జలయజ్ఞం | GHMC Starts Injection Borewells in Hyderabad | Sakshi
Sakshi News home page

జలయజ్ఞం

Published Sat, Jul 27 2019 11:09 AM | Last Updated on Sat, Jul 27 2019 11:09 AM

GHMC Starts Injection Borewells in Hyderabad - Sakshi

కాకతీయహిల్స్‌లో ఏర్పాటు చేసిన ఇంజెక్షన్‌ బోర్‌వెల్‌

సాక్షి, సిటీబ్యూరో: మహానగరంలో భూగర్భ జలాల పెంపునకు జీహెచ్‌ఎంసీ చర్యలు చేపట్టింది. జేఎన్‌టీయూ నిపుణుల సూచన మేరకు ప్రధాన రహదారుల్లో వరదముంపు తప్పించడంతో పాటు భూగర్భజలాలు పెంపొందించేందుకు పైలట్‌ ప్రాజెక్టుగా మాదాపూర్‌లోని కాకతీయహిల్స్‌ వద్ద నిర్మించిన ఇంకుడుగుంత, ఇంజెక్షన్‌ బోర్‌వెల్‌ ఏర్పాటు చేశారు. వీటితో మంచి ఫలితాలు రావడంతో నగర వ్యాప్తంగా 70 ప్రాంతాల్లో ఇలాంటివి ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దశలవారీగా వీటిని ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో తలెత్తిన సమస్యలతో వరద ముప్పు తప్పేందుకు ఇంజెక్షన్‌ బోర్లు పరిష్కారం చూపుతాయని భావించడంతో పాటు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సూచన మేరకు జీహెచ్‌ఎంసీ ఇంజినీర్లు, జేఎన్‌టీయూ నిపుణులు ఖైరతాబాద్, సికింద్రాబాద్, చార్మినార్‌ జోన్లలో 24 ప్రాంతాలను ప్రాథమికంగా గుర్తించారు. తొలుత పైలట్‌ ప్రాజెక్టుగా కాకతీయ హిల్స్‌లో ఇది పూర్తయ్యాక వర్షం కురిసినప్పటికీ నీటి నిల్వలు కనిపించలేదని ఇంజినీర్లు.. మరికొన్ని చోట్ల ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. 

ఏర్పాటు ఇలా..
నాలుగు అడుగుల పొడవు, నాలుగు అడుగుల వెడల్పు ఏడు అడుగుల లోతుతో ఇంకుడు గుంత కమ్‌ ఇంజెక్షన్‌ బోర్‌వెల్‌ నిర్మిస్తారు. రోడ్డుపై నీరు ఎక్కువ నిల్వ ఉండటంతో పాటు తగినంత స్థలం అందుబాటులో ఉంటే ఇంకుడు గుంతతో పాటు రెండు చాంబర్లు నిర్మిస్తారు. వర్షపునీరు తొలుత మొదటి చాంబర్‌లోకి చేరేలా ఏర్పాట్లు చేస్తారు. వరదనీటితో పాటు చెత్త, ప్లాస్టిక్‌ తదితరవ్యర్థాలు లోపల చేరకుండా జియో టెక్స్‌టైల్‌ మెంబ్రేన్‌ ఏర్పాటు చేస్తారు. అవి దానిపైనే  నిలిచిపోతాయి. ఈ మొదటి చాంబర్‌లో చేరిన నీరు రెండో చాంబర్‌లోకి వెళ్లేందుకు వీలుగా పైప్‌ ఏర్పాటు చేస్తారు. రెండో చాంబర్‌లోకి చేరిన నీరు అందులోని ఇంజెక్షన్‌ బోర్‌వెల్‌లోకి చేరుతుంది. రెండు చాంబర్లు ఏర్పాటు చేసే చోట గ్రీజు, ఆయిల్‌ వంటివి మొదటి చాంబర్‌లోనే అడుగున పేరుకుపోతాయి. రెండో చాంబర్‌లోకి వెళ్లవు. రెండో చాంబర్‌లో ఇంజెక్షన్‌ బోరు వేస్తారు. ఇంకుడు గుంతల్లో దిగువన 40 ఎంఎం, దానిపైన 20 ఎంఎం కంకర, ఆపైన ఇసుక వేస్తారు. జియో టెక్స్‌టైల్‌ మెంబ్రేన్‌పై పేరుకుపోయే వ్యర్థాలను ఎప్పడికప్పుడు తొలగించాలి. ఇంకుడు గుంతలు తవ్వే ప్రాంతాల్లోని భూగర్భ జలమట్టంలో మూడో వంతు వరకు మాత్రమే బోర్‌వెల్‌ వేస్తారు. గరిష్టంగా మాత్రం 200 అడుగుల లోతు మించకుండా వేస్తారు. పరిసరాల్లోని భూగర్భ జలాలు కలుషితం కాకుండా చర్యలు తీసుకుంటారని చీఫ్‌ ఇంజినీర్‌ జియావుద్దీన్‌ తెలిపారు. వీటిని జియో ట్యాగింగ్‌ కూడా చేస్తారన్నారు. కాకతీయహిల్స్‌లో యుద్ధ ప్రాతిపదికన నిర్మించిన రెండు చాంబర్ల ఇంజెక్షన్‌ బోర్‌కు రూ.1.40 లక్షలు ఖర్చయినట్లు ఎగ్జిక్యూటి ఇంజినీర్‌ చిన్నారెడ్డి చెప్పారు. ఇకపై నిర్మించే వాటికి రెండు చాంబర్లతో నిర్మించే వాటికి రూ.1.25 లక్షలు, ఒకే చాంబర్‌తో నిర్మించేవాటికి రూ.80 వేలు ఖర్చవుతుందని అంచనా వేసినట్లు జియావుద్దీన్‌ తెలిపారు.

ఇంజెక్షన్‌ బోర్‌వెల్స్‌కు ప్రతిపాదించిన ప్రాంతాలు..
కాప్రా సర్కిల్‌లో జీహెచ్‌ంఎసీ పార్కు దగ్గరిపోచమ్మగుడి ఎదుట
హయత్‌నగర్‌ సర్కిల్‌ ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ వెనుక జాన్సన్‌ గ్రామర్‌ స్కూల్‌ దగ్గర
ఉప్పల్‌ సర్కిల్‌ టీవీ స్టుడియో దగ్గరినల్లపోచమ్మ గుడి వద్ద
ఎల్‌బీనగర్‌ సర్కిల్‌ యాదగిరినగర్‌
రోడ్‌ నెంబర్‌ 12 సరూర్‌నగర్‌ సర్కిల్‌
అల్కాపురి రోడ్‌నెంబర్‌ 4
మలక్‌పేట పోలీస్‌స్టేషన్, చేనెంబర్‌ జంక్షన్‌
లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్, విల్లామేరీ కాలేజ్‌
శేరిలింగంపల్లి సర్కిల్‌ ఐఐఐటీ జంక్షన్‌
చందానగర్‌ మాతృశ్రీనగర్, కర్బలామైదాన్‌  
మూసాపేట బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయం  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement