సాక్షి, హైదరాబాద్: గ్రేటర్‌లో కోవిడ్ కలకలంతో వ్యక్తిగత వాహనాల వినియోగం అనూహ్యంగా పెరిగింది. దీంతో ప్రధాన రహదారులపై గంటల తరబడి ట్రాఫిక్ రద్దీ పెరుగుతోంది. వాహనాలు వదులుతోన్న కాలుష్యంతో గ్రేటర్‌లో భూస్థాయి ఓజోన్ మోతాదు క్రమంగా అధికమవుతోంది. ఈ విపరిణామంతో నగరవాసులు ఆస్తమా, బ్రాంకైటిస్ తదితర శ్వాసకోశ వ్యాధులతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వాహనాల నుంచి వెలువడుతోన్న కాలుష్య ఉద్గారాలతోపాటు ఓజోన్ వాయువులు సిటిజన్ల ముక్కుపుటాలను అదరగొడుతున్నాయి.
ట్రాఫిక్ అత్యధికంగా ఉండే ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పలు ప్రధాన రహదారులపై వాహనాలు వెదజల్లే పొగలోని ఓజోన్ వాయువు గాలిలోని నైట్రోజన్ ఆక్సైడ్స్, ఓలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్‌లతో కలవడంతోపాటు సూర్యరశ్మి ప్రభావంతో భూ ఉపరితల వాతావరణాన్ని ఓజోన్ దట్టంగా ఆవహిస్తోంది. దీంతో తరచూ ట్రాఫిక్ రద్దీలో చిక్కుకొన్న ప్రయాణికులు, వాహనదారులు, చిన్నారులు, వృద్ధులు, రోగులు, పాదచారులకు ఊపిరిసలపడంలేదని కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) పరిశీలనలో తేలింది.
చదవండి: విజృంభిస్తున్న విష జ్వరాలు.. డెంగీతో యువ డాక్టర్ మృతి
ప్రమాణాల మేరకు ఘనపు మీటరుగాలిలో భూస్థాయి ఓజోన్ మోతాదు వంద మైక్రోగ్రాములకు మించరాదు. కానీ, నగరంలోని ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండే సుమారు వంద కూడళ్లలో ఘనపు మీటరు గాలిలో 80–100 మైక్రోగ్రాములుగా నమోదవుతుండడంతో పలు అనర్థాలు తలెత్తుతుండడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
ఓజోన్‌తో అవస్థలు ఇవే..
► అస్తమా, బ్రాంకైటిస్‌తో బాధపడేవారి సంఖ్య పెరుగుతోంది.
► ట్రాఫిక్ రద్దీలో వేలాది మంది తరచూ ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
► గొంతునొప్పి, ముక్కుపుటాలు దెబ్బతినడం, కళ్లు మండడం వంటి సమస్యలు పెరుగుతున్నాయి.
► ఊపిరితిత్తుల పనితీరు దెబ్బతినడం, ఛాతీలో అసౌకర్యం.
చదవండి: ‘వైద్యురాలి నిర్లక్ష్యంతో బాలింత మృతి’
ధూళి కాలుష్యం సైతం
► ఓజోన్‌తోపాటు మోటారు వాహనాల పొగలో ఉన్న సూక్ష్మ, స్థూల ధూళికణాలైన పీఎం10, పీఎం 2.5, ఆర్‌ఎస్‌పీఎంలు పీల్చేగాలిలో చేరి నేరుగా ఊపిరితిత్తుల్లో చేరి తీవ్రమైన శ్వాసకోశవ్యాధులు, పొడిదగ్గు, బ్రాంకైటిస్‌కు కారణమవుతున్నాయి.
► దుమ్ము, ధూళి కళ్లలోకి చేరి రెటీనా దెబ్బతింటోంది.
► చికాకు, అసహనం, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది తలెత్తుతోంది.
► తలనొప్పి, పార్శ్వపు నొప్పి కలుగుతాయి.
► ధూళి కాలుష్య మోతాదు క్రమంగా పెరుగుతుంటే ఊపిరితిత్తుల క్యాన్సర్లు పెరిగే ప్రమాదం ఉంది.
► ఇటీవల నగరంలో శ్వాసకోశ సమస్యలు, ఆస్తమా, క్రానిక్ బ్రాంకైటిస్, సైనస్ సమస్యలు పెరగడానికి ప్రధాన కారణం వాతావరణ మార్పులు, వాయు కాలుష్యమేనని నిపుణులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment