లోటు.. లోతు | Ground Water Level Down in Hyderabad | Sakshi
Sakshi News home page

లోటు.. లోతు

Published Mon, Sep 9 2019 11:47 AM | Last Updated on Mon, Sep 9 2019 11:47 AM

Ground Water Level Down in Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లో వర్షాకాలంలోనూ భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి. ఓవైపు వర్షపాతం లోటు.. మరోవైపు భూగర్భ జలాల వినియోగం అనూహ్యంగా పెరగడంతో పలు మండలాల్లో అథఃపాతాళానికి చేరుకున్నాయి. హైదరాబాద్‌ జిల్లాలో 5 మినహా మిగతా 11 మండలాల్లో సరాసరిన ఒకటి నుంచి రెండు మీటర్ల మేర భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టగా... రంగారెడ్డి జిల్లా పరిధిలో మొత్తం 27 మండలాల్లోనూ సరాసరిన రెండు నుంచి నాలుగు మీటర్ల మేర భూగర్భ జలాలు తగ్గడం గమనార్హం. ఇక వర్షపాతం విషయానికి వస్తే జూన్‌  ఒకటి నుంచి సెప్టెంబర్‌ 8 మధ్య హైదరాబాద్‌ జిల్లా పరిధిలో 486.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా... 389.1 మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదైంది. అంటే సాధారణం కంటే 20శాతం లోటు వర్షపాతం. ఇక రంగారెడ్డి జిల్లా పరిధిలో సాధారణంగా 411.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా... 355.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ జిల్లాలోనూ 14శాతం లోటు వర్షపాతం నమోదవడం గమనార్హం.

కారణాలెన్నో...  
వర్షకాలంలోనూ గ్రేటర్‌లో భూగర్భ జలాలు ఆశించిన స్థాయిలో పెరగలేదు. ఖైరతాబాద్, బండ్లగూడ, సైదాబాద్, అంబర్‌పేట్, ముషీరాబాద్‌ మినహా... మిగతా 11 మండలాల్లో భూగర్భ జలమట్టాలు గతేడాదితో పోలిస్తే తగ్గుముఖం పట్టాయి. ఇక రంగారెడ్డి జిల్లాలో మొత్తం 27 మండలాల్లో భూగర్భ జలాలు అథఃపాతాళంలోనే ఉండడం గమనార్హం. అరకొర వర్షపాతం, నీటిని ఒడిసిపట్టే ఇంకుడు గుంతలు చాలినన్ని లేకపోవడం, విచక్షణారహితంగా బోరుబావుల తవ్వకం, నీటి వినియోగం అనూహ్యంగా పెరగడంతో పాతాళగంగ అడుగంటుతోంది. శివారు ప్రాంతాల్లో గేటెడ్‌ కమ్యూనిటీలు, స్వతంత్ర గృహాలు, బహుళ అంతస్తుల భవంతుల నిర్మాణం ఊపందుకోవడం, కాంక్రీటు మహారణ్యాలు విస్తరిస్తున్న కారణంగా భూగర్భజలాల వినియోగం రెట్టింపవుతోంది. ఈ నేపథ్యంలో పలు మండలాల్లో సుమారు వెయ్యి అడుగులకు పైగా బోరుబావులను రెవెన్యూ శాఖ నిబంధనలకు విరుద్ధంగా తవ్వుతున్నప్పటికీ ఆయా విభాగాల అధికారులు చోద్యం చూస్తుండడం గమనార్హం. 

నిబంధనలకు ‘నీళ్లు’  
భూగర్భజలశాఖ నుంచి సాధ్యాసాధ్యల నివేదిక (ఫీజిబిలిటీ) అందిన తర్వాతే రెవెన్యూశాఖ నూతన బోరుబావుల తవ్వకానికి అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. అదీ కేవలం 400 అడుగుల లోతు వరకు తవ్వేందుకు మాత్రమే అనుమతించాలి. అయితే ఈ నిబంధన గ్రేటర్‌ పరిధిలో కాగితాలకే పరిమితమవుతోంది. ప్రధాన నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో వెయ్యి అడుగులకు పైగా బోరుబావులు తవ్వుతున్నా.. రెవెన్యూ శాఖ ప్రేక్షక పాత్రకే పరిమితమవుతోంది. ప్రధానంగా కుత్బుల్లాపూర్,  మియాపూర్, చందానగర్, గచ్చిబౌలి, మాదాపూర్, రాజేంద్రనగర్, శంషాబాద్, హయత్‌నగర్‌ తదితర ప్రాంతాల్లోని చెరువులు, కుంటల్లో నిబంధనలకు విరుద్ధంగా బోరుబావులు తవ్వేస్తున్న ట్యాంకర్‌ మాఫియా... ఈ నీటిని అపార్ట్‌మెంట్లు, గేటెట్‌ కమ్యూనిటీలు, హోటళ్లు, హాస్టళ్లు, ఫిల్టర్‌ వాటర్‌ ప్లాంట్లకు సరఫరా చేస్తూ జేబులు నింపుకుంటోంది. 

జలవిల...  
నగర జనాభా కోటి మార్కును దాటింది. సిటీలో భవంతుల సంఖ్య సుమారు 25లక్షలు కాగా.. బోరు బావులు 23 లక్షల మేర ఉన్నాయి. కానీ ఇంకుడు గుంతల సంఖ్య 5 లక్షలకు మించలేదు. మరోవైపు నగరం కాంక్రీట్‌ జంగిల్‌గా మారడంతో వర్షపు నీరు నేల గర్భంలోకి ఇంకడం చాలా ప్రాంతాల్లో కనాకష్టంగా మారింది. మరోవైపు రోజువారీగా ఆయా బోరు బావుల నుంచి సుమారు 650 కోట్ల లీటర్ల మేర భూగర్భ జలాలు తోడుతున్నట్లు అంచనా. ఇక నగరంలో ఏటా కురుస్తున్న వర్షపాతం భూగర్భంలోకి ఇంకేందుకు అవసరమైన ఇంకుడు గుంతలు, కుంటలు లేక సుమారు 65శాతం మేర వృథాగా రహదారులపై ప్రవహించి చివరగా మూసీలో కలుస్తోంది. దీంతో నగరంలో ఏటేటా భూగర్భ జలమట్టాలు అథఃపాతాళంలోకి పడిపోతున్నాయి. గ్రేటర్‌ శివార్లలో ప్రధానంగా భూగర్భజలాల వినియోగం అత్యధికంగా ఉంది. 

ఇంకుడు గుంత ఉండాలిలా...
ఇళ్లల్లో బోరుబావికి సమీపంలో రెండు మీటర్ల లోతు, 1.5 మీటర్ల పొడవు, 1.5 మీటర్ల వెడల్పుతో ఇంకుడు గుంతను తవ్వాలి. ఈ గుంతను 50 శాతం 40ఎంఎం పరిమాణంలో ఉండే కాంక్రీటు రాళ్లతో నింపాలి. మరో 25శాతం జాగాను 20ఎంఎం పరిమాణంలో ఉండే రాళ్లను నింపాలి. మిగతా 25 శాతం ఖాళీ ప్రదేశాన్ని దొడ్డు ఇసుక(బఠాణా)తో నింపాలి. దీని చుట్టూ వ్యర్థాలు చేరకుండా ఒక అడుగు ఎత్తున చిన్న గోడ నిర్మించాలి. ఈ గుంతలోకి ఇంటి పైకప్పు నుంచి నేరుగా వర్షపు నీరు చేరేందుకు పెద్ద పైపును ఏర్పాటు చేయాలి.

ఉపయోగాలివీ...
ఈ ఇంకుడు గుంతలో సీజన్‌లో సాధారణ వర్షపాతం (20 మిల్లీమీటర్లు) నమోదయ్యే రోజుల్లో... రోజుకు 1600 లీటర్ల నీటిని భూగర్భంలోకి ఇంకించవచ్చు. ఈ నీరు నలుగురు సభ్యులున్న కుటుంబానికి మూడు రోజుల అవసరాలకు సరిపోవడం విశేషం. ఇంకుడు గుంతలు తవ్వడం ద్వారా మీ బోరు బావి ఎప్పటికీ వట్టిపోదు. అంతేకాదు భావితరాలకు మీరు జలబ్యాంక్‌ ఏర్పాటు చేసిన వారవుతారు. సామాజిక బాధ్యతగా ఇంకుడు గుంత తవ్వడం ద్వారా మీకే కాదు.. మీ ఇంట్లో పెంచుకునే మొక్కలకు సైతం జలం.. జీవం అందజేసిన వారవుతారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement