సాక్షి, హైదరాబాద్: రిజిస్ట్రేషన్ల శాఖ ‘కొత్త’ పుంతలు తొక్కుతోంది. కొత్త ఏడాది ఆరంభం అదిరింది. రిజిస్ట్రేషన్ల రికార్డులు బద్దలవుతున్నాయి. సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. 3 నెల లకుపైగా నిలిచిన రిజిస్ట్రేషన్లు తాజాగా మళ్లీ ప్రారంభం కావడంతో ప్రభుత్వ ఆదాయం పోటెత్తు తోంది. ఈ నెల 7వ తేదీ(గురువారం)న జరి గిన 14 వేలకుపైగా రిజిస్ట్రేషన్ లావాదేవీల ద్వారా రూ.94 కోట్ల ఆదాయం సమకూరింది. ఇంత పెద్ద మొత్తంలో ‘ఒక్కరోజు ఆదాయం’ రావడం తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఇదే ప్రథమమని రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులంటున్నారు. గతంలో వ్యవసాయ భూములతో కలిపి రోజుకు 8–9 వేల లావాదేవీలు జరుగగా, రూ.65 కోట్ల వరకు అత్యధిక ఆదాయం వచ్చేదని, ఇప్పుడు కేవలం వ్యవసాయేతర భూములు, ఆస్తులకే ఇంత భారీ ఆదాయం వచ్చిందని, ఇది రికార్డేనని చెబుతు న్నారు.
కొత్త ఏడాది తొలివారం కూడా రిజిస్ట్రేషన్ల శాఖకు భారీ రాబడులు వచ్చినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఈ నెల 1–7వ తేదీ వరకు రోజుకు సగటున 6,500 వరకు లావాదేవీలు జరిగాయి. ఈ వారంలో మొత్తం 37,178 లావాదేవీల ద్వారా రూ.208.88 కోట్లు వచ్చి నట్టు ఆ శాఖ లెక్కలు వెల్లడిస్తు న్నాయి. ఇదే జోరు కొనసాగితే కేవలం డాక్యుమెంట్ల లావా దేవీల వల్లే ఈ నెలలో ప్రభు త్వానికి రూ.1,000 కోట్లకు పైగా సమకూరడం ఖాయ మని రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
పెండింగులన్నీ పూర్తి..
గత ఏడాది సెప్టెంబర్ 8నుంచి డిసెంబర్ 21వరకు 96రోజులపాటు రిజిస్ట్రేషన్ల కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. పెండింగ్‌లో ఉన్న వాటన్నింటినీ పూర్తి చేసుకునేందుకు ప్రజలు పెద్దఎత్తున సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వస్తున్నారు. మంచి, చెడు రోజులతో నిమిత్తం లేకుండా అవసరాల కోసం అమ్ముకున్న, కొనుక్కున్న ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్ల కోసం గత 15 రోజులుగా వస్తున్న ప్రజలతో తమ కార్యాలయాలు కిటకిటలాడుతున్నాయని రిజిస్ట్రేషన్ల శాఖ సిబ్బంది అంటున్నారు.
ముఖ్యంగా హైదరాబాద్, పరిసర ప్రాంతాలు, రాష్ట్రంలోని మిగిలిన పట్టణ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్లు ఎక్కువగా జరుగుతున్నాయని సబ్ రిజిస్ట్రార్లు చెబుతున్నారు. వీటిలోనూ గేటెడ్ కమ్యూనిటీలు, ఇండిపెండెంట్ విల్లాలు, ఇతర నిర్మాణాలకు సంబంధించిన లావాదేవీలు ఎక్కువగా జరుగుతున్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయేతర భూములతో పోలిస్తే ఆస్తులకు సంబంధించిన లావాదేవీలే ఎక్కువగా జరుగుతున్నాయని అర్థమవుతోంది.
వెయ్యికోట్లు దాటింది..
రాష్ట్రంలో వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు డిసెంబర్ 21 నుంచి ప్రారంభం కాగా, 15 రోజుల్లోనే రూ.1,000 కోట్ల(ఈ చలాన్లు కలిపి) రాబడి వచ్చిందని రిజిస్ట్రేషన్ల శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత నెలలో రూ.383 కోట్లు, ఈ నెలలో రూ.208 కోట్లు కేవలం డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ల ద్వారానే రాగా, మరో రూ.415 కోట్లు ఈ చలాన్ల రూపంలో సమకూరాయి. దీంతో కేవలం 15 పనిదినాలు పూర్తికాకుండానే వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల ఆదాయం రూ.వెయ్యి కోట్లు దాటడం గమనార్హం.
నిరంతర పర్యవేక్షణ
రిజిస్ట్రేషన్ల సంఖ్య ఒక్కసారిగా భారీస్థాయిలో పెరగడంతో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఆ శాఖ ఐజీ శేషాద్రి ఇందుకోసం ప్రత్యేకంగా టెక్నికల్ గ్రూపులు ఏర్పాటు చేశారు. ఈ గ్రూపులను ఏఐజీ వేముల శ్రీనివాసులుతోపాటు సీనియర్ అధికారులు సుభాషిణి, మధుసూదన్ రెడ్డి తదితరులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుండటం వల్లే సర్వర్లపై భారాన్ని అధిగమిస్తున్నామని సిబ్బంది చెబుతున్నారు.
అన్నింటినీ అధిగమిస్తున్నాం
‘రాష్ట్రంలో మూడు నెలలకుపైగా నిలిచిన రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు మళ్లీ ప్రారంభం కావడంతో ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. అయితే, ఎంత తాకిడి పెరిగినా డాక్యుమెంట్లలో తప్పులు రాకుండా చూడటం, ప్రభుత్వ ఆదాయానికి నష్టం రాకుండా జాగ్రత్త తీసుకోవడం, ప్రభుత్వ భూములు, కోర్టు కేసుల్లో ఉన్నవాటిని రిజిస్ట్రేషన్ చేయకుండా చూడటం సిబ్బందిగా బాధ్యత. ఈ సమస్యలన్నింటినీ అధిగమించి శక్తికి మించి పనిచేస్తున్నాం. ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు కార్యాలయాల్లోనే ఉంటున్నాం’
– సామల సహదేవ్, సబ్ రిజిస్ట్రార్, అసోసియేట్ అధ్యక్షుడు,
తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం
ఈ ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ల గణాంకాలివీ..
డాక్యుమెంట్ల సంఖ్య ఆదాయం (రూ. కోట్లలో)
గురువారం 14,337 94.40
జనవరిలో 37,178 208.88
2020–21లో 5,63,766 2137.61
Comments
Please login to add a commentAdd a comment