సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. సీజన్ ప్రారం భం నుంచే రాష్ట్రవ్యాప్తంగా మొదలైన వానలు.. అన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీగానే కురిశాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షపాతం నమోదు ఆశాజనకంగా ఉంది. వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో జూన్, జూలై నెలల్లో 37.37 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. జూలై 31 నాటికి ఏకంగా 43.98 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం కంటే 18 శాతం అధికంగా వానలు కురిసినట్లు రాష్ట్ర వాతావరణ శాఖ నివేదికలు చెబుతున్నాయి. వానలు సంతృప్తికరంగా ఉండటంతో వ్యవసాయ పనులు సైతం జోరుగా ముందుకు సాగుతున్నాయి.
16 జిల్లాల్లో అధిక వర్షపాతం..
ఇక రాష్ట్రంలో 16 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. ఇందులో 4 జిల్లాల్లో సగటు వర్షపాతం కంటే 60 శాతం పైగా వానలు కురిశాయి. 12 జిల్లాల్లో సాధారణం కంటే 20 శాతం ఎక్కువగా వర్షపాతం నమోదైంది. ఇటు 15 జిల్లాల్లో సగటు వర్షపాతంతో కాస్త అటుఇటుగా వర్షాలు కురిశాయి. ఇక రెండు జిల్లాల్లో సాధారణ వర్షపాతంలో 20 శాతం కంటే తక్కువ వానలు నమోదు కావడంతో ఆయా జిల్లాలు లోటులో ఉన్నాయి.
జిల్లాల వారీగా వర్షపాతం పరిస్థితి..
అత్యధికం: మహబూబ్‌నగర్, జోగులాంబ గద్వాల, నారాయణపేట, వనపర్తి.
అధికం: భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్ అర్బన్, రాజన్న సిరిసిల్ల, మెదక్, సిద్దిపేట, జనగామ, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, నాగర్‌కర్నూల్, ఖమ్మం.
సాధారణం: ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్ రూరల్, కరీంనగర్, కామారెడ్డి, సంగారెడ్డి, భువనగిరి, మేడ్చల్, నల్లగొండ, సూర్యాపేట, ములుగు.
లోటు: నిర్మల్, నిజామాబాద్.
74 మండలాల్లో లోటు వర్షపాతమే..
ఈసారి వానలు అన్ని మండలాల్లో కురిశాయి. దీంతో రాష్ట్రంలోని 589 మండలాల్లో పూర్తిగా వర్షాలే లేనివి ఏవీ లేవు. అత్యధిక వర్షపాతం నమోదైన మండలాలు 99 ఉండగా, 167 మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. 249 మండలాల్లో సాధారణ వర్షాలు కురిశాయి. 74 మండలాల్లో మాత్రం లోటు వర్షపాతం నమోదైంది. ప్రస్తుతం వానలు ఆశాజనకంగా కురుస్తుండటంతో ఆగస్టు నెలలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ భావిస్తోంది. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో మరింత ఎక్కువ వానలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. వచ్చే రెండు నెలలు ఇదే తరహాలో వానలు కురిస్తే పంటలు సమృద్ధిగా పండే అవకాశముందని వ్యవసాయ శాఖ సైతం భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment