సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలు భూగర్భ జలాలకు కొత్త ఊపిరి పోస్తున్నాయి. ఓ పక్క ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు.. మరోపక్క నిండుతున్న చెరువులు, ప్రాజెక్టులతో భూగర్భ జల మట్టం రికార్డు స్థాయిలో పైకి ఉబికి వస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సగటు వర్షపాతం ఎక్కువగా నమోదు కావడం కన్నా.. ఎక్కువ కాలం నమోదవుతుండటం భూగర్భ మట్టాల్లో గణనీయ పెరుగుదలకు కారణమవుతోంది. రాష్ట్ర పరీవాహక ప్రాంతం, పెరిగిన నీటి మట్టాల ఆధారంగా జూన్, జూలై రెండు నెలల వ్యవధిలోనే 208 టీఎంసీల నీరు భూమిలో ఇంకిందని అంచనా వేస్తుండగా, ఆగస్టులో కూడా 200 టీఎంసీలు పెరిగే అవకాశముందని అంటున్నారు.
వాన నీరు లోపలికి.. పాతాళ గంగ పైపైకి..
రాష్ట్రంలో జూన్ చివరలో, జూలైలో విస్తారంగా వర్షాలు కురిశాయి. జూలై నెలాఖరుకు సగటున 373.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వాల్సి ఉండగా, 439.8 మిల్లీమీటర్ల అధిక వర్షపాతం రికార్డయింది. 33 జిల్లాలకు గానూ 16 జిల్లాల్లో సాధారణం కంటే అధికంగా, 15 జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదైంది. దీంతో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. గతేడాది జూలైలో రాష్ట్ర సగటు భూగర్భ నీటిమట్టం 14.12 మీటర్లు ఉండగా, ఈ ఏడాది అది 9.26 మీటర్లకు చేరింది. ఏకంగా 4.86 మీటర్ల మేర భూగర్భం పైకి ఎగిసింది. జూన్, జూలైలో 40 రోజులకు పైగా వర్షాలు స్థిరంగా కురవడంతో భూగర్భ జలాలకు కలిసొచ్చింది. కురిసిన వర్షపాతంలో సగటున 10 శాతం నుంచి 11 శాతం నీరు భూగర్భానికి చేరుతుంది. రాష్ట్ర భూ విస్తీర్ణం, ప్రస్తుతం పెరిగిన భూగర్భ మట్టాల ఆధారంగా రెండు నెలల వ్యవధిలో 208 టీఎంసీల నీరు భూమిలోకి చేరిందని భూగర్భ జల శాఖ అంచనా వేసింది. ఇందులో ఒక్క జూలైలోనే 158 టీఎంసీల నీరు భూమిలోకి ఇంకిందని తెలిపింది. ఆగస్టులో ఈ 19 రోజులుగా కురిసిన వర్షాలతో మరో 200 టీఎంసీల నీరు భూగర్భంలోకి చేరే అవకాశం ఉందని అంటున్నారు.
కలిసొచ్చిన కాళేశ్వర జలాలు, చెరువులు..
రాష్ట్రంలో కురిసిన వర్షాలకు తోడు నిండిన చెరువులు, ప్రాజెక్టులు, కాళేశ్వరం ఎత్తిపోతలు భూగర్భ మట్టాల పెరుగుదలకు కారణమయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా గోదావరి బేసిన్‌లో 13,859 చెరువులు, కృష్ణా బేసిన్‌లో 5,904 చెరువులు కలిపి 19,763 చెరువులు మత్తడులు దుంకడం, రెండు బేసిన్‌లలో మరో 6,400 చెరువులు 75 శాతానికి పైగా, 4,800 చెరువులు 50 శాతానికి పైగా నిండటంతో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. ఇక కాళేశ్వరం జలాలు భూగర్భ మట్టాల పెరుగుదలకు వరంగా మారిందని భూగర్భ జల శాఖ తన జూలై నివేదికలో వెల్లడించింది. గతేడాది కాళేశ్వరం పరీవాహకంలో 602 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం పరిధిలోనే భూగర్భ జలాలపై ప్రభావం ఉండగా, ఈ ఏడాది జూలైలో 2,419 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణానికి పెరిగిందని తెలిపింది. ఈ ప్రభావంతో రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, భువనగిరితో పాటు నిజామాబాద్‌లోని కొంత ప్రాంతం, కామారెడ్డిలోని తూర్పు ప్రాంతాల్లో భూగర్భ మట్టాలు మెరుగయ్యాయని వెల్లడించింది. రాష్ట్ర విస్తీర్ణంలో 24 శాతం భూగర్భ మట్టం 5 మీటర్ల లోపలే ఉండగా, ఇందులో ఎక్కువగా ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వనపర్తి, నాగర్‌కర్నూల్, భద్రాద్రి, జగిత్యాల, ఖమ్మం, నల్లగొండ జిల్లాలోని ఎక్కువ ప్రాంతాలు ఉన్నాయని నివేదిక తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment