సాక్షి, కరీంనగర్: రాష్ట్రంలో ఎడతెరిపి లేకండా వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నందున తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ సూచించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మరో రెండు రోజుల పాటు వర్షాలు పడనున్నందున ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని విజ్ఞప్తి చేశారు. వర్షాల వల్ల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని, వరద బాధితుల్ని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. బీజేపీ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో సహాయక చర్యల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలంతా స్థానిక పరిస్థితుల్ని అధికారుల దృష్టి తీసుకెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు.
భారీ వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరికలు ఉన్నా ప్రభుత్వం ముందుస్తు చర్యలు తీసుకోలేదని ఆయన ఆరోపించారు. వరద గుప్పిట చిక్కుకున్న ప్రాంతాల్లో ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు. హైదరాబాద్‌లో వరద తీవ్రత ఆందోళనకరంగా ఉందని, హైదరాబాద్‌లో వరద సమస్యకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపకపోవడమే ముంపునకు కారణమని పేర్కొన్నారు. వరదల్లో ఇళ్లు కూలీ నిరాశ్రయులైన బాధితులకు రూ.20 లక్షల చొప్పున ప్రభుత్వం నష్ట పరిహారం ఇవ్వాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment