సాక్షి, సిటీబ్యూరో: వర్షాకాల సీజన్‌లో అంటువ్యాధుల నివారణకు జీహెచ్‌ఎంసీ, వైద్యారోగ్య శాఖలు సంయుక్త కార్యాచరణకు శ్రీకారం చుట్టాయి. జీహెచ్‌ఎంసీలోని ఎంటమాలజీ విభాగం, గ్రేటర్ పరిధిలోని మూడు జిల్లాల వైద్యారోగ్య శాఖ, మలేరియా విభాగాల్లోని వివిధ స్థాయిల్లోని ఉద్యోగులతోప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆయా కార్యక్రమాల నిర్వహణను చేపట్టాయి. మలేరియా, డెంగీ తదితర వ్యాధులు వ్యాప్తి చెందిన ప్రాంతాలను గుర్తించి.. వాటితో పాటు మురుగు నీరు ఎక్కువగా పారే ప్రదేశాలు, మురికివాడలు తదితర ప్రాంతాల్లో ఈ బృందాలు ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరిస్తాయి. గ్రేటర్ పరిధిలోని దాదాపు రెండున్నర లక్షల ఇళ్లకు వెళ్లి నిత్యం దోమల నివారణ మందులు చల్లుతున్నారా? లేదా? అనేది తెలుసుకుంటాయి. అనారోగ్యంతో బాధపడేవారి రక్త నమూనాలు సేకరించి పరీక్షలకు పంపిస్తాయి. ఏదైనా వ్యాధి నిర్ధారణ అయితే చికిత్స అందిస్తాయి. ఆయా ప్రాంతాల్లో అంటువ్యాధులు వ్యాప్తి చెందకుండా నివారణ చర్యలు చేపడతాయి. అంటువ్యాధులు, నివారణ చర్యలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాయి. ఈ బృందాలు నిర్వహించే కార్యక్రమాలను జీహెచ్‌ఎంసీ ఎంటమాలజీ అధికారులు, ఫీల్డ్ అసిస్టెంట్లు పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తారు. వీటితో పాటు తొలి దశలో 275 ఉచిత వైద్యశిబిరాలు నిర్వహించనున్నారు. వీటిని గురువారం ప్రారంభించారు.
శిబిరాలు ప్రారంభం...
ఈ సీజన్‌లో అంటువ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు మురికివాడల్లో దోమల నివారణ మందు స్ప్రే చేయించడంతో పాటు 500 ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఎం.దానకిశోర్ ప్రకటించిన నేపథ్యంలో... తొలి విడతలో 275 వైద్య శిబిరాల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ జిల్లాలో 122, రంగారెడ్డి జిల్లాలో 54, మేడ్చల్ జిల్లాలో 99 వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు కమిషనర్ ప్రకటించారు. ఆయా జిల్లాల వైద్యారోగ్యశాఖ అధికారులు, జిల్లా మలేరియా అధికారులు, జీహెచ్‌ఎంసీ మెడికల్ ఆఫీసర్లు, ప్రాజెక్ట్ ఆఫీసర్లు, ఎంటమాలజీ విభాగం అధికారులు సంయుక్తంగా ఈ వైద్య శిబిరాలను గ్రేటర్ పరిధిలోని అంటువ్యాధులు ప్రబలే సమస్యాత్మక ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారు. వైద్యశిబిరాల్లో వైద్యాధికారితో పాటు అర్బన్ పబ్లిక్ హెల్త్ సెంటర్ సిబ్బంది, ఏఎన్‌ఎంలు, హెల్త్ అసిస్టెంట్‌లు, హెల్త్ సూపర్‌వైజర్లు, ఆశా వర్కర్లు ఉంటారు. ఈ శిబిరాలతో పాటు దోమల వ్యాప్తి నిరోధానికి చేపట్టాల్సిన చర్యలపై జీహెచ్‌ఎంసీ ఎంటమాలజీ విభాగం ఏఎల్‌ఓ టీమ్, జిల్లా మలేరియా హెల్త్ అసిస్టెంట్‌లు, హెల్త్ సూపర్‌వైజర్లు, వైద్యారోగ్యశాఖకు చెందిన సిబ్బందితో ప్రత్యేక కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. జీహెచ్‌ఎంసీ ఎంటమాలజీ బృందాలు లార్వా నివారణ మందు స్ప్రే చేయడంతో పాటు ఫాగింగ్ ఆపరేషన్లు చేస్తాయి.
కిట్‌లు రెడీ...
అన్ని పబ్లిక్ హెల్త్ సెంటర్లు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో స్వైన్‌ప్లూ, డెంగీ వ్యాధి నిర్ధారణ కిట్‌లు, మలేరియా ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ కిట్‌లు అందుబాటులో ఉంటాయని దానకిశోర్ పేర్కొన్నారు. ఎక్కడైనా డెంగీ, మలేరియా, స్వైన్‌ప్లూ తదితర వ్యాధులకు సంబంధించి కేసులు నమోదైతే.. అవి మరింత విస్తరించకుండా ఉండేందుకు సంబంధిత జీహెచ్‌ఎంసీ వైద్యాధికారులు, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ మెడికల్ అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడతారని కమిషనర్ తెలిపారు. రెండు అంతకన్నా ఎక్కువ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదైతే ఆయా ప్రాంతాల్లో కనీసం వంద ఇళ్లలో యాంటీ లార్వా ఆపరేషన్ల నిర్వహణ, 50 ఇళ్లలో పెరిథ్రియం స్ప్రే చల్లాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్టు స్పష్టం చేశారు. పాఠశాలలు, వార్డులు, సర్కిల్ కార్యాలయాలు తదితర ప్రముఖ ప్రాంతాల్లో అంటువ్యాధుల నివారణపై చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జూలై మాసాన్ని డెంగీ నివారణ మాసంగా పాటిస్తూ ఈ చర్యలకు శ్రీకారం చుట్టినట్లు జీహెచ్‌ఎంసీ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment