సాక్షి, హైదరాబాద్: పాత పద్ధతిలో వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత రాష్ట్రంలో ఓపెన్ ప్లాట్ల క్రయవిక్రయ లావాదేవీలు పెరుగుతున్నాయని రిజిస్ట్రేషన్ల శాఖ గణాంకాలు చెబుతున్నాయి. గతేడాది డిసెంబర్ 21 నుంచి రాష్ట్రంలో వ్యవసాయేతర భూములు, ఆస్తుల రిజి స్ట్రేషన్ల కార్యక్రమం ప్రారంభం కాగా, ఈ నెల 10 వరకు 52 రోజుల్లో జరిగిన 1.38 లక్షల రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి రూ.465 కోట్ల ఆదాయం సమకూరింది. అయితే ఆ ప్లాట్ల మార్కెట్ విలువలో ఆరు శాతం రిజిస్ట్రేషన్ ఫీజు కింద వసూలు చేసినా.. వీటి మొత్తం విలువ ప్రభుత్వ మార్కెట్ విలువ ప్రకారం రూ.7,600 కోట్లు పైమాటే. అదే బహిరంగ మార్కెట్‌లో అయితే రూ.50 వేల కోట్లు దాటుతుందని అంచనా.
సంగారెడ్డి, మహేశ్వరం టాప్..
సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల వారీగా పరిశీలిస్తే సంగారెడ్డి, మహేశ్వరం కార్యాలయాల్లో దాదాపు రోజుకు 100 ఓపెన్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని రిజిస్ట్రేషన్ గణాంకాలను పరిశీలిస్తే అర్థమవుతోంది. ఆ తర్వాత యాదగిరిగుట్ట, నల్లగొండ, వరంగల్, ఫారూఖ్‌నగర్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దాదాపు 60 రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. యాదగిరిగుట్టలో రోజుకు 80 రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. వీటితో పాటు రోజుకు 40 ఓపెన్ ప్లాట్ల చొప్పున జరుగుతున్న వాటిలో మొత్తం 141 ఎస్‌ఆర్‌వోలకుగాను, 19 ఎస్‌ఆర్‌వోలు ఉండటం గమనార్హం. హైదరాబాద్, దూద్‌బౌలీ, చార్మినార్, మారేడుపల్లి, ఇల్లెందు, భద్రాచలం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో ఇప్పటివరకు ఒక్క ఓపెన్ ప్లాట్ రిజిస్ట్రేషన్ కూడా జరగలేదు. అత్యంత తక్కువగా గత 52 రోజుల్లో కొడంగల్, సికింద్రాబాద్ ఎస్‌ఆర్‌వోల పరిధిలో రెండు ఓపెన్ ప్లాట్ రిజిస్ట్రేషన్లు మాత్రమే జరిగాయి.
ఎస్‌ఆర్ నగర్, గోల్కొండలో 3 చొప్పున, కొల్లాపూర్‌లో 7, ఆజంపురలో 22, నారాయణపేటలో 27, బంజారాహిల్స్‌లో 31, బాలానగర్, కూసుమంచిలో 32, వర్ధన్నపేటలో 96 ఓపెన్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. ‘కరోనా కారణంగా క్రయవిక్రయ లావాదేవీలు నిలిచిపోయాయి. ధరణి ద్వారా రిజిస్ట్రేషన్లలో కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. ప్రజల విజ్ఞప్తిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం మళ్లీ పాతపద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు ప్రారంభించడంతో ఒక్కసారిగా జోరు మొదలైంది. దాదాపు 2 నెలలుగా పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్ జరుగుతోంది. ముఖ్యంగా ఓపెన్‌ప్లాట్ల విషయంలో ఎల్‌ఆర్‌ఎస్ నిబంధనలకు సడలింపులు ఇవ్వడం, పాత రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంటే తదుపరి లావాదేవీకి అనుమతి ఇవ్వడంతో ఇవి మరింత పెరిగాయి. మరో 2 నెలలు ఈ జోరు కొనసాగుతుంది’అని రిజిస్ట్రేషన్ శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. ఎల్‌ఆర్‌ఎస్ విషయంలో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటే ఈ లావాదేవీల సంఖ్య ఎక్కువగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.
మొత్తం రూ.1,565 కోట్ల ఆదాయం
ఓపెన్ ప్లాట్లు సహా అన్ని రకాల వ్యవసాయేతర భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ద్వారా గత 52 రోజుల్లో ప్రభుత్వానికి రూ.1,565 కోట్ల ఆదాయం వచ్చిందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ కాలంలో మొత్తం 2.2 లక్షల లావాదేవీలు జరిగాయి. ఇందులో మొత్తం 2.46 లక్షల లావాదేవీలకు డాక్యుమెంట్ నంబర్లు ఇవ్వగా, 2.4 లక్షల డాక్యుమెంట్ల స్కానింగ్ పూర్తయింది. 702 లావాదేవీలు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment