనే నేలను కలియదున్నాలి. నేల స్వభావాన్ని బట్టి నాలుగు మూలలు సమానంగా ఉండేటట్లు పెద్ద పెద్ద మట్టి గడ్డలు లేకుండా పొలం సమతలంగా ఉండేటట్లు చూసుకోవాలి. తడి విత్తన పద్ధతిలో సాగు చేసేటప్పుడు సాధారణ నాట్లు పద్ధతిలో ఎలాగైతే భూమిని తయారు చేస్తామో అలాగే తయారు చేయాలి. చివరి సారి దమ్ము చేసిన తర్వాత పొలమంతా ఎత్తుపల్లాలు లేకుండా సమానంగా చదును చేయాలి. పొలాన్ని చిన్నచిన్న మడులుగా విభజించుకుంటూ చదును చేయడం వలన నీరు పెట్టడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. మట్టి పేరుకున్న తరువాత బురద పదునులో ప్రతి రెండు మీటర్లకు 20 సెం.మీ. కాలువలు చేయాలి. వీటి ద్వారా ఎక్కువగా నీరు, మురుగు నీరు బయటకు పోవడానికి వీలవుతుంది.

విత్తన మోతాదు
వెదజల్లే పద్ధతిలో అయితే రకాన్ని బట్టి ఎకరానికి 12 నుంచి 16 కిలోల విత్తనం, డ్రమ్‌సీడరుతో విత్తుకుంటే 10 నుంచి 12 కిలోల విత్తనం అవసరం అవుతుంది. వెదపద్ధతిలో ఎకరానికి పొడి విత్తనం 10 నుంచి 15 కిలోల విత్తనం వాడాలి.

విత్తనశుద్ధి
ఒక లీటరు నీటికి ఒక గ్రాము కార్బండిజమ్‌ను కలిపి కిలో విత్తనాన్ని 24 గంటలు నానబెట్టి తర్వాత మండె కట్టి మొలకవచ్చిన తర్వాత వెదజల్లడం గాని, డ్రమ్‌ సీడరుతో గాని విత్తుకోవాలి. వెదజల్లే పద్ధతిలో సాగు చేసేటప్పుడు ఒక కిలో విత్తనానికి 3 గ్రా. కార్బెండిజమ్‌ను కలిపి వెద పెట్టడం వల్ల విత్తనం ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్లను తక్కువ ఖర్చుతో నివారించవచ్చు. (సేంద్రియ పద్ధతిలో సాగు చేసే రైతులు బీజామృతం లేదా ఇతర పద్ధతుల్లో విత్తనశుద్ధి చేసుకోవాలి).

వెద పద్ధతిలో విత్తే విధానం
వెద పద్ధతిలో వరి విత్తనాలను పొలంలో చల్లడం కాక పొలంలో సాళ్లుగా విత్తితే మంచి ఫలితాలనిస్తాయి. దీనికి పొలాన్ని సాంప్రదాయ పద్ధతిలో దున్నకూడదు. విత్తన గొర్రు ఉపయోగిస్తే కనీసం 2–4 సెం.మీ. వెడల్పు, 4–7 సెం.మీ. ఎత్తు ఉండే గాడులు ఏర్పడి అందులో విత్తనాలు సమానలోతు, సమాన దూరంలో నాటుకుంటాయి. 2–3 సెం.మీ. లోతులో విత్తితే మొలక శాతం బాగుంటుంది. దీనికన్నా ఎక్కువ లోతులో విత్తితే మొలక రావడం కష్టమవుతుంది. ఈ విధానంలో పొలంలో నేల ఎక్కువ కదలికకు గురికాదు. నీరు పెట్టినప్పుడు అది సాఫీగా ప్రవహించి మొక్కలకు చేరుకుంటుంది. సాంప్రదాయ పద్ధతిలో దున్నినప్పుడు నేలంతా కదలడం వలన నీరు పెట్టినప్పుడు చాలా వరకు పీల్చుకుపోయి మొక్కకు చేరడానికి ఎక్కువ నీరు అవసరమవుతుంది. వెదసాగు యంత్రంలో విత్తనాలకు, కలుపు మందుకు, ఎరువుకు విడి విడిగా అరలు ఉంటాయి. విత్తనంతో పాటే ఎరువు కూడా నేరుగా చేలో పడుతుంది. అనుభవం కలిగిన ట్రాక్టరు డ్రైవరు ఈ వెదసాగు యంత్రంతో గంటలో ఒక ఎకరాన్ని విత్తగలరు.

వెదజల్లే విధానంలో విత్తేముందు పొలం వైశాల్యాన్ని బట్టి ఎన్ని మడులున్నాయో చూసుకొని ఆ ప్రకారం విత్తనాన్ని 24 గంటలు నానబెట్టి, 24 గంటలు మండెకట్టి, మొలకెత్తిన విత్తనాన్ని అన్ని భాగాలుగా చేసుకుంటే, విత్తనాలు సమానంగా నేలమీద పడతాయి. మొక్కల సాంద్రత సమంగా ఉంటుంది. విత్తిన రెండు వారాల తరువాత వత్తుగా ఉన్న మొక్కలను తీసివేసి పలుచగా ఉన్న చోట నాటుకోవాలి.

డ్రమ్‌ సీడరుతో వరి విత్తే విధానం
డ్రమ్‌ సీడరుతో విత్తేటప్పుడు విత్తనాన్ని 24 గంటలు నానబెట్టి 24 గంటలు మండెకట్టి గింజల నుంచి మొలక ఆరంభదశలో వున్నప్పుడు డ్రమ్‌లలో నింపుకోవాలి. అలా కాక మొలక పొడువగా ఉంటే డ్రమ్‌లలో పోసినప్పుడు అవి అల్లుకుపోయి రంధ్రాలకు అడ్డుపడి విత్తనాలు సులువుగా రాలవు. ఈ విధంగా మొలక ఆరంభ దశలో వున్న విత్తనాలను డబ్బాలలో 3/4 వంతు వరకు నింపి ముందుగా దమ్ము చేసి చదును చేసిన పొలంలో డ్రమ్‌ సీడరును దానికున్న పిడి సహాయంతో లాగడం వలన చక్రాలతో పాటు డ్రమ్ములు తిరిగి డ్రమ్ములకున్న రంధ్రాల ద్వారా విత్తనాలు పొలంలో వరుసగా పడతాయి. ఇలా ఒకసారి డ్రమ్‌సీడరును లాగితే 8 వరుసలలో వరుసకు వరుసకు మధ్య 20 సెం.మీ. దూరంలో 5 నుంచి 8 గింజలు పడతాయి. వరుసలు పాడవకుండా ఉండాలంటే పొలంలో వారం వరకు బుదర పదునుగా నీరు పలుచగా ఉండాలి. అయితే, నీరు పలుచగా ఉండటం వలన కలుపు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కావున కలుపు మందును తగు మోతాదులో 6–7 రోజుల లోపు వేసుకోవాలి. ఈ డ్రమ్‌సీడరును ఉపయోగించి రోజుకు 2–3 ఎకరాలు విత్తుకోవచ్చు. ఒక ఎకరం పొలాన్ని ఇద్దరు కూలీలు రెండున్నర గంటలలో విత్తగలరు.

నీటి యాజమాన్యం
విత్తిన తరువాత మొక్కల మొదటి ఆకు పూర్తిగా పురి విచ్చుకొనే వరకు (అంటే సుమారు 7–10 రోజులు) ఆరు తడులను ఇవ్వాలి. మొక్కలు 4–5 ఆకులు తొడిగిన తరువాత పొలంలో పలుచగా అంటే 2–3 సెం.మీ.ల లోతు నీరుండాలి. అంతకు మించి నీరు ఎక్కువగా ఉంటే పైరు బాగా దుబ్బు చేయదు. పైరు పిలక తొడిగి దుబ్బు కట్టుట పూర్తి అయిన తరువాత నుంచి కోతకు సుమారు 10 రోజుల ముందు వరకు 5 సెం. మీ. లోతు నీరుండాలి.

పంటకోత
నేరుగా విత్తే పద్ధతిలో సాంప్రదాయ ఊడ్పు విధానం కన్నా పంట 7–10 రోజులు ముందే కోతకు వస్తుంది. పంటను కూలీల ద్వారా లేక కోత–నూర్పిడి యంత్రం ద్వారా కోయవచ్చు.
 నేరుగా విత్తే పద్ధతిలో జాగ్రత్తలు
1 పొలమంతా సమానంగా ఎత్తుపల్లాలు లేకుండా చదును చేసుకోవాలి. దీనితో పొలమంతా నీరు సమానంగా పారి ఎరువుల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది.
2 ఎకరానికి సిఫారసు చేసిన విత్తన మోతాదు ప్రకారమే విత్తుకోవాలి. ఎక్కువ విత్తనం వాడితే మొక్కలు ఒత్తుగా, తక్కువ వాడితే పలుచగా వుండి దిగుడులు తగ్గుతాయి. నేలలో విత్తనాన్ని 3 సెం.మీ. కంటే ఎక్కువ లోతులో వెద పెట్టకూడదు.
3 విత్తనాన్ని నాటిన రెండు రోజులలోపే కలుపును అరికట్టాలి. సరైన మందులను, సరైన కాలంలో, సరైన మోతాదులో వాడాలి.
4 విత్తనం పూర్తిగా మొలకెత్తిన తరువాత మొదటి నీటి తడిని భూమి స్వభావాన్ని బట్టి 7 నుంచి 15 రోజుల తర్వాత ఇవ్వవచ్చు.
5 విత్తిన రెండు వారాల తరువాత ఒత్తుగా ఉన్నచోట మొక్కలు తీసి పలుచగా వున్నచోట నాటుకుంటే మొక్కల సాంద్రత పొలమంతా సమానంగా ఉంటుంది.
6 నానబెట్టి, మండెకట్టిన విత్తనాలకు మొలక ఎక్కువగా పెరగనివ్వకూడదు. పెరిగినట్లైతే విత్తేటప్పుడు లేదా వెదజల్లేటప్పుడు మొలక విరిగి పోయే ప్రమాదం ఉంది.
7 విత్తిన 10 రోజుల వరకు ఆరు తడులనివ్వాలి. నీరు ఎక్కువగా ఉంటే మురుగు కాల్వల ద్వారా తీసివేయాలి. లేదంటే మొలక మురిగిపోతుంది. దుబ్బు దశ నుంచి నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి.
– డాక్టర్‌ సి.వి. రామారావు,(94949 97701), ముఖ్య శాస్త్రవేత్త, వరి విభాగం, బాపట్ల వ్యవసాయ పరిశోధనా స్థానం,ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం

వరిని నేరుగా విత్తితే లాభాలు
1 తొలకరి వానలు పడిన వెంటనే వరి సాగు మొదలు పెట్టుకోవచ్చు.
2 అటు వర్షపు నీరు, ఇటు కాలువ నీరును ఉపయోగించుకుంటూ పంటను పండించవచ్చు.
3 దీని వలన పంటకాలం నష్టపోకుండా సకాలంలో సాగు చేయడానికి వీలవుతుంది.
4 ఈ పద్ధతిని పాటించడం వలన కాలువలలో నీరు ఆలస్యంగా వచ్చినా వరి పంట తరువతా మినుము, పెసర వంటి పైర్లను సకాలంలో విత్తవచ్చు.
5 ఈ పద్ధతిలో తక్కువ మోతాదు విత్తనం వాడటం వల్ల విత్తన ఖర్చు, నారు పెంచడానికి, నారు తీయడానికి, నారు మోయడానికి, నాట్లు వేయడానికి అయ్యే ఖర్చు ఆదా అవుతుంది.
6 సరి అయిన సమయంలో విత్తడం వల్ల నాట్ల పద్ధతిలో కన్నా చీడపీడల బెడద తక్కువగా ఉంటుంది. అందువల్ల సస్యరక్షణ ఖర్చులు తగ్గుతాయి.
7 విత్తనం భూమిపై తక్కువ లోతులో మొలకెత్తడం వలన వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది.. పైరు నీటిని, పోషక పదార్థాలను సక్రమంగా వినియోగించుకుంటుంది.
8 నాట్ల పద్ధతిలో కన్నా ఈ విధానంలో 20% నీరు ఆదా అవుతుంది.
9 నాట్ల పద్ధతిలో కన్నా 7–10 రోజుల ముందుగా వరి పంట కోతకు వస్తుంది. నేరుగా విత్తే పద్ధతిని అనుసరించడం వలన సాగు ఖర్చు తగ్గడంతో పాటు 10–15% అదనపు దిగుబడులు కూడా సాధించవచ్చు.
వరి నేరుగా విత్తే పద్ధతిలో సమస్యలు
1 సరైన లోతులో విత్తుకోవటం
2 ప్రారంభ దశలో కలుపు నిర్మూలన
3 సరైన నీటి యాజమాన్యం
4 పొలాన్ని సరిగ్గా చదును చేసుకోవడం

తెలంగాణలో నేరుగా విత్తే వరి సాగుకు అనువైన రకాలు
సాధారణ నాట్ల పద్ధతితో పాటు వెద పద్ధతిలో కూడా సాగు చేయడానికి అనువైన మూడు వరి రకాలు తెలంగాణ రైతులకు అందుబాటులో ఉన్నాయి. ఆర్‌.ఎన్‌.ఆర్‌. 15048 (తెలంగాణ సోన) – 120 రోజుల పంట. ఖరీఫ్‌లో జూలై ఆఖరు, రబీలో డిసెంబర్‌ ఆఖరు వరకు విత్తుకోవచ్చు. రసాయనిక ఎరువులు మోతాదుకు మించి వాడితో పొలంలో పంట పడిపోతుంది. కె.ఎన్‌.ఎం. 118 (కూనారం సన్నాలు)– 120 రోజులు. మామూలుగా, ఆలశ్యంగా కూడా విత్తుకోవచ్చు. ఖరీఫ్‌లో జూన్‌–జూలై, రబీలో నవంబర్‌ ఆఖరు నుంచి డిసెంబర్‌ ఆఖరు వరకు విత్తుకోవచ్చు. జగిత్యాల మషూరి (జెజె 11470) – 135 రోజులు. ఖరీఫ్‌లో జూన్‌ 30లోగా, రబీలో నవంబర్‌ 30 లోగా విత్తుకోవాలి.   – డా. చెన్నమాధవుని దామోదర్‌రాజు(94402 25385), ప్రధాన శాస్త్రవేత్త, వరి విభాగం, ప్రొ.జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం

చీడపీడలను దరిచేరనీయని నవార వరి
నవార రకం దేశీ వరిని తెలుగు రాష్ట్రాల్లో (ఖరీఫ్, రబీ) ఏ ప్రాంతంలోనైనా పండించవచ్చు. ఎకరానికి 15 కిలోల విత్తనం అవసరం. శ్రీ పద్ధతిలో 2 కిలోలు చాలు. పంటకాలం ఖరీఫ్‌లో 110–115 రోజులు, రబీలో 120–125 రోజులు. ఎకరానికి 18–20 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. నవార అన్ని రకాల చీడపీడలను తట్టుకుంటుంది. విత్తనాలు నల్లగా, బియ్యం ఎర్రగా ఉంటాయి. నవార బియ్యం తిన్నవారిలో షుగర్‌ వ్యాధి నియంత్రణలో ఉంటుంది. ఇడ్లీ, దోసెలలో ఎక్కువగా వాడుతారు. అయితే, వడగళ్ల వానకు పంట కింద పడిపోయి గింజలు రాలిపోతాయి. గడ్డిని పశువులు ఇష్టంగా తింటాయి. ఈ విత్తనాల కోసం సికింద్రాబాద్‌ తార్నాక నాగార్జున నగర్‌లోని సి.ఎస్‌.ఎ. కార్యాలయాన్ని 1800 120 3244 నంబరులో సంప్రదించవచ్చు.  జూలై చివరి వరకూ విత్తుకోవచ్చని శాస్త్రవేత్త డా. రాజశేఖర్‌(83329 45368) తెలిపారు.

అటవీ కృషిపై 30, జూలై 1 తేదీల్లో డా. ఖాదర్‌ వలి సదస్సులు
తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం, రైతునేస్తం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో అటవీ కృషి పద్ధతుల్లో సిరిధాన్యాల మిశ్రమ సాగుపై స్వతంత్ర శాస్త్రవేత్త డా. ఖాదర్‌ వలి రైతులకు శిక్షణ ఇస్తారు. 30(ఆదివారం) ఉ. 10 గం. నుంచి సా. 4 గం. వరకు నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లోని కొత్త రమాకాంత్‌ ఫంక్షన్‌ హాల్‌లో జరిగే రైతు సదస్సులో డా. ఖాదర్‌ ప్రసంగిస్తారు. వివరాలకు.. అభిలభారత రైతు సమన్వయ సమితి నేత అప్పిరెడ్డి –83090 24948. నిజామాబాద్‌లోని లక్ష్మీ కల్యాణ మండపం (ఆర్మూర్‌ రోడ్డు)లో 30న సా. 5 గం. నుంచి సిరిధాన్యాలపై ఆరోగ్య సదస్సులో డా. ఖాదర్‌ వలి ప్రసంగిస్తారు. వివరాలకు.. జి. దామోదర్‌రెడ్డి – 94407 02029. జూలై 1(సోమవారం)న మెదక్‌లోని వైస్రాయ్‌ గార్డెన్‌లో ఏకలవ్య ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఉ. 10 గం. నుంచి 12 గం. వరకు డాక్టర్‌ ఖాదర్‌ వలి ప్రసంగిస్తారు.  వివరాలకు.. డా. శ్యాంసుందర్‌రెడ్డి – 99082 24649. జూలై 1(సోమవారం)న సా. 4 గం. నుంచి జనగామలోని ఎన్‌.ఎం.ఆర్‌. ఫంక్షన్‌ హాల్‌ (సూర్యాపేట రోడ్డు)లో వాలంతరి ఆధ్వర్యంలో జరిగే రైతు సదస్సులో డా. ఖాదర్‌వలి ప్రసంగిస్తారు. వివరాలకు.. శంకరప్రసాద్‌ – 77029 70001. ఈ సభలకు ప్రవేశం ఉచితం.

30న సేంద్రియ మిరప, పత్తి, వరి సాగుపై శిక్షణ
రైతునేస్తం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడు రైతు శిక్షణ కేంద్రంలో ఈ నెల 30(ఆదివారం) సేంద్రియ వ్యవసాయ విధానంలో మిరప, పత్తి, వరి సాగుపై ప్రకృతి వ్యవసాయదారులు శ్రీమతి లావణ్య, రమణారెడ్డి శిక్షణ ఇస్తారు. వివరాలకు 97053 83666.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement