రికార్డు వర్షాలు! | Rain Season Created Record After Ten Years | Sakshi
Sakshi News home page

రికార్డు వర్షాలు!

Published Tue, Sep 29 2020 6:23 AM | Last Updated on Tue, Sep 29 2020 6:23 AM

Rain Season Created Record After Ten Years - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వానాకాలం.. పదేళ్ల అనంతరం కొత్త రికార్డ్‌ను నెలకొల్పింది. నైరుతి రుతుపవనాలు, అల్పపీడనాలకు తోడు కొత్తగా ఏర్పడ్డ షీర్‌జోన్‌తో కురిసిన కుంభవృష్టి తెలంగాణను నిండు కుం డలా మార్చేసింది. జూన్‌ మొదటి వారంలో ప్రవేశించిన నైరుతి రుతుపవనాల ఉపసంహరణ సోమవారం నుంచి మొదలైంది. ఈ నాలుగు మాసాల్లో ఏకంగా 16 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదవ్వగా.. 11 జిల్లాల్లో అధిక వర్షపాతం, 6 జిల్లాల్లో సాధారణ వర్షపాతం రికార్డయింది. వాస్తవానికి నాలుగు మాసాల్లో 711.7 మి.మీ.ల సగటు వర్షం కురువాల్సి ఉండగా ఏకంగా 1,071 మి.మీ.ల వర్షం కురిసింది. ఇది సాధారణ సగటుతో పోలిస్తే దాదాపు 50 శాతం అధికం.. ఇంత భారీ ఎత్తున వర్షాలు గడిచిన పదేళ్లలో 2010లో సాధారణ సగటు కంటే 32 శాతం అధికంగా నమోదు కాగా ఈ మారు ఆ రికార్డు చెరిగిపోయింది.

సగం రోజులు వానలే..
ఈ సీజన్‌ ప్రారంభం నుంచి తెలంగాణలోని పలు జిల్లాల్లో సగం రోజులు (రెయినీ డేస్‌) వర్షాలు కురిశాయి.  అత్యధికంగా కామారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో జూలైలో 23 రోజులు, ఆగస్టులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 25, ములుగులో 24, మహబూబాబాద్‌లో 23, ఆగస్టులో రంగారెడ్డిలో 18, ఆదిలాబాద్‌లో 17 రోజులు వర్షాలు కురిశాయి.  జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు ఏర్పడ్డ 9 అల్పపీడనాల వల్ల కూడా భారీగా వర్షం నమోదైంది. జూన్‌ 9, జూలై 5, ఆగస్టులో 4, 9, 13, 19, 24, సెప్టెంబర్‌లో 13, 20 తేదీల్లో బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనాల ప్రభావ వర్షాలతో అన్ని పల్లెలు, పట్టణాలు తడిసి ముద్దయ్యాయి. వీటికి తోడు తెలంగాణ భూ ఉపరితలంపై 15–16 రేఖాంశాల మధ్య ఏర్పడ్డ షీర్‌జోన్‌ కూడా దక్షిణ తెలంగాణ, రాయలసీమ జిల్లాల్లో కుండపోతకు కారణమయ్యాయి. 

ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో టాప్‌
ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో రికార్డు వర్షాలు నమోదయ్యాయి. వనపర్తి జిల్లాలో 150 శాతం, నారాయణపేటలో 140, గద్వాలలో 130 శాతం వర్షాలు కురిశాయి. రాష్ట్రమంతా భారీ వర్షపాతం నమోదైనా.. ఆదిలాబాద్, నిర్మల్‌ జిల్లాల్లో కురువాల్సిన సాధారణ వర్షం కంటే కాస్త తక్కువగా నమోదు కావటం గమనార్హం. నిర్మల్‌లో 944.9 మి.మీ.కి 819 మి.మీలు, ఆదిలాబాద్‌లో 995.4 మి.మీకి గానూ 908.1 మి.మీ. కురిసింది.  

షీర్‌జోన్స్‌ అంటే..
వాతావరణ పరిభాషలో షీర్‌జోన్స్‌ అంటే.. తూర్పు, పడమర ప్రాంతాల్లో ఒకే అక్షాంశం (లాట్యిట్యూడ్‌)తో ఎదురెదురుగా ఉపరితల ఆవర్తనాలు ఏర్పడితే ఆ మధ్య ప్రాంతాన్ని షీర్‌జోన్స్‌ అంటారు.  రెండు ఉపరితల ఆవర్తనాల మధ్య ప్రాంతం షీర్‌జోన్‌ అన్నమాట. ఇవి సాధారణంగా 15 లేదా 16 లేదా 17 డిగ్రీల లాట్యిట్యూడ్స్‌లో ఏర్పడతాయి. ఈసారి దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఈ షీర్‌జోన్స్‌ అధికంగా ఏర్పడటంతోనే ఆయా ప్రాంతాల్లో ఎన్నడూ లేనంతగా వర్షపాతం నమోదైంది.

అత్యధిక అల్పపీడనాల వల్లే..
ఈ సీజన్‌లో ఏకంగా 9 అల్పపీడనాల వల్ల భారీగా వర్షం కురిసింది. వీటి వల్ల రెయినీడేస్‌ బాగా పెరిగాయి. అల్పపీడనాలతో ఉత్తర తెలంగాణ జిల్లాలు, చీర్‌ జోన్స్‌ ఏర్పడటంతో దక్షిణ తెలంగాణ, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. – రాజారావు, హైదరాబాద్‌ వాతావరణ అధికారి

లానినో వల్లే..
ప్రతి ఐదేళ్లకు ఒకసారి వాతావరణంలో మార్పులు చోటు చేసుకుం టాయి.. అందులో భాగంగానే ఎల్‌నినో, లానినోలు ఏర్పడతాయి. ఈ మారు లానినో ప్రభావం వల్లే అత్యధిక వర్షాలు కురిశాయి. సాధారణ కంటే అధికంగా కురిస్తే లాభం కంటే నష్టమే అధికం. అయితే రెయినీ డేస్‌ ఎక్కువగా ఉండటం వల్ల భూగర్భ జలాలు వృద్ధి అయ్యేందుకు అవకాశముండటం సంతోషకర పరిణామం.
–డా. సాయిభాస్కర్‌రెడ్డి, శాస్త్రవేత్త 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement