రైతుల రెక్కల కష్టం నేలపాలు
* ఐదు జిల్లాలో అకాల వర్షం
* తడిసిన ధాన్యం
* లబోదిబోమంటున్న రైతన్నలు
న్యూస్‌లైన్ నెట్‌వర్క్: అకాల వర్షాలు రైతుల కంటిపై కునుకులేకుండా చేస్తున్నాయి. సోమవారం రాత్రి, మంగళవారం కురిసిన వర్షాలు చేతికి వచ్చిన పంటను నేలపాలుచేశాయి.నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్, నల్లగొండ జిల్లాల్లో ఈదురు గాలులు, వడగండ్ల వాన మార్కెట్లు, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వరి, పసుపు, మామిడి పంటలకు తీవ్రనష్టం కలిగించాయి. వివరాలివీ... నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలో సోమవారం రాత్రి కురిసిన అకాల వర్షంతో సజ్జ, వరి పంటలకు నష్టం వాటిల్లింది. మాక్లూర్ మండలంలో వరి, టమాటా, పసుపు పంటలు దెబ్బతిన్నాయి. ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్, ఠాణాకలాన్, పోచా రం తదితర గ్రామాలలో వరికి భారీ నష్టం వాటిల్లింది. నిజామాబాద్ మార్కెట్‌లోని ధాన్యం, పసుపు నిల్వలు భారీగా తడిసిపోయాయి.
దీంతో రైతులు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలం టూ మార్కెట్‌లో ఆందోళనకు దిగారు. వరంగల్ జిల్లా ములుగు, వెంకటాపూర్, ఖానాపూర్, కేసముద్రం మండలాల్లో 1345 హెక్టార్లలో కోతకొచ్చిన వరి చేతికి రాకుండా పోయింది. పరకాల, భూపాలపల్లి, నర్సంపేట, పాలకుర్తి తదితర ప్రాంతాల్లో వరిపంటతో పాటు పండ్లు, కూరగాయల తోటలు నాశనమయ్యాయి. కళ్లాల్లో ఆరబోసిన మిర్చి తడిసింది. ములుగు, జనగామ, కేసముద్రం మార్కెట్‌లోకి తెచ్చిన ధాన్యం తడిసి ముద్దరుుంది. కరీంనగర్ జిల్లాలో సోమవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి ఉంచిన ధాన్యం తడిసిపోయింది.
పదిహేను రోజులుగా కొనుగోళ్లలో జాప్యం జరుగుతుండటంతో గత వారం కురిసిన వర్షానికి ఓసారి ధాన్యం తడిసి ముద్దయింది. దానిని ఎండబెట్టి తూకం కోసం ఎదురుచూస్తున్న రైతుల ధాన్యం మళ్లీ సోమవారం నాటి వర్షం తడిసిపోయింది. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మంథని, బేగంపేట, కమాన్‌పూర్, కోరుట్ల మండలం అయిలాపూర్‌లో రైతులు రాస్తారోకోలు నిర్వహించారు. ఈదురు గాలులతో సూర్యాపేట, నల్లగొండ డివిజన్లలో కరెంటు స్తంభాలు నేలకూలి విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. ఆదిలాబాద్ జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలోని చెన్నూర్, కోటపల్లి, జైపూర్ మండలాల్లో 1,500 ఎకరాల్లో మామిడి కాయలు నేలరాలాయి. కోటపల్లి మండలంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆయా మండలాల్లో 20కి పైగా ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి. ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనూ ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ధాన్యం తడిసింది.. రైతు గుండె ఆగింది
కోనరావుపేట, న్యూస్‌లైన్: ఐకేపీ సెంటర్‌లో అమ్మకానికి తెచ్చిన ధాన్యం అకాల వర్షానికి తడిసిపోవడంతో మనస్తాపానికి గురై కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లికి చెందిన గుమ్మడి చిన్న రాజయ్య(65) మంగళవారం గుండెపోటుతో మృతి చెందాడు. రాజయ్య తనకున్న రెండెకరాల పొలంతోపాటు గ్రామంలో ఎకరన్నర కౌలుకు తీసుకుని వరి సాగుచేశాడు. పొలం కోతకు వచ్చిన దశలో వారంక్రితం కురిసిన వర్షానికి వడ్లగింజలు రాలిపోయాయి.
మిగిలిందైనా దక్కించుకుందామని సోమవారం హార్వెస్టర్‌తో పొలం కోయించాడు. సుమారు 95క్వింటాళ్ల ధాన్యం దిగుబడి రాగా.. నేరుగా ఐకేపీ కొనుగోలు కేంద్రంలో అమ్మకానికి తరలించాడు. అక్కడా ఆయనను దురదృష్టమే వెంటాడింది. కేంద్రంలో పోసి గంటలు కూడా గడవకముందే సోమవారం రాత్రి వర్షం కురిసి ధాన్యం మొత్తం తడిసిపోయింది. దీంతో మనస్తాపం చెందిన రాజయ్య మంగళవారం ఉదయం గుండెపోటుతో ఇంట్లో కుప్పకూలి చనిపోయాడు. కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు.