ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న తెలంగాణ హరితహారం పథకం అమలు జిల్లాలో అధ్వానంగా మారింది. నియోజకవర్గానికి 40లక్షల మొక్కల చొప్పున వర్షాకాలం నాటికి రైతులకు పంపిణీ చేయాలని భావించారు. అధికారుల మధ్య సమన్వయలోపంతో ఈ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. అయితే వర్షాకాలం నాటికి మొక్కలు పెంచితేనే డిమాండ్ ఉంటుంది.. లేదంటే రైతులు విముఖత చూపే అవకాశం ఉంది. ఇదే జరిగితే కోట్ల రూపాయల నిధులు వృథాకాక తప్పదు..!
మహబూబ్‌నగర్ వ్యవసాయం: పర్యావరణ పరిరక్షణతో పాటు వాతావరణ సమతుల్యత, భూసారాన్ని కాపాడేందుకు ఉద్దేశించిన హరితహారం పథకం అమలు జిల్లాలో నత్తనడకన సాగుతోంది. పొలం గట్లు, ఖాళీస్థలాల్లో పెంచేందుకు ఏడాదిలో సుమారు 5.60కోట్ల మొక్కలు పెంచి రైతులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయిచింది. కొన్నింటిని అటవీశాఖకు, మరికొన్నింటిని డ్వామాకు కేటాయించింది. అందులో భాగంగానే డ్వామా పరిధిలో జిల్లాలోని 62 మండలాల్లో 160 లక్షల మొక్కల చొప్పున 160 నర్సరీల ద్వారా పెంచేందుకు నిధులు విడుదల చేసింది. ఒక్కోనర్సరీలో లక్ష మొక్కలు పెంచేవిధంగా మూణ్నెళ్లక్రితం న ర్సరీలను కూడా మంజూరుచేసింది.
ఈ క్రమంలో 1.44కోట్ల టేకుమొక్కలు పెంచేందుకు అధికారులు శ్రీకారం చుట్టగా.. కేవలం 62 నర్సరీల్లో మాత్రమే ఆ ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లాలో ఇంకా 82 నర్సరీలకు 82లక్షల టేకుస్టంప్స్ రావాల్సి ఉంది. 16లక్షల వెదురు మొక్కల పెంపకానికి అధికారులు సిద్ధమైనా పనులు సాగడం లేదు. ఇలా ఇప్పటివరకు కేవలం 62 నర్సరీల్లో మాత్రమే మొక్కలు పెంచుతున్నారు.
జాప్యానికి కారణాలివే..
ఒక్కోస్టంప్‌కు 0.99పైసల చొప్పున కొనుగోలు చేసేందుకు ఇతర రాష్ట్రాలకు చెందిన పంపిణీదారులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మేరకు ఇప్పటివరకు జిల్లాకు కేవలం రూ.55లక్షల విలువచేసే 62లక్షల స్టంప్స్ మాత్రమే ఇవ్వగలిగారు. రూ.70 లక్షలు విలువచేసే 160లక్షల పాలిథిన్ కవర్లను గతనెల అందజేశారు.
పాలిథిన్ సంచుల్లో మట్టి నింపేందుకు, నర్సరీ పనులు చేసేందుకు రెండు నెలలుగా కూలీలకు 70శాతానికి పైగా కూలీడబ్బులు చెల్లించాల్సి ఉంది.మట్టి తరలింపు, ఎరువులు, ట్రాక్టర్ తదితర పనులకు రైతులకు బిల్లులు రాకపోవడంతో నిరుత్సాహంతో చాలాచోట్ల అర్ధాంతరంగా పనులను నిలిపేశారు. ఇలా ఒక్కో నర్సరీకి రూ.7.60 లక్షలు ఖర్చవుతుందని అధికారులు అంచనావేశారు. లక్ష్యం మేరకు పనులు పూర్తయినా ఇప్పటివరకు 30శాతం కూడా చెల్లింపులు జరగలేదు. ఈ నేపథ్యంలో పంపిణీదారులు మిగతా స్టంప్స్ ఇవ్వడానికి ముందుకురావడం లేదు.
అధికారుల మధ్య సమన్వయలోపం
జిల్లాలో ఎంపీడీఓలు, ఏపీఓల మధ్య సమన్వయం లోపించడంతో హరితహారం పనులు సక్రమంగా జరగడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఉపాధిహామీ పనులను పర్యవేక్షణ బాధ్యతను ప్రభుత్వం మొదట్లో ఎంపీడీఓలకు అప్పగించింది. వారు విముఖత చూపడంతో గతేడాది అక్టోబర్‌లో పీఓలుగా అదనపుబాధ్యతలు అప్పగించింది. నాటినుంచి ఎంపీడీఓలు ఉపాధి పనుల పట్ల చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. పనులను పర్యవేక్షించిన దాఖలాలు చాలా తక్కువే. ఉపాధి పనులకు డీఎస్‌కే ద్వారా కూలీలు చెల్లించే బాధ్యత ఎంపీడీఓలపై ఉంటుంది. కాగా, వీటి విషయంలో సదరు అధికారులు అంటిముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో జిల్లాలో నాలుగునెలలుగా చెల్లింపులు ఆగిపోయాయి. సకాలంలో కూలీలకు డబ్బులు చెల్లించకపోవడంతో పనులు చేసేందుకు ముందుకురావడం లేదు.
జూన్‌లోగా అందించకుంటే వృథాయే
నర్సరీలో మొక్కల పెంపకానికి ఐదునెలల సమయం పడుతుంది. ఈనెల 15వ తేదీలోగా జిల్లాలోని నర్సరీల్లో మొక్కల పెంపకాన్ని ప్రారంభించాలని అధికారులు ప్రణాళిక సిద్ధంచేసినా ఇప్పటివరకు 62నర్సరీల్లో మాత్రమే పనులు మొదలయ్యాయి. మిగతా 98 నర్సరీల్లో పనులు మొదలుకావాల్సి ఉంది. వర్షాకాలం ప్రారంభమయ్యేలోగా మొక్కులు పెంచితేనే డిమాండ్ ఉంటుంది. లేదంటే విముఖత చూపే అవకాశం ఉంది. ఇదే జరిగితే కోట్లు ఖర్చుచేసి పెంచిన మొక్కులు వృథా అయ్యే అవకావం ఉంది.
ఎంపీడీఓలు సహకరించాలి
తెలంగాణ హరితహారం నర్సరీలకు సంబంధించిన బిల్లులను ఎప్పటికప్పుడు చెల్లించాల ని ఎంపీడీఓలకు చాలాసార్లు తెలి యజేశాం. అయినప్పటప్పటికీ డీఎస్‌కే ద్వారా బిల్లులు చెల్లిం చేందుకు ఎంపీడీఓలు ముందుకురావడం లేదు. దీంతో స్టంప్స్, పాలిథిన్ కవర్లు పంపిణీచేసిన వారికి బిల్లులు చె ల్లించకపోవడంతో కొత్తవాటిని ఇవ్వడం లేదు. కూలీలకు సకాలంలో డబ్బులు చెల్లించకపోవడంతో పనులు చే సేందుకు వారు ముందుకురావడం లేదు. ఎంపీడీఓలు వెంటనే నర్సరీలకు సంబంధించిన బిల్లులు చెల్లించి పనులు ముందుకుసాగే విధంగా సహకరించాలి.
- సునందరాణి, డ్వామా పీడీ
‘హరితం’.. అధ్వానం
Published Sun, Feb 15 2015 3:01 AM | Last Updated on Sat, Sep 2 2017 9:19 PM
Advertisement
Advertisement