బంగారంపై రుణాలివ్వద్దనడం తగదు
-
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు
-
రైతులను ప్రభుత్వం నిండా ముంచుతోందని ఎద్దేవా
కరప :
రైతులకు రుణమాఫీ కాక, పావలావడ్డీ రాయితీ రాక ఇబ్బంది పడుతున్నా పట్టించుకోని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చివరకు బంగారంపై కూడా రుణాలు ఇవ్వవద్దని బ్యాంకర్లకు ఆదేశాలివ్వడం తగదని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పేర్కొన్నారు. ఆదివారం ఆయన కరపలో పర్యటించారు. గణపతి నవరాత్రులు ముగింపు సందర్భంగా ఏర్పాటుచేసిన అన్నసమారాధనలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఇటువంటి కార్యక్రమాలవల్ల ప్రజల్లో భక్తిభావం, ఐకమత్యం వర్ధిల్లుతాయన్నారు. రుణమాఫీ పేరుతో మోసపోయామని ఇప్పటికే చాలా మందికి రుణమాఫీ రాలేదని, సహకారం సంఘాల్లో తీసుకొన్న పంటరుణాలకు రెండేళ్లుగా రావాల్సిన పావలా వడ్డీ రాయితీ రావడం లేదని, బ్యాంకులకు వెళ్తే బంగారు నగలపై అప్పు పుట్టడం లేదని రైతులు కన్నబాబుకు వారి గోడు వివరించారు. రైతులు అధైర్యపడవద్దని వైఎస్సార్‌సీపీ రైతులు తరుపున పోరాడుతుందన్నారు. అనంతరం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. ఎన్నికల్లో రుణమాఫీ చేస్తామని అధికారంలోనికి వచ్చిన తర్వాత టీడీపీ ప్రభుత్వం నిబంధనలు పేరుతో అరకొర రుణమాఫీ అమలు చేసి చేతులు దులుపుకొందన్నారు. దివంగత నేత వైఎస్పార్ హయాంతో రైతులకు పావలావడ్డీ ఎప్పటికప్పుడు చెల్లించేవారన్నారు. బ్యాంకుల్లో రుణాలు ఇవ్వకపోవడం వల్ల ప్రయివేట్ వ్యక్తులు వద్ద అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకోవాల్సివస్తోందన్నారు. రైతులును నిండాముంచుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు రైతు పక్షపాతిగా చెప్పుకొనే అర్హత లేదన్నారు. కాపు కార్పొరేషన్ రుణాల మంజూరులో రాజకీయ జోక్యం తగదని అర్హులైన కాపుపేదలను గుర్తించి రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లాలో డెంగీ జ్వరాలు రోజురోజుకీ పెరుగుతున్నాయని, ప్రభుత్వం స్పందించి వైద్య బృందాలను ఏర్పాటుచేయాలని రక్తం, ప్లేట్‌లెట్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. తాగునీటి సరఫరాను పర్యవేక్షించి, రక్షితనీటిని అందించేందుకు పారిశుద్ధ్య చర్యలు తీసుకోవాలన్నారు. కరప సొసైటీ అధ్యక్షుడు నక్కా వీరభద్రరావు, ఎంపీటీసీలు పాట్నీడి భీమేశ్వర్రావు, పెంకే సత్తిబాబు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ రావూరి వెంకటేశ్వర్రావు, పార్టీ నాయకులు నక్కా సత్తిబాబు, ముద్రగడ వీరబాబు, మేడిశెట్టి సత్తిబాబు, బి.శ్రీరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.